అనుభూతులంతే
జ్ఞాపకాల దొంతరల మధ్య
మంచు చినుకులై పలుకరిస్తయి
మనసు వాడిపోకుండా మమకారంతో తడిపిపోతై .
తాకినప్పుడల్లా పురా పరిమళాలద్దిపోతయి.
పోగొట్టుకున్నవన్నీ
రాలిపోయిన ఆకులమీది రాగాలే
పొందుతున్నవీ పొందాలనుకుంటున్నవీ
మనస్సీమలో అంకురించే ఊహల విత్తనాలే.
అరిగిపోతున్న ఆయువునూ
కరిగిపోతున్న కాలాన్నీ గుర్తుచేస్తూ
బొట్లు బొట్లుగా జారే క్షణాలన్నీ
ఈ ఎడారినౌక ధ్యానంలో విచ్చుకోవాల్సి ఉంది .
దిగులును కొద్దిసేపు మూపురంమీంచి
దించుకున్న తీర్పాటంలో
తడి జాడ కోసం
దాటాల్సిన ఇసుక మైదానాల మధ్య
రాత్రిని నెమరేసుకుంటాం .
నిమీలితమైన కళ్ళల్లోంచి నిశ్శబ్దం
ధారకడుతుంది .
గడ్డకట్టిన రాత్రిమీద తలాన్చి
తల్లో ఒలుకబోసుకున్న తలపులు
తెల్లారి చిటారుకొమ్మమీద పూసి కవ్విస్తాయి .
పూతా అందదు కాతా దక్కదు .
ఆశపెట్టిన పూలూ రిక్కలు రాల్చుకుంటాయి.
తోటకు కన్నీటి పారకంపెట్టుకుంటూ
కాలానికి మొక్కుకుంటం .
ఎందుకో కనికరపు మేఘాలన్నీ
ఎప్పుడూ
కొండల మీదే కురిసి వెలిసి పోతుంటయి.
నిరాశ ఊబిలో ఒంటరి దిగులు
లుంగలు చుట్టుక పోతుంటుంది .
దుక్కపు వాసనేదో
మనసును లొంగదిసుకుంటది .
గుప్పెడు గుండెలో ఏదో ఓ మూల
బలహీనపరిచే
క్షణాల సునామీలకు ఎదురీదడానికి
ఇప్పుడొకింత ఆసరా అవసరం .
కాసింత ఆశను చిగురింపజేసే
విచ్చుకున్న ఒక పచ్చటి లోగిలి అవసరం.
ఇప్పుడు సాంత్వన నిచ్చే నీడ కోసం
నిబ్బరాన్నినింపి
జారిపోకుండా చూసే
మనసు తోడు అవసరం .
-వఝల శివకుమార్