జీవితం ఓ చిన్న పయణం
పుటుక ఉదయం
చావు అస్తమయం
వీటి మధ్య
అంతులేని అల్లరి మాయా స్నేహితులు…
అలవాట్లు…
పుట్టగానే పండుగ
ఇరుగు పొరుగు సంబురం
బంధువుల సంతోషపు కానుకలు
బావా మరదలు సరదాలు అబ్బో…
అదో టైటానిక్ సినిమా!
అమ్మ, నాన్న ఆనందానికి ఆకాశమే హద్దు
ఎగిరే పక్షుల కేరింతలు చెప్పనలవి కాదు !
మధ్యలో వచ్చి మధ్యలో పోయేటోనికి
పొగరెక్కువ,
బలుపు సంగతి నేనేం చెప్పను ?
పొంగే అలవాటు
గాలి బుడుగలు చెప్పతరమా !?
మన చుట్టూ ఉన్న సమాజం నుంచి
మన అలవాట్లు పురుడుపోసుకుంటయి…
షష్టి పూర్తీ చేసుకుంటయి.
మనకు తెలియకుండనే
మన శరీరాన్ని, మనసును
అస్తపంజరం చేస్తయి కొన్ని.
మనల్ని దేవుళ్ళను చేసి
దేవతల చేత పూజింపజేసి
లోకంలో కీర్తి కంకణాలు తొడుగుతయి మరికొన్ని!
మున్న పోయినేడు అలాటిదే
నన్ను నిస్తేజంగా పడుకోబెట్టి
ఇంటెన్సీవ్ కేర్ లో గతాన్నంత కొరికేసి
పార్సిల్ చేసినవి అలాటివే !
నిన్న
పోయిన యాదులను ఎప్పటిమాదిరిగా
ఎరగనట్టే తెచ్చి కూర్చోబెట్టి
నన్ను మరింత
శక్తిమంతున్ని చేసినవి మరిన్ని.
ఈ అక్షరాలు అలా చేరినవే !
మొన్నటి రోజున నా అనుమాల మిత్రుడి
వంశ వృక్షాన్ని
నిలువెల్ల పాతరేసి కుదేసినవి
శోకమెరుగని అశోకుడిని
శోక సముద్రంలో ముంచినవి అవే కదా?
ఆ ముసలి తల్లిని కన్నీళ్ళమయం చేసి,
కట్టుకున్న తాళిబొట్టును అపహాస్యం చేసి,
సంతోషంలో మునకలెయ్యాల్సిన చిట్టి చిట్టి చేతులకు
దుక్కపు ఆట నేర్పినవి
ఆ తుంటరి అల్లరి హాబిట్సే కదా !
హాబీలు మనల్ని ఆడించకూడదు
మనమే వాటిని బానిసలను చేయాలి
మనమే నియంత స్థానంలో ఉండి
వాటిని ఎగిరించాలి
వీలయితే ఆటాడించాలి
పసిపాపలా బుజ్జగించాలి
అవసరం అయితే
అంతం చేసి ఘోరి గట్టేయాలి…
అప్పుడే
ఈ జీవితానికి పూర్ణ యశస్సు…!
-విలాసాగరం రవీందర్
9440932934

Facebook Comments