Sunday, October 2, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరుదీపం! (10 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరుదీపం! (10 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఏళ్లకేళ్ళు ఎదురు చూసిన హరికీ ఫిషర్ మాన్ కూ పెద్ద తేడా కనిపి౦చలేదు చందనకు. భాష ఏదైనా, ఉండే ప్రాంతం ఏదైనా మనుషుల స్వభావాలు అనుభూతులూ ఒక్కలానే ఉ౦టాయేమో అనిపించింది.

పార్కర్ ప్రేమకోసం ఆత్మ హత్యకు సిద్దమవడం, పరమేశం కోసం ప్రాణాలు వదిలిన స్వరాజ్యం, ఎందరో ప్రేమకు బలైపోడం…ఇవన్నీ చూస్తే ఇంత బలమైనదా ప్రేమ అనే భావన అనిపి౦చి౦ది. ఒక్క మనిషి లేకపోతే జీవితమే ముగిసిపోయి౦దని అనుకోడం ఎంత విచిత్రం. కానీ ఒక క్షణికమైన ఉద్వేగంలో ఒక బలవత్తరమైన బలహీనతలో జీవితం త్యాగం చెయ్యడం, ఆ కాస్సేపు కాస్త విచక్షణతో కంట్రోల్ తెచ్చుకుని ఆలోచిస్తే ఎంత మూర్ఖంగా ఆ పని చేస్తున్నారో, చెయ్యాలనుకున్నారో అర్ధం అవుతుంది కావచ్చు.

ఆలోచిస్తూనే ఈ విషయం హరికి చెప్పి౦ది.
“నిజమే చ౦దూ, అది అనుభవించిన వాళ్ళకే అర్ధం అవుతు౦ది. నరకం అనేది ఏదైనా ఉంటే అదే కావచ్చు. ఏ పని చేసినా, ఏం చెయ్యకపోయినా అనుక్షణమూ పక్కన లేరన్న దిగులు ఒక ఉప్పెనలా కమ్మేస్తూ ఉ౦టు౦ది. ఆఫ్ కోర్స్ ఆత్మ హత్య అనేది మానసిక బలహీనత అనుకో..”

“అదే ఆలోచిస్తున్నాను హరీ. ఇలా డిప్రెషన్ లొ పడి కొట్టుకుపోయే వాళ్లకు, ముఖ్యంగా యువతకు వారానికో రోజు ఫ్రీ కౌన్సెలింగ్ ఇద్దామా అని. అదేదో వాళ్ళను కూచోబెట్టి పాఠంలా కాకు౦డా మన పార్కర్ లాటి వారితో వారి వారి అనుభవాలు చెప్పిస్తే బాగు౦టు౦ది కదూ…”

ఆశ్చర్యంగా చందన మొహం లోకి చూసాడు హరి.
“భగవంతుడు నాకిచ్చిన అవకాశానికి ఈ ప్రతిఫలం చాలా చిన్నది. మన జీవితం పొడిగించిన ప్రతి సారీ మన వల్ల ఏదో జరగాలని ఆశిస్తున్నాడేమో ఆపై వాడు అనిపిస్తుంది. “యధాలాపంగా అన్నా ఆ మాటలు హరి హృదయాన్ని బలంగా తాకాయి.
అవును. చందన కోసం దేనికైనా సిద్ధమే.
“ష్యూర్ చందూ నేనూ నీతో పాటే” అన్నాడు.
దాని కోసం ఒక పరిపూర్ణమైన ప్లాన్ తయారు రెండు నెలలు పట్టింది.
ముందుగా టీనేజిలోకి అడుగు పెట్టే వారికోసం కౌన్సెలి౦గ్ క్లాసెస్ ఇంట్లోనే ఆదివారం సాయంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు.
సాయంత్రం నాలుగు నుండి అయిదు వరకూ.
ఆ కౌన్సెలింగ్ క్లాస్ లకు సాయపడతామని పార్కర్, ఫిషర్ మాన్ కూడా ముందుకు వచ్చారు.
తొలి రోజున నాలుగున్నర దాటాక ఒకే ఒక్క అమ్మాయి వచ్చింది.
