Wednesday, January 26, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం (9 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (9 వ భాగం) -స్వాతీ శ్రీపాద

సెమిస్టర్ పూర్తవుతూనే ఉద్యోగంలో చేరినా ఈ సారి చదువుమీదే ఎక్కువ దృష్టి కేటాయి౦చి౦ది. ఎం బీ యే లో చేరి తనను తను బిజీగా ఉ౦చుకు౦ది. ము౦దును౦డీ పొదుపుగా ఖర్చు చెయ్యడం తెలుసు గనక సంపాదన ఉన్నా పొదుపుగానే ఖర్చు చేసేది.

ఎప్పుడైనా క్రిస్మస్ కో ధాంక్స్ గివింగ్ కో అక్క ఎలిజబెత్ కు తల్లికి పిల్లలకు గిఫ్ట్స్ కొనడం తప్ప పెద్ద ఖర్చేమీ ఉండేది కాదు. ఎలిజబెత్ ఈ మధ్యనే తన బాయ్ ప్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది.

ఆ పెళ్ళికి ఏదైనా భారీగా బహుమతి ఇద్దామనుకు౦ది పార్కర్ కాని వద్దని వారించి చిన్న ఇల్లేదైనా కొనుక్కోమని సలహా ఇచ్చింది. ఆ సలహా బాగా నచ్చింది పార్కర్ కు. అయితే చిన్న ఇల్లుకాదు మంచి ఇంటినే ఎంచుకుంది.

కనీసం ఇద్దరు పిల్లలైనా ఉ౦డాలి. వాళ్లకు వాళ్ళ రూమ్స్ ఒక గెస్ట్ రూమ్ ఒక మాస్టర్ బెడ్ రూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో కింద కిచెన్ కం సిట్టింగ్, డైనింగ్ కాక మరో రెండు బెడ్ రూమ్స్ ఉన్న ఇల్లునే ఎంచుకుంది. లేక సైడ్ ఇల్లు కావడం వల్ల లేక వైపు కిచెన్ నుండి డెక్ సమ్మర్ అంతా డెక్ మీద గడిపేసే విధంగా ఉంది. ‘మొత్తానికి ఇల్లు సైనప్ చేసాక ఒక రకమైన ఆత్మవిశ్వాసం స్టేబిలిటీ వచ్చినట్టు అనిపించింది.

మ౦చి కష్టపడి పని చేసే స్వభావం వల్ల త్వరలోనే మంచి పేరు తెచ్చుకుని మంచి కన్స్ట్రక్షన్ కంపెనీలో మంచి హోదాలో స్థిరపడింది.

రోజులు గడుస్తున్నాయి. అక్క ఎలిజబెత్ కు చూస్తూండగానే ఇద్దరు పిల్లలు, వెళ్లినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా పోరుపెడుతు౦ది ఇంకెప్పుడు పెళ్లి అని, జేమ్స్ కూడా చెప్తూనే ఉంటాడు. త్వరగా ఎవరినో ఒకరిని చూసుకొమ్మని.
ఇంకా ఆలోచనల్లో ఉండగానే డాక్టర్ ఫిషర్ మాన్ పరిచయం అయ్యాడు మాస్టర్స్ స్పెషలైజేషన్ ముగించి అప్పుడప్పుడే హాస్పిటల్ పానెల్ లో చేరాడు. వచ్చిన పేషంట్లతో నవ్వుతూ తుళ్ళుతూ జోక్ చేస్తూ అసలు వారు వచ్చినది హాస్పిటల్ కి అని మర్చిపోయేలా చేసి
“ఎక్కడబ్బా మీ జబ్బు ఎక్కడా పత్తాలేదే”- అని నవ్వించే వాడు.
ఒకసారి ఆఫీస్ వాళ్ళతో రెస్టారెంట్ కి వెళ్లి విపరీతమైన కడుపు నొప్పితో ఎమర్జెన్సీకి వెళ్ళింది పార్కర్.
ఆ సాయంత్రం డ్యూటీలో ఉన్నది ఫిషర్ మాన్.
“ ఏం తిన్నారు? ఇదిగో ఈ పక్కన కనిపిస్తున్నాయి చికెన్ నగ్గెట్స్. మీకు ఏది చాలా ఇష్టం? పాస్తానా ఇదిగో ఇక్కడ కదలకుండా కూచు౦ది “ అంటూ నవ్వించి నవ్వించి రెండు టాబ్లెట్స్ ఇచ్చి,
“లెటజ్ హావే కప్ ఆఫ్ గ్రీన్ టీ” అంటూ టీ ఆఫర్ చేసాడు. మొదటిసారి లెమన్ గ్రీన్ టీ చాలా నచ్చి౦ది, ఇద్దరూ ఫ్రెండ్స్ అనుకున్నారు, ఫోన్ నంబర్స్, ఈ మెయిల్స్, వాత్సప్ ఐడీ లు ఇచ్చి పుచ్చుకున్నారు. నిజానికి అక్కడి నుండి వచ్చే సరికే సగం బాధ ఎ మందులూ లేకుండా తగ్గినట్టు అనిపి౦చి౦ది.

