Sunday, October 2, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )- 8 వ భాగం – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )- 8 వ భాగం – శ్రీ విజేత

ఎప్పటిలానే తెల్లవారింది. ఇక దైనందిన జీవితములో మునిగిపోవాలనిపించింది. కొద్దిగా కలిగిన కుటుంభం అని పేరుంది కాబట్టి ఎక్కవగా బయటికి వెళ్ళే అవకాశాలు తక్కువ. ఇంట్లో ఇంటి పని చేయడానికి పనిమనిషి ఉంది. వంట చేసి వడ్డిస్తే సరిపోతుంది. ఇంకా ఒంటరితనం అనే భావన పోనే లేదు నాకు. ఇంట్లో వాళ్ళు అందరు నన్ను దగ్గర అనుకొని చూసుకుంటున్నారు అని అనిపించ లేదు. అత్తమ్మ అతమ్మనే, అత్తమ్మ అత్త ఇంకా అత్తమ్మనే, వాళ్ళదే నడువాలి ఇంట్లో మాటైనా, పనైనా.. మామగారు మామగారే, వీళ్ళు ఏది చెపితే అదే. బయటి పనులు, వ్యవసాయం ఇద్దరు పాలేర్లతో చూసుకునేవాడు. ఇక మా ఆయన, మా ఆయనే పేరుకు. ఏది స్వతంత్రమైన మాట కాని, పని కాని అతనికి ఏది లేదు అని తెలిసింది. ఇంట్లో వాళ్ళు ఏది చెపితే అదే వింటాడు, చేస్తాడు. ఆ ఇంట్లో పరువాలేదు, మంచివాడు అంటే మా మరిదే అని అర్థమయ్యింది. అతను డిగ్రీ చదువుకుంటున్నాడు. కొందరి మంచితనాలు, దగ్గరితనాలు కూడా మన జీవితములో ఆటంకాలుగా అవుతాయని చూస్తూ పోతూ ఉంటె తెలిసింది. కొందరి తెలివి, కొందరి జ్ఞానం, స్వతంత్రత కూడా ఎదుటి వారికి నచ్చక మనను ఇబ్బందులకు గురిచేస్తారు అని అర్థమయ్యింది. చూస్తూ ఉంటే వేసవి మే మాసం గడిచిపోయి జూన్ మాసం కూడా గడిచి పోవచ్చింది. రెండు నెలల కాలం భారంగానే గడిచిపోయింది.

అప్పుడప్పుడు ఆప్తులు, మిత్రులనుండి ఉత్తారాలు వచ్చేవి. సుజి ఉత్తరాలు రాసేది, అప్పుడప్పుడు పట్నములో చదువుకుంటున్న అన్నయ్య, అక్కయ్యవాళ్ళ పిల్లలు కూడా ఉత్తరాలు వేసేవారు. కలత చెందిన మనస్సుకు ఊరట నిచ్చ్చేవి ఈ ఉత్తరాలే. నేను కూడా ఊరట చెందడానికి ఆప్పుడప్పుడు ఉత్తరాలు రాసేదాన్ని. మనిషి కనిపించకున్నా పరువాలేదు, ఉత్తరం వచ్చి మనసును నింపేది, ప్రేమతో పలుకరించేది. ఎలుగెత్తి చాటడానికి, గళమెత్తి చెప్పడానికి వీలు లేనపుడు ఉత్తరాలే హృదయాలకు అనుసంధానం అయ్యేవి. ఉత్తరమంటే అది రక్తమాంసాల సజీవ ధార, హృదయాకాశపు సుందర విహంగం! రాయడానికి అనేకం ఉన్నా చెప్పడానికి మనసు రాదుగా. ఏదో బాగానే ఉన్నాను అని రాసే దాన్ని. రాసిన ఉత్తరాలు వేయడానికి మా యింటి ముందటనే చెట్టుకు పోస్ట్ బాక్స్ ఉండేది, లెటర్ రాసి వేయడానికి సమస్య అయ్యేది