Monday, August 8, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )-11 వ భాగం ! -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( సీరియల్ నవల )-11 వ భాగం ! -శ్రీ విజేత

కాలం బహు విచిత్రమైనది, అది చస్తామన్నా చావనీయలేదు నన్ను, ఇక బతుకడం ఒడుదొడుకులతోనే గడిచి పోయింది. అన్నయ్య మాట మీద కొద్దిగ సర్దుకొని, అర్ధంచేసుకొని బతుకాలనుకున్నాను. మా అత్తవారు కొద్దిగా సంప్రదింపులతో నన్ను తీసుక వెళ్ళడానికి వచ్చారు. ఇష్టం లేకున్నా వెళ్లక తప్పలేదు. అయినా సర్దుకపోవడానికి నాకు కష్టమయ్యింది. మూడేండ్లు గడిచిపోయింది కాలం, నా జీవితములో పెద్దగా మార్పు ఏమి అనిపించలేదు. ఇష్టం లేని దగ్గర కష్టంగా బతుకడం కంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకడం నయం అనిపించి నా జీవితాన్ని కాలానికి వదిలేసి అమ్మ దగ్గరకు వచ్చి ఉన్నాను. ఓ పది నెలల కాలం కూడా గడిచిపోయింది.

ఈ నాలుగేళ్ళలో నా జీవితంలో పెద్ద మార్పు ఏమి లేదు గాని, అన్నయ్య ఈ నాలుగేళ్ళలో పట్నంలో ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసి వచ్చాడు. అతడు కూడా డిగ్రీ పూర్తి చేసి, ఒక్క సంవత్సరం పట్నంలో బి.ఎడ్.చేసివచ్చి టీచరుగా ఉద్యోగం సంపాదించుకొని స్థిర పడ్డాడు అని తెలిసింది. కొందరి జీవితాలు కొందరిపై ప్రభావితం చేస్తాయని నాకు తెలియదు. ముఖ్యంగా నా జీవితం అతన్ని ప్రభావితం చేస్తుందని నేను అసలే ఉహించలేదు. ఈ నాలుగేళ్ళలో అతడు నాకు కనిపించలేదు కూడా. కాని ఆ సంవత్సరం నవంబర్ మాసం చలికాలం రాత్రి అన్నయ్య మా యింటికి వచ్చాడు మామూలుగానే నాతో మాట్లాడుదామని. ఆ సాయంత్రమే అతను కూడా దీపావళి సెలవులు ఉన్నాయని ఇంటికి వచ్చాడట, అన్నయ్యను కలుద్దామని వస్తే అన్నయ్య మా యింట్లో ఉన్నాడని తెలిసి మా యింటికి వచ్చాడు అతను. బహుశా నేను అప్పుడు అక్కడ ఉంటానని, నేను గత కొంత కాలంగా ఇక్కడే ఉంటున్నాననే విషయం కూడా అతనికి తెలియక పోవచ్చు. నేను కూడా పండుగకు వచ్చానని అనుకున్నాడేమో.

“బాగున్నారా” అన్నాడు నన్ను చూస్తూ అభిమానంగా

“బాగున్నాను” అన్నాను

“ఎప్పుడచ్చారు” అడిగాడు

ఏమి చెప్పాలో తెలియక “ చాలా రోజులు అవుతుంది ” అన్నాను.

ఆ సాయంత్రం చక్కగా ముస్తాబై నాకు నచ్చిన నల్లటి చీర జాకెట్ ధరించి ఉన్నాను. మా యింటి మల్లె చెట్టు మల్లె మొగ్గలు కూడా పెట్టుకున్నాను జడలో. చక్రాల్లాంటి కళ్ళకు కాటుక కూడా పెట్టుకున్నాను. అప్పుడు నా వయస్సు ఇరవై ఏళ్ళు. ఎందుకోగాని అతడు నన్ను తదేకంగా అభిమానంగా చూస్తున్నాడు. అభిమానంతో తొనికీసలాడే అతని కళ్ళలోకి చూడడం కష్టం అయ్యింది.

