Sunday, October 2, 2022
Home > కథలు > సజీవం! -స్వాతీ శ్రీపాద

సజీవం! -స్వాతీ శ్రీపాద

లైట్ ఆఫ్ చేసి పడుకున్న మానసకు ఏమీ తోచలేదు…నిద్రవచ్చే సూచనలూ లేవు. పదకొండు దాటింది. అటుమసిలి ఇటు మసిలి లేచి ఏసీ ఆన్ చేసి మళ్ళీ పడుకుని …చలిగా ఉందని కంఫర్టర్ కప్పుకుని … మళ్ళీ వేడిగా అనిపించి కాళ్ళతో దాన్ని తన్నేసి మళ్ళీ లేచి కూచుంది.
లాప్ టాప్ తెరవబుద్ధి కాలేదు. పక్కనే బెడ్ సైడ్ టేబుల్ మీద దొంతరలు దొంతరలుగా పుస్తకాలు… ఇష్టంగా చదివే పుస్తకాలు… కాని మనసు రావడం లేదు.
లేచి పక్క గదిలోకి నడిచింది. అక్కడ గ్లాస్ షెల్ఫ్ మీద అమర్చిన ఆల్బమ్స్ దొంతరలు. అవును, పెళ్ళికి ముందు చదువుకునే రోజుల్లో వచ్చిన బహుమతులతో దిగిన ఫోటోలు, ఎవరెవరో సెలబ్రిటీస్ మెచ్చుకున్న ఘడియలు. అమ్మ నాన్న మధ్య అపురూపంగా మసలిన క్షణాలు.
ఆపైన రాఘవ స్మృతులు. రాఘవతో మొదటిసారి తీసుకున్న సేల్ఫీ. ఎంత సజీవంగా ఎంత సౌకుమార్యంతో ఎంత ఆత్మా విశ్వాసం ఆ కళ్ళలో …
ఆ పైన ఊహ పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకు విదేశాలకు వెళ్ళే వరకూ ప్రతి అపురూప క్షణం దాచుకున్న జ్ఞాపకాలు.
ఇప్పుడిహ ఇలా… ఈ నిశ్శబ్ద మందిరాన….
వద్దన్నా మనసు ఆక్రోశిస్తుంది. ఎందుకు రాఘవ అంత అర్ధంతరంగా వెళ్లిపోవాలి?
చిన్నప్పుడు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నది లేదు, నిజానికి ఒక్కటే కూతురైనా ఇంటినిండా వచ్చే పోయే జనాలే ఎక్కువ. ఎప్పుడూ ఒక కుటుంబం తమతో పాటు ఉండేది.
అమ్మా నాన్న కూడా ఒక్కత్తీ అని అపురూపంగా చూసుకున్నా మంచీ మర్యాదా బంధుమిత్రులను ఎలా గౌరవించాలో బాగానే నేర్పారు.
వారి దృష్టి లో ప్రేమ వేరు క్రమ శిక్షణ వేరు. అందుకే అతి సామాన్యంగానే పెరిగింది.
ఎప్పుడూ తనగదిలో ఇద్దరు చుట్టాల అమ్మాయిలైనా ఉండే వారు. షేరింగ్ అనేది చిన్నప్పటి నుండే అలవాటు చేసారు.
రాఘవకు బాగా నచ్చినదీ అదే. అవును.
రాఘవ పెద్ద కంపెనీలో ఒక మామూలు ఉద్యోగి. సాదాసీదా మనిషి. నలుగురన్నదమ్ముల్లో కడగొట్టు వాడు.
ముగ్గురన్నలూ ఎవరికుటుంబాల్లో వాళ్ళు తలమునకలు అవుతూ ఉంటే అమ్మానాన్నలకు సాయంగా ఉ౦డిపోయాడు రాఘవ. అసలు ఇద్దరి పరిచయమే చిత్రంగా జరిగింది.
