Saturday, February 22, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( సీరియల్) -12 వ వారం -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( సీరియల్) -12 వ వారం -శ్రీ విజేత

అన్నయ వెళ్ళిపోయాడు కొద్ది సేపటికి నా నిర్ణయాన్ని నాకే వదిలేసి. అవన్నీ విన్న తరువాత అనిపించింది, అతడు నా పై చూపించిన అభిమానం వెనుక ఇంత కథ ఉందా అని. ఆడపిల్ల నిజంగా ప్రేమించడానికి సాహసిస్తుందా ఈ సమాజంలో. కులాంతరం ఉన్న ఇద్దరు యువతీ యువకుల మధ్య ప్రేమ అని చిగురించినా ఆ ప్రేమను చూపించుకొనే పరిస్థితులు, ప్రకటించుకొనే సందర్భాలు ఆడపిల్లలకు తక్కువే కదా ! మగవాళ్ళకైనా అ అవకాశాలు ఎంతగా ఉంటాయి?. సమాజం యువతీ యువకుల ప్రేమను అర్ధ చేసుకొనే పరిస్తితులు, అంగీకరించే సందర్భాలు ఆనాటి కాలములో ఎంతగా ఉన్నాయి? ఒకసారి జీవితాన్ని మననం చేసుకుంటే, ఓ అయిదారేళ్ళు వెనక్కి వెళ్ళితే అతడు- నేను- అన్నయ్య దాదాపుగా ఒకే వయసు వాళ్ళం ఒకటి రెండేళ్ళ వయసు తేడాతో నేను. నిజంగా అతడు నన్ను అంతగా ప్రేమించాడా! నేను మరి? పరస్పరం పలుకరింపులు లేని ప్రేమలు, కలయికలు లేని ప్రేమలు, చూపులు కలువని ప్రేమలు ఉండవు కదా ! అతని చూపుల్లో కరిగిపోయినానేమో కదా నేను ! అతనంటే కూడా నాకు అబిమానం, కాదనను, దానినే ప్రేమ అంటారా? సమాజ నియమాలు, కులాంతరాలు, కుటుంభ గౌరవం, పరువు, ప్రతిష్టల వెనుక బతుకుతున్న సమాజంలో ఇది ప్రేమ అని అనుకోలేదు, ఇష్టం, అబిమానం అని మాత్రమె అనుకున్నానేమో ! అతనైనా చెప్పినాడా ఎన్నడైనా, అదీ లేదు. అతడు ప్రేమించాడనే విషయం, ఇంతగా ప్రేమించాడనే విషయం అన్నయ్య చెపితేనే తెలిసింది. తోలి యవ్వన ప్రాయంలో పదహారేళ్ళ వయసులో ఒక మగ స్నేహితుడు, నవ యువకుడు నా దృష్టిపథం లోకి వచ్చింది అతడేనేమో ! లీలగా గుర్తుకు తెచ్చుకుంటే చిరునవ్వులు చిందించే అతన్ని నేను అప్పుడప్పుడు యాదృచ్చికంగా చూడడం ప్రేమనా ? ముస్తాబై అతని కన్నుల్లో నేను కరిగిపోయిన సందర్బాలు కూడా అప్పుడప్పుడు ఉన్నాయేమో ! అది కూడా ప్రేమనేమో! మనసులో ఇష్టం లేనిది ఎవరికైనా కనిపిస్తామా, కనిపించాలనుకుంటామా ! అలాంటి ఇష్టమంటేనే ప్రేమనా ! ఆ అభిమానం ఇష్టాలను నేను ప్రేమ అని అనుకోలేదు. అతడు పరిచయమైన మొదటి సంవత్సరంలోనే పెళ్ళయి పోయింది నాకు. తర్వాత నాలుగైదేళ్ళు ఒడుదొడుకులతోనే గడిచిపోయింది. జీవితంలో కొందరివల్ల ఏర్పడిన మనసులోని కొన్ని అసంతృప్తులు ఇంకొందరి స్నేహం వల్ల, అభిమానంవల్ల తీరుతాయేమో. నాకు తెలియకుండానే నేను పరిస్థితుల ప్రభావంవల్ల అతని మనసుకు దగ్గరైనానేమో ! ప్రేమ ఇది అని చెప్పలేమేమో ! నవ యవ్వన తోలి ప్రాయంలో ఇద్దరు స్త్రీ పురుష యువ మనసులు కలుసుకోవడమే ప్రేమ కావచ్చు. ఇష్టాన్ని, అభిమానాన్ని పరస్పరం మౌనంగా ప్రకటించుకోవడమే ప్రేమ కావచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒకరినొకరు చెప్పుకోకున్నా అది ప్రేమ అనే ఒక మౌన సందేశమేమో ఒకరినుంచి ఒకరికి ! ప్రేమ ఒక సహజాతి సహజమైన మూగ భాష ఇద్దరు నవ యువతీ యువకుల మధ్య. అలా అయితే నేను కూడా ప్రేమించానా అతన్ని! ఆ ప్రేమకు పర్యవసానం ఏమిటీ ? నా కోసం అతడు ఆలోచించడం ఏమిటీ ? నా కోసం అతడు ప్రాణం ఇస్తాను అనడం ఏమిటీ ? నన్ను జీవితంలోకి స్వీకరించి పెళ్లి చేసుకోవడానికి ఆగి ఉన్నాడని తెలియడం ఏమిటీ ? ఆశ్చర్యం వేసింది ఆలోచిస్తుంటే. ఏమిటీ జీవితం ? నేను ఎవరి దాన్ని? అతనికి నేను ఏమి కానుగా ! నాపై అతనికి ఇష్టాలు, అభిమానాలు, హక్కులు ఏమిటీ? చిన్ననాడు తలిదండ్రుల చాటు బిడ్డను, పెళ్ళయిన నాడు అత్తింటి కోడలును, ఒకరికి భార్యను, ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించాను. మనసులో మనసు లేకుండాపోయింది.

