Wednesday, June 3, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )- 9వ భాగం -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )- 9వ భాగం -శ్రీ విజేత

కాలం ఎవ్వరి కోసం ఆగకుండా గడిచిపోతూనే ఉంది. కొత్త సంవత్సరం జనవరి మాసం గడిచి సంక్రాంతి పండుగ వచ్చిపోయింది, ఫిబ్రవరి, మార్చి మాసాలు గడుస్తూ ఉగాది పండుగ కూడా వచ్చి పోయింది. నాన్న చనిపోయాడు కాబట్టి ఇక్కడ పండుగలు లేవు, నేను నాలుగయిదు నెలల్లో అమ్మ వాళ్ళ ఇంటికి పోలేదు. చాల భారంగా గడిచిపోయింది కాలం. మా అత్తవారి ఇంట్లో ఆ మనుష్యుల ప్రవర్తనలో ఏమయినా మార్పులు వచ్చినాయా అంటే, అదీ లేదు. అనుమానం మనుషులను ఎవరు మారుస్తారు అనిపించింది. ప్రతి రోజు ఒక గండం లానే గడిచి పోయింది. జీవితంలో నమ్మకం లేని మనుషుల మధ్య బతుకడం కష్టం అనిపించింది. నిజంగా మనసును చంపుకొని ఎన్ని రోజులు బతుకడం ఇలా అనిపించింది. కాకి ముక్కుకు దొండపండులా మా ఆయనకు దొరికినట్టున్నాను నేను, ఇక ఆ ముక్కుతో దొండపండును పొడిచి పొడిచి చంపినట్లుగా ఉండేది బతుకు. అందమనే వృక్షానికి ముళ్ళ కంప నాటి కాపాడు కోవాలనుకున్నట్లు చూసేవారు నన్ను. ఒకోసారి వాళ్ళ పిచ్చి పిచ్చి అనుమానాలను బాహాటంగానే ఎదురించేదాన్ని, అయినా ఎన్ని రోజులు ఎదిరిస్తాను? అత్తింట్లో కోడలు మాటలు ఏమి నడుస్తాయి? వాళ్ళు ఇంకా ఏమైనా అబాండాలు వేయడానికి సిద్ధంగా ఉండేవారు. చెల్లని పైసకు గీతలెక్కువ, పనికిరానివాడికి చేష్టలెక్కువ అన్నట్లు మా అయన అనుమానాలకు శ్రుతి మించి పోయే దశ వచ్చింది. ఆయన అనుమానాలకు నేను ఎదురు సమాదానం చెప్పుతే విని అర్ధం చేసుకొనే శక్తి లేక, ఒకనాడు అన్నాడు, “ మీ సిటీ పక్క వాళ్ళను నమ్మ రాదు, నువ్వు మా తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూస్తున్నావు” అని. విని విస్తుపోయాను, కంపరమెత్తింది ఆ మనిషిపై, కుమిలికుమిలి ఏడ్చాను. చాతకానివాడు భార్యపై ప్రయోగించే అస్త్రం ఇదేనా అనిపించింది. జీవితం అంటే తీయని కల అనుకున్నాను, ఆ కల చెదిరిపోయింది. నిజంగా ఎలాంటి పిచ్చి ఊహలు వాళ్లకు ఉన్నాయో, అవి నిజం చేసే శక్తి లేకనా నాకు ఈ బాధ అనిపించేది. ఇక ఆ మొగుడు అనే మనిషితో , ఆ ఇంటి వాళ్ళతో పనేమిటీ అనిపించింది. ఇక అక్కడ బతుకడం కన్నా చావడం నయం అని నిర్ణయించుకున్నా. ఏ తప్పు చేయని నేను ఇన్ని అబాండాలు ఎందుకు మోయాలి అని తలంచి, చచ్చిన బతికినా ఇక ఇక్కడ కాదు అమ్మ దగ్గరనే అని నిర్ణయించుకుని ఒకనాడు ఆ వేసవి మే, మాసంలో బట్టలు సర్దుకొని ఇక అక్కడ ఉండ లేనని అమ్మ దగ్గరికి వచ్చేసిన. బాధపడితే, కన్నీళ్లు కారిస్తే జీవితానికి సమాధానం దొరుకుతుందా. జీవితంలో ఏదయినా ఒక బలమైన నిర్ణయం కావాలి ఏ పని చేయాలన్నా, ఇక వాళ్లకు నాకు సంభంధం లేనట్లుగానే ఆ యింటి నుండి వెళ్లి వచ్చాను. ఏ తప్పు చేయని నేను అలా వెళ్లి వస్తుంటే నిరుత్తరులై చూశారు వాళ్ళు. దెబ్బతిన్న బెబ్బులి గాని, దెబ్బతిన్న నాగుపాము కాని, ప్రతీకారంగా ఏ పని అయినా చెయ్యగలవు కాని నేనేమి చేయగలను ఆడపిల్లగా వాళ్లకు దూరంగా ఉండడం తప్పా. జీవితంలో ఒక భాగం అయిపొయింది అనుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను.

