Saturday, December 14, 2019
Home > కథలు > నాన్నా! నా బంగారు కొండా! -వి. సునంద

నాన్నా! నా బంగారు కొండా! -వి. సునంద

నాన్నా! చందూ! నా బంగారు కొండా!

నీ క్షేమమే ఊపిరిగా బతికే మీ అమ్మను.
ఇంట్లోనే వుంటూ, ఇలా ఉత్తరం రాయడమేమిటా అని ఆశ్చర్య పడుతున్నావు కదూ.. నీకెలా చెప్పాలో తెలియక ఈ మార్గం ఎంచుకున్నాను.

కన్నయ్యా! నిన్నెంత అల్లారుముద్దుగా చూసుకుంటున్నామో నీకు తెలుసు. నీవు కోరింది క్షణాల్లో నీ కళ్ళముందుంచాం.. నీ స్నేహితుల ముందు తక్కువ కాకూడదని పాకెట్ మనీ కూడా ఇస్తున్నాం. పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిస్తే బాగా వస్తుందని లక్షలు పోసి చదివిస్తున్నాం.. మేం పడిన ఇబ్బందులు మీరు పడకూడదని మీ జీవితాన్ని వడ్డించిన విస్తరి చేశాం…

అయినా ఈ. మధ్య ఎందుకో మా నుండి నువ్వు దూరంగా వుంటుంటే వయసు తెస్తున్న మార్పు కదా అనుకున్నాం….
ఈ మధ్య పాఠాలు, పరీక్షల విషయంలో నీవు చాలా వెనుక బడి వున్నావని, మీ ఉపాధ్యాయులు చెప్పేంత వరకు నీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోలేక పోయాను…
మనమంతా ఉదయం వెళితే కాని సాయంత్రం దాకా ఇంటికి రాలేము.
వచ్చీ రాగానే మనందరం బోలెడు ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం. అలాంటి మేము మీ గురుంచి ఎక్కుప సమయం కేటాయించలేక పోవడం మా తప్పే… మరొకటి నీ మీద మాకున్న నమ్మకం..
అలాంటిది ఈ మధ్య మాతో సరిగా మాట్లాడకుండా తప్పుకొని పోతున్నావంటే. చదువులో తలమునకలై పోయావని, కామన్ పరీక్షలు కదా అందుకేనేమో అనుకున్నా…

కానీ!, మునుపటిలా ఉండట్లేదని అందరూ అంటుంటే.. నా మనసేదో కీడు శంకించింది.
అనుకున్నంత పనీ అయ్యింది. నీవు మీ స్కూల్లో కొెందరు డ్రగ్స్ కు బానిలై… మత్తులో మునుగుతున్నారని తెలిసి అవాక్కయ్యాను.. అందులో నీ పేరు కూడా చదివి కన్నీరు మున్నీరు అయ్యాను..

నీ వెందుకిలా అయ్యావు కన్నయ్యా! నీ కేమైనా అయితే మా శ్వాస ముందే ఆగిపోతుందని నీకు తెలుసు.. నీవు మామూలు మనిషి గా మారాలనే రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చాము. మాట మనిషిని మారుస్తుందని, నీవు మళ్ళీ మామూలు మనిషివి కావాలనే తపనతో ఈ ఉత్తరం రాస్తున్నాను..

నీ మీద మాకు నమ్మకం వుంది. నీవు మా మునుపటి బంగారు కొండవు కావాలని కోరుకుంటూ, కన్నీటితో వేడుకుంటూ మీ అమ్మ.

వి. సుకన్య,
ఖమ్మం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!