Wednesday, January 26, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 13 వ వారం ) – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 13 వ వారం ) – శ్రీ విజేత

ఫిబ్రవరి 23, రాత్రి : 10.35

ప్రేమా! పిరికివాళ్లకు ఏదీ సాధ్యం కాదు, ఏమీ అందదు. ఈ స్వార్ధపు మనుష్యులతో ఏమీ కాదు. ఈనాడు నీ కోసం ఆలోచించే నీ వారు అనేవారు ఉన్నారా? ఉంటే ఏమి చేస్తారు? ఏమీ చెయ్యలేరు. నీ పెళ్లి చేసి నీ జీవితాన్ని నరకం చేశారు. ఈర్ష్య పరులైన కాకుల్లా అరిచేదే ఈ లోకం. నిన్ను, నీ మనసును గాయం చేస్తుంటారు మాటలు, చేతలతో. నువ్వు విసిగిపోయి చనిపోతే ఏం చేస్తారు వీళ్ళు? రెండు కన్నీటిబొట్లు రాల్చి ఊరుకుంటారేమో ! నువ్వు లేనపుడు ఈ గుండెలోని బాధను ఎవరు తీరుస్తారు? ప్రేమా ! నువ్వు నా ప్రాణం! దేవుడితో పోరాడి అయినా నిన్ను నేను కాపాడుకుంటాను.మనం వేరువేరు కులములలో పుట్టడం తప్పా? ప్రేమించుకోవడం తప్పా? ఎవరి పరువు ప్రతిష్టల కోసం నిన్ను నీవు బలి చేసుకుంటావు? నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోయిననాడు నాడు ఏమీ చెయ్యలేని అశక్తున్ని. నువ్వు చనిపోతానని తెలుసుకొని ఎంతో తల్లడిల్లిపోయాను. నువ్వు మనసు మార్చుకొని వెళ్ళిపోయి బతుకు వెల్లదీస్తాను అని అనుకొన్నపుడు, బతుకనీ ఎక్కడైతేమిలే అని సరిపెట్టుకొని మౌనంగా ఉన్నాను. నాలుగు సంవత్సరాలు గడిచిపొయినాయి. మళ్ళీ ఈనాడు నీవు ఒంటరిగానే విసిగిపోయి తల్లడిల్లిపోతుంటే, అదృష్టవశాత్తు తెలుసుకొని, ఆ దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. నీ పై జాలితో కాదు, నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం, ప్రేమ, అనురాగం, ఆత్మీయత, అభిమానం అన్నీను, నిన్ను మనసారా ప్రేమించాను కనుక. ఓ! మై స్వీట్ డియర్ నీ కోసం నేనున్నాను.

ఫిబ్రవరి 24, రాత్రి : 9.10.

ప్రేమా ! జీవితంలో నేను చాలా విసిగిపోయాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో అడ్డంకులను దాటి చదువును పూర్తి చేసుకొని ఇక్కడి దాకా వచ్చాను. ఈనాడు ఆర్థికంగా నా కాళ్ళపై నేను నిలబడ గలిగాను.నాపై నన్ను కష్టపడి పెంచిన మా అమ్మకు తప్పా ఎవరికి హక్కు లేదు. నా ఇష్టాన్ని నా కోసం మా అమ్మ అంగీకరిస్తుందని అనుకుంటున్నాను. జీవితంలో కోరుకున్న విలువల కోసం నిజాయితీగా బతకడం నాకు నచ్చుతుంది. నిన్ను కాదని స్వార్ధపరుడిగా బతికే శక్తి నాకు లేదు. జీవితంలో నువ్వు చాలా విసిగిపోయావు. ఇంకా జీవితంలో ఎప్పుడు తెలుసుకుంటావు? ఈ ఇరువయో శతాబ్దంలో కూడా ఇంకా పిరికివాళ్ళ లాగా ఆలోచించడమా కులం అంటూ. నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు. నాకు దూరంగా ఉండి. నా గురించి ఏమి తెలుసుకోవాలి అన్నా మీ అన్నయ్యను అడుగు చెపుతాడు. ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మీయుడిగా నాకు మీ అన్నయ్యకు మించిన వాళ్ళు ఎవరు లేరు. నా జీవితంలోకి రా, వెళ్ళిపోయి కలిసి బతుకుదాం. ఈ మూర్ఖపు మనుష్యులకు బుద్ధి చెప్పినట్లుగా.

