Sunday, October 2, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )-10 వ భాగం -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )-10 వ భాగం -శ్రీ విజేత

అరుంధతి రాజారావు దగ్గరకు వెళ్ళినా, రాజారావు రాజకీయ ప్రాపకంలో ఉన్నా, సిరి సంపదలతో తులతూగుతున్నా లోకం దృష్టిలో ఆమె స్థానం రాజారావుకు ఉంపుడుగత్తె, సమాజం దృష్టిలో పతిత, లేచిపోయి వచ్చిన స్త్రీ. అంతకన్నా గొప్పగా భార్య స్థానం ఈయలేక పోతాడు రాజారావు. ఈ విషయంలో తన స్థానానికి బాధపడుతుంది అరుంధతి. పదిహేనేళ్ళు గడిచిపోతుంది కాలం. రాజారావు రాజకీయంగా చితికిపోతాడు, అప్పటి ఎలక్షన్లలో ఒడిపోతాడు, వ్యతిరేక పార్టీవాళ్ళు అధికారం లోకి వస్తారు. ఆరోగ్యం కూడా దెబ్బ తింటది. ఆత్మాభిమానం గల అరుంధతి దగ్గర ఉండలేక పల్లెటూరికి వెళ్ళిపోతాడు రాజారావు. అరుంధతి ఒంటరిదై పోతుంది. తనకున్న ఒకే ఒక్క ఆశ, ఇష్టం అది తన బిడ్డ మాధవి గురించే. తన బిడ్డ మాధవిని చూడాలని, తన బిడ్డను తనకు చూపించాలని సీతాపతికి ఎన్నో ఉత్తరాలు రాసింది గతములో. కాని ఆ ఆశలేమి ఫలించలేదు. ఒకనాడు సీతాపతి నుంచి ఫోన్ వస్తుంది అరుంధతికి, మాధవిని చూడాలనుకంటే ఆ రోజు సరిగా అర్ధరాత్రి సమయమున తన అత్తవారింటికి బయలుదేరిరమ్మని. హుటాహుటిన అర్దరాత్రివరకు తన అత్తవారి ఇంటికి చేరుకుంటుంది. కాని తనకు అక్కడ మాధవి కనిపించదు. మాధవి గుంటూరు ఆసుపత్రిలో ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చి చనిపోయిందని తెలుసుకుంటుంది. తల్లి అండలేని మాధవి ఎదురింటి పిల్లవాడి మోసంతో గర్భం దాల్చిందని, అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామన్నా ఆ అబ్బాయి తలిదండ్రులు అంగీకరించలేదని విషయం తెలుసుకొని బోరున ఏడుస్తూ గుంటూరు ఆసుపత్రికి వెళుతుంది కనీసం ఆ పుట్టిన బిడ్డనైనా తీసుకవెళ్లి పెంచుకుంటానని. ఆ పాపకు పేరును ‘సమత’ అని పెట్టుకుంటానని, తను తన పాపకోసం, పాపలాంటి వారికోసం ఒక ఆదర్శ నగర్ కాలనీ లాంటిది కడుతానని కళలు కంటూ వెళ్తుంది. తీరా గుంటూరు చేరేవరకు ఒక పసిపాపను మూడు రోజుల క్రితం ఒక కుక్క ఎత్తుక పోయిందని, ఆసుపత్రి సిబ్బంది సమ్మె చేస్తున్నారని, ఆసుపత్రి దగ్గర పోలీసు బందోబస్తు ఉందని తెలుసుకొని ముందుకు వెళ్తూ గాయ పడుతుంది పోలీసు వలయంలో. తను స్పృహ కోల్పోతూ ఆస్పత్రి బెడ్ పై ఉండి, తన పేరును అరుంధతి అని, తన పేరా ఆస్థిపాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని, తెల్ల కాగితంపై తన పేరు రాసి తన మరణ వాంగ్మూలం కు మీరు సాక్షులుగా ఉండండని, ఆసుపత్రిలో ఉన్న తన మనుమరాలి పేరును ‘సమత’ అని పెట్టుకున్నాను అని, ఆ సమతను మీరే పెంచండని చెపుతూ కన్ను మూస్తుంది అరుంధతి అక్కడ ఉన్న వారితో చెప్పి. ఇది స్థూలంగా ఆ నవల సారాంశం. ఆ నవల మొదట్లో రెండు మూడు కుటుంభాల కథలు మననం చేసుకుంటుంది అరుంధతి. తను వ్యక్తిత్వం, ఆత్మాభిమానం అంటూ భర్త ఇంటి నుండి కాలు బయటపడితే లోకం తనను లేచిపోయింది అనే పేరు చేసింది. అదే తప్పు చేస్తూ ఇంటి గడప లోపల ఉండి గుట్టుగా అక్రమ సంభందాలు కొనసాగిస్తున్నస్త్రీలను ఈజిగానే భరిస్తుంది ఈ లోకం అని.

