Thursday, July 9, 2020
Home > సీరియల్ > చుక్కాని చిరుదీపం (11 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరుదీపం (11 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఎప్పటిలాగే పనులన్నీ ముగి౦చుకుని పిల్లలతో కాస్సేపు మాట్లాడి పాక్ చెయ్యవలసిన సూట్ కేస్ లు సిద్ధం చేసి పదిన్నర దాటాక బెడ్ మీద వాలి౦ది చందన.

హరి ఇంకా మెడికల్ జర్నల్ ఏదో తిరగేస్తూ మంద్ర స్థాయిలో పాటలు వింటూ లైబ్రరీలో ఉన్నాడు.

“హరీ నిద్రరావడం లేదా? నేను రెండు నిమిషాల్లో నిద్రలోకి వెళ్తున్నాను”
చందన తనదైన మామూలు స్థాయిలోనే చెప్పింది.

“నువ్వెప్పుడు అంత తొ౦దరగా నిద్రపోతావు, అర్ధరాత్రి వరకూ టీవీ చూస్తూనే ఉంటావు గా… ఇదిగో అయిదు నిమిషాలు వస్తున్నా”

అవును విశ్రాంతిగా బెడ్ మీద వాలాక మెంటల్ రిలాక్సేషన్ కోసం ఏదో ఒక కార్యక్రమం చూడటం చందనకు అలవాటు.
అలాగే టీవీ ఆన్ చేసి గేంషో వస్తుంటే చూస్తూ పక్కకు తిరిగింది.

వెంటనే లోపలెక్కడో మెలికపడ్డట్టు బాధ.
“అబ్బా మజిల్ కాచ్” అటూ ఇటూ తిరిగి సర్దుకు౦టు౦దేమోనని ప్రయత్నించింది.

ఉహు ఇంకా ఎక్కువవుతో౦ది తప్ప తగ్గే సూచనలు ఎంత మాత్రమూ కనిపి౦చలేదు…

ఇహ ఆగలేక హరిణి మరోసారి పిలిచేసరికి అతను మెట్లు ఎక్కుతున్నాడు.
ఆమె స్వరంలో తేడా వెంటనే గుర్తించాడు.

“ ఏమైంది చందనా?” ఆత్రుతగా అడుగుతూ రెండేసి మెట్లు ఎక్కి గదిలోకి వచ్చాడు క్షణంలో

“సివియర్ మజిల్ కాచ్ అనుకున్నా…” అతను ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు.

మూడు నిమిషాల్లో అంబులెన్స్ రావడ౦ ఇద్దరూ ఎమర్జెన్సీకి వెళ్ళడం జరిగింది.
వెళ్ళిన పదినిమిషాల్లో అర్జంటుగా రెడీ టు బ్రేక్ స్థితిలో ఉన్న అపెండిసైటిస్ ఆపరేట్ చేసారు.
ఇంత సైలెంట్ గా రావడం అరుదేమీ కాకపోయినా అంత మామూలు విషయమూ కాదు.

“సరిగ్గా సరైన సమయానికి వచ్చారు, ఏ మాత్రం ఆలస్యం చేసినా…”

సర్జన్ మాటలు మధ్యలోనీ ఆపేస్తూ,
“నేను ఉన్నంత కాలం చందనకు ఏమీ కాదు, కానివ్వను, నన్ను వదిలి వెళ్ళడానికి ఒప్పుకోనుగా” చాలా ధృడంగాపలికింది హరి స్వరం.

“ఆఫ్ కోర్స్ మీరే పెద్ద ఫిజీషియన్ …”

“డాక్టర్ గా కాదు ఈ మాటలు చెప్పినది… మనిషిగా నా ప్రేమ ఆమెను వెళ్ళనివ్వదు.”

తలవూపినా మనసులోనే జాలిపడ్డాడు ఆమె మెడికల్ హిస్టరీ పూర్తిగా తెలిసిన సర్జన్.
ఆమె జీవితం గాలోలో దీపంలా ఉందని అతనికి తెలుసు.

మూడో రోజున ఇంటికి వచ్చారు.
ఇలా సడెన్ గా అనుకోని ప్రమాదాల అంచున నడక చందనకు కూడా అలవాటై పోయింది.
ఈ మధ్యన పార్కర్ తో పాటు వాలంటరీగా పనిచేసే ఎందరో అతి సన్నిహితులయారు. ఏ అవసరం వచ్చినా వచ్చి ఒక వారం ఉండి సాయపడటానికి సిద్ధంగా ఉంటారు.

“ఏం పుణ్యం చేసుకున్నానో మీ అందరి సహాయ సహకారాలకు …” ఎంతో కృతజ్ఞతగా అనేది చందన.