కాదు. అప్పుడప్పుడు లెటర్లు కావాలంటే మా మరిదితో లెటర్లు తెప్పించుకునేదాన్ని. అప్పట్లో లెటర్లు వేయడం, లెటర్లు అందుకోవడం పెద్ద ఊరట నాకు. ఇప్పటి కాలంలా అప్పుడు సెల్ ఫోన్ లాంటివి ఏమీ ఉండేటివి కావు. పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చే ఉత్తరాల కోసం ఒకోసారి ఎదురు చూసేదాన్ని. జీవితం లోని ప్రతి సందర్భం, సన్నివేశం, కొత్తవారితో పరిచయం కూడా ఒకోసారి జీవితములో సమస్యలు తెచ్చిపెడుతుందేమో అని అనుభవ పూర్వకంగా తెలుస్తూ పోయింది కాలాన్ని గమనిస్తూ పోతుంటే. జీవితంలో బతుకాలంటే సమ ఉజ్జీలతోనే బతుకాల్నేమో ముఖ్యంగా భార్యాభర్తలుగా, అలా కానప్పుడు కొన్ని సమస్యలు కొత్తవి పుట్టడానికి అవకాశం ఉంటుందేమో, వారి ఇద్దరి మధ్య ఇతరులు కల్పించుకునే అవకాశం కూడా ఉంటుందేమో. మా యింట్లో నా యెడల అలానే జరిగింది నాకు, ఆయనకు సంబంధించి. భార్య రూపవతీ శత్రువు అని ఏ కాలములో ఎందుకు అన్నారో తెలియదు కాని నా యెడల మాత్రం నిజమయ్యింది. మా ఆయనకు సపోర్టుగా మా యింట్లో నా యెడల కొన్నిఆంక్షలు మొదలయినాయి మా అత్తమ్మ, మామయ్య, ముసలమ్మ తరపు నుండి. నా అందం, నా చురుకుదనం వాళ్లకు ఇష్టం అనిపించలేదేమో. నా ఈడుకు దగ్గరలో ఉన్న మా మరిది యెడల కొద్దిగా అభిమానం చూపించేదాన్ని, ఆ పిల్లవాడు మంచివాడు నిజంగా, ఆ పిల్లవాడితో మాట్లాడ కూడదు అన్నారు. అప్పుడప్పుడు అతడికి భోజనం వడ్డించే సందర్భాలు సహజంగా వచ్చ్చేవి. ఆ విషయం లో కూడా నాకు ఆంక్షలు పెట్టేవారు అతనికి నీవు భోజనం వడ్డించ కూడదు అని. మనస్సు చివుక్కు మనేది. ఈ మనుష్యులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని. మనసులో బేదాభిప్రాయాలు రానే రావద్దు, వస్తే కష్టమే కదా జీవితంలో నెట్టుక రావడం.

ఇంట్లో పని మనిషితో కూడా మాట్లాడ కూడదు ఎక్కువగా, ఏమి చెప్పకూడదు. బయటివారు ఎవరిని కలువకూడదు, బయటివారి ఎవరి ఇంటికి వెళ్ళకూడదు, వారితో ఏమి మాట్లాడ కూడదు, ఏమి చెప్పకూడదు. ఇంకో విషయానికి కూడా నేను ఆశ్చర్యానికి లోనయ్యాను, ఉత్తరాలు అందచేసే పోస్ట్ మ్యాన్ గురించి, ఉత్తరాలు ఇచ్చిపోతూ అలవోకగా ఒక మాట మాట్లాడే వాడు, చిన్నగా వీలున్నంత అవసరమైన సమాధానం చెప్పేదాన్ని, ఎప్పుడైనా వేసవి కాలం కాబట్టి మంచినీళ్ళు అడిగేవాడు, మంచి నీళ్లు ఇచ్చేదాన్ని ఆ విషయాలలో కూడా నాకు ఆంక్షలు పెట్టారు. ‘పోస్ట్ మ్యాన్ కు మంచి నీళ్లు ఇవ్వకూడదు, అతనితో మాట్లాడకూడదు’ అని. ‘ఇంకా