సదా తోడుండే నేస్తం
గజిబిజి గందరగోళ ఆలోచనల్లోంచి
మొలకెత్తిన అంకురం
ఆర్ద్రత తో నిండిన
హృదయాన్ని ఊరడింపజేసి
మనసుకు స్వాంతన కలిగిస్తుంది
జీవన గమనంలో
ఆత్మీయంగా పెనవేసుకుంది
యెద సంద్రంలో ఇమడలేక
లావాలా ఉప్పొంగి
కన్నీటి చుక్కైంది
మస్తిష్కంలోని భావాలకు అనుసంధానమై
మెదడు పొరలను చీల్చుకొని
నాలుకపై నాట్యమాడుతుంది
బీడు వారిన తలంపులను
తన చినుకులతో
రంగు పూలు పూయిస్తుంది
నిలకడ లేని జీవితాన్ని
గమ్యం వైపు అడుగులు వేయిస్తుంది
అచేతనావస్థలో ఉన్న సమాజాన్ని
చైతన్య పరుస్తుంది
వెన్నెల వెలుగుల్లా హాయినిస్తూనే
రవి కిరణంలా జ్వలిస్తుంది
అక్షరం ఒక హారం
అక్షరం ఒక ఆయుధం…
– మాధవ్ గుర్రాల
Facebook Comments