అలా నేను ఇంటికి రావడం అమ్మకు నచ్చలేదు. మా అమ్మకే కాదు ఏ తలిదండ్రులకు కూడా నచ్చదేమో అలా ఆడపిల్ల అత్తవారి ఇంటి నుండి వెళ్లి రావడం. పెళ్లి చేస్తే చాలు అని , అమ్మాయి ఎలా బతుకుతేంది అనుకునే తలిదండ్రుల నుండి ఏమి ఆశిస్తాం. మొదటి నుండి మా అమ్మ ఇష్టం తోనే ఈ పెళ్లి జరిగింది. నా గుండెల్లోని బాధను యేమని చెప్పాలి. సర్డుకపోయి బతుకాలె అంటుంది. వీలైతే నన్ను మళ్ళీ పంపించాలే అని అనుకొని ఉంటుంది. నేను మాత్రం చచ్చినా పరువాలేదు అనుకొనే వచ్చాను. అమ్మకు నాకు ఇంట్లో కోల్డ్ వారే జరిగింది. నాకు మనసులో మనసు లేకుండాపోయింది. ఆ రోజుల్లో సరిగా అన్నం కూడా తిన లేదు,విపరీతమైన జ్వరం వచ్చింది , డాక్టర్ దగ్గరికి వెళ్లాలని, మందులు వేసుకోవాలని కూడా అనిపించలేదు. అప్పుడే వేసవి సెలవులు కాబట్టి పట్నం నుండి అన్నయ్య వచ్చిండు. నేనిక్కడ ఉన్నానని తెలిసి నన్ను కలిసి మాట్లాడి పోదామని ఇంటికి వచ్చిండు. జ్వరంతో మంచంలో పడుకొని ఉన్నాను. అన్నయ్యను చూస్తేనే కట్టలు త్రెంచుకొని ప్రవహించింది దుఃఖం. అన్నయ్యపై వాలిపోయి కుమిలికుమిలి ఏడ్చాను. అనునయంగా ఊర్కొమ్మన్నాడు. ఒళ్ళంతా కాలిపోతుంది అని డాక్టర్ దగ్గరికి తీసుకవెళ్తనన్నాడు. వద్దన్నాను బతికి ఏమి చేసేది ఉంది అని చెప్పి. అంత నిరాశ వద్దన్నాడు. సాయంత్రం తనే కొన్ని మందు గోలీలు తీసుకవచ్చి ఇచ్చి పోయాడు.నాకు జ్వరం వస్తుందని తెలిసి సుజి కూడా వచ్చి కలిసి మాట్లాడి పోయింది. ఓ నాలుగైదు రోజుల్లో జ్వరం తగ్గింది. మళ్ళీ అమ్మ అనడం మొదలు పెట్టింది వాళ్ళు వస్తారట తీసుక వెళ్ళడానికి నువ్వు రడీగా ఉండాలని. నన్ను వెళ్ళమని ఇంట్లో ఒకటే పోరు, నాకు ప్రాణసంకట మయ్యింది ఆ మాట.