ఇంటికి వచ్చిన చుట్టాలతో కలిసి బిగ్ బజార్ షాపింగ్ కి వెళ్ళింది మానస. ఇంట్లోకి కావలసిన చిన్న చిన్న ఆర్గనైజర్లు, మగ్స్ , బాగా పాతవైపోయిన టీ కాచే గిన్నెలు వగైరాలు కొనడానికి వెళ్ళింది. చిన్న నాప్ కిన్స్, కిచెన్ క్లీనర్లు, బెడ్ షీట్స్ లాటివికొన్నాడు రాఘవ. ఇద్దరూ కౌంటర్ దగ్గరకు వచ్చాక కనబడింది ఆ బోర్ద్. పదివేలు ఆపైన కొన్నవారికి ౩౦% డిస్కవుంట్. గబగబా లెక్కేసుకుంటే మానస బిల్ అయిదు వేల ఒకవంద, రాఘవ బిల్ అయిదువేలు. కాస్సేపు తటపటాయించి అడిగింది రాఘవను.
“మీకు అభ్యంతరం లేకపోతె ఒకే బిల్ వేయిద్దామా ? ఇద్దరికీ లాభం”
అతను సరే నన్నాక ఒకే బిల్ వేయడంతో అనుకోకుండా ఇద్దరికీ కలిపి మూడు వేలు కలిసివచ్చాయి. బిల్ మానస పే చేసింది. బయటకు వచ్చాక కింద అయిస్క్రీం పార్లల్ లో కూచుని లెక్కలు సరిచూసుకున్నారు. రాఘవ అయిస్ క్రీం ఆర్డర్ చేసాడు.
అక్కడా ఇద్దరికీ అదృష్టం కలిసి వచ్చింది. ప్రతి వందో కస్టమర్ కీ ఫ్రీ సర్వింగ్. ఆ అదృష్టం వారికి దక్కింది. ఆ సంతోషంలో ఇద్దరూ కలిసి ఒక సేల్ఫీ తీసుకున్నారు. అది ఒక కుటుంబానికి నాంది అని ఇద్దరూ అనుకోలేదు.
పెళ్లిచూపులు చూడటానికి వచ్చినది మానస అని రాఘవకు తెలియదు. వచ్చేది రాఘవ అని మానసకూ తెలియదు. అయితే ఇద్దరూ మాట్లాడుకున్నది ఏమిటనేది ఎవరికీ తెలియదు.
“ఎంత చిత్రం కదా? మళ్ళీ రెండేళ్ళ తరువాత మనం ఇలా?”
“‘నిజమే”
“ మానసా మీరెంత ఒద్దికగా ఉంటారో ఆరోజున కలిసి బిల్ చేయించిన రోజునే తెలిసింది. మీకు చెప్పవలసిన అవసరం లేదు కాని మా అమ్మా నాన్న నాతోనే ఉంటారు. అన్నయ్యలు విదేశాలు వదిలి రారు వీళ్ళు వెళ్లరు. అందువల్ల ఏవైనా పొరపొచ్చాలొచ్చినా సర్దుకు పోవాలి. ఇదే మాట వారికీ చెప్పాను. ఇంటికి వచ్చే అమ్మాయి ఆపైన మన ఇంటి మనిషే.కొచం సర్దుకు పోవాలని…”
“ఆఫ్ కోర్స్, నలుగురున్నాక సర్దుబాటు తప్పదు. కాని నేనూ ఒక మాట చెప్పాలి. మా అమ్మానాన్నకు నేను ఒక్కదాన్నే. ఇప్పటికి వాళ్ళను వాళ్ళు చూసుకున్నా ఎప్పటికైనా వారి బాధ్యతా నాదే…”
“ఆ మాట వేరుగా చెప్పాలా ? పోనీ ఇకపై నేను వారికొడుకును, నువ్వు మా వాళ్లకు కూతురివి సరేనా?”
అలా కుదిరిన ఒప్పందం అలాగే కొనసాగింది. చివరిచివర్లో అందరూ కలిసే ఉండేవారు.
అందరి గారాబంలో ఊహ అపురూపంగా పెరిగింది. మెడిసిన్ చదివి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. పెళ్లి చేసుకున్నదీ అమెరికన్ నే. ఇహ వాళ్ళు ఇండియా వస్తారన్న ఆశలేదు.
ఉన్నట్టుండి రాఘవ హఠాత్తుగా ఆయాసం అన్న అరగంటలోపే పెద్ద షాక్. ఆర్నెల్ల క్రితమే నెల తేడాతో మానస తలిదండ్రులు వదిలి వెళ్ళిపోయారు.
ఇపుడిలా….
అబ్బో ఇప్పుడా అది జరిగి దాదాపు ఎనిమిదేళ్ళు గడచిపోయింది. కాని ఇంకా ఆ గాయం నిన్నమొన్న తగిలినట్టుగానే బాధ.
