Sunday, October 2, 2022
Home > కథలు > కొంచం మనసు పెడితే…! -వి. సునంద

కొంచం మనసు పెడితే…! -వి. సునంద

వాడిని. చూడాలి ఎలా వున్నాడో…..తహ తహ లాడింది మనసు. వాడి చెల్లి పెళ్ళి కార్డు చూడగానే వెంటనే ప్రయాణమయింది
సుకన్య..
బస్సులో కూర్చుందే గానీ మనసు గతంలోకి పరుగెత్తింది….
చిరుమర్రి ప్రాథమిక పాఠశాల కు బదిలీ పై వచ్చింది సుకన్య…
అక్కడంతా వ్యవసాయ కూలీ కుటుంబాలేనని తెలుసుకుంది..
ఆ రోజు బడిలో ప్రవేశించ బోతున్న రోజు.. అక్కడి పిల్లలు పెద్దలు ఎలా వుంటారోనని ఆలోచిస్తూ బస్సు దిగి నడుస్తోంది.
ఇంతలో ఓ చిన్న రాయొచ్చి నుదుటికి తాకే సరికి అబ్బా అంటూ తలపట్టుకుని వచ్చిన వైపు చూసింది.. అక్కడ చుట్టూ పిల్లల గుంపు. మధ్యలో అర్థం కాకుండా అరుస్తూ పిల్లల నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడు పదేళ్ల పిల్ల వాడు. పిల్లలు చిన్న చిన్న రాళ్ళను అతడిపై విసురుతూ వాడు కోపంగా వాళ్ళ మీదికి రాబోయే సరికి పరుగెత్తుతున్నారు…

ఆ దృశ్యం చూసి చలించి పోయింది సుకన్య… బొప్పి కట్టిన నుదురును తడుముకుంటూ పిల్లల్ని ఎందుకలా చేస్తున్నారు..? టైమైతుంది రండిరా అని బళ్ళో కి తీసుకెళ్తుంటే దారి పొడవునా ఆ పిల్లవాడి ముచ్చట్లే.. ”పిచ్చోడు టీచర్ పిచ్చోడు”.. మేం దొరికితే మీదపడి రక్కుతడు, కొరుకుతడు టీచర్.. ”అందుకే గుంపుగా కలిసి వాన్ని ఏడిపిస్తం టీచర్ ” అంటుంటే
”అయ్యో! అలాగారా వాడికి దూరంగా వుండండి”.. పంటిగాట్లలో విషముంటుంది జాగ్రత్త అని చెప్పింది….
కానీ ఆ రోజంతా వాడి ఆలోచనలే ఇంటికొచ్చాక కూడా వాడి రూపమే కళ్ళలో మెదులుతోంది సుకన్యకు..
వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడుదామా తనతో పనిచేసే టీచర్నడిగతే వాళ్ళు వినరు మేడం అని తేలిగ్గా తీసిపారేసాడు..
ఓ రోజైతే బస్సు డ్రైవర్ సడెన్ బ్రేకేస్తూ ”కొద్దిగైతే గా పోరడు సచ్చేటోడు”. భూమ్మీద నూకలున్నయింక అంటుంటే కిటికీలోంచి చూసింది సుకన్య. వాడే పిల్లలన్న పిచ్చోడు.. వాళ్ళు తరుముతుంటే ఇలా పరుగెత్తుకొచ్చాడు…
ఇంకో ఫర్లాంగ్ దూరము నడవాలి స్టేజీ రావాలంటే… అయినా అక్కడే దిగింది సుకన్య…