మళ్ళీ నాకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథనే జ్ఞాపకం వచ్చింది, పూర్ణమ్మలా చనిపోతేనే బాగుంటుందని.అనిపించింది.
“ మేలిమి బంగరు మెలతల్లారా ! కలువల కన్నుల కన్నెల్లారా ! తల్లులగన్నా పిల్లల్లారా ! విన్నారమ్మా యీ కథను ? ఆటల పాటల పేటికలారా ! కమ్మని మాటల కొమ్మల్లారా ! విన్నారమ్మా మీరీ కథను ?” అంటూ నేను కూడా పిల్లలనే జ్ఞాపకం చేసుకున్నాను, ముఖ్యంగా మా అక్కయ్యల పిల్లలను, వాళ్ళు నాతో చాలా చనువుగా ఉండేవారు. .
“అన్నల్లారా తమ్ముల్లారా ! అమ్మను అయ్యను కానండీ ” అని అమ్మ కోసం చెప్పాలని ఉన్నా నేను వాళ్ళకు ఏమి చెప్పలేకపోయాను, వాళ్ళే నా యెడల సరిగా ఉంటే ఇవాళ్ళ నేను ఇలా పరితపించేదాన్ని కాదుగా అనిపించింది.

“ నలుగురు కూచుని నవ్వే వేళల , నా పేరొక తరి తలవండి; మీమీ కన్న బిడ్డల నొకతెకు , ప్రేమను నా పేరివ్వండి.” అంటూ పిన్నలకు , పెద్దలు స్మరించుకొని

“ఆవులు పెయ్యలు మందలు జేరెను , పిట్టలు చెట్లను గుమిగూడెన్ , మింటను చుక్కలు మెరయుచు వొడమెను, యింటికి పూర్ణమ రాదాయె.” అన్నట్లుగా

“ కన్నుల కాంతులు కలవల చేరెను, మేలిమి జేరెను మేని పసల్ ! ,

హంసల జేరెను నడకల బెడగులు , దుర్గను జేరెను పూర్ణమ్మ.” అన్నట్లుగా నేను కూడా ఆ అమ్మ ఒడికే చేరుకోవాలనుకున్నాను.

బతుకడం ఇక చాలనిపించింది, నా బతుకులో ఏ మార్పు ఉండదనిపించింది.

ఇన్లాండ్ లెటర్ తీసుకొని కన్నీటిబొట్లు హృదయ సముద్రంలోంచి జలజలా రాలుతుండగా మా అక్కయ్యల పిల్లలను పేరుపేరునా తలచుకుంటూ లేఖ రాసాను వారికి.

ప్రియమైన రాజు, రాణి, చిట్టి, విష్ణు…, మీకు నా ప్రేమపూర్వకమైన దీవెనలు. మీరు బాగా చదువుకోండి, నాలా మధ్యలో చదువు ఆపివేయకండి. చక్కగా చదువుకొని వృద్ధిలోకి రండి. మీరే నా పిల్లలు, మీరే నా స్నేహితులు, నాతో అంత చనువుగా ఉన్నది మీరే చిన్ననాటి నుండి. అందుకే మీకే రాస్తున్నాను. కొందరి జీవితాలు ఇంతేనేమో అర్ధంతరంగా ముగుస్థాయి. నా కోసం ఎవ్వరు బాధ పడవద్దని చెప్పండి. ఆడ పిల్ల పెళ్లి విషయంలో కట్నాలు, కానుకలు అవసరం ఉన్న ఈ సమాజంలో మార్పు రావాలని చెప్పండి. మీరు అలాంటి విషయాలకు ఆశ పడకండి. జీవితం లొ పెళ్లి అనేది ఒక ఆనందాల హరివిల్లు కావచ్చు, అది నాకు నేను కోరుకున్నట్లుగా అందలేదు, దొరుక లేదు. అందుకే నేను ఈ లోకం లోంచి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నా. నాపై ప్రేమను కురిపించిన అమ్మానాన్నలను అడిగినట్లుగా చెప్పండి. నేను వెళ్ళిపోయినా తరువాత అమ్మమ్మను సరిగా చూసుకోండి , ఒక్కతే ఉంటుంది. బహుశా ఈ లెటర్ మీకు ముట్టే వరకు నేను ఈ లోకములో ఉండను కావచ్చు.

