నేనెక్కడో మరణించినట్టున్నాను
స్వార్థం దేహమంతా నిండిపోయి
నరాల్లో కూడా నీరే ప్రవహిస్తోంది
ఒక బాల్యం బజారులో ఆకలితో అలమటిస్తున్నా
రైతు పక్కన కూర్చొని పంట దుఃఖిస్తున్నా
వేళ్లు రాలిపోయిన చేతి ఒకటి రూపాయి కోసం
బిడియంగానే మొండి చేయి చాస్తున్నా
సరిహద్దులో దేశం ప్రాణాలు విడుస్తున్నా
ఒక నిర్లిప్తత ఒళ్లంతా పాకిపోతోంది
నాలోపల యుద్ధం తలుపులు మూసుకున్నట్టుంది
మనిషితనం కోసం పాతాళగరిగే వేస్తున్నాను
***
అంతరాత్మ ఆకురాయికి
నన్ను నేను రాసుకుంటున్నాను
స్వార్థం కుప్పలు కుప్పలుగా కూలిపోతోంది
శిబిచక్రవర్తి, బలిచక్రవర్తి
కర్ణుడు, దధీచి ఇప్పుడు నా చేతివేళ్లు
మాట మనసు రూక దేహాన్ని కూడా
త్యాగపు తేజాబ్ లో కడుగుతున్నాను
ఇప్పుడు
ధమనులు మనిషితనపు మానేరులు
-వెల్దండి శ్రీధర్
98669 77741
Facebook Comments