ఆ నవల చివరన ఒక వాక్యం రాశాడు అతను. ‘అరుంధతి బిడ్డ సమత’ అని. ఆ నవల చదివినంక కంపరమెత్తింది నాకు. అతని ఉద్దేష్యమేమిటీ అనిపించింది. నన్ను కూడా అరుంధతి లా లేచిపోవాలని ప్రోత్సహిస్తున్నాడా అనిపించింది. నరనరాన సంప్రదాయ భావాలు ఇమిడి ఉన్న పవిత్రమైన హైందవ సమాజములో పుట్టిన నేను అలా చేయలేను అని తలంచి అతనిపై అసహ్యం వేసింది. నేను కొందరిలా ఏ అక్రమ సంభంధాలు కొనసాగించ లేను గుట్టుగా, అరుంధతిలా లేచిపోనులేను. నేనింత చులకనగా కనిపిస్తున్నానా అతనికి అని అనిపించింది. కొంత సన్నిహితంగా అతనితో మాట్లాడినందుకే ఇంతగా నా నుండి ఆశిస్తున్నాడా అనిపించింది.

అతడు రాసిన వాక్యానికి సమాధానంగా ‘అరుంధతి చెడ్డది చెడ్డది చెడ్డది’ అని పెన్ తో దిద్ది దాని కింద రాజారావు మూర్కుడు అని రాసి ఆ పుస్తకం అతనికి ఇవ్వడానికి ఆ సాయంత్రమే అతన్ని కలిసినాను. అతను అన్నయ్య వాళ్ళ ఇంట్లో కుర్చీలో కూర్చొని ఏదో చదువుకుంటున్నాడు. అతనితో మాటలేమి మాట్లాడాలనిపించ లేదు. దెబ్బతిన్న పాములా తీక్షణంగా చూశాను అతని ముఖంలోకి, పుస్తకాన్ని అతని ముఖం పై ఈడ్చి కొట్టాను నా అభిమతం నువ్వు ఊహించినట్లు ఉండదు అన్నట్లు. అక్కడ ఇంకెవరు లేరు అప్పుడు. వెనువెంటనే ఇంటికి వచ్చేశాను.

వెక్కి వెక్కి దుఃఖం వచ్చింది. ఇంత చులకనగా చూస్తారా నన్ను అని అనిపించింది. నా ప్రవర్తనకు అతను ఏమనుకున్నాడో నాకు తెలియదు. నాకున్న కొద్ది మంది మిత్రుల్లో అతను ఒకడు. అయినా అతని భావన అదే అయితే అది నాకు నచ్చ లేదు. నేను నేనుగానే బతుకుతాను నా ఇష్టం వచ్చినట్లు, బతుకడం చాతకాక పోతే చనిపోతాను కాని అరుంధతిలా మాత్రం చేయను, మరెందరి లాగానో బతుకలేను అని అనిపించింది. మనసు పరిపరి విధాలా ఆలోచనల్లో పడిపోయింది బతుకాలా చావాలా అనే సందిగ్ధంలో.

