ఈ దేశం ఎటుపోతుంది
మతాలుగా ఒక్కటౌతున్నం
మనోభావాల పేరుతో కొట్టుకచస్తున్నం
మనిషి యొక్క కులాన్ని గుర్తిస్తున్నం
కానీ మనిషి లోని మనసుని గుర్తిస్తలెం
నాకొకటి అర్ధమైతేలేదు
“మన దేశంలో ఒక మనిషి మనిషికి పుట్టిండా? మతానికి పుట్టిండా? లేక కులానికి పుట్టిండా?” అని!
అవును ఈ దేశం వ్యవసాయ ప్రధాన దేశం
రైతుకు పెట్టుబడికి పైసలిస్తామంటుర్రు
కానీ గిట్టుబాటు ధర ఇస్తలేరు
కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నయ్
కానీ ఎందుకో అన్నదాతల ఆదాయం అడుక్కంటి పోతుంది
నాకోటి అడగాలని ఉంది
” మనదేశంలో ఎక్కువగా రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుర్రా?
లేక ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేటోల్లే రైతులా?” అని!
అవును ఈ దేశం ప్రజాస్వామ్య దేశం
మంది గొడ్డు మన గడ్డి మేస్తే తరిమి కొడుతున్నం
కానీ ప్రజాప్రతినిధులు మన సొమ్ము మేస్తే మిన్నకుండి పోతున్నం
ఎప్పుడు ప్రజాప్రతినిధులు మారాలని మాట్లాడుకుంటున్నం
కానీ ప్రజాలమే మారాలని గ్రహిస్తలెం
అప్పుడప్పుడు అనిపిస్తుంది
“మనం దొంగల్ని జైలుకు పంపిస్తున్నమా? లేక చట్టసభలకు పంపిస్తున్నమా?
మనం ఓటు వేస్తున్నమా? లేక అమ్ముకుంటున్నమా?” అని!
ఇంకా చెప్పాలంటే
ఇక్కడ సాతగానోనికి పించనిస్తరు
కానీ సదుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు
మన సర్కార్ బళ్ళో సార్లు ఉండరు
సర్కార్ ఆస్పత్రి లా సరైన సౌలతులుండయి
స్వచ్చ్ భారత్ అని దేశాన్ని శుభ్రం చేస్తున్నం
అయినా మురుగు కాల్వల నడుమ ఛిద్రం అవుతున్న పేదల బతుకులు చూస్తున్నం
ఇక్కడ పరమన్నాన్ని పాచిన అన్నంగా పడేసే అమీర్లున్రు
పాచిన అన్నాన్ని పరమాన్నంగా తినే గరీభిలుండ్రు
ఆశయాల్ని ఆకాశానికి ఎక్కు పెట్టినం
ఆచరణలో పాతాళంలోకి పాతుకు పోతున్నం
భరత మాత – ఎప్పుడు మారుతుందమ్మా నీ తలరాత!
-అక్కల మనోజ్
9700176866,