ఎనిమిదేళ్ళు! ఎన్ని రోజులు? ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు!
సమయం మంచం పట్టినట్టు ఘడియ గడవటమే కష్టంగా ఉండేది. ఉ౦దేమిటి ఇప్పటికీ అంతే. ఎన్ని నిమిషాలు గడిస్తే ఒక గంట అవాలి. అలాటిది గంటలు దినాలు , వారాలు, నెలలు.
అవును ఏ పుస్తకం చదివినా ప్రతిబాదా తనదిగానే తోచేది. ప్రతి ఒంటరితనమూ తనకోసమే రాసినట్టు అనిపించేది. చదవాలన్న ఆసక్తి చచ్చి పోయింది.
ఏ సినిమా చూసినా అంటే, అదే ఫీలింగ్.
అక్కడికీ ఏడాదికి ఆరునెలలు కూతురి దగ్గరవున్నా అక్కడ మరింత ఒంటరితనం అనిపించేది. ఎవరిల్లు వాకిలి పిల్లలు వారికి, మరి తనకేం మిగిలింది గెస్ట్ రూమ్ … వెళ్ళాలన్న ఆసక్తీ తగ్గిపోయింది.
ఎన్నాళ్ళిలా ఎప్పుడు చస్తామా అని ఎదురు చూస్తూ బ్రతకడం?
గుళ్ళూ గోపురాలపట్ల చిన్నప్పటినుండీ ఆసక్తి లేదు. పూజారుల ప్రవర్తన అస్సలు నచ్చదు.
మనిషి బలహీనతల మీద ఆడుకునే ఆటలు అవసరమా అనిపిస్తుంది.
రెండేళ్ళుగా కూతురి దగ్గరకు వెళ్ళడం మానుకుంది.
కూతురే పిల్లలను పట్టుకుని ఏడాదికోసారి వస్తుంది, ఒక మూడు వారాలు. ఆ మూడు వారాలు పిల్లలకు ఇండియా చూపించటం షాపింగ్ లు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవే సరిపోతాయి. ఆ ఇరవైరోజులూ రోలర్ కోస్టర్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మర్నాటి నుండీ మామూలే.
పోనీ ఏదైనా వాలంటరీ వర్క్ చేద్దామన్నా ఎక్కడ చూసిన మోసం ఎక్స్ ప్లాయిటేషన్… మనిషి మీదే నమ్మకం లేకుండా పోతోంది.
సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తితో సాహితీ సభలకు వెళ్ళింది. అక్కడా అదే భాగోతం. కులాల వెంపర్లాట, అవార్డుల గోల, అవన్నీ పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు.
ఎంతో గొప్ప రచయిత్రులనుకున్నవారి అసలు స్వరూపం కనిపించి వెగటు అనిపిచి౦ది.
ఏమీ అర్ధం కాని అయోమయంలో మళ్ళీ మొదటికే వచ్చినట్టుంది స్థితి.
ఈ ఆధునిక యుగాన మనిషీ నీ చోటెక్కడ? అని అడగాలనిపి౦చి౦ది.
ఆల్బమ్స్ మూసి లైటార్పి ముందుగది లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది.
అన్ని చానెల్స్ ఒకసారి తిప్పి మళ్ళీ ఏం చూడాలనిపి౦చక టీవీ ఆఫ్ చేసి లోనికి వెళ్ళింది. బెడ్ రూమ్ లొ ఎదురుగా నులువెత్తు ఫోటో రాఘవది.
అది ఫోటో లా అనిపించదు మానసకు ఒక సజీవ మూర్తి లాగే కనిపిస్తుంది.
ఒక్కసారి ఆ ఫోటో ఎదపై తలవాల్చి కళ్ళు మూసుకుంటే ఎంతో నిశ్చింత. ఓ అయిదు నిమిషాలు అలాగే ఆగి లైతార్పి పడుకుంది మానస.