– మీ ప్రేమమయి.

లేఖ రాసి, లెటర్ను మడిచి అన్నం మెతుకులతో అతుకు పెట్టాను. అతుకు పెట్టిన తరువాత కూడా ఆ అతుకుపై పెన్ తో ఇంటూ మార్కులు పెట్టాను, లెటర్ ముట్టేవరకు మధ్యలో ఎవరు విప్పి చూడద్దు అన్నట్లుగా . ఆ లెటర్ ను తెల్లవారి అన్నయ్యకు ఇచ్చాను టౌన్ లొ పోస్ట్ డబ్బాలో వెయ్యమని. సరేనన్నాడు అన్నయ్య. కాని విధి రాతను ఎవ్వరు మారుస్తారు. మనం అనుకున్నవి అన్నీ జరుగుతాయా! అసలు లెటర్ చేరవలసిన సమయానికి చేరవలసిన వారికి చేరుతుందా అనేది కూడా కాలమహిమనేమో ! లెటర్ పోస్ట్ చెయ్యమని అన్నయ్యకిచ్చాను కాని అతడు పోస్ట్ చేశాడో లేదో అనే విషయం నాకు తెలియదు అప్పటికి .

ఆ తర్వాతి తెల్లవారి, అన్నయ్య, అతడు నాకు కలిశారు. కొందరి కలయిక, కొందరి సహచర్యం మనకు తెలియకుండానే మనకు ఒక అజ్ఞాతమైన శక్తిని ఇస్తుందేమో. మంచివాళ్ల తలంపులు, మంచి ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉంటూ మనకు మంచిని చేస్తాయేమో. అందుకేనా నేను ఇన్నేళ్ళు బతుకుతూ వచ్చింది కష్టాలను ఓర్చుకుంటూ కూడా అని అనిపిస్తుంది. గుండెల్లో తీరనంత విషాదాన్ని పెట్టుకొని కూడా అప్పట్లో అందరిలో ఉన్నపుడు హాయిగా నవ్వేదాన్ని. అన్నయ్య తో పాటు అతడు కలిసాడంటే కులాసా కబుర్లు చెప్పే వాడు, హాయిగా నవ్వించేవాడు, నాకు టైం పాస్ అవుతుంది అనేమో అని నా కోసం కొన్ని వార పత్రికలు, నవలలు తెచ్చి ఇచ్చాడు చదువుకోవడానికి ఆనాడు అతడు.

