Monday, August 8, 2022
Home > కథలు > పచ్చని అనుబంధం

పచ్చని అనుబంధం

“ఒరేయ్! చింటూ ఎందుకురా ! అన్నం తినకుండా అలా సతాయిస్తున్నావు” ఇటురా నేను తినిపిస్తా! అంటూ పిలిచింది శారదమ్మ.

వాడంతే అత్తయ్యా! అన్నం తినే సరికి తాతలు దిగొస్తారు’ అంటున్న కోడలి మాటలకు నవ్వుతూ ‘ఇదిగో తాత దిగొస్తూనే వున్నాడు డాబా మెట్లు’ అంటూ వచ్చాడు పరంధామయ్య..

రారా మనవడా! మీ బామ్మ తినిపిస్తుంది. చింటూ చేయి పట్టుకొని శారదమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు. వెనుక కోడలు సుమ అన్నం గిన్నెతో వచ్చింది. చెట్లకింద అరుగుమీద కూచున్న శారదమ్మ రామచిలుకలు కాకులను చూపిస్తూ ‘చింటూ ! నువ్వు తినకుంటే మేం తినేస్తామంటున్నాయి..పెడుతున్నా…పెడుతున్నా..హుష్! అమ్మో!మా చింటూ అన్నమిది.. ముద్ద తీసి నోట్లో పెట్టగానే గబగబా తినేసాడు. అలా మరిపిస్తూ మురిపిస్తూ తినిపించే అత్తగారిని అలాగే చూస్తుండి పోయింది సుమ. మిగిలిన మెతుకుల గిన్నెను మనవడి చుట్టూ తిప్పి కడిగి చెట్లకింద పోయగానే కాకులన్నీ బిలబిల వచ్చి తింటుంటే కేరింతలు కొట్టసాగాడు చింటూ..

శారదమ్మ ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పివుంటుందో కోడలికి.. ఆ చెట్లకు తన మామగారికి, భర్తకు గల అనుబంధాన్ని…

ఇంటి ముందు కాంపౌండ్ కు లోపల వేప, మామిడి చెట్లు స్నేహితుల్లా కొమ్మల చేతులతో ఊసులాడుకుంటూ గాలి వీచినపుడల్లా చిరునవ్వుతో తలలు ఊపుతూ వుంటాయి.. వాటి చుట్టూ సిమెంటు అరుగు కట్టించాడు పరంధామయ్య.. వాటితోపాటే తన బాల్యం యవ్వనం అన్ని దశలను దాటుతూ వస్తున్నాడు…మనసు కలతగా వున్నా ఆనందంగా వున్నా భార్యాభర్తలిద్దరూ హృదయమున్న వాటిలాగే భావిస్తూ ఆ చెట్లతో పంచుకుంటారు…

కొడుకు బిడ్డా ఆ చెట్ల నీడలలోనే స్నేహితులతో కలిసి చదువుకున్న విషయం..మండే ఎండాకాలంలో వాటి నీడన సేదతీరుతూ కోకిలమ్మల కుహూ రాగాలకు పరవశిస్తూ కూ అని కవ్విస్తూ, మామిడి పిందెలను ఉప్పుకారంతో నంజుకుని తిన్న, వారి బాల్యం ముచ్చట్లు కళ్ళకు గట్టినట్టుగా చెబుతుంటే మనకూ అసూయ కలుగుతుంది.

ఇప్పుడిప్పుడే పట్నం పోకడలు సంతరించుకుంటున్న ఊరది.. సిటీకి దగ్గరగా వుండటం వల్ల.. మట్టి రోడ్ల స్థానంలో తారు రోడ్లతో వాహనాల రద్దీ పెరిగింది. నాలుగు రోడ్ల కూడలిలో హుందాగా తలెత్తుకొని సుమారు ఐదారొందల గజాల స్థలంతో పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఆ ఇల్లు. బాటసారులకు చల్లని నీడ నివ్వడమే కాకుండా కొత్తగా పెట్టుకున్న బజ్జీల బండి సాంబయ్యకు ధనలక్ష్మీ కటాక్షం పుష్కలంగా లభించేలా చేస్తోంది.

కాలచక్రం గిర్రున తిరుగుతోంది…పరంధామయ్య మనుమడు చింటూ ఎంబీయే చదువుతున్నాడు…చదువు స్థాయి పెరిగే కొద్దీ తాతగారింటికి రావడం తగ్గిపోయింది…కొడుకూ కోడలు ఎన్నో సార్లు రమ్మని బతిలాడారు.. ప్రశాంతమైన పల్లెనొదిలి రాలేమని ఖరాఖండీగా చెప్పడంతో మిన్నకుండి పోయారు. వాళ్ళే పండుగలు పబ్బాలకు వచ్చి పోతూ వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటున్నారు.

రియలెస్టేట్ వ్యాపారుల డేగ కళ్ళు పరంధామయ్య ఇంటిమీద పడ్డాయి.. ఆ స్థలం కొని ముందు షెట్టర్లేసి షాపులకు వెనక అపార్టుమెంటు కడితే రెండు విధాల లాభమొస్తుందని లెక్కలు వేసుకున్నారు.. పరంధామయ్య ఇంటికిరువైపుల వారిని నయానా భయానా చెప్పి ఒప్పించారు గానీ పరంధామయ్య గారే వాళ్ళకు కొరకానికొయ్య అయ్యారు.. కొడుకు వచ్చినపుడు అతనితో చెప్పించాలని చూశారు.. వాళ్ళకిచ్చిన మరుక్షణమే ఏం జరుగుతుందో చెప్పాడు.. తండ్రి మాటలలో అంతరార్థం అర్థమయిన కొడుకు తండ్రికే సపోర్ట్ చేయడంతో అప్పటికి కిమ్మనకుండా వెళ్ళిపోయారు కానీ ఎలా ఆ స్థలం రాబట్టాలా అనే దుర్మార్గపు ఆలోచన మాత్రం వదల్లేదు.