వచ్చిన పిల్ల చాలా సేపు నోరు విప్పలేదు.
ఇహ లాభం లేదని ఒక పేపర్ పెన్ ఇచ్చి ఆమె వివరాలు రాయమన్నారు.
జెన్నీ ఆ పిల్లపేరు. పదకొండో క్లాస్ చదువుతో౦ది. పదహారు నిండి పదిహేడో ఏట అడుగుపెట్టింది.
ప్రపంచం అంతా శూన్యంగా ఎ౦దుకు అనిపిస్తో౦దో తెలియదట. దేని మీదా ఆసక్తి లేదట.
తినాలి గనక ఏదో ఒకటి తినడం, టీవీ చూస్తున్నా ఏదీ తలకెక్కదట. పుస్తకాలు చదవ బుద్ధి కాదు.
మూవీస్ పట్ల ఆసక్తి లేదు.
కాస్సేపు ఆ పేపర్ పట్టుకుని అలాగే ఉంది పోయింది చందన.
ఆ రోజు క్లాసెస్ ఇనాగరేషన్ కి వచ్చిన పార్కర్
ఆ పిల్ల పక్కన కూచుని అతి తక్కువ స్వరంలో మాటలు మొదలుపెట్టింది.
“నీ చేతి వేళ్ళు పొడుగ్గా ఎంత అందంగా ఉన్నాయి? నెయిల్ పాలిష్ ఎందుకు వేసుకోలేదు?” మృదువుగా అడిగి౦ది.
“అమ్మకు నెయిల్ పాలిష్ నచ్చదు.”
“నీకు ఇష్టమేనా?”
కాస్సేపు ఏం చెప్పాలో తెలియనట్టు చూసి ఇష్టమే అన్నట్టు తలూపింది.
మళ్ళీ అంతలోనే, “రోజూ కాదు గాని అప్పుడప్పుడయినా వేసుకోవాలనిపిస్తు౦ది. కాని అమ్మకు అసలు నచ్చదు. “
“ మీ మామ్ వేసుకోరా?”
“ఉహు, అస్సలు. అస్సలంటే అస్సలు నచ్చదు. వేసుకోదు”
విషయం కొంచం అర్ధం అయినట్టు అనిపి౦చి౦ది పార్కర్ కు. సహజమే. పిల్లలకు ఏది నచ్చుతుందో అది అమ్మలకు నచ్చదు. అమ్మలకు వ్యతిరేకంగా పోలేక మొత్తం ఆసక్తినే కోల్పోడం…
“ ఏ కలర్ నెయిల్ పాలిష్ ఇష్టం నీకు?” మళ్ళీ అడిగింది పార్కర్.
కాస్సేపు మౌనంగా ఉండిపోయి౦ది జెన్నీ ఏం చెప్పాలో ఆలోచి౦చుకు౦టున్నట్టు.
“రెడ్ కలరా డార్క్ పి౦కా?”
“రెడ్”
చాలా సేపు ఎన్నో ప్రశ్నలు అదిగాక జెన్నీ తనగురించి చెప్పడం మొదలుపెట్టింది.
“నేను హైస్కూల్ కి వచ్చాను. క్లాస్ లో అందరూ తెలివైన దాన్ననే అంటారు. ఎప్పుడూ చాలా మటుకు ఏ ప్లస్ గ్రేడ్ లే వస్తాయి. అందంగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అంటారు. కాస్త మేకప్ వేసుకు౦టే రాకుమారిలా ఉంటానని, కాని అమ్మకు నా మీద నమ్మకమే లేదు.
నేను చూడట్లేదనుకుని నా నోట్ బుక్స్ చెక్ చేస్తుంది. నా ఫోన్ కాల్స్ చెక్ చేస్తుంది. నా ఫ్రెండ్స్ అందరికీ ఫేస్ బుక్ ఐడీ లు ఉన్నాయి. నాకూ ఫేస్ బుక్ అకౌంట్ కావాలి, కాని అమ్మ ఒప్పుకోదు.”
