Wednesday, June 3, 2020
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం (12 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (12 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం 12 వ భాగం

రెండో రోజు ఉదయమే లేచి హరి జిమ్ కి వెళ్తే చందన , యోగాకు వెళ్లి అటునుండి అటు స్పాకు వెళ్ళింది. వేపర్ రూమ్ లో ఒక పదినిమిషాలు కూచుని ఆవిరి ఒళ్లంతా తగిలితే ఉక్కిరి బిక్కిరి అనిపించినా బయటకు వచ్చి గోరు వెచ్చని నీటిలో స్నానం ఎంతో సాంత్వనను ఇచ్చింది. ఇద్దరు ఇండియన్స్ ముగ్గురు అమెరికన్లు , ఒక మిడిల్ ఈస్ట్ వాళ్ళతో పరిచయాలు , పలకరింపులు నచ్చాయి. డాక్టర్ అనే సరికి తమకున్న అనుమానాలు ఆమెతో చెప్పుకుని వాటికి సమాధానాలు పొ౦దవచ్చనే ఉద్దేశ్యం సాధారణంగా ఇతర జనంలో మామూలే.
ఇండియన్స్ లో ఒక అమ్మాయి భర్తతో కొత్తగా పెళ్ళై హనీమూన్ కి వచ్చి౦ది. మరొకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , ఇంకొక మధ్య వయస్కురాలు హోమ బిజినెస్ -బోటీక్ లాటిది నిర్వహిస్తోంది.
అందులో మళ్ళీ ఒకరు పంజాబీ , ఒకరు గుజరాతీ కొత్తపెళ్లి కూతురు తెలుగమ్మాయి స్పందన.
“ మన పేర్లు చిత్రంగా ఎంత దగ్గరగా ఉన్నాయి చూసారా , స్పందన , చందన …” చందన తెలుగు వాళ్ళని తెలిసాక తెలుగులోనే మాట్లాడటం సాగించింది. నవ్వింది చందన. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నమిత . చదువు ఉద్యోగం ఇచ్చిన ధీమా ఆమె మాటల్లో కనిపిస్తోంది. బోటీక్ నడిపే రేష్మా కూడా చాలా ధీమాగా ఉంది.
అమెరికన్స్ ఫార్మల్ గా హాయ్ , హలోలతో ముగించారు.
వెనక్కు వచ్చి స్నానం చేసి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళారు ఇద్దరూ. కాని ఏం తినాలో తెలియనంత ఆహారం, ఎన్నో రకాల పాస్తాలు, నూడుల్స్, బర్గర్ లు డోనట్స్తొ పాటు ఇండియన్ వెరైటీలు, వివిధ దేశాల ప్రత్యేకతలు. మనిషనే వాడికి తిండి పట్ల ఎ మాత్రం వ్యామోహం ఉన్నా అక్కడ వున్నా పది రోజుల్లో తీరిపోతుంది. నచ్చినంత తిని రోజంతా తిరిగి వెన్నెలనూ చుక్కలనూ ఆస్వాదించి చాలు ఈ జన్మకిది అనుకునేంత తృప్తి.
బాలీ ఫిట్ డాన్స్ లూ స్పాలతో జిమ్ యోగాలతో తిన్నదంతా అరిగిపోడం, సాయంత్రం వరకు విండో షాపింగ్ షాపింగ్, మధ్య మధ్య ద్వీపాల్లో దిగి నడక, మళ్ళీ సాయంత్రానికి నౌక చేరడం అసలు నీటి మీద వెళ్తున్నామన్న ధ్యాస సముద్రంలో ఏమవుతుందో నన్న బెంగ ఏ మాత్రం మిగలవు. టైటానిక్ అసలు గుర్తు రాదు.
బ్రేక్ఫాస్ట్ తరువాత స్పందన వారి గదికి వచ్చి షాపింగ్ కి వెళ్దాం రమ్మని అడిగింది. హరి గేమ్ రూమ్ కి వెళ్ళాడు, ఎన్నేళ్ళ తరువాత అతనికి ఇష్టమయిన టేబుల్ టెన్నిస్ ఆటకు. చందన స్పందనతో పాటు షాపింగ్ ఏరియాకు బయలు దేరింది.