చివరి అస్త్రంగా మనుమడిని ప్రయోగించాలనే పట్టుదలతో, నెలరోజులు చింటూ వెంటబడి చివరికి అతడు చెప్తే వింటాడనే గట్టి నమ్మకాన్ని పెంచుకున్నారు. తల్లిదండ్రులు బామ్మ ఎంత నచ్చ చెప్పినా వినలేదు చింటూ. మనుమడి మొండి పట్టుదలకు అవుననక తప్పలేదు పరంధామయ్య.

విషయం తెలిసిన సాంబయ్య దంపతులు కంటికి కడివెడుగా ఏడ్చి వెళ్ళారు. తమ జీవనాధారం పోతుందని…మరుసటి రోజే కూలీ వాళ్ళొచ్చి ముందు భాగంలో వున్న చెట్లను పడగొట్టి చదును చేసేది..ఆరాత్రి నిశ్చింతగా నిద్ర పోయింది చింటూ ఒక్కడే..

ముసలి అత్తమామల ఆవేదన ఒక వైపు కొడుక్కు నచ్చ చెప్పలేని బలహీనత మరోవైపు సుమను నిద్ర పోనివ్వలేదు.. పున్నమి వెన్నెలలో చెట్ల తల్లి ఒడిలో ఆదమరచి నిద్రపోతున్న పక్షి కూనలు.. రేపేం జరుగుతుందో తెలియక నిండు జాబిలి సోయగాలలో కొమ్మ చేతులతో పెనవేసుకున్న గున్నమామిడి వేపలు… చిరుగాలికి ఉలికులికి పడుతున్న విరి బాలలు… అవన్నీ చూస్తున్న సుమ కళ్ళు కట్టలు తెగిన ప్రవాహాలైనవి… ఒంటరిగా చెట్లకింద అరుగు మీద కూర్చుంది. గుండెల్లో గూడుకట్టుకున్న బాధ అంతా గండి పడిన తటాకంలా అయ్యేంత వరకు దుఃఖించింది.. ఎప్పటికో వెళ్ళి మంచంపై నడుం వాల్చింది.

పొద్దున్నే పనిమనిషి చంద్రమ్మ అరుపులు కేకలతో ఏమయ్యుందోననని శారదమ్మ సుమలతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళంతా గుమికూడారు.. మామిడి చెట్టు కాండంపై వినాయకుని రూపం.. ఎవరూ చెక్కినట్టు లేదు.. కాండం రంగులోనే మెరుపులీనుతూ కనిపిస్తోంది.. చాలా చిత్రం కదా తాతల నాటి చెట్టు.. దేవుడి మాయ.. తలా ఒక మాట అనుకుంటుండగానే… పొద్దున్నే ఊరంతా విషయం పాకిపోయింది.. శారదమ్మ పరంధామయ్యలకు ఇదెలా జరిగిందో అంతు పట్టడం లేదు.. కూలీవాళ్ళు చేజేతులా దేవుడి చెట్లను నరకమని వెళ్ళి పోయారు.. వ్యాపారులు ఇది ఎవరి కుట్రయినా చేసేదేం లేక వెను తిరిగిపోయారు.. చింటూకైతే ఇరవై ఒకటవ శతాబ్ధంలో కూడా ఇలాంటి నమ్మే ప్రజలను ఏంచేసి మార్పు తేవాలోఅర్ధం కాలేదు.

చెట్లను మొక్కుకొని వెళ్తున్న భక్తులను వస్తాపోతా చెట్లనీడన సేదతీరండి. ముడుపుగా మీ ఇంటిముందు మొక్కలను నాటి మొక్కులు తీర్చుకోండి అని చెబుతున్న కోడలి మాటలు ఆ వృద్ధుల మనసుల్లో వెలకట్టలేని ఆనందాన్ని నింపాయి..

వారం రోజులుండి పట్నం వెళుతూ చంద్రమ్మకు జాగ్రత్తలు చెబుతుంటే,” పచ్చని అనుబంధాన్ని కాలరాయనీయకుండా చేసిన సుమను మనసారా ఆశీర్వదిస్తూ.. కళ్ళలో కళ్ళు కలిపి ప్రమాణం చేసింది…. ఆ నిజాన్ని ఎప్పుడూ బయట పెట్టనని.. ఆనాడు సుమ తనకున్న కళతో వినాయకుని చిత్రం చెక్కి రంగులు వేయడం. తన సహాయంతో పండుటాకుల పచ్చని అనుబంధాన్ని బతికించింది. పక్షిజాతుల ఆధారాన్ని కోల్పోకుండా చేసి బాటసారులు సేద తీరేలా చేసింది.. ఆతల్లి చలువతోనే అందరం ఇంత ఆనందంగా వున్నామని చంద్రమ్మ చెబుతుంటే పరంధామయ్య దంపతులలో కోటి సందేహాలు.. ఎవరాతల్లని అడిగే సరికి తడబడుతూ ఆ తండ్రి సలవయ్యా !గణపయ్య సలవ! అంది.

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!