అతడే కొన్ని మాటలు చెప్పాడు. అతడు ఉద్యోగం చేస్తున్న ఊరు మా చిన్నమ్మ వాళ్ళ ఊరు దగ్గర అని, మా చిన్నమ్మ వాళ్ళ కూతురు మొన్న వేసవిలో వాళ్ళ బడిలో పరిక్షలు రాస్తున్నపుడు కలిసిందని చెప్పాడు. ఆ మధ్యలో ఇక్కడికి వచ్చినపుడు చూసి గుర్తుంచుకొని పలుకరించానని చెప్పాడు. నిజంగా అతడు నిర్మలమైన మనిషి అనిపించింది అతడు మాట్లాడుతుంటే. కాలం గడుస్తూ పోయిన కొలది తెలిసింది, అతడు ప్రేమ గల మనిషి అని, అభిమానం, ఆత్మీయత గల మనిషి అని. ముఖ్యంగా నా యెడల ప్రాణ సమంగా ప్రేమ గల మనిషి అని.

కొన్ని విషయాలు మాట్లాడి, అర గంట తర్వాత అన్నయ్య, అతడు వెళ్లి పోయారు.

రాత్రి భోజనం చేసి పడుకోనేప్పుడు, అతడు నాలుగేళ్ళ క్రితం చదువుకొమ్మని ఇచ్చిన నవలను అతని ముఖంపై కోపంగా విసిరి వేసిన విషయం జ్ఞాపకం వచ్చి నాకే సిగ్గు అనిపించింది.

******************

జీవితంలో కొన్ని సంఘటనలు, విషయాలు కాలానుగునంగానే తెలుస్తూ పోతాయేమో. నా జీవితంలొ అలానే జరిగింది. తరువాత ఒక వారం రోజులకు అన్నయ్య నాతో మాట్లాడడానికి ప్రత్యేకంగా వచ్చాడు. నేను గత పది నెలలలుగా ఇక్కడే ఉంటున్నాను. ఆ విషయం గురించి మాట్లడుతాదేమో అనుకున్నాను. అమ్మ తెలిసిన వాళ్ళ ఇంటికివెళ్లి వస్తానంది, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.

అన్నయ్య కొన్ని విషయాలు సూటిగా అడుగుతానని జవాబు చెప్పమన్నాడు.

“జీవితం గురించి ఎమనుకుంటున్నావు” అడిగాడు.

“నాకేమి అర్ధం కావడం లేదు” అన్నాను.

“జీవితం తమాషా కాదు, సీరియస్ గా ఆలొచించాలి” అన్నాడు..

భయమేసింది నాకు, ఏమి అడుగుతాడో, ఏమి చెపుతాడో అని.

“భవిష్యత్ గురించి ఏమి ఆలోచిస్తున్నావు “

“ఇప్పటికైతే ఏమి లేదు, ఒంటరిగానైనా ఉందామనుకుంటున్నాను”

“ఇవ్వాళ్ళ ఉన్న శక్తి, జీవితం, ఈ మనుషులు ఎప్పటికీ ఉండరు, కష్టమవుతుంది ముందుముందు” అన్నాడు

“ఏమి రాసి పెట్టి ఉంటే అలా అవుతుంది, అంతకన్నా ఏమి చేయగలను”

“దీనిని కర్మ సిద్ధాంతం, వేదాంత దోరణి అంటారు, జీవితంలో వాస్తవాల దృష్ట్యా ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఉన్నది ఉన్నట్లు”.

“నాకు అంత శక్తి లేదు, చెప్పండి, ఆలోచిస్తాను” అన్నాను

“భర్త దగ్గరకు వెళ్ళవా?”

“వెళ్ళను అనుకుంటున్నాను”

“కారణం”

“మొదటి నుండి అతడు నాకు నచ్చలేదు, అతనితోను, ఆ ఇంట్లోను ఇమడ లేక పోతున్నా,”

“మరి విడిపోవచ్చుగా”

“కాలం ఏది చెప్పితే అది, అంతదాక ఆలోచించలేదు, నా చేతిలోని పనేనా అది, ఇక్కడివాళ్ళు, అక్కడివాళ్లు ఆలోచించాలి”.

“సరే, ఎలా జరుగవలసి ఉందొ అలానే జరుగుతుంది కాని మనం ఎలా జరుగాలనుకుంటామో అలా కూడా జరుగుతుంది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. గుండెల మీద చెయ్యి వేసుకొని, నా మీద ప్రమాణం చేసి చెప్పాలి కొన్ని విషయాలు ఉన్నది ఉన్నట్లు” అన్నాడు నా కళ్ళ లోకి సూటిగా చూస్తూ.

ఏ విషయం గురించో తెలియక విస్మయంగా చూశాను.

“కృష్ణ గురించి చెప్పు” అన్నాడు

కృష్ణ అంటే అతడు. చాలా మంచివాడు, అన్నయ్య ప్రాణ స్నేహితుడు.