“చెప్పు స్పందనా ఏమయినా చెప్పాలనుకున్నావా?”
“ ఎలా కనుక్కున్నారు? సరిగ్గా మీతో మాట్లాడాలనే నేను ఇలా వెళ్దామని వచ్చినది.”
“ నువ్వు వచ్చావంటేనే అర్ధం అయింది, నాతో వంటరిగా ఏదో మాట్లాడాలనుకున్నావని, ఆ విషయం హరికి కూడా అర్ధం అయి౦ది.” స్పందన మొహం ఎర్రబారింది.
“ ఏమయినా అనుకుంటారేమో …”
“ ఉహు హరి అలా అనుకునే మనిషి కాదు. నా కంటే ఎక్కువ అర్ధం చేసుకునే మనిషి. మా ఇద్దరికీ మాటలూ వివరణలూ అవసరం లేదు. ఒకరు మనసులో మాట ఒకరికి అర్ధం అయిపోతుంది.”
“నిజమా ? అదెలాగ?”
“ అదంతే , మేం ఇద్దరం కాదు ఒకరిమనే అనుకుంటాము. అందుకేనేమో ఇలాటి సిక్స్త్ సెన్స్”
“సరిగ్గా మీతో ఈ విషయమే మాట్లాడదామని వచ్చాను చందనా. మా పెళ్ళై రెండు నెలలు.
అంతకు ముందు నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాము. రిషి చాలా మంచి వాడు నెమ్మదైన వాడు. అందరికీ అన్ని విధాలా సాయపడే వాడు. ముఖ్యంగా నైతిక విలువలు, మానవత్వం ఉన్న వాడు అనిపించాడు. అందుకే అతనితో స్నేహం ప్రణయంగా మారి అతన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి అమ్మా నాన్నకు అంతగా ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కూతురినని నా మాట కాదనలేక ఒప్పుకున్నారు.
అవును. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. మా నాన్న ఆగర్భ శ్రీమంతుడు. కూతురిని హనీమూన్ కని క్రూజ్ లొ పంపించాడ౦టేనే మీరు ఊహించుకోవచ్చు.
అయితే రిషి తో నా నాలుగేళ్ల పరిచయంలో ఆ విషయం అతనికి తెలుసనీ నేను అనుకోను. మామూలు సామాన్యుల లాగే నేను బస్ లొ కాలేజీకి వెళ్ళే దాన్ని ఎవరికీ నా స్థితి గురించి ఎప్పుడూ తెలిసేలా ప్రవర్తించలేదు. చివరికి కాలేజీ ప్రిన్సిపాల్ కి కూడా. ఒక్క రోజూ కూడా వంద రూపాయలకు మించి నా దగ్గర వుండేవి కాదు.
ముఖ్యంగా అమ్మ , నా డబ్బు చూసి నన్ను ఎవరూ వలలో వేసుకుని మోసం చెయ్యకూడదని, మనం వీలైనంత సామాన్యంగా బ్రతికితేనే ఎ కష్టాలు వచ్చినా తట్టుకోగాలమనీ చెప్పేది. నిజమే, ఏ పరిస్తితుల లోనైనా స్తితప్రజ్ఞాతతో బ్రతకాలి.
ఇంట్లో కూడా మా పన్లు మేమే చేసుకునే వాళ్ళం. అంటే మామూలు మధ్యతరగతి కుటు౦బాల లాగే … రిషికి కూడా మధ్య తరగతి అమ్మాయిగానే తెలుసనుకున్నాను.
నాలుగేళ్ళలో అడపా దడపా సినిమాలకో షికార్ల కో వెళ్ళినా ఖర్చంతా అతనే పెట్టుకునే వాడు తప్ప ఎప్పుడయినా నేను ఇస్తానన్నా వారించే వాడు. మధ్య మధ్య చిన్న కానుకలూ ఇచ్చిన గుర్తు.
ఫాన్సీ హెయిర్ క్లిప్, రంగు రంగుల వాచ్ స్ట్రాప్స్ , నా పుట్టినరోజున నా కెంతో ఇష్టమయిన టైటాన్ దివా డిజైనర్ వాచ్ ఇలా … నవ్వుకునే దాన్ని నాకు మా నాన్న పుట్టిన రోజున డైమండ్ సెట్ ఇచ్చాడని అతనికి తెలియదు కదా అని.
