Monday, August 8, 2022
Home > కథలు > తారే జమీన్ పర్..! -వి. సునంద

తారే జమీన్ పర్..! -వి. సునంద

మనసంతా ఆందోళనగా ఓ రకమైన భయంగా కూడా వుంది సుచరితకు. వస్తువు పోయినందుకు కాదు ఎవరు ఈ పని చేసింది, ఇంత ధైర్యంగా తీసింది. రోజూ తరగతి గదిలో వినిపించే జీవన విలువలు సూక్తుల ఫలితం ఇదా.. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పుతున్నా నా పిల్లలకు అనుకున్నా.. చదువే కాదు సాహిత్యంలో వాళ్ళ ప్రగతిని చూసి మురిసి పోయాను. కవితలతో వాళ్ళు వ్యక్తం చేస్తున్న భావాలు చదివి అందరు మెచ్చుకుంటుంటే ఎంత గర్వ పడ్డానో…
ఇదేమిటి ఇలా జరిగింది. వాడు నమ్మిన బంటులా ఎప్పుడూ వెంట వెంటే తిరుగుతుంటాడు. ఎంత వద్దన్నా నా పర్స్ బ్యాగ్ పట్టుకొని. క్లాస్ మారినపుడల్లా పరుగెత్తుకొచ్చి పట్టుకుంటాడు. మిగతా స్టాఫ్ మందలించినా మౌనంగా వుంటాడే తప్ప ఆపని మాత్రం మానడు. అలాంటి వాడు ఆపని చేశాడా నమ్మబుద్ధి కావడం లేదు సుచరితకు.

“మీరే వాడిని బాగా నెత్తికెక్కించుకున్నారు. ఇది ఖచ్చితంగా వాడి పనే” బల్ల గుద్ది మరీ చెబుతున్న స్టాఫ్ తో ఏం మాట్లాడాలో తోచక ఆలోచిస్తూ వుండి పోయింది. సెల్తో పాటు డబ్బులూ చాలా వున్నాయందులో. చిట్టీ కట్టాలని ఏటీయం లోంచి తీసి పెట్టుకుంది. అందులో ఓ వంద రూపాయలు మాత్రమే మిస్ అయ్యాయి. దొంగబుద్ధి వుంటే డబ్బులు కూడా తీసేవాడు కదా..

మొన్నీ మధ్యే సెల్ లో డౌన్ లోడ్ చేసిన పిల్లల సినిమా

“తారే జమీన్ పర్” ను పిల్లలకు చూపెట్టింది. వాడు ఇంతలేసి కళ్ళను ఆర్పకుండా ఎంత ఇష్టంగా చూసాడు.

“నిజంగా వాళ్ళు అంత గొప్పగా అవుతారా మేడమ్”. అని ఎన్ని సార్లు గుచ్చి గుచ్చి అడిగాడో అ రోజు.

“తప్పకుండా మార్పు వస్తుందిరా వారికి ఓపిగ్గా శిక్షణిస్తే” అంది తను.

అసలు వాడా విషయాన్ని ఎందుకంత ఇదిగా అడుగుతున్నాడో… తరగతిలో ఎవరికి రాని డౌట్లన్నీ వీడికే వస్తాయని అనుకుందప్పుడు.

“ఈ తీయడానికి దానికేమన్నా సంబంధముందా” పిల్లలను అడుగుదాం అనుకుంటూ అన్యమనస్కంగా నిద్రకు ఉపక్రమించింది.. రెండు సెల్లులుండటం వల్ల ఎవరికయినా ఫోన్ చేయడానికి పెద్ద సమస్యగా ఏం లేదు కానీ పోయిన సెల్లు పెద్ద స్క్రీన్ వున్నది. అమెరికా వెళ్ళినపుడు బాబు కొనిచ్చింది. ముప్పై వేల దాకా అవుతుందది. పిల్లలకు అప్పుడప్పుడు విజ్ఞాన సంబంధ విషయాలు, దేశభక్తి పాటల నృత్యాలవి చూపించి ప్రోగ్రామ్స్ కు ప్రిపేర్ చేయించడానికి. బాలల సినిమాలు చూపించడానికి అది ఎంతో ఉపయోగ పడేది. సెల్లు పోయినప్పటి నుండి వాడూ రాకపోయే సరికి అందరి మాటలు నిజమయినవి. కానీ మనసే ఎందుకో ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇష్ట పడటం లేదు.
ఇంట్లో కూడా “నువ్వు పిల్లలకు అతి చనువిస్తావు” అందుకే ఇలా జరిగింది ఇక నైనా పిల్లల్ని ఎంతలో వుంచాలో అంతలోనే వుంచాలి. “చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బాధ పడితే ఏం లాభం” కొంచెం కోపంగా నిష్ఠూరంగా. అన్న భర్త మాటలకు ఏమనకుండా తలొంచుకుంది.. తన నమ్మకాన్ని వమ్ము చేసిన వాడి గురించి, వాడితో పాటు తననూ తలోమాట అందరూ అంటుంటే బాధగా వుంది. కనబడితే వాడిని నిలదీయాలి ఎందుకిలా చేశావని అడగాలి. ఎన్ని రోజులు రాకుండా వుంటాడు.. చూద్దాం అందరూ వాడినే అంటున్నారు.. అసలు వాడీ పని చేశాడో లేదో….