ఆనాడు అతడు నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒక నవల నన్ను తీవ్రంగా ఆలోచింప చేసింది. అతనికి నా యెడల ఏమైనా కోరికలు, అభిప్రాయాలు ఉన్నాయా అని. అతడు ఆ నవల నాకు కావాలని ఇచ్చాడా, నా మనోగతాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడా అని అనిపించింది. ఆ నవల వాసిరెడ్డి సీతా దేవి గారి ప్రసిద్ధ నవల ‘ సమత’. ఆ నవలను మూడు గంటల్లో ఏకధాటిగా చదివాను ఆనాడే. ఆ నవలలొ ప్రధాన పాత్రదారి అరుంధతి, సీతాపతి అనే ఒక పల్లెటూరి రైతుకు భార్య, మాధవి అనే బిడ్డకు తల్లి, శాంతమ్మ అనే అత్తకు కోడలు. ఆమె చాలా, అందమైనది, తెలివైనది, పట్నంలో పెరిగిన ఆమె అధునాతన అభిరుచులు గల స్త్రీ. సవతి తల్లి పెంపకంలో పెరిగి, బీదవాళ్ళ ఇంట్లో పుట్టింది కాబట్టి కట్న కానుకలు ఏమి ఇచ్చుకోకుండానే అంతో కొంత ధనవంతుడైన సితాపతికి భార్యగా వస్తుంది. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితం లోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి సీతాపతి ప్రాణమిత్రుడు రాజారావు. మొదటిసారి చురుక్కుమనే కళ్ళతో ఉండి ఆకట్టుకునే అతడి ఫోటోను గోడపై చూసి ఎవరీయన అని తెలుసుకుంటుంది. అతడు వామ పక్ష భావాలు కలిగిన అభ్యుదయ వాది, సమసమాజం కోసం, ప్రజల కొరకు పాటుపడే వ్యక్తి అని, పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతములో ఉంటున్నాడని తెలుసుకుంటుంది. ఒకనాడు రాజారావు వాళ్ళ ఇంటికి వస్తాడు, రాజారావు వస్తే ఇంకో కొడుకు ఇంటికి వచ్చాడు అన్నంతగా సంబుర పడిపోయింది శాంతమ్మ. ప్రాణ స్నేహితుడు వచ్చాడు అని ఆత్మీయంగా ఫీలయ్యాడు సీతాపతి. అరుంధతి అద్వితీయమైన అందాన్ని చూసి ముగ్ధుడవుతాడు రాజారావు మొదటిసారే. మా సీతాపతి అదృష్టవంతుడు అని అనుకుంటాడు మనసులో. ఒక వారం రోజులు తిరక్కుండానే రాజారావు దగ్గర చనువు ఏర్పడుతుంది అరుంధతికి. రాజారావు చురుకుదనం, ఆదర్శాలు బాగా నచ్చుతాయి అరుంధతికి. ఇద్దరు పరస్పర ఆకర్షణకు లోనవుతారు. కాని స్నేహధర్మంగా అతడు, భార్యా ధర్మంగా ఆమె హద్దులలోనే ఉండాలనుకుంటారు. ఒక నెల రోజులు పైగా వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళిపోతాడు రాజారావు. తరువాత సీతాపతికి, అరుంధతికి ఒక బిడ్డ పుడుతుంది. శాంతమ్మకు మనుమరాలి పేరు మహలక్ష్మి అని పెట్టుకోవాలని ఉన్నా, అరుంధతి తన బిడ్డకు మాధవి అనే పేరు పెట్టుకుంటుంది, తను బాగా చదివే శరత్ నవలల్లోని ఒక పాత్ర పేరుతో. అమ్మాయికి వయసు ఏడాది దాటి ఉంటుంది. మాధవికి 11 నెలలు దాటుతాయి, ఒకనాడు పనిమనిషి రంగడు పాపను తోటలోకి తీసుక వెళుతాడు ఆడించడానికి, అక్కడ ఒక కోడె దూడ మాధవిని కుమ్మడానికి వస్తుంటుంది. అప్పుడు అటుగా రక్తపు మరకలతో వస్తున్న రాజా రావు కోడెదూడతో పోట్లాడి పాపను రక్షించి సొమ్మసిల్లి పడిపోతాడు. అలా రెండవ సారి సీతాపతి ఇంటికి చేరుకొని రెస్ట్ తీసుకుంటుంటాడు రాజారావు. అలా కొన్ని రోజులు గడుస్తాయి, రాజారావుకు, అరుంధతికి సాన్నిహిత్యం ఇంకా పెరుగుతుంది ఒకరంటే ఒకరు అభిమానంతో. వారి సాన్నిహిత్యం గమనించి కోడలిని హెచ్చరిస్తుంది శాంతమ్మ ఈ వంశం మచ్చ లేని వంశం అని, అరుంధతి వల్ల ఈ వంశ గౌరవం పెరుగాలి గాని తగ్గద్దు అని. భర్త కూడా అరుంధతితో అసహనంగా ఉంటాడు మనసులో మాట చెప్పకుండా.