“నీకు నిజంగా ఫేస్ బుక్ అకౌంట్ లేదా ?” ఆశ్చర్యంగా అడిగింది పార్కర్.
“నిజానికి ఒక ఫేక్ అకౌంట్ వుంది. కాని అది నాదని అమ్మకు తెలియదు. అమ్మ లేనప్పుడే దాన్ని ఆపరేట్ చేస్తాను, అందుకే గదా నా ఫోటోలు ఏవీ అప్ లోడ్ చెయ్యలేకపోతున్నాను.” అదేదో కొ౦ప మునిగే విషయం లా మొహం పెట్టింది.
“ నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా?”
“అమ్మో బాయ్ ఫ్రెండే, అమ్మ నరికేస్తుంది.”
“నిజం ?”
“అవును. అమ్మ ముందే చెప్పింది ఆరో క్లాస్ లో ఉన్నప్పుడే. కాలేజీ కి వెళ్ళే వరకూ బాయ్ఫ్రెండ్ అంటే నాసంపాదన నేను సంపాదించుకుని చదువుకోవాలని. ఇప్పుడు కూడా నా ఖర్చులకు బేబీ సిట్టింగ్ చేసి స౦పాది౦చు కు౦టాను.”
“అవునా?”
“అవును. బాయ్ ఫ్రెండ్
అంటూ ఇరవై ఏళ్లయినా రాకుండా మదర్ ని గనక అయితే నన్నూ నా కిడ్ నూ వీధిలోకి గెంటేస్తానని చెప్పింది అమ్మ”
వింటున్న చందనకు అనిపించింది, ఇన్ని కట్టడులలో పెట్టకపోతే ఈ అమెరికాలో పిల్లలను పెంచటం కత్తిమీద సాము కదా అని.
“నీ ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా?”
“ఉన్నారు, వాళ్ళతో కలిసి మూవీస్ కి పార్టీలకు వెళ్తారు. కాని నేను మాత్రం వెళ్ళను. అమ్మకు నచ్చదు.”
“నిజం చెప్పు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని అనిపి౦చ లేదూ ?”
“అనిపిస్తుంది. రోజీ బాయ్ ఫ్రెండ్ దానికి మంచి పర్ఫ్యూమ్స్ గిఫ్ట్ చేసాడు. మేరీ వచ్చిన మూవీ అల్లా తన బాయ్ఫ్రెండ్ తోనే చూస్తుంది.
అమ్మకు తెలియకుండా ప్రిన్స్ తో స్నేహం చేద్దామనుకున్నాను. కాని వాడు మాట్లాడిన రెండో రోజే గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నా కది నచ్చలేదు.”
అమాయకంగా అనిపించింది జెన్నీ.
“ఎందుకు నచ్చలేదు?”
“ఏముంది? ఇప్పుడు ముద్దంటాడు రేప్పొద్దున్న ప్రేమ అంటాడు డేటింగ్ అంటాడు ఆ తరువాత లాస్టియర్ మా స్కూల్లో ఒకమ్మాయి టెన్త్ లొ ప్రెగ్నెంట్ అని స్కూల్ నుండి తీసేశారు”
“అవునా. చూసావా, అందుకే కదా అమ్మ భయపడేది?”
“నిజమే అక్కా, కాని మాకు అన్నీ తెలుసు మా లిమిట్స్ మాకు తెలుసు మా జాగ్రత్తలో మేం ఉంటాం కదా. మరీ అమ్మ నన్ను చిన్న బేబీలా ట్రీట్ చేసి ఏ మాత్రం లిబర్టీ లేకుండా చేసింది. అందుకే విరక్తిగా వుంది.”
పార్కరే ఆ అమ్మాయితో మాట్లాడి ఎలా నచ్చజెప్పి౦దో కాని చివరకు, “ మీ అమ్మతో అన్ని విషయాలూ ఫ్రీగా మాట్లాడు బంగారూ. అప్పుడు ఆవిడకూ నమ్మకం వస్తుంది. పిల్లలు ఇబ్బంది పడకూడడనే తలిదండ్రులు స్ట్రిక్ట్ గా వుంటారు”
తలూపింది జెన్నీ.