అదే విషయం చెప్పాను, “ నీకు ప్రాణ స్నేహితుడు, నాకు కూడా స్నేహితుడు” అని

“ అంతకు మించి ఏమి లేదా?”

“ లేదు ” అన్నాను.

“కృష్ణను నువ్వు ప్రేమిస్తున్నావా? ” అడిగాడు సూటిగా

విని త్రుళ్ళి పడ్డాను.

“ లేదు, కృష్ణను నేను స్నేహితుడు అనే భావనతోనే చూశాను నేను. ఎప్పుడన్నా నువ్వున్నప్పుడే మాట్లాడేదాన్ని, అతడేమన్నా టైం పాస్ కని పుస్తకాలు ఇస్తే చదువుకోనేదాన్ని. అంతే ” అన్నాను.

“నువ్వు అతన్ని ప్రేమించావో లేదో కాని అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రాణంగా, ఇష్టంగా, నీ కోసం ప్రాణం ఇమ్మన్నా ఇస్తాడు, అంతటి ప్రేమ అతనిది, ఆ విషయం నీకు తెలియక పోవచ్చు.”

వింటూ విస్మితురాలినయ్యాను.

“ఇప్పుడే కాదు,, నీ పెళ్ళికి ముందు నుండి కూడా నిన్ను ప్రాణములా ప్రేమిస్తున్నాడు, ఇంకా చెప్పాల్నంటే ఆరాదిస్తున్నాడు.”

“ పుస్తకాలు చదువడమే కాదు, నీ కోసం, నిన్ను గూర్చి వందల కవితలు రాశాడు, కథలు రాశాడు, నవలలు కూడా రాశాడు. నీ కోసం అనుక్షణం, ప్రతి క్షణం ఆలోచించాడు. అప్పటికీ ఇప్పటికీ నీ కోసం ఆలోచిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం నీ పెళ్లి జరిగేనాటికి అతడు అతడు చదువుకుంటున్న విద్యార్ధి మాత్రమె. నీ పెళ్లి జరిగిపోయింది కాని నీ జీవితం బాగుంటే అతడు అతడు నీ గురించి ఆలోచించేవాడు కాదు కావచ్చు. నీ పెళ్లి జరిగిన సంవత్సరానికి నువ్వు చనిపోతానని రాసుకున్న లేఖ చూసి విలవిలా కన్నీళ్లు కార్చాడు. అతన్ని ఉర్కుంచడం నా తరం కాలేదు. నువ్వు చనిపోతే తను కూడా చనిపోతానన్నాడు, అతని ప్రేమ అంతటిది. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అప్పుడే. నేనే వారించాను, ఇద్దరి మధ్య కులాంతరం ఉంది అని, అప్పటికీ నువ్వు పెళ్ళయిన అమ్మాయివి అని. ఎలానో కాలం మరో మూడేళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు అతడు ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థికమైన స్వేచ్చ అతనికి ఉంది. ఏడాది నుండి అతనికి పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి కూడా. నువ్వు అత్తారింటికెళ్ళి బతుకుతున్నావని అనుకున్నాడు నిన్నా మొన్నటి వరకు కాని మొన్న దీపావళి సెలవులకు వచ్చినపుడు నీ గురించి తెలుసుకొని తనకు వచ్చే పెళ్లి సంబంధాల విషయాలు అన్నీ పక్కన పెట్టి ఇక నీ గురించే ఆగిపోయాడు. నువ్వు సరేనంటే ఒకటి రెండు సంవత్సరాలు ఆగి అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయలు అన్నీ నీకు తెలియక పోవచ్చు. నేను చెప్పినంత మాత్రాన నువ్వు నమ్మకపోవచ్చు. నీకు అతనికి సంబంధించిన కథనంత అతడు ఓ నవల రూపంలో రాసుకున్నాడు. ఆ తోలి రోజుల్లోని డైరీ కూడా ఇస్తానన్నాడు, నువ్వు చదువుకొని అతన్ని అర్ధం చేసుకోవడానికి. నిన్ను అతడు ఎంతగా ప్రేమించాడో చెప్పనా అతడు నీ పేరును తన రక్తంతో రాసుకున్నాడు. నువ్వు ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పాలి”
అన్నయ్య అవన్నీ చెపుతుంటే ఆశ్చర్యంగా విన్నాను. ( మిగతా వచ్చేవారం).

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!