రోజు రోజుకూ సహనానికి పరీక్షలా వుంది సుచరితకు. వాడిది తను పనిచేసే వూరు కాదు పక్క ఊరునుండి నడుచుకుంటూ వస్తాడు. వాడితో మరో ముగ్గురు నలుగురు వస్తారు. వాళ్ళ నడిగితే వాడీమధ్య కలవడం లేదని చెప్పారు. ఏం చేయాలో పాలు పోవడం లేదు.

“మీ ప్రియ శిష్యుని ఆచూకీ దొరికిందా” మేడమ్. కొంచెం వ్యంగ్యం కొంచెం ఆసక్తి కలిపి అంటున్న స్టాఫ్ ను ఏం జవాబు చెప్పాలో తెలియడం లేదు.

“మీకేంటండీ అబ్బాయుండేది అమెరికా కావాలంటే మళ్ళీ క్షణాల మీద పంపుతాడు” అని ఓ సారు, “పిల్లలకు మరీ అంత చనువు ఇవ్వొద్దు ఇస్తే ఇలాగే వుంటుంది” మరొకరి జ్ఞాన బోధ. “అదే మా ఇంట్లో అయితే ఎంత గొడవయ్యేదో మేడమ్ వాళ్ళ సారు మంచి వాడు కాబట్టి సరిపోయింది” మరో మేడం ముక్తాయింపు. “జరిగిందానికే పాపం మేడమ్ బాధ పడుతుంటే మనమెందుకు ఇంకా బాధ పెట్టడం” కొంచెం జాలి మేళవించి ఓ సారు.

సెల్లు పోయిన దాని కంటే వీళ్ళ మాటల బాధ ఎక్కువైంది…

“సర్ నాకో సహాయం చేస్తారా” అర్థింపుగా అంది తన గురించి జాలి పడ్డ సారును ఉద్దేశించి.

“చెప్పండి మేడమ్ ఏం కావాలి” అనగానే

“ఒక్కసారి వాళ్ళ వూరు వెళ్ళొద్దామా!హెచ్చెం సర్ పర్మిషన్ తీసుకుని..” అంది.

“సరే వస్తా”ననగానే, లంచ్ అవగానే ఇద్దరికీ పర్మిషన్ తీసుకొని సార్ తో పక్కనున్న గోవిందాపురం వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ కాలనీలో వుంటుందని తెలిసి అడ్రసు తెలుసుకొని వెళ్ళారిద్దరూ.

తల్లీ తండ్రీ లేరు. ముసలమ్మ వాడి నాయనమ్మ, ఓ ఎనిమిదేళ్ళ పిల్లవాడు గుంజకు కట్టేసి ఉన్నాడు.

“అయ్యో! వాడినెందుకలా కట్టేశారు? వాడేమన్నా కుక్కా మేకా” కోపంగా.. ఆవేశంగా ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది..

ఆమె ఇరిగి పోయిన కళ్ళ జోడు సవరించుకొని వచ్చిన వాళ్ళిద్దర్నీ చూస్తూ “అయ్యా మా నాగ బాబు సార్లా మీరు?” నెమ్మదిగా మంచం మీంచి లేచి దుప్పటి సవరించి కూకోండమ్మా వినయంగా అంది.

“మాకేం మర్యాదలొద్దు గానీ ముందా పిల్లవాడి సంగతి చెప్పవ్వా” వినపడుతుందో లేదోనని గట్టిగా అంది.

అమ్మా వాడు మెంటలోడు. ఎక్కడా కుదురుగా వుండడు.. బడికి పంపితే. వీడల్లరి భరించలేక వద్దు పొమ్మన్నరు సార్లు. ఎటెల్లి ఏం చేసుకుంటాడోనని వాళ్ళ అయ్య అమ్మ, అన్నొచ్చే దాక ఇట్ల కట్టేసి వుంచుతం అంది.

మనసంతా భారమైంది సుచరితకు!

వాడి దగ్గరికెళ్ళ గానే ముడుచుకొని స్థంబం చాటుకెళ్ళి దాక్కున్నాడు. బ్యాగ్ లోంచి చాక్లెట్ తీసి రమ్మని పిలిచింది.
నెమ్మదిగా వచ్చి చేతిలోంచి చాక్లెట్ అందుకోవాలని చూడగానే గబుక్కున దగ్గరికి తీసుకొని చాక్లెట్లు కావాలా ఇంకా వున్నాయి అని తీస్తుంటే

“కావాలి” అనగానే “అరే వీడికి మాటలొచ్చా” ఆశ్చర్యపోతుంటే..