మీ సిటీ పక్కవాళ్ళను నమ్మకూడదు, చాలా హుషారుగా ఉంటారు’ అనేవారు. ఎలాంటి మలినం లేని నా మనసును అర్ధం చేసుకోకుండా వాళ్ళు అలా నాపై కొన్ని ఆంక్షలను మొదలు పెట్టారు. వాళ్ళను చూస్తే జాలి వేసింది. నేను ఏ తప్పు చేయలేదు, చేయాలని కూడా అనుకోలేదు. నాకు తెలియని, నేను ఊహించని వాటిని నా కళ్ళ ముందటకు తెచ్చారు. అందమైన వృక్షానికి ముళ్ళకంపను నాటుకొని బతుకాలను కున్నారేమో, స్వేఛ్చగా జీవించాలనే పక్షిని పంజరంలో బంధించి చూస్తూ బతుకాలనుకున్నారేమో. పెళ్లి అయిన తొలి రోజులు కదా ఇప్పుడే నన్ను ఆంక్షల చట్రంలో బిగించి కాలాన్నివెళ్ళదీయాలనుకున్నారేమో వాళ్ళు. బాధ పడ్డాను ఇలా జరుగుతుందేమిటీ అని! ఈ మనుషులెంత స్వార్ధపరులు, మూర్ఖులూ అనిపించింది, వాళ్ళ స్వార్ధం కోసం నన్ను బలి చేశారు కదా అనిపించింది. మెల్లగా వచ్చి, మంచివాళ్ళుగా నటించి, అమాయకులైన మా తలితండ్రులను మోసం చేసి నన్ను ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు కదా అనిపించింది.పెళ్లి అనేది హైందవ సమాజం లో ఒక బలమైన పీటముడి లాంటిది, దానిని అంత ఈజీగా విప్పేసుకోలేము. ఒక్కసారి తెలిసో తెలియకనో తప్పుచేస్తే ఇక జీవితాంతం గిలగిలా కొట్టుకోవలసిందేమో. ఆయన స్వతంత్రత గల మనిషా అంటే అది కూడా కనిపించ లేదు. అమ్మనాన్న చాటు బిడ్డడు ఇన్ని సంవత్సరాలు వచ్చినా. పెద్దగా చదువుకున్నాడా ఉద్యోగాలు చేస్తాడా అంటే అదీ లేదు. చేస్తే అందరిలా వ్యవసాయం లేకుంటే లేదు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడుపడం ఇలా అనిపించేది. అయినా అవన్నీ అవసరం లేదు నన్ను నన్నుగా చూసుకున్నా చాలు అనుకున్నాను.

కాలం గడిచిపోతూ ఆషాడ మాసం దగ్గరకు వచ్చింది. ఆశాడ మాసంలో అత్త ముఖం చూడకూడదట కొత్త కోడలు. అది సెంటిమెంట్, ఆ పేరున నేను ఒక నెల రోజులు అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ నెల రోజులు కొద్దిగా ఊరటలా అనిపించింది మనస్సుకు. ఆషాడమాసం హోంసిక్ ను తగ్గించుకొనే మాసం లాంటిదేమో కొత్త పెళ్లి కూతుర్లకు. కాలం మనుషులను దగ్గర చేయాలి దూరంగా ఉన్నపుడు ముఖ్యంగా భార్య భర్తలను. కాని దగ్గరగా ఉన్నపుడే దగ్గర కాలేకపోయినపుడు ఆ దాంపత్యంలో లోపం ఉన్నట్లేమో. తాత్కాలిక ఉపశమనాలు మనుష్యులకు ఊరట కల్పించినా మనసులో ఒక గాయం కెలుకుతూనే ఉంటుండేది జీవితం ఎలా గడుస్తుంది మరి అని! ఎంతవరకు, ఎంత కాలం సర్డుకపోవలసి ఉంటుందో అని అనిపిస్తుండేది.