అయినా కాలం మొండిది, నేను కూడా మొండిదాన్నేమో అది నన్ను చస్తామన్నా కూడా చావనీయలేదు.
కాని తర్వాత తెలిసింది అన్నయ్య ఆ లెటర్ పోస్ట్ చెయ్యలేదని, అనుమానం వచ్చి చింపి చదివి చూసాడని, అన్నయ్య, అతడు నా గురించి ఆలోచించారని, నన్ను బతికించుకోవాలని చూసారని, నా మనసు మార్చాలని తపన పడ్డారని తెలిసింది. కొందరి పనుల్లో స్వార్ధం లేక నిస్వార్ధం ఉంటుందేమో. అన్నయ్య అతను అలాంటివారే అని కాలం గడుస్తున్నకొద్దీ తెలుస్తూ పోయింది. నా యెడల అతని ప్రేమ కూడా కాలం గడుస్తున్నా కొద్దీ బహిర్గతమవుతూ పోయింది.

ఆనాటి తెల్లవారి అన్నయ్య నన్ను కలిశాడు ఒంటరిగా. అన్నయ్య చేతిలో నేను పోస్ట్ చెయ్యమన్న ఉత్తరం ఉంది, అది చింపి ఉంది. అన్నయ్యను చూస్తే నాకు భయం వేసింది.

“ఇలా ఎందుకు రాసుకున్నావు“ అన్నాడు ఉత్తరం చూపిస్తూ

“బతుకలేక ..” అన్నాను బాధతో

“చావొక్కటే పరిష్కారం కాదు” అన్నాడు

“బతికేమిచేయాలె” అన్నాను

“బతుకాలనుకుంటే ఎలానైన బతుకచ్చు. నీ కోసం కూడా బతుకచ్చు, ఎదుటివాళ్ళ కోసమైనా బతుకచ్చు, జీవితం మనం అనుకున్నంత కష్టం ఎపుడూ కాదు. మనమే దానిని ఎప్పుడూ ఎక్కువగా ఊహించుకుంటాం అనవసరంగా. కాలం గాయాన్ని మాన్పుతుందంటారు, నువ్వు మనసు మార్చుకో, అంతా మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కాలం గడుస్తుంటే అంతా సర్దుకుంటుంది. బతుకు భగవంతుడు యిచ్చిన వరం. దానిని సాఫీగా సాగనివ్వాలి, అర్ధాంతరంగా ముగించడం ధర్మం కాదు. కష్టాలు మనుష్యులకే వస్తాయి మ్రానులకు కాదు. జీవితంలో ఎందరో ఉన్నారు ఎమిలేనివాళ్ళు, కుంటివాడితో కూడా, గుడ్డివాడితో కూడా కలిసి జీవనం చేసేవాళ్ళు ఉన్నారు. బతుకంటే ఒకరితో ఒకరు సహజీవనం చేయడం ఉన్న దాంట్లోనే. ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం లేదు ఈ జీవితంలో ఈ దేశంలో. మనం ఒకటి అనుకుంటాం జీవితంలో కాని అది రాదు జీవితంలో, అప్పుడు అదే కావాలని పట్టు పట్టి కూర్చోకూడదు. ఉన్నంతలో సర్డుకపోవడం నేర్చుకోవాలి. నిన్ను వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు, అది వాళ్ళ యొక్క అజ్ఞానం. వాళ్ళు కూడా మారుతారు అంతా కొత్త. ఎవరు కూడా ఎల్లకాలం బతుకడానికి రాలేదు. జీవితంలో రెండే రెండు ఉంటాయి ఒకటి ఉన్న దాంట్లో సర్డుకపోయి బతుకడం లేకపోతే దాన్ని వదిలిపెట్టి కొత్త జేవితం ప్రారంభించడం కాని చనిపోవడం మాత్రం కాదు ” అన్నాడు

అన్నయ్య చెపుతుంటే నిరుత్తరురాలినై వింటూ పోయాను.

కొద్ది సేపటికి ఒక ప్రశ్న వేశాడు “ పెళ్లి చేసుకుంటావా మళ్ళీ” అని సూటిగా

విని షాక్ తిన్నాను. ఆ మాటను నేను ఉహించ లేదు, అది నాకు నచ్చని విషయం కూడా.

“ లేదు, చేసుకోను” అన్నాను ముక్తసరిగా

“ఎందుకూ ?”