తెల్లవారి అన్నయ్య అతను రాసుకున్న నవలను, అతని డైరీని నాకు అందచేశాడు చదువుకొమ్మని. జీవితం ఊహించని విషయాలతో కూడుకొని ఉంటుందేమో అనిపించింది జరుగుతున్నా సంఘటనలను చూస్తుంటే!

ముందుగా అతను రాసుకున్న నవల పేజీలు తిరిగేస్తూ పోయాను. ఆశ్చర్యం వేసింది రెండు వందల పేజీలు, మూడు గంటలు చదివాను ఆగకుండా, సమయం తెలియ లేదు. అది నా జీవితం, అతని జీవితమే, మధ్యలో అనుసంధానంగా అన్నయ్య అక్కడక్కడ. ఇంత నిశిత పరిశీలనా జీవితం యెడల, ఇంత ప్రేమనా నా యెడల! అంతటి అపురూపమైన ప్రేమను పొందిన నేను ఎంత అదృష్టవంతురాలిని అని అనిపించింది.. నన్ను నేను చూసుకున్నాను ఆ నవలలో. అది నా పెళ్ళికి ముందు ఒక్క సంవత్సరం ముందు మొదలై, ఒక్క సంవత్సరం గడిచి నేను చనిపోతానని లేఖ రాసుకున్న తరువాత, కొంత స్తిమితంతో అలోచించి అత్తవారింటికి వెళ్లి ఒక సీదా సాదా గృహిణిలాగా భార్హతో కలిసి ఉంటున్నట్లు ముగించాడు నవలను.

అది నా జీవితానికి ప్రతిబింబం లాగా ఉంది. ఎంతటి ప్రేమ అతనిది నేను చనిపోతే తను కూడా చనిపోతాను అనే నిర్ణయంతో ఉన్నాడని అర్ధమయ్యింది. దీనిని త్యాగం అంటారా! అతనికి ఏమి కాని నా గురించి ఎంత తపన పడ్డాడు! ఎంత పరితపించాడు! ఎంత కన్నీళ్లు కార్చాడు! నాకు ఎన్నడూ చెప్పలేదేమి ఈ ప్రేమ గురించ అని అనిపించింది. ఈ ప్రేమే పెళ్ళికి ముందు తెలిస్తే ఎంత బాగుండునో కదా అని అనిపించింది. నవల చదువుతూ పోతూ ఉంటె మధ్యలో ఒక పేజీలో ఎర్రని అక్షరాలతో నా పేరును రాసుకున్నాడు ‘ప్రేమ లత’ అని, అది అతని రక్తంతో రాసుకున్న నా పేరు.