అయినా ఈ ప్రేమ ఎంత వరకో తెలియదు. ఆ ప్రేమను నా అంతస్తు ప్రభావితం చెయ్యడం నా కిష్టం లేదు. చివరికి రిషి ప్రపోజ్ చేసిన రోజున నన్ను నేను నమ్మలేకపోయాను. కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి. అప్పటికీ చెప్పాను, నేను చాలా మధ్య తరగతి కుటు౦బీకు రాలైననీ పెద్ద ఆస్తి పాస్తులేమీ లేవనీ ఒకే సంతానాన్ని కావడం వల్ల పెళ్లి తరువాత కూడా వారి బాధ్యతా నాదేననీ.
“పెళ్లి తరువాత నీ , నా ఉండదు స్పందనా, అంతా మన. అంతే. నీ పేరెంట్స్ కాదు నా పేరెంట్స్” అన్నాడు.
ఆ తరువాతే రిషిని అమ్మా నాన్నలకు పరిచయం చేసాను. ఆ ఆదివారం రోజున ఇంటికి లంచ్ కి పిలిచాను. నిజానికి అమ్మా నాన్నతో ఎంతో ఆత్మీయంగా , కావలసిన వాడిలా మాట్లాడాడు.
ఉన్న నాలుగైదు గంటల సమయంలో ఇద్దరినీ నవ్వించాడు. పాటలు పాడి వినిపించాడు. వాళ్ళ వివరాలు చెప్పాడు. తండ్రి రైల్వే లో పెద్ద ఆఫీసర్. ఒకకొడుకు , ఒక కూతురు. అక్క పెళ్లి అయిపోయిందని చెప్పాడు.
అతను వెళ్లి పోయాక నేనేమీ చెప్పక ముందే నాన్న హఠాత్తుగా “ఇతను చెప్పినదేదీ నాకు నచ్చలేదు. లాయల్ అని అసలు అనిపించటం లేదు” అనేశాడు.
“ అదేమిటి డాడీ, అతని గురించి మీకేం తెలుసు? ఏం పరిచయం లేదు కదా, నేను నాలుగేళ్ళుగా చూస్తున్నాను. ఏ ఒక్క సందర్భంలోనూ అతనలా ప్రవర్తించలేదు” కొంచం ఆవేశంగా అని ఉంటాను.
అమ్మ నా వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూసి నాన్న వైపు చూసింది. ఆ ఒక్క చూపులోనే
“మీరు౦డ౦డి” అని సూచించడం కనిపించింది.
అప్పటికి ఆ విషయం వదిలేసినా తరువాత అమ్మ నన్ను అడగనే అడిగింది,
“ఇంటి దాకా తీసుకు వచ్చావంటే ఏదో ఉండే ఉంటుంది చేప్పేసేయ్ స్పందూ” సాయంత్రం నాన్న క్లబ్ కి వెళ్ళగానే అడిగింది అమ్మ నవ్వుతూనే.
“ అబ్బ , ఆ బ్రహ్మ దేవుడి వద్దైనా దాచగలమేమో గాని నీ చూపుల ముందు కాదు కాని మమ్మీ …” అంటూ మా ఆషామాషీ పరిచయం మొదలు పెరిగి పెద్దదై నిన్నటి వరకూ వచ్చిన ప్రతి విషయం పూసగుచ్చినట్టు చెప్పాను అమ్మకు.
అమ్మలో కూడా ఏదో సంశయం.
అయిష్టంగానే ఇద్దరినీ ఒప్పించడానికి మరో ఏడాది సమయం పట్టింది.
అమెరికా వెళ్లి మాస్టర్స్ చెయ్యమని చెప్పి చెప్పి విసిగిపోయారు ఇద్దరూ. రిషి సంగతి తేలే వరకూ ఏమీ చెయ్యదలుచుకోలేదు నేను. రిషి మాస్టర్స్ కి అమెరికా వచ్చాడు. అయినా ప్రతి రోజూ మూడు వందల అరవై రోజులూ రోజుకి కనీసం రెండు గంటలైనా మాట్లాడే వాడు. అది మూడేళ్ళపాటు. మళ్ళీ ఏం మాట్లాడాం అంటే చెప్పడానికి ఏమీ ఉండేది కాదు.