“పుణ్యం కాదు. నలుగురికీ మీరు చేసిన సాయం. నలుగురూ మీతో నడిచేలా చేసుకున్నారు” అనేవారు. మళ్ళీ పార్కర్, ఫిషర్ మాన్ వచ్చి వారితోనే ఉన్నారు.

చందనకు సాయంగా ఎలాగూ ఒక వంట మనిషి, క్లీనర్ రోజూ వస్తూనే ఉంటారు.
రెండు వారాలు గడిచాయి. మళ్ళీ మామూలుగా రొటీన్ లోకి వచ్చినట్టుగానే అనుకున్నారు. క్రూజ్ కోసం మంచి అఫీషియల్ డ్రెస్ లు, ఇండియన్ డ్రెస్ లు అన్నీ పాక్ చేసుకున్నారు.
ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకోడం ఇబ్బందిలు ఏం వస్తాయో ఊహించి వాటికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోడం ఇద్దరికీ అలవాటై పోయింది.

గాజుబొమ్మలా సుకుమారంగా ఉన్నా.. తన సేవాకార్యక్రమాలు మానుకోలేదు.
క్రూస్ లో వెళ్ళే పదిరోజులకూ కూడా దారిలో చెయ్యగలిగిన పనులు ప్లాన్ చేసుకున్నారు ఇద్దరూ.
ఇహ వారం ఉంది ప్రయాణం అనగా మళ్ళీ ఒకసారి కడుపులో విపరీతమైన బాధ అనిపి౦చి౦ది. కాని ఈ సారి హరితో చెప్పదలుచుకోలేదు చందన.

ఎంతో మనసు పడిపెట్టుకున్న విహార యాత్రకు తన ఆరోగ్యం అడ్డుకావడం ఆమెకు ఇష్టం లేదు.
ఏవో పెయిన్ కిల్లర్స్ వేసుకుని సరిపెట్టుకుంది. అనుకున్నట్టుగానే క్రూస్ కి బయలు దేరేముండు పిల్లలు ఇద్దరూ ఒక వేకే౦డ్ వచ్చి వారితో గడిపారు. ఇద్దరికిద్దరూ అటు చదువులోనూ ఇటు సోషల్ అవేర్నెస్ లోనూ వయసుకు మించి తెలివిగా ఉండటం తలిదండ్రులకు తృప్తిని ఇచ్చింది.

ఇద్దరికిద్దరూ పైకి అనకపోయినా మనసులో మాత్రం ఒక నిశ్చింత, పిల్లలు ఇహ సెటిల్ అయినట్టే అన్న రిలీఫ్ మెదిలి౦ది.

ఇల్లు పార్కర్, ఫిషర్ మాన్ చూసుకుంటామని హామీ ఇచ్చారు. ముందు రోజురాత్రే ఫ్లారిడా చేరుకున్నారు. తమతమ బాగేజిలతో. ఆ రోజు కు మారియెట్ లొ వుంది తరువాత రోజు లంచ్ తరువాత తమకు ఇచ్చిన సమయానికి సముద్ర తీరం చేరుకున్నారు.

ఎంట్రీ అయిన తరువాత లగేజ్ ఇచ్చేస్తే వాళ్ళే రూమ్ కి పంపేసారు. సముద్రం వైపు వరందావున్న కాబిన్ అలాట్ చేసారు. చిన్న రూమే అయినా అన్ని సౌకర్యాలతో ఉంది.

అది ఒక మహే౦ద్ర భవనం లా అనిపి౦చి౦ది, ఒకటనేమేమిటి ? ఏడు అంతస్తులలో ఒక వైపున రూమ్స్ మధ్యన ఒక ఫ్లోరంతా డైనింగ్ హాల్స్, మరో ఫ్లోర్ లొ స్విమ్మింగ్ పూల్ జిమ్, స్పాలు, బ్యూటీ పార్లర్ లూ, షాపింగ్ కాంప్లెక్స్, ఒక చిన్న నగరంలా ఉంది. అంత గొప్ప క్రియేషన్ సముద్రం మీద మరో ఊహకు చోటులేకుండా జీవితాన్ని కోర్ వరకూ అనుభవించాలంటే ఒక్కసారైనా క్రూస్ కి వెళ్ళాలనడం అతిశయోక్తి కాదు. రేమంది ఉంది ఉంటారు, షిప్ క్రూ బిజినెస్స్ పీపుల్ వెకేషన్ గడపగానికి వచ్చిన కుటుంబాలు ఎంత తక్కువలో లేక్కేసుకున్న ఒక నాలుగైదు వేల మంది ఉండటం తధ్యం. ఎంత పెద్ద ఎస్టాబ్లిష్ మెంట్, ఎంత పని ఎంత వినోదం. వేలాది మదికి చక్కని ఉపాధి కదా?