“వచ్చమ్మా కొద్దిగా తేడా గుంటడు అంతే” అంది ముసలమ్మ.

వచ్చిన సారు ఇదంతా చూస్తూ “వాడేడి? ఎటెల్లిండు?” అనగానే

అయ్యా! పది రోజుల సంది పొద్దున బొయి రాత్రి కొస్తున్నడు. ఏడికెళ్తుండో ఎంతడిగినా చెప్పట్లే…

“తల్లిదండ్రి మేమంతా మనియాది బడుతున్నం సారూ!”

“తమ్ముడికి సదువొస్తది తమ్మున్ని సదివియ్యాలంటడు. ఈడి సదువేమే అటకెక్కించిండు ఈ మెంటలోడి గురించి మాటలు చెబుతున్నడు.. ఏం జెయ్యాలి సార్లూ..!” కళ్ళొత్తుకుంది ముసలమ్మ.

“ఇంతకు మేమెందుకొచ్చినమో తెల్సా” సుచరిత అంది.

“ఆడు బల్లోంచి పంతులమ్మ సెల్లు ఎత్తుకొచ్చిండట. ఇచ్చిరమ్మని అమ్మ అయ్య ఎంత తిట్టి కొట్టినా రెండ్రోజులాగి నేనే ఇచ్చొత్తనంటడు. రోజూ మా అందరికి అదేదో చిన్న పిలగాడి సినిమా సూబెట్టి తమ్ముడు గూడా అట్ల బాగయితడు ఏరే బడికి పంపుదామంటడమ్మ” గోడంత ఎల్లబోసుకుంది ముసలవ్వ.

ఇప్పుడర్థం అయ్యింది సుచరితకు వాడు సెల్లే ఎందుకు తీసుకొచ్చాడో…

పిల్లలకు ఆ రోజు చూపించిన సినిమా విషయం చెప్పింది ఆ సారుకు.

“మేమొచ్చినట్టు చెప్పకవ్వా! వాడు మంచిగా చదివే పిల్లవాడు. బడికెందుకు రావట్లేదో తెలుసుకుందామని వచ్చాం. మీ చిన్నోడికి ఖమ్మంలో మంచి బడి వుంది. అక్కడ మంచి సార్లు నాకు తెలిసిన వారున్నారు. వాళ్ళతో మాట్లాడి మీ వోన్ని అందులో చేరుద్దాం” అని మరోసారి ఆ చిన్నోడి దగ్గర కెళ్ళి తల నిమిరి, సారుతో బడికి వచ్చేసింది. దారిలో సారును ఈ విషయాలేవీ చెప్పొద్దన్నది…

స్టాఫ్ అడిగితే విషయం ఏదో చెప్పి దాటేసారిద్దరు. మరో నాలుగు రోజుల తర్వాత బడికి వచ్చాడు నాగబాబు. అందరూ వాడినో దొంగలా చూస్తున్నా మాటలంటున్నా, మిగిలిన వాళ్ళు గద్దించినా కిక్కురుమనకుండా సరాసరి సుచరిత దగ్గరికి వచ్చి బోరుమని ఏడ్చాడు.

వాడిని దగ్గరికి తీసుకుంటూ నువ్వు వస్తావని నాకు తెలుసునాన్నా! అంది. వాడి చేతిలో తన సెల్లుతో పాటు డబ్బుల కట్ట. ఆశ్చర్యంగా చూసింది సుచరిత.

“మేడమ్! ఇలాంటి సెల్లు కొనుక్కురండి.. తప్పయింది మేడమ్.. ఇందులో మీరు చూబెట్టిన సినిమా మాయమ్మోళ్ళకు సూబెట్టాలని తీసుక పోయిన.. మా తమ్మున్ని అది జూస్తెనన్న బడిల చేర్పిస్తరని” అందుకే మేడమ్ నేను తప్పు చేసిన కొట్టండి. అంటుంటే అందరిలో ఆశ్చర్యం. వాడిలోని విజ్ఞతకు.

“ఒరే నాన్నా! ఆ మాట నాకు చెబితే నేనే ఇచ్చేదాన్ని కదరా.. ఇన్ని రోజులు చదువు పోయింది. సరేలేరా!నీమీద నాకున్న నమ్మకాన్ని నిలిపావు. తమ్ముడికి ఖమ్మంలో ప్రత్యేకంగా చదువు నేర్పు మంచి బడిని చూశాను అమ్మ వాళ్ళతో మాట్లాడి చేర్పిద్దాం.

నీకిప్పుడిక సెల్లు అవసరం లేదు. హాయిగా చదువుకో. బాలలు బడిలోనే వుండాలి. అలా పనిలో వుండకూడదు వెళ్ళకూడదురా.. నీకు తెలుసు కదా ఇవన్నీ..” అంటూ భుజం తట్టింది సుచరిత.

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!