అతను ఉద్యోగంలో స్థిరపడ్డాడని అనిపించాక మా పేరెంట్స్ ఒప్పుకున్నారు పెళ్ళికి కాని ఒక కండిషన్ మీద. నేను మాస్టర్స్ కోసం స్టూడెంట్ వీసా తెచ్చుకుంటేనే.
“ మన జాగ్రత్త మనది పాపా, నీ వీసా పాస్ పోర్ట్ నీకు౦డాలి. ఎప్పుడే పరిస్థితులు ఎదురైనా నీ స్వాతంత్ర్యం నీకు౦డాలి. ఏం చెయ్యాలి ఏం వద్దు అనేది నీ నిర్ణయం కావాలి. ఈ కాస్త ముందు చూపు మనందరి కోసం. అందుకే కొంచం కష్టమే ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ జీ ఆర్యీలూ తోఫెల్ లూ రాయటం కాని కష్టమైనా తప్పదు”
అమ్మ చెప్పాక ఇహ మాట్లాడ వలసినది ఏం మిగిలింది?
నాకు ఐ ట్వంటీ వచ్చి మంచి యూనివర్సిటీ లో ఎయిడ్ వచ్చాక మొన్న ఉగాది దాటాక మా పెళ్లి జరిగింది.పెళ్లి వరకూ కూడా మేము మధ్య తరగతి వాళ్ళమనే భ్రమలోనే ఉంచారు మా అమ్మా నాన్నా. పెళ్లి కి బుక్ చేసిన గార్డెన్స్ అక్కడి అరేంజ్ మెంట్స్ చూసి ఖంగు తి౦టారనుకున్నాను కాని అలాటిది వాళ్లేవరిలోనూ కనబడలేదు. అందరికీ చాలా ఖరీదైన బహుమతులనే ఇచ్చారు. అయినా రిషి పేరెంట్స్ అతని అక్కయ్య మాతో ముభావంగానే ఉన్నారు. అయినా నేను వారింట ఉన్నది సరిగ్గా మూడురోజులు.
మా నాన్న సర్ప్రైజ్ గా అల్లుడికి మా క్రూజ్ టికెట్స్ నాతోనే పంపారు.
కాని అదేమిటో ఇక్కడికి వచ్చాక ప్రేమైక సామ్రాజ్నిలా ఊహించుకున్న నాకు ఈ ప్రపంచం కొత్తగా ఉంది. ఒక్కో మాటకూ వెనక అర్ధాలేవో స్పురిస్తాయి.
“ రా రా ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా” అన్న ఎయిర్ పోర్ట్ లో మాటలు ప్రేమతో అన్నట్టు అనిపించలేదు. ఏదో దొరికావులే నీ సంగతి చూస్తాను అన్నట్టుగా ధ్వనించాయి.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం నాకు చెప్పనైనా చెప్పనిది నేను వచ్చిన నాలుగో రోజున కాబోలు మా ఇన్ లాస్, రిషి అక్క కూడా ఇక్కడికి రాడం. ఉదయమే బయటకు వెళ్తూ పని మీద వెళ్తున్నానన్న మనిషి గంటలో వారిని ఇంటికి తీసుకు రాడం ఎంత పెద్ద షాక్.
“నీకు సర్ప్రైజ్” అన్నాడు.
“ మరీ ఇంత రహస్యమా ?” అంటే
“నీకంటే ఎక్కువ రహస్యాలు దాచుకున్నానా?” అనడం.
అన్యాపదేశంగా ఏదో తెలుసనే అనిపిస్తోంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. మా అమ్మను అడుగుదామన్నా అమ్మతో ఎప్పుడు మాట్లాడినా రిషి ఆ చుట్టు పక్కలే ఉంటాడు. ఈ నెలాఖరుకు కాలేజీలో చేరాలి.
ఇంట్లో ఎవరూ అర్ధం కాలేదు.
రిషితో మాట్లాడే తీరికా దొరకడం లేదు. నిద్ర వచ్చే వరకూ వారితో కూచుంటాడు. విజిట్ కి వచ్చిన వాళ్ళు, కన్న వాళ్ళు , తోడబుట్టిన సోదరి ఏం అడగను?

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!