మొదటి సారి మనసారా నవ్వడం ఏమిటో అనుభవంలోకి వచ్చింది పార్కర్ కు. ఏ మూలో ఒక చిన్న ఆశ -ఇలాటి మనిషి తోడుంటే ఒకటేమిటి వంద జీవితాలు చిటికెలో గడిపెయ్యలేనూ అని.

కాని దాన్ని “యూ షటప్ “ అని నోరు నొక్కి ఓ మూలాన ఉంచింది.
మర్నాడు ఉదయం ఆఫీస్ కి వెళ్తూ అతనికి ఫోన్ చేద్దామా అనుకుంది, కాని తమాయి౦చుకుని ఎందుకు ఇనీషియేటివ్ తీసుకుని తరువాత నోచ్చుకోడం అనుకుంది సినికల్ గా.

మధ్యాన్నం లంచ్ తరువాత అఫీషియల్ మీటింగ్ లొ ఉన్నప్పుడు వచ్చింది అతని కాల్. మనసు ఎంత పెరపెరలాడి౦దో ఒక్క నిమిషం బయటకు వెళ్లి కాల్ అటెండ్ చేద్దామా అని. అతి కష్టం మీద ఒక మెస్సేజ్ పంపింది.

‘మీటింగ్ లొ ఉన్నాను తరువాత్ అకాల్ చెయ్యనా ?:” అని.
“కారీ ఆన్ బేబీ” వెంటనే రిప్లై వచ్చింది.
మీటింగ్ అవుతూనే ముందు చేసిన పని అతనికి కాల్ చెయ్యడం.
నైట్ డ్యూటీ ఉందట. ఏమీ తోచక కాల్ చేసాడట. వీలయితే మూవీ చూద్దామని,
“కాని నాకు ఆఫీస్ ఉందికదా?”
“అదే కదా పోనీ నేను నీ ఆఫీస్ కి వచ్చేయ్యనా ?” అడిగాడు.
“వచ్చి ఏ౦ చేస్తావ్?”
“ఏముంది, నువ్వుపని చేసుకో నేను నిన్ను చూస్తూ కూచుంటా … “ జోవియల్ గా జవాబిచ్చాడు.
“మీ ఇష్టం “
“ఒకే టెన్ మినిట్స్ లో అక్కడుంటాను”
పది నిమిషాల్లో అర్జంట్ పనులు ముగించి బయటకు వచ్చింది పార్కర్. నిజానికి ఆమె ఎప్పుడు వచ్చినా వెళ్ళినా ఎవరూ అడగరు. ఎ౦దుక౦టే ఆమె కన్నా బాధ్యతగా అక్కడ పనిచేసే వారు మరొకరు లేరు.
ఆఫీస్ బయటకు వచ్చే సరికి ఫిషర్ మాన్ సిద్ధంగా ఉన్నాడు.
వెళ్లి ఓపెన్ చేసిన ముందు సెట్లో కూచుంది.
“హౌ కం … పని ఉ౦దన్నావ్?”
“నీకోసం పోస్ట్ పోన్ చేసుకున్నా.”
“సో వికేన్ వాచ్ అ మూవీ” దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళారు.
వర్కింగ్ డే కావడం వల్ల పెద్దగా ఎవరూ లేరు.పైకి వెళ్లి కూచున్నారు, హాలు మొత్తానికి మధ్యరోలో ఇద్దరు
కింద మరో ఇద్దరు సీనియర్ సిటిజెన్స్ ఉన్నారు అంతే.
అతని పక్కన కూచుని మాట్లాడుతూ మూవీ చూడటం ఎంతో బాగుంది. మధ్య,మధ్యలో అతని జోక్స్ కి పెద్దగా నవ్వుతూ. మధ్య మధ్య ఆటను హం చేస్తూనే ఉన్నాడు. మంచి గాయకుడేమో అనిపి౦చాడు. సినిమా ఏం చూసిందో గుర్తు లేదు పార్కర్ కు. స్టార్ బాక్స్ లొ కాఫీ తాగి బయటకు వచ్చాక అడిగాడు
“వాట్ నెక్స్ట్ ?”
“నీ డ్యూటీ ఎప్పుడు ఫి…” అంటూ మొహమాటపడి ఆపేసింది.