ఆ పిల్లవాడు పిచ్చి పిచ్చిగా అరుస్తూ సుకన్య మీదికి రాబోతుంటే చిరునవ్వుతో చేతులు చాపింది.. భయం భయంగా దగ్గరకు వచ్చి గట్టిగా చేతులు పట్టుకున్నాడు..
తనూ అలాగే పట్టుకుని నడిపించ సాగింది..
“వాడు కొరుకుతడు రక్కుతడు వదిలేయండి టీచర్!” అని ఎదురుగా అరుస్తూ వస్తున్న పిల్లల్ని “నాకేం కాదు మీరేం చేయకండీ” గట్టిగా చెప్పి వాడిని స్కూల్ కు నడిపించుకొచ్చింది.. తనతో పాటే కూర్చోబెట్టుకుంది. వాడికేదో కొత్తగా అనిపించి టీచర్ చెప్పినట్టు విన్నాడు. మళ్ళీ మధ్యాహ్న భోజన సమయంలో వాడిని పిల్లలు రెచ్చగొట్టడం తో ఒకటవ తరగతి అమ్మాయిని పట్టుకుని కొరక బోతుంటే సుకన్య వెళ్ళి విడిపించింది..
ఎందుకు టీచర్! వాడిని అనవసరంగా బడిదాకా తీసుకొచ్చారు.. రేపు ఎంత గొడవ వుంటుందో అసహనంగా అంటున్న తోటి టీచర్ మాటలకు ఆలోచనలో పడిపోయింది..
మరుసటిరోజు అన్నట్టు గానే తల్లిదండ్రులు వచ్చి సుకన్యను టీచర్ను హెచ్చరించారు..వాళ్లకు నచ్చ చెప్పి పంపేసరికి ‘తలప్రాణం తోకకొచ్చింది’.
అయినా సరే ఏదో పట్టుదల వాడినెలాగైనా మామూలు మనిషిని చేయాలని. తల్లిదండ్రులను కలిసింది “మేం చేసుకున్న పాపం ఏం జేయమమ్మా” అంటుంటే “వాళ్ళ కోసం ప్రత్యేకమైన వసతులు వుంటాయి పంపండి” అంది. ఒప్పుకోని వాళ్ళ మూర్ఖత్వం తో ఏంచేయాలో అర్థం కాలేదు సుకన్యకు..

పిల్లలతోనే సాధ్యమవుతుంది అనుకున్న మరుక్షణం ఆచరణలో పెట్టింది.. పాపం వాడు మంచిగా వుంటే మీలాగే చదువుకునే వాడు కదరా.. అంటూ వాడికేం తెలియదు కదా! వాడినలా మనం రెచ్చగొట్టడం మంచిదా? అనగానే పిల్లలంతా కాదు టీచర్! అన్నారు..
వాడిని చూడగానే నవ్వుతూ రమ్మని పిలుద్దాం అంటే.. అదేదో ఆటలా అనిపించి సరే అన్నారంతా..
వారం రోజుల్లో వాడు కూడా ధైర్యంగా బడిలోకి అడుగు పెట్టడం తొలి విజయంగా భావించింది..
ఇంతకుముందులా ఎవర్నీ ఏమీ అనకుండా తనకు రక్షణ కోసం సుకన్య పక్కనే కూర్చోవడం మొదలుపెట్టాడు.. సుకన్య టీచర్ కు నమ్మిన బంటు అయ్యాడు. పిల్లలను వరుసలో నిలుచోబెట్టడం… సైగలను అర్థం చేసుకుని చేయడం.. సుకన్య టీచర్ బ్యాగ్ పట్టుకొని బాధ్యత గా చూడటంతో పాటు బడికి తాళాలు కూడా తనే వేసేంతగా మార్పు వచ్చింది వాడిలో…
ఊళ్ళో వాళ్ళకు తల్లిదండ్రులకు ఇదో అద్భుతంగా అనిపించింది..
టీచర్ విన్నపాన్ని మన్నించి ప్రత్యేక స్కూల్లో చేర్పించారు తనే వీలున్నప్పుడు వెళ్ళి పలకరించే ది……. కండక్టర్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది.

ఊళ్ళో బస్ దిగగానే పూలదండ తో స్వాగతం పలుకుతూ ఊరి ప్రజలతోపాటు వాడు… ఎంత ఎదిగి పోయాడు అనుకుంటుండగానే వచ్చి కాళ్ళకు నమస్కరిస్తున్న వాడిని హృదయానికి హత్తుకుంది..

-వి. సునంద

Facebook Comments

One thought on “కొంచం మనసు పెడితే…! -వి. సునంద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!