Thursday, April 9, 2020
Home > కవితలు > నీ ఊసులు! -స్వాతీ శ్రీపాద

నీ ఊసులు! -స్వాతీ శ్రీపాద

నిరంతరం
ఎన్ని నక్షత్రాల వెలుగులను
మోసుకు వచ్చాయో నీ ఊసులు
అణువణువునా వికసితమవుతూ
తలపుల పొద్దుతిరుగుడు పూలు
నీ సమ్మోహిత స్వరం వెంట
వశీకరణలో నడిచి నడిచి
ఎప్పుడో జనారణ్యం దాటి
వలపు మేఘాల రెక్కలు తగిలించుకు
నీ వెనకెనకే స్వప్నాలు మోసి మోసి బరువెక్కిన
కనురెప్పలు వాల్చి పరవశ౦లో
నన్ను నేను పరామర్శించి నప్పుడు
జవాబుగా నీ చిరునవ్వు
అదేమిటో గాని
వసంతమయితేనేం హేమంతం అయితేనేం
రంగురంగులుగా కురిసేది
ఇద్దరం నేసుకున్న హరివిల్లు
పరదాలేగా
ఆకులు ఆకులుగా రాలి
తివాసీగా పరచుకునేది
పంచుకు బ్రతికిన పగలూ రాత్రులేగా
చినుకులు చినుకులై రాలినా
వరదలై ముంచెత్తినా
కలగలిసిన క్షణాల కావ్యాలేగా
ఒక్కింత గాలి కదిలినా
సవ్వడి ఎరుగని నీ పాదాలేమోనన్న ఆలాపన
కదలని పెదవులు దాటి
నదిలా నన్ను అల్లుకుపోయే
నీ ఊహలు సముద్రాలు సముద్రాలుగా
ఒక నిరంతరహోరు
జలపాతాలై ప్రవహి౦చే యుగాలు ఎన్ని గడిస్తేనేం
మల్లె పొదలై
వాకిట్లో విరబూసే మనసు ఇక్కడున్నప్పుడు.

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!