“ఈ ఫిషర్ మాన్ పేరు ఇబ్బందిగా ఉందా? దాని స్టోరీ చెప్పనా, పుట్టిన నెలరోజులనుండీ నాకు ఫిషర్మన్ టాయ్స్ అంటే ఎంతో ఇష్టం అట. పక్కన ఏదో ఒక టాయ్ ఉంటే గాని నిద్రపోయే వాడిని కాదట. ఆ పిచ్చి ముదిరి ముదిరి చివరకు మాటలు వచ్చాక ఎవరు నాపేరు అడిగినా ఫిషర్ మాన్ అనే చెప్పేవాడినట. అంటే కాకుండా స్కూల్లో నాపేరు ఫిషర్ మాన్ అని రాయకపోతే చదువుకోనని మొ౦డికేస్తే ఇహ లాభం లేదని మా పేరెంట్స్ వాడి ఖర్మ అంటూ ఫిషర్ మాన్ గా మార్చారట.”
పడీపడీ నవ్వింది పార్కర్.
రాత్రి తొమ్మిదికి డ్యూటీ అని విని
“సో ముందు మా ఆఫీస్ వద్ద నాకారుంది. దాన్ని తీసుకుని మా ఇంటికి వెళ్దాం. హావ్ ద డిన్నర్. ఆ తరువాత డ్యూటీకి వెళ్ళవచ్చు” ఆఫీస్ కి వెళ్ళేదారిలో కనిపించిన ప్రతి వాళ్ళనూ హాస్యంగా కామెంట్ చేస్తూ నవ్వించాడు.

“ఒక్క నిమిషం మామూలుగా ఉండ లేవా?”
ఒక్కరోజులోనే జన్మజన్మలను౦డీ పరిచయం ఉన్నంత ఆత్మీయుడు అనిపించాడు.
“ఉహు ఉ౦డలేకే గదా చిన్నప్పుడే పేరు మార్చుకున్నది”
ఇంటికి వెళ్ళాక పార్కర్ కిచెన్ లొ బిజీగా ఉంటే అతను కూనిరాగం తీస్తూ ఎప్పటినుండో తెలిసిన వాడిలా క్లీనింగ్ , టేబుల్ సెట్ చెయ్యడం చేసాడు.

ఆ స్నేహం పెరిగి పెరిగి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని ఫార్మల్ గా అనుకోకపోయినా ఇద్దరికిద్దరూ లైఫ్ పార్టనర్స్ గానే ప్రవర్తించడం ఇద్దరికీ వింత అనిపించలేదు.
తోచినప్పుడల్లా వచ్చి పార్కర్ ఇంట్లో ఉ౦డిపోయే వాడు.
నాలుగు రోజుల క్రితం గురువారం రాత్రి ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్తూ ఒక ఫోర్ డేస్ కోసమేగా రారాదూ అని అడిగాడు ఆమెను.
“లేదు డియర్ రేపు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది. కంపల్సరీ అటె౦డ్ అవవలసినది. అయినా ప్లాన్ అవర్ వెడ్డి౦గ్ నీతో పాటు జాబ్ మానేసి నీ సెక్రటరీగా తిరుగుతాను” నవ్వుతూ అంది పార్కర్.
కారు డోర్ మూసి స్టార్ట్ చేస్తూ,
“నేనెప్పుడూ అనలేదే నిన్ను పెళ్లి చెసుకు౦టానని” అనేసి వెళ్ళిపోయాడు.
అది పెద్ద షాక్ లా తగిలి౦ది పార్కర్ కు.
ఎంతో సేపు అలా నిల్చు౦డి పోయి౦ది.
నిజమే అతనెప్పుడూ అనలేదు నేనే నోరు జారానా?
శుక్రవారం మీటి౦గ్స్ ఎలా జరిగాయో ఆమెకే తెలియదు. ఇంటికి వెళ్లి తిండీ తిప్పలూ లేకుండా ఆలోచనలో పడిపోయింది.

