ఈయన ఓ కవి, మంచి స్నేహితుడు, అన్యాయాన్ని సహించని వాడు. లోకాన్ని తన మేధస్సుతో స్పర్శించిన వాడు, తన కలంతో నిజాల్ని నిగ్గు తేల్సిన వాడు, ఉపన్యాసాలతో ఆకర్షించడం ఆయన నైజం! మనుషుల రక్తాన్ని కళ్లజూస్తున్న రజాకార్ల రాక్షసత్వాన్ని మొండిగా ఎదురొడ్డి జనంలో చైతన్యాన్ని రగిలించిన ధైర్యశాలి. పెద్దమనుషుల ఒప్పందానికి తూట్లు పొడిచి తెలంగాణ సమాజానికి తీరని అన్యాయం చేస్తే.. తన కలమే ఆయుధంగా రాజకీయ వర్గాలను హడలెత్తించిన ధీశాలి. కార్మికుల కోసం తపించిన కష్టజీవి…ఆయనే పాములపర్తి సదాశివరావు. రచయితగా, జర్నలిస్టుగా అభ్యుదయవాదిగా తెంలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన పాములపర్తి సదాశివరావు మన ఈ వారం రచయిత!
బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక మంది పండితుల ప్రశంసలను అందుకున్న పాములపర్తి సదాశివరావు.. వరంగల్లు జిల్లాలో హనుమంతరావు, దుర్గాబాయి దంపతులకు 1921, జూలై 17న జన్మించారు. హనుమకొండలోని హైస్కూలులో ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. విద్యార్థి దశలోనే సమకాలిన అంశాలపై చురుకైన ఆలోచనలు కలిగి ఉన్నపాములపర్తి.. భయానకంగా ఉన్ననాటి హైదరాబాద్ సంస్థానంలోని రాజకీయ వాతావరణం నేపథ్యంలో రాజకీయ పరిణామాల వైపు ఆయన ఆలోచనలు సాగించారు. ‘ఆజాద్ హైదరాబాద్’ నినాదాలు విజ్రింభించేయి. వాటికి తోడు రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల హాహాకారాలు తారా స్థాయికి చేరాయి. కదిలి అదిలించే మనస్తత్వం కావునా… విద్యార్ధి దశలోనే జాతీయోద్యమ ప్రభావంతో ఇంటర్మీడియట్ స్థాయిలో కాలేజీని బహిష్కరించి నాగపూరులో తన చదువు కొనసాగించారు.
సాహిత్యం, కళలపై తనకున్న ఇష్టంతో ఆంద్ర మహా సభ, గ్రంధాలయోద్యమం, ఆర్య సమాజ్ ఉద్యమాలలో పాల్గొని వాటిని ప్రోత్సహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అతివాదానికి జై కొట్టిన పాములపర్తి…స్వాతంత్య్ర సమరంలో అజ్ఞాత పోరాటానికి విద్యార్ధులను, యువకులను మరెందరినో ప్రేరేపించారు. 1944 లో ఓరుగల్లులో కాకతీయ కళాసమితి ఏర్పాటు చేసి వార్షికోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించారు. సాహిత్య కళా పోటీలను కూడా నిర్వహించి ఎందరో ఆనాటి యువకులుకు ప్రోత్సహించారు. ఈయన స్థాపించిన కళా సమితికి కాళోజి నారాయణ రావు, కాశీనాధం, వెంకట రామారావు, గార్లపాటి రాఘవరెడ్డి మున్నగు మహామహులెందరో బాసటగా నిలిచి తమ మద్దతునిచ్చారు.
సమాజంలో చైతన్య దివిటీలు పట్టాలని ఆకాంక్షించిన పాములపర్తి.. మాజీ ప్రధాని శ్రీ పీ.వీ నరసింహారావు గారితో కలిసి 1948లో ఈ కాకతీయ పత్రికను ప్రారంభించారు. సదాశివరావు ఈ వారపత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తే, పి.వి.నరసింహారావు ఈ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఇద్దరూ కలిసి జయ-విజయ అనే కలం పేరుతో ఈ పత్రికలో చేసిన రచనలు నాటి సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ఈ పత్రిక ద్వారా ప్రజలలో పోరాట స్ఫూర్తిని, దీప్తిని రగిలింపజేయడంతో సదాశివరావు విజయం సాధించారు. కాకతీయ పత్రిక తెలంగాణలో వెలువడిన రెండవ తెలుగు పత్రికగా ప్రసిద్దికెక్కింది. ఇద్దరూ అనేక కలంపేర్లతో ఈ పత్రికలో చాలా రచనలు చేశారు.
అలాగే, సందేశమ్ పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా కూాడా ఈయన పని చేశారు. కాకతీయ పత్రికతో పాటు విశ్వజ్యోతి, ధర్మభూమి మొదలైన పత్రికలలో నిప్పుకణికల్లాంటి రచనలు చేశాడు. మార్క్సిజం మొదలుకొని ప్రపంచ చరిత్ర, భారతీయ తత్త్వము, హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం, నాటకరంగం ఇలా అన్ని విషయాలపైనా వ్యాసాలు రాశాడు. 1982లో వరంగల్లులో జరిగిన పోతన పంచశతాబ్ది ఉత్సవాలకు ఈయనే ప్రేరేపకుడు. పోతన విజ్ఞానపీఠం స్థాపించడంలో పాములపర్తి ప్రధాన పాత్ర పోషించారు.
సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలపై నిర్విరామంగా పోరాటం చేశారీయన. కులాంతర వివాహలను ప్రోత్సహించడం, ఆజంజాహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యదర్శిగా ఆయన ఒక జయప్రదమైన సమ్మెను నిర్వహించారు. భూసంస్కరణల ఉద్యమానికి చేయూతనిచ్చి, భూసంస్కరణల చట్టం కొరకు ఆందోళన చేపట్టారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే ఉద్యమంలో శ్రీ తెన్నేటి విశ్వనాధం గారితో కలిసి పని చేసి జైలుకు వెళ్ళారు. పౌర హక్కుల పరిరక్షణకు పాటుపడటంతో పాటు ‘రాయిస్టు ఉద్యమం’, ‘మంత్రుల ఆడంబర వ్యతిరేక ఉద్యమం’ గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి ‘నాస్తికోద్యమం’ లాంటి కొన్ని ఉద్యమాలను ఈయన బలపరిచారు.
రచయితగా సమాజంపై విస్తృతమైన ప్రభావాన్ని చూపిన ఈయన..చరిత్ర, సంస్కృతి, కళ, తత్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, భారతీయ సాహిత్య పరిశీలన, అభ్యుదయ గీతాలు, గదర్ విప్లవం, జ్ఞాన సిద్ధాంతం (అనువాదం) వంటి రచనలు చేశారు. తన రచనలతో ఏకశిలా వైతాళికుడిగా పేరుగాంచిన పాములపర్తి సదాశివరావు 76ఏళ్ల వయసులో
కేన్సర్ వ్యాధితో 1996, ఆగస్టు 26వ తేదీ మరణించాడు. ఈయన జ్ఞాపకార్థం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతియేటా ఇతని పేరిట ఒక ప్రముఖవ్యక్తిచే స్మారకోపన్యాసం ఇప్పిస్తోంది. కాగా, తన ఆలోచనలను ఆచరణలో పెడుతూ అన్యాయాలను తూర్పారబట్టిన సదాశివరావు రచనలను, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.
-ప్రసాద్ జూకంటి
manchi vyasam abhinandanalu