నింగిల ఆవరించిన దూది మబ్బులు
గాలి గమకాలకు తన్మయం చెంది
భూమికి పర్సుకున్న నిచ్చెనలు దిగి
నీటి సుక్కలై రాలిపడుతై
సినుకు సిందులు
వాన మువ్వల సవ్వడులకు
నేల.. మురిసి ముద్దైతది
పిట్టల కేరింతల సరిగమలు
తూనీగల విహంగపు నాధాలు
కప్పల బెకబెక స్వరాలు
ఉరుముల గాన గంధర్వాల నడుమ
కురులీరబోసుకున్న చెట్లు
తలార తానాలాడుతై..
సెలయేళ్ళు జారుడుబండలపై జారి
నదుల్లో దూరి పరవళ్లుతొక్కుతై..
నిశ్చలంగా ఉన్న చెరువులు
పూనకమొచ్చినట్టు మత్తళ్ళు దునికి
పరుగులు పెడుతై..
నీరు ఉన్నట్టుండి
కాలువలు, కందకాలను కబ్జాచేస్తది
* * *
భవనాలు, గుట్టలు
మేనికంటిన బురదను కడిగి
రంగుసొగసులు అద్దుకుంటై
గుళ్ళూ, గోపురాలు, ప్రార్థనామందిరాలు
పరవశంతో..
పాదాలను ప్రక్షాళన చేసుకుంటై
పొలాలు ఆకుపచ్చ వసంతాన్ని పులుముకుంటై..
పసిరిక నెమరెసి
పశువులు పానంబడుతై
చిలిపి కాగితాలు చిట్టి పడువలై
వరుదల ఈది మోజుతీర్సుకుంటై
వానచిత్రాన్ని కంటి కెమరాలు
మెరుపుల ప్లాష్ లో బంధిస్తై
* * *
కొన్ని ఇండ్లు వానను వడబోస్తే
వంటగిన్నెలన్నీ కన్నీరుమున్నీరై
అలుగుపారుతై..
పదనెక్కిన పాతగోడల
గ్నాపకాలు నేలమట్టమై
మట్టితో మమేకమైతై
పిడుగులు..టపాకాయలై పేలి
తనువుకో.. మనసుకో..
తీరని గాయంజేత్తయి
వానదృశ్యం..
ఓ కంటిల ఆనందాన్ని..
మరో కంటిల విషాదాన్ని రాల్చి
కుంచె కొసన చిత్తరువై ఒదిగిపోతది.
– వడ్లకొండ దయాకర్