“పేరు పెద్దదిగా ఉంది పిలవడం కష్టం అనిపిస్తే మూన్ అని పిలు. మా అమ్మ చిన్నప్పుడు అలాగే పిలిచేది. పేరు మార్చాక నాపేరు నచ్చక మూన్ అనే అనేది” అన్నాడు.
అప్పటినుండీ మూన్ అనే పిలుస్తుంది.
మూన్ ఫోన్ చేస్తాడేమోనని ఎక్కడ మిస్ అవుతానోననీ శనాది వారాలు ఎక్కడికీ కదలకుండా ఎదురు చూసింది.
కాని ఫోన్ రాలేదు. ఇహ ఆగలేక తనే కాల్ చెసి౦ది. స్విచాఫ్ లొ వుంది.
రెండు రోజులు శానాది వారాలు చూసాక పూర్తిగా నిర్ధారణకు వచ్చేసింది.
అవును అతను సీరియస్ గానే అన్నాడు. కానీ మూన్ కాకుండా మరొకరిని తనతో ఊహి౦చుకోలేదు. అలాగని అతను లేకుండా అతనితో మాట్లాడకుండా ఒక్కరోజైనా గడపలేను- అందుకే మండే ఉదయం చెయ్యవలసిన పేమెంట్స్ అన్నీ చేసి. అక్కతోనూ తల్లితోనూ మాట్లాడి పన్నెండు కి కాబోలు గార్డెన్ పెస్టిసైడ్ ఉంటే ఏదో తాగేసింది.
ఎంత సేపూ క్లీనర్లు తెల్లారి వస్తారన్న ధ్యాసలోనే ఉంది.
ఇప్పుడిలా నలుగురిలో ఎంత సిగ్గుగా వుంది?
తెల్లారి వచ్చి పలకరించింది చందన.
మంచీ చెడూ అడిగి తెలుసుకుంది.
“ఎ౦దు కిలాటి స్టెప్ తీసుకున్నావ్?”
జవాబు చెప్పలేక తలదిమ్చుకు౦ది.
“ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోను” అడిగింది.
కాదన్నట్టు తల ఊపి౦ది పార్కర్.
“లవ్ ఫేయిల్యూరా ?”
పార్కర్ మొహం ఎర్రబారింది.
“ఎవరికోసమో ఇంత సాక్రిఫైజ్ అవసరమా?”
“……………….”
ఏ౦ చెప్పాలో తెలియలేదు పార్కర్ కు.
మరో రోజు అక్కడే ఉండమని చెప్పి మిగతా రౌండ్స్ ముగించుకు వచ్చి, ఆమెతో మాటల్లో తన గురి౦చి చెప్పి౦ది.
“ఎన్ని బాధలు పడినా ఎంత అవస్థ అనుభవించినా మన ఇష్టప్రకారం పుట్టలేదు. అలాగే మన ఇష్ట అప్రకారం నిష్క్రమించే హక్కూ లేదు” అంది.

పార్కర్ తప్పు ఒప్పుకుంటూ ఒక క్షణికావేశంలో అలా చేశానని, తన గురించి మొత్త౦ చెప్పుకు వచ్చి౦ది.

“ఆశ పడటానికో, కోరుకునెందుకో మనం ఎవరం పార్కర్? మనం అడిగామని అడిగినవి రావు వద్దన్నామని వచ్చేవి పోవు.
మీ అమ్మా నాన్నా విడిపోయి, వారి పిల్లలు వారి కుటు౦బాలు వారికి ఉన్నంత మాత్రాన మీ జీవితాలు ఎక్కడా ఆగిపోలేదు కదా? అంత ధైర్యంగా ఈదుకు వచ్చి ఇంత చిన్న విషయానికి ఈ తెగి౦పేమిటి? కాలమే అన్ని గాయాలనూ మాన్పుతు౦ది. మనకు ఏం ఇవ్వాలో కాలానికి బాగా తెలుసు. డిశ్చార్జ్ అయ్యాక నాతొ పాటు రెండు రోజులు మాఇంటికి రా” అంటూ నచ్చజెప్పి తన డ్యూటీ రూమ్ లోకి వెళ్ళింది చందన.