ఆ నెల రోజుల్లో నేను అమ్మావాళ్ళ ఇంటి దగ్గర ఉన్నపుడు సుజి కలిసేది, అది నన్ను గమనించి, ఎందుకో దిగులుగా ఉన్నావు అని నా గుండెల్లోని, మనసుల్లోని బాధను గుర్తించి తెలుసుకోవాలని అడిగేది, చెప్పడానికి ఏమీ లేక టప్పున జారే కన్నీళ్లను నాలో నేనే దాచుకునే దాన్ని. దాని కన్నులో జారే కన్నీటిని కూడా చూడలేకపోయేదాన్ని. బాధ చెప్పుకుంటే తీరుతుందా, కొన్ని బాధలు తీరవు మనిషంటూ లేకుండా పోతే తప్పా! కాలేజికి సెలవులున్నాయని పట్నం నుండి అన్నయ్య వచ్చిండు, నా పెళ్లి తరువాత కలిసింది మొదటిసారి అదే. గుండెలోని బాధను స్కానింగ్ తీసినట్టు పసికడుతారేమో కొందరు. ‘అసంతృప్తితో కనిపిస్తున్నావు, బాధేమిటో చెప్పూ’ అనేవాడు. ‘ఏమిలేదు, అంతా మంచే’ అని నవ్వి ఊర్కొనేదాన్ని.

ఆ ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు అన్నయ్యతో కలిసి అతడు కనిపించేవాడు, మాట్లాడేవాడు. నేను చదువుకుంటానని టైం పాస్ కోసం పుస్తకాలు, పత్రికలూ ఇచ్చేవాడు నా కోసమని తీసుకవచ్చి. నాకు అతడు మామూలుగానే కనిపించేవాడు మిత్రుడిగా. అతని హృదయం వెనుక నా యెడల, ఎంత అభిమానం, ఇష్టం, ప్రేమ, అనురాగం ఉందో అనే సంగతి నాకు కాలం గడుస్తూ పోతుంటే తెలుస్తూ పోయింది. మనమేమి ఇవ్వకునా, మనమేమి కాకున్నా మనగురించి ఆలోచించేవాళ్ళు, మన క్షేమం కోసం బతికేవాళ్ళు, మన కోసం ప్రాణం ఇవ్వడానికయినా సిద్ధపడేవాళ్ళు ఉన్నారని తెలియడం చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. అయినా కాలం అన్ని విషయాలను బయటపడనీయదు అప్పటికప్పుడే. జీవిత గమనాన్ని ఏది,ఎప్పుడు,ఎలా జరుగానియ్యాలో కాలానికే తెలుసేమో అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉంటాను ఇక్కడ, నెల తొందరాగానే గడిచిపోయింది. ఆషాడ మాసం గడిచి మళ్ళీ ఇష్టమున్నా లేకున్నా వెళ్ళవలసి వచ్చ్చింది అత్తవారింటికి.