చదువుకుంటూ పోతూ ఉంటె ఉబికిఉబికి కన్నీళ్లు వచ్చాయి. ప్రేమ మూర్తి అయిన అతన్ని తలచుకుంటుంటే. ఎవరీయన, అంతటి ప్రేమ నాపై అతనికి ఎందుకు అనిపించింది. ఇది ఏ జన్మల బంధం, అనుబంధం అనిపించింది. “ప్రేమ.. ప్రేమ..” అని రాసుకున్న ఆ నవలను చదువుతూ నిండా కన్నీళ్ళలో మునిగిపోయాను. తను మాత్రమే నన్ను ప్రేమించాడా, నేను ప్రేమించాలేదా అతన్ని, హృదయాన్ని, గుండెను నేను దాచుకున్నానా ప్రేమ అని ప్రకటించడానికి, అతను మాత్రం నాపై అతని ప్రేమను సర్వదా ప్రకటించుకుంటూ వస్తున్నాడా? నేను విషయం తెలిసేదాకా గ్రహించ లేదు. అతని బలమైన కోరిక నేను చనిపోవద్దు, బతుకాలి అని. నేను అతనికి దూరంగా, అందకుండా బతికినా పరువా లేదు, కాని నేను చనిపోకూడదు. అందుకే నేను ఉల్లాసంగా ఉండేటట్టు అప్పుడప్పుడు ప్రయత్నించాడేమో! ఎంత మౌన ప్రేమ, మూగ ప్రేమ అతనిది! ఎంతటి ఆరాధన అతనిది! నిజంగా ఏమివ్వాలి అతనికి, యేమని సమాధానం ఇవ్వాలి నేను అని అనిపించింది. ఎంతటి ప్రేమ మూర్తి అతడు, అక్కడక్కడ నన్ను వర్ణిస్తూ అద్బుత కవిత్వం రాశాడు! నిజంగా నేను అంత అందంగా ఉన్నానా! నాపై ప్రేమతో అతను కవి అయిపోయాడా? రచయితై పోయాడా ? నన్ను నా జీవితాన్ని చూసి చలించిపోయి అతను ఎంత వేదనను అనుభవించాడు? అతని వేదనల సారాంశం అతని కవిత్వం, అతని రచనలా? నా దుఃఖ మయ జీవితం అతని కవితకు ప్రాణం అయ్యిందా ! ఎందుకూ పనికిరాని, ఎవరూ పట్టించుకోని గడ్డిపువ్వును అనుకున్నాను కాని నన్ను గురించి ప్రాణములా పట్టించుకునేవారు, నా కోసం కూడా ఆలోచించేవారు ఉన్నారు, ఇది చాలు తృప్తి అనిపించింది. నిజంగా అతనికి ఏమి సమాదానం ఇవ్వాలి? ఏమిచ్చి అతని ప్రేమ ఋణం తీర్చుకోవాలి అనిపించింది. ఒక మంచివాడు, ప్రాణములా ప్రేమించే ఒక ప్రేమికుడు, బుద్ధిమంతుడు, ఉద్యోగం ఉన్న సంపాదనా పరుడు, నా కోసం కేవలం నా కోసం ఆగి, కట్నాలు, కానుకలు అన్నీ వదులుకొని, తన వాళ్ళు అందర్నీ కూడా పక్కన పెట్టి రెండు చేతులతో నిండుగా ఆహ్వానిస్తూ నన్ను తన జీవితంలోకి తీసుకుంటానంటే నేను వెళ్ళగలనా? వెళ్లే శక్తి నాకుందా అనిపించింది అప్పుడు. ఇద్దరి మధ్య కులాంతరం, పైగా నాకు పెళ్ళయ్యింది! ఇక ఎలా సాధ్యం అనిపించింది. నిజంగా ఎంతటి స్వార్ధం లేని మనిషి అతడు! ఈ కాలములో ఎవరుంటారు అతనిలా? నా కోసం తన జీవితాన్ని బలి చేసుకోవలనుకుంటున్నాడా ? సాఫీగా సాగిపోయే జీవతం ఉంది తనకు, ఎందుకు ముళ్ళ దారినే ఎంచుకుంటున్నాడు అతను అనిపించింది. ఎవ్వరికీ పనికిరాని, ఎవ్వరూ పట్టించుకోని నా గురించి అతను ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఇది విధి వైపరీత్యం కాపోతే మరేమిటీ! నేను అతను-జీవితం- ప్రేమ, ఎంత విచిత్రం ! కాలమహిమ అంటారేమో కొత్త కొత్త విషయాలను తెలియ చేస్తూ పోయింది. కొంత సంతోషం, కొంత విషాదం కాలచక్రం అనిపించింది.

కొద్దిగా తేరుకొని అతడు రాసుకున్న నవలను పక్కన పెట్టి అతని డైరీ లోనికి తొంగి చూశాను ఆసక్తిగా. తన కథనంతా నా ముందు నిజాయితీగా కుమ్మరించాడు తనను అర్ధం చేసుకొమ్మని నాకు తన డైరీ ద్వారా.

ఫిబ్రవరి 21, రాత్రి : 10.25

ప్రేమా! ఇవ్వాల్టి నుండి నా డైరీ ద్వారా వారం రోజులు నీకు చెప్పవలసిన విషయాలు అన్నీ వ్రాయాలనిపించింది.