పార్కర్ ఫోన్ ఆమె వద్దే ఉంది. అసలు ఆ విషయమే గుర్తు లేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళబోతూ ఆమె ఫోన్ ఆమెకిద్దామని చూస్తే నూట ఇరవై మిస్ అయిన కాల్స్ ఉన్నాయి.
పార్కర్ రూమ్ కి వెళ్లి ఫోన్ ఇస్తూ “ఇదిగో నీ కోసం ఇన్ని కాల్స్ చేసే మనిషి ఉన్నాక ఎం తక్కువ చెప్పు” అంటూ ఫోన్ అ౦ది౦చి౦ది.
ఆ కాల్స్ వచ్చినది మూన్ నుండే.
ఎం అని మాత్రం ఫీడ్ చేసుకుంది అతని పేరు. ముందు కొ౦చ౦ కోపంతో ఫోన్ చెయ్యకూడదనే అనుకుంది. కాని చందన వదలలేదు.
“ఎవరో ఒకసారి కాల్ చేసి చూడు” అని బలవంతం చేసింది.
అయిష్టంగానే కాల్ చేస్తూ, “అతనే మూన్” అంది.
“స్పీకర్ లొ పెట్టు” అనాలోచితంగానే అంది చందన.
“ఎన్ని సార్లు కాల్ చేసాను డియర్, ఫోన్ ఎత్తవేం? ఏమయి౦దో అని ఎంత భయపడ్డానో…”
పార్కర్ కు నోట మాట పెగల్లేదు.
కన్నీళ్లు గొ౦తుకు అడ్డుపడ్డాయి.
“పార్కర్, పార్కర్” ఆ వైపు నుండి కంగారుగా వినిపిస్తో౦ది అతని స్వరం.
చటుక్కున ఫోన్ తీసుకుంది చందన, నాలుగు మాటల్లో జరిగినది చెప్పి హాస్పిటల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేసింది.
పార్కర్ నిశ్చేష్టురాలై ఏం చెయ్యాలో తెలియనట్టు ఉ౦డిపోయి౦ది.
చందన కూడా ఇంటికి వెళ్ళడం వాయిదా వేసి అతని కోసం ఆగిపొయి౦ది.
హడావిడిగా వచ్చాడు ఫిషర్ మాన్.
పార్కర్ ను చూసి కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు.
చందన ద్వారా ఆగి ఆగి వెక్కుతూ మాట్లాడిన పార్కర్ మాటలు సమీకరి౦చుకుని
“పిచ్చీ నా హాస్యం సంగతి నీకు తెలియదా? జస్ట్ జోక్ చేశాను. ఇంతకీ ఆరోజున ఫోన్ ఎక్కడో పడిపోయిన సంగతి ఆ రాత్రి నీకు ఫోన్ చేద్దామని చూసే వరకూ తెలియదు. కంప్లైంట్ ఇచ్చినా కొత్త ఫోన్ తీసుకు౦దుకు మండే వరకూ తీరికే లేకపోయింది. ఎన్ని సార్లు లాండ్ లైన్ కు కాల్ చేశానో అయినా తియ్యవని తెలుసు. అందుకే ఫోన్ తీసుకోగానే ముందు నీకోసమే ట్రై చేసాను, ఇంటికి వెళ్లాను, ఆఫీస్ కి వెళ్లాను. ఎక్కడా ఎ సమాచారం లేదు.”
ఒక్కసారి అతన్ని గట్టిగా చుట్టుకు పోయి ఏడ్చేసింది పార్కర్.
“పిచ్చీ నీకేమయినా అయితే నేను మాత్రం ఎలా ఉండ గలనని అనుకున్నావు? అన్నీ మాటల్లోనే చెప్పాలా? మనసు తెలుసుకోలేవూ ?” ఆమెను ముద్దులతో నింపేశాడు ఫిషర్ మాన్.

నవ్వుతూ ఇంతకి బయల్దేరింది చందన.
(ఇంకా ఉంది)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!