“ నేను వచ్చి అమ్మతో మాట్లాడనా?” ఆఫర్ చేసింది పార్కర్.
“వద్దు అక్కా, మళ్ళీ అమ్మ తనమీద మీకు చెప్పానని ఫీలవుతుంది”.
తల్లీ కూతుళ్ళకు ఒకరి మీద ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోక ఎంత దూరం అవుతున్నారో అనిపించింది.
ఆ రోజు సమయం ఆ పిల్లతోనే సరిపోయింది.
ఆ రాత్రి పార్కర్ ఫిషర్మాన్ డిన్నర్ కి వాళ్ళతోనే ఉండి, చాలా పొద్దుపోయాక వెళ్ళారు.
చందనకు మనసుకు ఎంతో తృప్తిగా అనిపించింది.
ఆ రాత్రి హరి గుండెల మీద తలపెట్టుకుని,
“హరీ, ఎన్నో అనుకుంటాము కాని మనం ఏ౦చెయ్యాలో ఆ పై వాడు ముందే నిర్దేశిస్తాడులా ఉంది. ఎప్పుడయినా అనుకున్నానా, ఇలా ఈ పనులన్నీ చేస్తానని. కాని వాటన్నిటి వెనకా ఉన్నది మాత్రం నువ్వే సుమా…”
హరికాస్సేపు మౌనంగా ఉండి,
కాదు చందూ, అలా పైకి అనిపిస్తుంది కాని ఎవరికీ వారికి వెనక ఉండేది వాళ్ళ ఆత్మ విశ్వాసమే. చెయ్యాలన్న తపన. ఆ తపన చేతికర్రలా ముందుకు నడిపిస్తు౦ది . వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ఆ బలం నీకు ఇవ్వడానికి నేనొక ఉత్ప్రేరకాన్ని అంతే” అన్నాడు.
“ఏదేమైనా అవనీ నా ఉనికికి ఆధారం నువ్వు. అదే నాకు కొండంత అండ.” అనుకుంది మనసులో.
వారానికి ఏడు రోజులూ బిజీగా ఉండటం వాళ్ళను చూసే నేర్చుకోవాలి, అనుకునే వారు అందరూ. జెన్నీతో మొదలైన కౌన్సెలింగ్ సెంటర్ ఏడాది తిరిగేసరికి వందలాది మందికి ఊతకర్ర అయింది.
పార్కర్, ఫిషర్ మాన్ తో పాటు, మరెందరో వాలంటరీగా వచ్చి చేరారు.
పది సంవత్సరాలు గడిచాయి. గిర్రున తిరిగాయనీ చెప్పలేము అలాగని కుంటుతూ నడిచాయనీ చెప్పలేము.
వాటి దారిన అవి తోచినప్పుడు పరుగులు పెడుతూ, కుదరనప్పుడు కుంటుతూ. మొత్తానికి పదేళ్ళు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాయి.
ఆ మధ్యన మరో సారి మరో బ్రెస్ట్ ప్రభావితం అవడం మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ కీమో మళ్ళీ ఒక నరకం, అది కోలుకునే లోగా అపెండిసైటిస్ ఆపరేషన్ …
“ప్రపంచంలో ఉన్న బాధలన్నీ చందూకే రాసాడా ఆ పైవాడు” అనుకునే వాడు హరి.
సిక్ అవడం కోలుకోడం ప్రతిగా ఎదో ఒక పని ఎంచుకోడం, పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళారు.
ఇంట్లో ఉండేది ఇద్దరు.
వచ్చే నెలలో రాబోయే వెడ్డింగ్ యానివర్సరీకి ఇద్దరూ ఎంతో ప్లాన్ చేసుకున్నారు. పది రోజులపాటు క్రూజ్ లో వెళ్లి ఒకరికొకరుగా ఈ బిజీ ప్రపంచానికి దూరంగా గడపాలని.
అనుకున్నదే తడవు ఫ్లారిడా నుండి టికెట్స్ బుక్ అయ్యాయి.
(ఇంకా ఉంది)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!