******************************

నిద్రలేస్తూనే అతని జ్ఞాపకం. ఎప్పుడు లేపలన్నా ఒక్కసారీ గట్టిగా కుదిపి లేపినది ఎప్పుడూ లేదు. అతని మెత్తని ముని వేళ్ళ కదలిక పెదవులపై సోకగానే మెలుకువ వచ్చేది.
ఎప్పుడు నిద్రలేచినా పెదవులపై అతని ముని వేళ్ళ స్పర్శ సజీవంగా ఉన్నట్టే అనిపిస్తుంది.
లేచి బ్రష్ చేసుకుని ఫిల్టర్ లొ డికాషన్ వేసి పాలు స్టౌ మీద సిమ్ లొ వుంచి పేపర్ అందుకుంది.
ఇంతలో పక్క అపార్ట్ మెంట్ అపర్ణ తలుపు తట్టి “ఆంటీ పనిమనిషి వచ్చిందా?” అని అడిగింది.
పనిమనిషి సుజాత ఇక్కడపనిచేసి వెళ్లి పక్కింట్లో రోజంతా పాపాయిని చూస్తుంది.
రెండు రోజులుగా రాలేదు.
ఏమైనా అంటే ఉద్యోగులకు సెలవలివ్వరా ? అలాగే మాకూ కావాలి అంటుంది.
“లేదమ్మా … ఇవ్వాళా వస్తానంది మరి ఇంకారాలేదు.”
“ఎప్పుడూ అంతే కదా ఆంటీ రెండు రోజులు ఇద్దరం ఒక్కోరోజు వంతున సెలవుపెట్టి పిల్లను చూసుకున్నాం. ఈ రోజు తప్పదని రవి పొద్దున్నే వెళ్ళాడు. నాకూ ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళాక తప్పదు. మళ్ళీ ఎవరినో బ్రతిమాలుకోవాలి.”
ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఒక స్థాయిలో బ్రతకలేని రోజులు. పిల్లలను చూడటానికి అత్తగారు ముందే చెప్పిందట నా వల్లకాడు మీ తిప్పలు మీరు పడండని. ఇహా అపర్ణ వెనకాల ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారిని వదిలి తల్లి రాలేదు.
పాప మరీ చిన్నది కాదుగా రెండేళ్ళు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, అయినా తటపటాయిస్తూనే
“పోనీ ఈ రోజుకి ఇక్కడు౦చి వెళ్ళు అపర్ణా” అంది.
“మిమ్మల్ని ఇబ్బందిపెడుతు౦దేమో ఆంటీ” అంది కాని ఆ పిల్ల మొహం విప్పారింది.
వెళుతూ వెళుతూ పిల్ల షెడ్యూల్ రాసిన కాగితం ఒక బాగ్ ఇచ్చి వెళ్ళింది.
మానస మళ్ళీ నలభై ఎల్లా వెనక్కు వెళ్ళిపోయింది.
పాపాయి మాటలు , ఆటలు గంటన్నర తినిపించడం మధ్యాన్నం నిద్రపుచ్చాక గాని స్నానం చేసే తీరిక దొరకలేదు.
స్నానం చేసి ఆబగా అన్నం ముద్దా నోట్లో పెట్టుకున్నాక గాని తెలిసి రాలేదు. ఎన్నేళ్ళకు ఇలా ఆకలివేసిమ్దన్న సంగతి.
క్షణం నడుం వాల్చుదామనుకు౦దో లేదో లేచి కూచుంది చిన్నారి.
ఇహ దానికి పాలు తాగించడం ఒక గంట . ఆ గంట సేపట్లో ఎన్ని కధలు ఎన్ని పాటలు
చివరికి రంగులపేర్లు వారాల పేర్లు ఆ పైన నెలలు… అయిడున్నరయాక పిల్లకు స్పాంజ్ బాట్ చేయించి వాళ్ళమ్మ పెట్టిన మరో డ్రెస్ వేసింది. దానితో కాస్సేపు హైడ్ అండ్ సీక్ ఆట.
అరుదాటాక వచ్చింది అపర్ణ.
అప్పుడే విప్పిన మల్లెమొగ్గలా ఉన్న కూతురిని చూసుకుని మురిసిపోతూనే “ఇబ్బంది పెట్టిందా ఆంటీ రాలుగాయి పిల్ల “ అంటూ తను తెచ్చిన మామిడి పళ్ళు మానస చేతికిచ్చింది.
ఏడింటికి లేచి మొహం కడుక్కుని కాస్సేపు పక్కనే ఉన్న పార్క్ లొ వాకింగ్ చేసి ఇంటికి వచ్చిన మానసకు మళ్ళీ చిన్నతనం గుర్తుకు వచ్చింది.
పిల్లలు తిని పడుకున్నాక ఒక్క క్షణం టీవీ చూసే ఓపిక ఉండేది కాదు.
ఈరోజు రాత్రి పూట ఆకలనే మాటే ఎరగదు. అలాటిది…
లేచి పిడికెడు ఉప్మా చేసుకుంది.
తొమ్మిదిన్నర కాకముందే కునికి పాట్లు వస్తుంటే లేచి వెళ్లి పడుకుంది.

*****************

నెల తరువాత ఆఫ్లాట్ లొ అత్యాధునిక సౌకర్యాలతో వెలసింది విరిమల్లి బేబీ కేర్ సెంటర్. ట్రైనింగ్ అయిన నర్స్, ఇద్దరు ఆయాలు, ఇద్దరు ప్రేస్కూల్ ట్రైనింగ్ అయిన బేబీ సిట్టర్స్. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో యాభై ఫ్లాట్ లకు పెద్దదిక్కులా ఆరంభమయింది.
ముందుగా కేక్ కట్ చేసినది అపర్ణ కూతురు.
“బ్రతికున్నందుకు బ్రతకడం కాదు ప్రతినిమిషం సజీవంగా బతకాలి” మరోసారి అనుకుంది మానస.

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!