డెబ్బై ఏళ్ళు
ఏమిటో అనుకున్నా
పొట్లంకట్టి తాయిలం చేతిలో పెట్టినట్టు
ఎంత బాగా చెప్తారు మువ్వన్నెలు మొహాలని౦డా పులుముకుని
ఇదంతా నేను పుట్టకమునుపు జరిగిన సంగతే
అయితేనేం రంగురంగుల జెండాలు
వీధుల్లో రెపరెప లాడుతూ ఎగిరినప్పుడల్లా
అవేమిటో నాకు తొడిగే రెక్కలే అనుకున్నాను
నా జెండా తల పైన ఎగిరినప్పుడల్లా
నేనే ఆపై అకాశాన్ననుకుని సంబరపడ్డాను.
పంద్రాగష్టున పాడిన పాటకు
ఇచ్చినం రిబ్బనుముక్క బహుమానం
ఇంకా నా ఆనందోద్వేగానికి గుర్తుగా
అప్పుడప్పుడు లోలోపల నా చుట్టూ చుట్టుకున్న
వజ్రాభరణమే అవుతుంది.
అయితే
జెండాలు తెలుసు వాటి రంగులూ తెలుసు
పాటలూ తెలుసు చదువుకున్న పాఠాలూ తెలుసు
తెలియనిదల్లా స్వాతంత్ర్యం అంటే ఏమిటో …
తలుపు చాటున నిల్చుని మొగుడిక్కూడా ఎదురుపడని
మహా ముగ్ధ అమ్మ తెలుసు
అత్తారింటికి వచ్చాక పెడితే తినాలి కొడితే పడాలి
గడప దాటేది మాత్రం శవమేననే మహా పతివ్రతలు తెలుసు
చెప్పుకి౦ద తేళ్ళలా అణిచిపెట్టి
గట్టిగా నవ్వడానికి కూడా అనుమతించని
మగ హిట్లర్ లూ తెలుసు
కాలం మారిందన్నారు
ఎక్కడబ్బా ఆ మార్పు? ఎప్పటిలా అదే సూరీడు
ఎప్పటిలా అదే చీకటి
పని భారం పదింతలు చేసుకోడం తప్ప
ఎక్కడ వచ్చిందా మార్పు?
మొగుడికి సంపాదన అప్పగించి జోడించే చేతులకా
కొడుకులకు పట్టంగట్టి నది వీధిలో తలొ౦చుకునే అమ్మలకా?
ఇప్పటికీ అన్ని వేళలా పహారా కాసే నీతులకా
సంప్రదాయం పేరిట తలలొగ్గిన మధ్య తరగతి
త్యాగ మూర్తులకా?
ఎత్తిన తలలు వంగేలా గుదిబండలు మోపే
మహా సంస్కర్తలకా
నాకూ నాజాతికీ లేని స్వాతంత్య్రానికి
డప్పుల మోతల చావుబాజాలెందుకు
సంబరాల కంటి తుడుపులెందుకు
ఎవరి ఉనికి వాళ్ళు ఎగరేసుకునేదాకా
ఏ జెండా ఎగరేస్తారు?
ఎజెండా తప్ప
-స్వాతీ శ్రీపాద