అదే లోకం, మూసపోసినట్లుగా ఉన్నజీవితం ఊపిరాడనట్లుగా బతకవలసి వచ్చేది. స్వేఛ్చగా విహరించాలనుకొనే సీతాకోక చిలుకను బందిస్తే అది మన గలుగుతుందా, బతుకుతుందా దాని స్వేచ్చను హరిస్తే. ఎంతలో ఎంత ఇలా అయిపోయిందేమిటీ జీవితం అనిపించేది. తెలిసి చేసుకుందా, తెలియక చేసుకుందా? జీవితమంటే త్యాగమా! ఎవరి కోసం దేనికోసం అనిపించేది. జీవితంలో అడ్జస్ట్ కాలేకపోయాననిపించేది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే దీనికి కూడా ఉండదా అనిపించేది. నిజంగా నాకేమి పరిష్కారం కనిపించలేదు, అయితే బతుకాలి, లేదా చనిపోవాలి అనిపించేది. అంతకన్నా వేరే పరిష్కారం లేదా అంటే ఉండవచ్చు, విడిపోయి ఎలా బతుకాలి, ఎవరి దగ్గర బతుకాలి అనిపించేది. పెళ్లి అంటే ఈ సమాజంలో రెండు కుటుంబాల కలయిక, గౌరవం. దానిని నేను చిద్రం చేయగలనా? అంతటి శక్తి బహుశా నాకు లేదేమో అనిపించేది. ఎవరు ఈ జీవితానికి పరిష్కారం చూపేవారు లేరా అనిపించేది. కథలు, సినిమాలు వేరు, జీవితం వేరేమో అనిపించేది. అమ్మను, నాన్నను, బంధువులను ఇబ్బంది పెట్టలేను, ఇది నా కష్టం అని చెప్పలేను, నాకు పరిష్కారం చూపించండి అని అడుగలేను. అంతా గానుగెద్దు జీవితం ఒకే తీరు. బతుకుతే ఇలానే బతుకాలి, చనిపోతే నయమేమో అనిపించేది నా చిన్నారి మనసుకు. అయినా చావు కూడా మన చేతిలో ఉంటుందా, బతుకుతామనుకున్నవారు చనిపోతారేమో, చని పోతామనుకున్న వారు బతుకుతారేమో. కాల మహిమనేమో, నా యెడల జీవితం అదే చూపించింది. చనిపోదామనుకున్నా చావు రాలేదు నాకు, మొండి దాన్ని, ఎన్ని మలుపులు తిరుగుతూ జీవితం గడిచిపోయిందో జ్ఞాపకం తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ప్రతి యేట లాగానే ఆ ఏడు కూడా ఒకటి వెనుక ఒకటి వస్తూ పోయినవి పండుగలు. ఆగస్ట్ సెప్టెంబర్ కు అటూ ఇటుగా వినాయక చవితి వచ్చింది. ఆ తరువాత నాకు ఇష్టమైన బతుకమ్మ పండుగ వచ్చింది. అయినా మునుపటి ఉత్సాహం లేకుండా పోయింది. ఉట్టి యాంత్రికమైన జీవతంలో బొమ్మల్లాగా కాలం గడుపడంలా ఉండేది. దసుర పండుగ కూడా అయిపొయింది. కొత్తగా పెళ్ళయిన సంవత్సరం కాబట్టి మా ఆయన కూడా వస్తే కట్నకానుకలు పెట్టారు మా వాళ్ళు. అప్పుడే దీపావళికి పట్నం నుండి అన్నయ్య వచ్చినాడు సెలవులున్నాయని. అన్నయ్య నాకు ఆప్తుడుగా కనిపించేవాడు, మా స్వంత అన్నయ్యలకు కూడా నేను ఎన్నడు ఏమి చెప్పుకోలేదు, అడుగ లేదు. దాదాపుగా నా తోటి వయసు వాడు, నేనంటే అభిమానం కలవాడు, నా గురించి కొంత తెలుసుకొని, ఒక్కసారి అడుగుదాం అతనికి కొద్దిగా భయముంటుంది అన్నాడు మా ఆయన గురించి. తెల్లవారి అడిగాడు మా ఆయనను నా గురించి’ ఎందుకు అమ్మాయిని అలా అనుమానిసున్నారు’అని. అతనికి కూడా మాటలు మాట్లాడ వసుందేమో, “ మీరెందుకు అడుగుతున్నారు నన్ను, మీరేం తోడబుట్టిన అన్నయ్య కాదుగా” అన్నాడు. అందుకు అన్నయ్య “వాళ్ళు కాదు నేనే అన్నయ్యను, ఇక నుండి అలాంటి మాటలు మాట్లాడకూడదు” అని బలంగానే వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత ఓ ఒకటి రెండు నెలలు మామూలిగానే ఉన్నారు. అయినా మా బంధంలో దగ్గరితనం పెరుగ లేదు దూరమే పెరిగిపోయింది. ఆ తరువాత రెండు నెలలకు నాన్న వయసు మీరి సహజంగానే కాలధర్మం చెందాడు. నాకున్నా ఆధారంలో ఒక ఆధారం పోయినట్లయ్యింది. (సశేషం…)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!