Monday, February 17, 2020
Home > కవితలు > మౌనంగా ప్రశ్నిస్తే…!

మౌనంగా ప్రశ్నిస్తే…!

స్వాతంత్య్రం సిద్ధించి
ఇన్ని సంవత్సరాలైనా
సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు

ఆడవారి దుఃఖాశ్రువుల చారికలు
ఇంకా పొడిబారలేదు

కొన్ని వర్గాల స్థాయి
ఇంకా గౌరవాలను అందుకోలేదు

లంచగొండితనం
ఇంకా తోక ముడవనే లేదు

ధనబలం..భుజబలం
ఎన్నికలలో హాహాకారాలు
చేయడం మానలేదు
మద్యానికో నోటుకో
ఓటును కొనడం ఆగనే లేదు

మేధావుల మౌనం ఇంకా
పెదవి వీడనే లేదు‌‌..
జరుగుతున్న దౌర్జన్యాలకు
చరమగీతం పాడనే లేదు

అప్పుడే ఇంకొక స్వాతంత్య్ర దినోత్సవం
ఉరుకుల పరుగుల మీద
ఆనందంగా పరిగెత్తుకొస్తోంది

త్రివర్ణ పతాకం
తన రెపరెపలు
విశ్వవ్యాప్తమవ్వాలని
ఆశతో ఎదురుచూస్తోంది

కొద్దిపాటి శాస్త్ర సాంకేతికతను
చిన్నపాటి ప్రగతిశీల పయనాన్ని
చూపించి
భరతమాతను ఎలా మభ్య పెట్టనూ…
స్వాతంత్ర్య ఫలాలు
ఇంతేనా అని అడిగితే
ఏమి బదులు చెప్పనూ…

విదేశీ పెట్టుబడుల ముందు
సాగిలపడవలసిందేనా..
వారు ఏర్పరచే వ్యాపార వ్యాప్తికి
పచ్చని పంటచేలను
జారవిడుచుకోవలసిందేనా
అని మౌనంగా ప్రశ్నిస్తే..
భరతమాతకు ఏమి బదులు చెప్పాలి
నిలదీస్తున్న నా మనసుకు
ఎలా భరోసా ఇవ్వాలి!

గంజాం భ్రమరాంబ
9949932918

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!