డైరీ అంటే స్వచ్చమైన హృదయమే ! నాడైరీల్లోని ప్రతి పేజీలో నువ్వున్నావేమో నిజంగా ! నిన్ను మరచిపోలేక నీతో చెప్తాననుకున్న విషయలనన్నీ డైరీల్లో వ్రాసానేమో! జీవితంలో నేను నిన్ను ఇంతగా ప్రేమించానంటే, బహుశా నిన్ను మరచిపోవడం నాకు సాధ్యం కాదు. నీ లాంటి అందమైన, తెలివైన అమ్మాయి బహుశా నాకు ఈ ప్రపంచంలో దొరుకదు! నీ లాంటి ప్రేమికురాలు, మీ అన్నయ్య లాంటి స్నేహితుడు కూడా దొరుకడు.మీ లాంటి వాళ్ళ కోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. నేను ఇంటర్మీడియెట్ పాసయిన రోజులు, వేసవి కాలం,నువ్వు నా దృష్టి లోకి వచ్చావు.నాకు పద్దెనిమిదేళ్ళు ఉంటాయేమో ! నీ అందంతో నన్ను ముగ్ధుణ్ణి చేశావు. నీ చూపులు, నీ రూపులతో చెముక్కున మెరిసావు. నా జీవితమే మారిపోయింది. రెండు మూడు నెలలలో డిగ్రీ చదువుల కోసం పక్క సిటీ కాలేజిలో జైన్ అయినాను. అసలిక చదువే చదువాలనిపించలేదు. నీ కోసం నవలలు చదివాను, నీ కోసం నవలలు తెచ్చాను. నీ కోసం నవలలు వ్రాసాను కూడా. నిన్ను చూడాలని ప్రతిరోజు నీ కోసం వచ్చేవాన్ని, నీ కోసం ఎదురు చూసేవాన్ని. ఆ రోజులను ఎలా మరచి పోవాలి నిజంగా ! కాలం నాకోసం , నీ కోసం ఆగక మళ్ళీ వేసవి కాలం వచ్చింది. నీకు నేను ఏ విషయం తెలియచేసే అవకాశం రాకుండానే మే మాసంలో నీ పెళ్లి జరిగిపోయింది. ఈ తప్పెవరిదీ ?
ఫిబ్రవరి 22, రాత్రి : 09..50

ప్రేమా! ఆరు సంవత్సరాలు ఇంత తొందరగా గడిచిపోయినాయా! ఈ ఆరు సంవత్సరాల్లో ఏనాడు నాకు సంతృప్తి లేదు. ఇష్టమున్నా లేకున్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. నువ్వు కనిపించని ఒంటరి జీవిత దుర్భరాన్ని, నిద్దుర రాని కాల రాత్రులను, నువ్వు లేని వేదనను భరిస్తూ రాయాల నిపిస్తే నవల రాస్తూ, రాయాలనిపిస్తే కవితలు రాస్తూ, నిన్ను మరిచిపోలేక వేదననంతా గుండెల్లో పెట్టుకొని యంత్రములా బతికాను. ఇష్టం లేని పెళ్లి నువ్వెందుకు చేసుకున్నావు? అప్పుడు నాకు పందొమ్మిదేళ్ళు. డిగ్రీ చదువుకుంటున్నాను. పెళ్లి చేసుకొని నా నుండి దూరం అయిపోయావు. నా ప్రేమ రాకపోతుందా, కలియకపోతుందా, మాట్లాదకపోతుందా అని ప్రతి పండుగ వస్తుంటే ఎదురుచూసేవాన్నినీ కోసం. అయినా ఒకోసారి నా దృష్టిలోకి రాకుండా కనిపించద్దనుకున్నావేమో ! ఉండి కూడా, చూసి కూడా మాట్లాడేదానివి కాదు. నీ గుండెల్లో, మనసులో నేనున్నా మౌనంగా చూసేదానివి. నన్ను మరచిపోవడం నీకు సాధ్యమా ? నీ పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి నువ్వు చనిపోతా ననుకున్నావు. అది తెలిసి నేనెంత బాధ పడ్డానో తెలుసా ! నువ్వు చనిపోతే నేను కూడా చనిపోయేవాన్నేమో! నీ కెవ్వరు లేరనుకున్నావా ? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఈ లోకంలోంచే వెళ్లిపోదామనుకున్నావా? ఆ రోజుల్లో నీ కోసం వచ్చి , నీ చుట్టూ తిరిగి ఎంతో తాపత్రయపడి నపుడు, కొందరు నచ్చని మనుష్యుల మాటలకు ఎంత బాధ పడ్డానో తెలుసా! ప్రేమా! స్వార్ధపరులైన ఆ పిచ్చి మనుష్యులకు బుద్ధి చెప్పాలని ఉంది. నీ సమాధానం నాకు కావాలి.

( మిగితా వచ్చేవారం..)

-శ్రీ విజేత

Facebook Comments

error: Content is protected !!