“నాకు నచ్చదు ఇంకో పెళ్లి” అన్నాను

“ఇవే మొండి వాదనలు, ఉన్నది నచ్చదు, నచ్చని దాన్ని వదిలి పెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు కాని అలా పెట్టలేనంటావు. జీవితంలో ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించడం మూసలో పోసినట్లు. పాత భావనలు తోలగించుకొని కోత్హగా జీవించడం నేర్చుకోవచ్చు. నీ కోసం కూడా ఆలోచించేవారు ఉంటారు కదా, నువ్వు బతుకాలని కోరుకునేవారు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా బతుకచ్చు. నువ్వు రడీగా ఉంటే చెప్పు నేను నీకు ఇంకో పెళ్లి చేస్తాను”.

“ నాకు ఆ ఉదేశ్యం లేదు, ఇంకో పెళ్లి చేసుకొని బతుకాలని” బదులిచ్చాను

“మరి చనిపోవడం నిర్ణయం ఎందుకు?”

“తక్షణం అలా అనిపించింది, నా కేమి పరిష్కారం కనిపించలేదు, పరిష్కారం చూపించేవాళ్ళు కూడా లేరు. ఎవరికి ఇబ్బంది కాదలచుకోలేదు నేను, ఎవరిని ఇబ్బంది పెట్ట దలచుకోలేదు. అందుకే చనిపోవడమే మార్గం అనిపించింది” బాధ తోనే చెప్పాను.

అర్ధం చేసుకొని అనునయంగా చెప్పాడు.

“చూడురా ! జీవితం అమూల్యమైనది. దానిని మనం మన ఇష్ట ప్రకారం మలచుకోవాలి, కష్టాలు బాధలు సమస్యలు ఉండనే ఉంటాయి అవి మన పుట్టి పెరిగిన సమాజాన్ని బట్టి ఉంటాయి. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు మారుతారు కూడా, పరిస్థితులు కూడా మారుతాయి. మార్పు సహజం జీవితంలో. మార్పు అనివార్యం మార్పును అంగీకరించాలే కూడా! నీ ఆలోచనల్లో మార్పు రావాలి. అసాధ్యం అనేది ఏమి లేదు బతుకచ్చు. అంతా మన నిర్ణయం మీదే ఆదారపడి ఉంటుంది. జీవితం అంటే అవకాశం తీసుకోవడం, బతుకడానికి వెయ్యి దారులు, ఏ దారి మనకు సరిపోతుందో తెలుసుకొని ముందుకు వెళ్ళడమే జీవితం. జీవితం అంటే ఆగిపోవడం కాదు, సాగి ముందుకు వెళ్ళడం. స్వేచ్చ లేక కనీస అవసరాలు తీరక బతుకుతున్నవారు ఎందరో ఉన్నారు. కష్టాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి మనిషి. ఇక బాధ ఉండదు. జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకుంటే ఇక బాధ ఉండదు. జీవితంలోని ప్రతి క్షణం మనం స్వీకరించాడంలోనే ఉంటుంది. జీవితంలో పాజిటివ్ ప్రవర్తనను అలవరచుకోవాలి. నీ వ్యక్తిగత దాంపత్య జీవితంలో సమస్యలు ఉండచ్చు, అవి అదిగమించవచ్చా లేదా అనేది నీకు తెలుసు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. జీవితంలో లాజిక్ గా ఆలోచించాలి కలిసి బతుకచ్చు, బతుకలేం అనే విషయములో. బతుకచ్చు అంటే కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలె నువ్వే. కలిసిబతుక లేను అంటే కూడా చెప్పు నీకు ఇంకో కొత్త జీవితానికి అవకాశం ఉంది కాని చనిపోతాననే విషయానికి స్వస్తి చేపుతాననే మాట ఇవ్వు” అన్నాడు

అన్నయ్య అలా చెపుతుంటే విస్మయానికి గురి అయి అంత చిన్న వయసులో అంత జీవితానుభవం ఎక్కడిదీ అనిపించింది! అవి నా ఊహకు అందని విషయాలు. నా మనసుకు కొంత కుదుట పరచి, చనిపోతాననే భావనల్లోంచి నన్ను తప్పించి నా నుండి మాట తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నయ్య అలా చెపుతున్న విషయాలు నేను పరిపూర్ణంగా తెలుసుకోవడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది. ( మిగితా వచ్చీవారం….)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!