ఎక్కడంటే అక్కడ కూచుని సముద్రం చూసే అవకాశం. ఎప్పుడు షిప్ స్టార్ట్ అయి సముద్రపుటలల మీద సాగటం మొదలు పెట్టిందో కూడా తెలియలేదు. సెకండ్ ఫ్లోర్ లొ ఆడిటోరియం పాటలు డాన్స్ లూ అనౌన్స్ మెంట్స్. వెల్కం డ్రింక్స్..

ఒక సారి షిప్ మొత్తం చూడటానికే సగం రోజులు పట్టేలాఉన్నాయి. పది రోజులు నిజంగా ఒక స్వర్గంలో ఉన్నట్టే.
ఉదయం లేచి జిమ్ కి స్విమ్మింగ్ కి వెళ్ళేవాళ్ళు, షిప్ మీదే వాకింగ్ అండ్ రాకింగ్…

బ్రేక్ఫాస్ట్ కి సరిగ్గా ముప్పై ఆరు రకాలు ఇంటర్ కా౦టినె౦టల్ వంటకాలు, వేడి వేడిగా అందిస్తూ పాస్తా, నూడుల్స్, ఉప్మా దోసలతో సహా. సాంద్ విచ్లు బర్గర్ లూ చెప్పనే అవసరం లేదు. ఒక్మరో పక్క డాన్స్ క్లాసెస్, షాపింగ్ కి వెళ్తే సరిగ్గా నాలుగు గంటలు తిరగటం అయింది.

చందనకు డైమండ్ సెట్ కొన్నాడు హరి ఎ౦దుకిప్పుడు అని ఆమె వారిస్తున్నా, వెన్నెల తొంగి చూస్తున్న ఆ అర్ధ రాత్రి నీటి తరగలపై ఊయల్లూగుతున్నట్టు కనిపించే జాబిలినీ నక్షత్రాలనూ చూస్తూ..

“హరీ ఇది చాలు ఈ జన్మకు అనిపిస్తో౦ది. ఇంత ప్రశాంతంగా ఈ చుట్టూ పరచుకున్న సముద్రం పై ఎవరూ లేనట్టు, మనిద్దరిదే ఈ ని౦గీ నేలా అయినట్టు, ఒక్క మాట అడుగుతాను సూటిగా చెప్పు హరీ, జీవితం ఎంత అనిశ్చయం కదా, ఏదీ మన చేతిలో ఉండదు. ఎప్పుడేమవుతు౦దో తెలీదు. గత ఇరవై సంవత్సరాలుగా అలాగే జరుగుతోంది కదా
ఎప్పుడయినా నేను లేని స్థితి వస్తే ఏమ్చేస్తావు?”

“నిజమే … ఏదీ మన చేతిలో ఉండదు అయినా మనం బలంగా ఏదైనా కోరుకోవాలే కాని జరగకుండా ఉండదు. అంత విల్ పవర్ ప్రతి వాళ్ళకూ ఉ౦టు౦ది, కాదంటే అంత ఏకాగ్రత అంత బలమైన కాంక్ష కూడా ఉ౦డాలి. అందుకే ఎన్ని విధాల అవరోధాలు ఎదురైనా నిలదొక్కుకోగలుగుతున్నాము.

నువ్వు లేనిస్థితి అనేది ఉండదు చందనా, దానిక్కారణం నీ ఉనికే నా ఊపిరి”.

జవాబు చెప్పడానికేమీ మిగల్లేదు.
అయిదు రోజులు సవ్యంగానే గడిచిపోయాయి. అక్కడకూడా ఎవరికైనా మెడికల్ అవసరం కనబడితే చటుక్కున ముందుకు వచ్చే వారు ఇద్దరూ. త్వరలోనే షిప్ లొ ఉన్న చాలా మందితో పరిచయం కొత్త ఆసక్తులు కొత్త జీవితాలు కొత్త భావాలు.

అలెక్స్ అండ్ లారా ఇద్దరే వచ్చారు క్రూస్ కు, ఇద్దరికీ ఎనిమిదేళ్ళు తేడా. అలెక్స్ డెబ్బై అయిదు నిండి డబ్బై ఆరులోకి వస్తే లారా ఎనభై నాలుగు. అయినా ఇద్దరూ చురుగ్గానే ఉన్నారు. ఒకరినొకరు టీజ్ చేసుకోడం, ఒకరికోసం ఒకరు తాపత్రయపడటం.

రెండో రోజు కాబోలు ఆ వయసులో లారా చేసిన డాన్స్ అలెక్స్ పాడిన పాట చిన్నా పెద్దా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఊపిరి అక్షరాలలో నింపి ఆటను పాడితే జవాబు ప్రతి అణువులో చూపింది ఆమె.

అసలు చెప్పే వరకూ వారి వయసులు ఎవరూ ఊహించలేదు. లేట్ యాభైలు లేదా అరవైలలో ఉంటారు అనుకున్నారు.
ఒక అర్ధ రాత్రి వేళ ఊపిరందక లారా ఇబ్బంది పడుతుంటే వెళ్ళారు చందన, హరి.

