Tuesday, July 14, 2020
Home > ఈవారం రచయిత > ‘కలాన్ని , కాలాన్ని నిద్రపోనివ్వని’ కవి గోపి!

‘కలాన్ని , కాలాన్ని నిద్రపోనివ్వని’ కవి గోపి!

ఆచార్య ఎన్.గోపి ఈ పేరు తెలియని తెలుగు సాహిత్యాభిలాషులుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు పండితుడిగా, కవిగా రచయితగా మంచి విమర్శకుడిగా ఎన్. గోపి తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ మరువలేనిది. కవిగా కాలాన్ని నిద్రపోవివ్వని ఆచార్య గోపి.. ప్రకృతిలోని ప్రతి అందాన్ని తన రచనల్లో చూపిస్తాడు. నిరాశలో కృంగిపోతుంటే నిలువెత్తు ఆశావాదమై మన ముందు నిలబడతాడు. జీవిత సత్యాన్ని అక్షరాలుగా మలిచి తాత్వికతను బోధిస్తారు. తెలంగాణలో కవులే లేరన్న అహంభావం ఒకటి విర్రవీగుతూ వెక్కిలి నాట్యం చేస్తున్న సమయంలో ఇదిగో నేనున్నానంటూ ‘నానీ’లు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత ఆచార్య గోపి మన ఈ వారం రచయిత.

డాక్టర్ గోపి నల్గొండ జిల్లా భువనగిరిలో జూన్ 25, 1950లో జన్మించాడు. చిన్న తనం నుంచి పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్న ఆయన బాల్య దశలోనే శాఖ గ్రంథాలయంలో క్రమం తప్పకుండా పుస్తకాలు చదివేవారు. గ్రాంథిక భాష, వ్యవహారికమన్న తేడా లేకుండా కనిపించిన పుస్తకాలు చదువుతూ పోవడం వల్ల తెలుగు సాహిత్యంపై పట్టు పెంచుగోగలిగారు. ఎనిమిదో తరగతిలోనే ‘శశి’ అనే శతకం రాయండ చూస్తే ఆయనకు భాషపై ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్లు పనిచేసిన గోపి.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి పూర్వపు అధ్యక్షుడు మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపసంచాలకులుగా పనిచేశారు. పదవీ విరమణ చేసేటప్పడికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ మరియు హ్యుమానిటీస్ యొక్క డీన్ గా పనిచేశాడు.

గోపీ దాదాపు ముప్ఫై పుస్తకాలు దాకా ప్రచురించాడు. అందులో 11 కవితా సంకలనాలు కూడా ఉన్నాయి.
తంగెడుపూలు, మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, చుట్టకుదురు, ఎండపొడ, జలగీతం, దీర్ఘకావ్యం, నానీలు, మరో ఆకాశం, అక్షరాల్లో దగ్ధమై, మళ్ళీ విత్తనంలోకి వంటి కవితా రచనలు చేశారు. కేవలం కవిత్వంతో, సాహిత్య ఆచార్యుడిగా పాఠాలు చెప్పడంతో గోపి సంతృప్తి చెందడం లేదు. విమర్శ, పరిశోధనకు సంబంధించి ఆయన పలు గ్రంథాలు వెలువరించారు. వేమన, వేమనవాదం, వ్యాసనవమి, వేమన పద్యాలు – పారిస్ ప్రతి, జ్ఞానదేవుడు,గవాక్షం, సాలోచన-పీఠికలు. నిలువెత్తు తెలుగుసంతకం సినారె వ్యక్తిత్వం, ఇవేకాక నాలుగు యాత్రాగ్రంథాలు (ట్రావెలాగ్లు) మరియు అనేక అనువాదాలు చేశారాయన.

నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టి నానీల నాన్నగా ప్రసిద్దికెక్కారు. మానవ జీవితంలోని ప్రతి కోణాన్ని, ప్రతి పార్శ్వాన్ని, స్పుశిస్తూ నానీలు రాశా రు.

కుండ ముక్కలైందా
కుమిలిపోకు
మట్టి మరో రూపంలో సిద్దమౌతోంది

అంటూ ఆశావాదాన్ని ప్రకటించినా దాని నినాలుగు పాదాల్లోనే అత్యంత ప్రతి భావంతంగా చిత్రించడం ఆయనకే చెల్లింది. ఇప్పుడు నానీలు రాయడం కవులకు ఒక ఇష్టమైన కార్యంగా మారింది. గోపి నానీలకు అనుచరులు తయారయ్యారు. కోట్ల వెంకటేశ్వరరెడ్డి తెలంగాణ నానీలతో పాటు అనిశెట్టి రజిత, రఘు వంటివారి నానీలు గోపీ పెంచి పోషించిన నానీలకు గల ఆదరణ తెలుస్తుంది. గోపి నానీలు హిందీలోకి సైతం అనువాదమయ్యాయి. ‘నన్హే ముక్తక్‌’ పేర గోపీ నానీలను డాక్టర్‌ విజయరాఘవరెడ్డి హిందీలోకి అనువదించి పుస్తకంగా తెచ్చారు. హిందీలో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కవిత్వంలో బ్రివిటీని, మెరుపులను హిందీ, ఉర్దూ పాఠకులు విశేషంగా ఆదరించే విషయం మనకు తెలియంది కాదు.

సాహిత్యం పట్ల తనకున్న అభిలాష అంతా ఇంతకాదు. తెలియని పదం కోసం కనిపించిన వారినల్లా అడిగి తెలుసుకునే నిత్య విద్యార్థి ఆయన. తెలుగు సాహిత్యంలో శిఖర స్థాయిలో ఉన్నా.. నవతరం రచయితలను, కవులను ప్రోత్సహించడంలో ముందుంటారు. వేదనలోంచే కవితా వేదన జనిస్తుందని.. ఏదైనా అడ్డంకి వస్తే అది తొలివిజయంగా భావించాలంటాడాయన.

ఆయన సమాజాన్న, జీవితాలను ప్రభావితం చేసే రచనలు చేసిన ఆచార్య గోపికి 2017 సంవత్సరానికి గాను దాశరథి కృష్ణమాచార్య అవార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తంగెడు పూలు కవితా సంపుటికి 1980లో కృష్ణశాస్త్రి అవార్డు, మైలురాయి కవితాసంపుటికి 1982లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, మైలురాయికి తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, చిత్రదీపాలు కవితాసంపుటికి సినారె కవితాపురస్కారం, చిత్రదీపాలు కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమకవితాసంపుటి బహుమతి (1990), 2006 సంవత్సరానికి సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజన్ అవార్డ్ లు దక్కాయి.

తెలుగు సాహిత్యంలో తనదైన స్థానం దక్కించుకున్న ఆచార్య గోపి తన కవితాహృదయంలోని తడిని ఆరనివ్వలేదు. ఆయన కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆశిద్దాం.

-ప్రసాద్ జూకంటి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!