తరువాత కొద్ది రోజులకు రాజారావు అరుంధతితో చెపుతాడు, అమ్మకూ , సీతాపతికీ మనిద్దరి చనువు భాదాకరంగా ఉంటుందని తను రేపు వెళ్ళిపోతున్నాను అని.

నీవు లేనిది నేను కూడా లేనని తను కూడా వచ్చేస్తాను అంటుంది అరుంధతి రాజారావుతో .

రాజారావు ఆశ్చర్యపడుతాడు అరుంధతి ప్రవర్తనకు , తను మిత్ర ద్రోహం చెయ్యలేనని, పార్టి క్రమ శిక్షణను తప్పలేనని, తనకు కర్తవ్యమే ముఖ్యం అని. రాజారావు ను అర్ధం చేసుకొని సరేనని ఊర్కొంటుంది అరుంధతి. తరువాత రోజు రెండు రోజుల పని ఉందని సీతాపతి ఏలూరు వెళ్ళిపోతాడు, సీతాపతి వెళ్ళిన రోజు సాయంత్రం పోలీసులు వచ్చి రాజారావు ను అరెస్ట్ చేసి తీసుక వెళుతారు. రాజారావు అరెస్ట్ అయిన మూడో నాటి సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు సీతాపతి. రాజారావు అరెస్ట్ విషయం తల్లి ద్వారా తెలుసుకుంటాడు. రాజారావు ఆచూకి పోలీసులకు ఇచ్చింది సీతాపతే అని అతనిపై అసహ్యభావాన్నిపెంచుకుంటుంది అరుంధతి. ఆ అరెస్ట్ కు కారణం నేను కాదు అని తల్లికి చెప్పుకుంటాడు సీతాపతి. మాధవికి మూడవ పుట్టిన రోజు గడిచి పోతుంది. ఒకనాడు పేపర్లో వార్త వస్తుంది, రాజారావు పోలీసులకు లొంగిపోయాడని, పార్టికి రాజీనామా చేసాడని, ప్రజా జీవితంలోకి వసున్నాడని. సీతాపతికి ఆ విషయం ఇష్టం అనిపించలేదు కానీ అరుంధతి సంతోష పడుతుంది. తరువాత రాజారావు అధికార పార్టీ లోకి మారి, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీ చేయాడానికి ప్రచారంలో భాగంగా సీతాపతి వాళ్ల ఊరికి వస్తున్నాడని తెలిసి సంతోష పడుతుంది అరుంధతి కాని సీతాపతికి ఆ విషయం నచ్చలేదు. అరుంధతి రాజారావుపై అబిమానంతో ఆ సభకు వెళ్ళాలనుకుంటుంది కాని సీతాపతి వెళ్ళద్దని వారిస్తాడు, తను మొండిగా వెళ్తానంటుంది. వెళ్తే ఇక ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్లిపోవలసిందే అని ఆజ్ఞాపిస్తాడు భర్త. ఆ సభకు వెళ్లి వస్తుంది అరుంధతి, భర్త ఇంట్లోకి రానీయదు, బిడ్డను ఇస్తేనయినా వెళ్లిపోతానతుంది, బిడ్డను కూడా ఈయడు. అలా భర్తను, మూడేళ్ళ కూతురను వదిలిపెట్టి, అత్తగారి ఇంటి నుండి కాలు బయటపెట్టి ఒంటరిగా గుంటూరులో ఉన్న రాజారావును కలువడానికి వెళ్తుంది అరుంధతి. ( మిగతావారం….)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!