ఒకటి రెండు గంటల్లో సర్దుకుంది. మాటలలో తెలిసింది లారా వయసు.

“ ఈ వయసులో ఇబ్బంది పడకు స్ట్రెస్ తట్టుకోలేవు అంటాను. వినదు” అలెక్స్ నిట్టూర్పు.

“ఎంత వయసు ? ఇంకా వృద్ధాప్యం లోకి అడుగే పెట్టలేదు. నువ్వే నా కన్నా పెద్ద అనిపిస్తావు.”

“ నాకు సెవెంటీ సిక్స్ ఆవిడ ఎనభై నాలుగు” సంజాయిషీగా చెప్పాడు అలెక్స్.

ఆశ్చర్యపోడం ఇద్దరి వంతూ అయి౦ది.
“ఇద్దరే వచ్చారా క్రూస్ కి”

“ఎస్ గత పాతికేళ్ళుగా ఇద్దరమే, ఒకరికొకరం.”

“పిల్లలు?”

“ పిల్లలు ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకు తున్నారు. నాకు నలుగురు అబ్బాయిలు, ఎవరి కుటుంబాలతో వాళ్ళు బిజీ, మాట్లాడే తీరికలు లేవు. లారా కి ముగ్గురు అమ్మాయిలూ, వారూ అంతే” మరింత ఆశ్చర్యపోయారు.

“ అవును. అసలు కథ మీకు తెలియదు కదూ…
నేను లారా చిన్నప్పుడు ఒకే స్కూల్ లో చదువుకున్నాము. నేను క్లాస్ వన్ లో ఉన్నప్పుడు తను తొమ్మిదో తరగతి. ఈ హైస్కూల్ వాళ్ళు మా టీచర్లు సెలవులో ఉన్నప్పుడు మా క్లాస్ లు మానేజ్ చెయ్యడానికి మమ్మల్ని బేబీ సిట్టింగ్ చెయ్యడానికీ వచ్చే వారు.

మాకు లంచ్ తినిపించడం క్లీనింగ్ తో పాటు అవసరమైతే మమ్మల్ని రెస్ట్ రూమ్ కి కూడా తీసుకెళ్ళేవారు.
అలా లారా చిన్నప్పుడే నాకు చాలా సాయపడేది. అది చిన్నప్పటి పరిచయం.

ఆ తరువాత దాదాపు పది పన్నెండేళ్ళు లారా మా నెక్స్ట్ నైబర్.

తన కూతుళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళాయన మానేజ్ మెంట్లలో తలమునకలై ఉన్నప్పుడు, మధ్య, మధ్యన సమయం దొరికితే చిన్నప్పటి విషయాలు నెమరు వేసుకునే వాళ్ళం. ఈ సమయంలో ఒకరికొకరు కష్ట సుఖాలు చెప్పుకుని దగ్గరయాం.

నాభార్య కార్ యాక్సిడెంట్, లారా వాళ్ళాయన కాన్సర్ కు బలి కాడ౦ అవసరాలు తీరి పిల్లలు రెక్కలు వచ్చి వెళ్లి పోడం తరువాత కూడా అయిదారేళ్ళు పక్కపక్క ఇళ్ళలో ఉన్నాం చివరికి ఇలా కలిసి ఉందామని డిసైడ్ అయి పాతికేళ్ళు.”

నిజమే కదా ఎప్పుడు ఎవరికీ ఎవరు ఎంత అనుబంధమో ఎవరు చెప్పగలరు?

యాభై ఏళ్ళు దాటితే జేవితం చివరి అంచు వచ్చామనుకేనే వారి మధ్య యాభైలు దాటాక మళ్ళీ కొత్త జీవితం…
“ ఒకరి కొకరం అనుకున్నాము కనకే ఇన్నేళ్ళు బ్రతికి ఉన్నాం, లేకపోతె ఎప్పుడో కొత్త జన్మ ఎత్తే వాళ్ళమేమో …” లారా నవ్వింది.

“నిజమే డియర్ ఒకరికొకరు అనేది ఒక సజీవ జీవనామృతం”

ఆ మాట ఆ పై వాడే అలెక్స్ తొ చెప్పిచ్చాడేమో అనిపించింది చందనకు .
ఎస్, ఒకరికి ఒకరు…

“లారా డియర్ పూర్తిగా నీపైనే ఆధారపడి ఉన్నాను, నువ్వు స్ట్రెస్ అవకు నా ఊపిరి ఆగిపోతుంది” తిరిగి వస్తూంటే అలెక్స్ ఆమెతో ఆర్తిగా అనడం వినిపించింది.

(ఇంకా ఉంది)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!