ఫిబ్రవరి 25, రాత్రి : 10.25 .

ప్రేమా ! ఏమి వ్రాయాలి నీ కోసం ! జీవితంలో ఏమి జరుగనుందో అది జరుగక మానదు. నా ఆలోచనలు అన్నీ నీ గురించే . ఒక అందాలరాశిగా పుట్టి, ప్రేమించి ఎందుకు దూరమైపోయావు.? ఇంకా ఒంటరిగా ఎంతకాలం తల్లడిల్లిపోతావు? ఇంకా నన్ను ఒంటరిగా ఎవరి కోసం బతుకమంటావు ? నీ కోసం ఎవరూ లేరని ఎన్నోసార్లు చనిపోదామనుకున్నావు కదా ! అంత పని ఎన్నడూ చేయకు. నీ కోసం నేనున్నాను. మళ్ళీ పుట్టం కదా మనం, కలిసి బతుకుదాం. ఏమి చెయ్యాలన్నా, ఏమి సాధించాలన్నా ప్రాణాలతో బతికి ఉన్నపుడే కదా ! మన అదృష్టం ఏంటో కదా అని ఎదురు చూస్తున్నాను.

ఫిబ్రవరి 26, రాత్రి : 9.15

ప్రేమా ! ఏమి చెయ్యాలి నేను ! నేను మౌనంగా ఉన్నా, నా చుట్టు నాపై చాలా పెళ్లి సంబంధాల

ఒత్తిడులు ఉన్నాయి. ఈ సార్ధపు ప్రపంచంలో బతుకడం కష్టమే! ఇక నీ కోసం నా కోసం ఆ దేవుడున్నాడు. నీ తర్వాతనే నీను ఎవ్వరి గురించి ఆలోచించడమైనా . నువ్వేమి చెపుతావో, నన్నేమి కమ్మంటావో ! అంతా నీ ఇష్టం పైనే ఆదారపడి ఉంది. ఇక బగవంతుడి పై భారం వేశాను కూడా మన ఇద్దరినీ కాపాడుకొమ్మని! ప్రేమా నువ్వు ఒంటరిదానిగా బతికి నన్నుఒంటరి వాణ్ని చెయ్యకు! ఇక ఎమైయినా పరువాలేదు. నీ కోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. ప్రేమా ! ఆలోచనలతో తల పగిలిపోతుంది.

ఫిబ్రవరి 27, రాత్రి : 8.15

ప్రేమా ! నువ్వు నాకు జనవరి ఒకటి నాడు కనిపించావు. ఒక యంత్రములా కాలాన్ని గడిపాను. నేనెక్కడున్నా నా మనసంతా నీ చెంతనే. నాకు ఏమి మిగిల్చుతావు? నీ గురించి ఎన్నో బంగారు కలలు కన్నాను, నీ సన్నిధిలో బాధను, వేదనను మరచిపోవాలని. ప్రేమా ! నువ్వు నాకు ఏమీ కావా ? జీవితంలో అనురాగం, అనుబంధంలతో నీ కన్నుల వెన్నెల్లో కరిగిపోవాలని నాకు ఆశ. కాలమంతా పరీక్షలా ఉంది. అంతా మౌనమే నీ నుండి. ఏమైనా కోపమా నా పైన. నిన్ను చూస్తూ చూస్తూ ఎలా వదిలిపెట్టుకోవాలి? నీ కోసం ఎంత కాలమైనా నిరీక్షణ చేస్తాను. నీ లాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది! అంతా నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది.

ఫిబ్రవరి 28, రాత్రి : 7.10.

ప్రేమా! నువ్వు నన్ను పూర్తిగా అర్ధం చేసుకో ! నేను వ్రాసిన నవల, నా డైరీ, లేఖ చదువుకొని , సీరియస్ గా ఆలోచించి నువ్వు నాకు నీ నిర్ణయం చెప్పగలవు. ఇప్పటివరకు నేను నీకోసం ఉన్నాను, ఇంకెంత కాలమైనా నేను నీ కోసం వేచి చూస్తాను. నీ లాంటి అందమైన,తెలివైన, చురుకైన అమ్మాయి నాకు ఇలలో ఎక్కడ వెతికినా దొరుకదు. నువ్వు నా జీవితంలోకి వస్తే నేను అదృష్టవంతున్నే!

ఫిబ్రవరి 29, ఉదయం 3.10.

ప్రేమా ! ఎన్నడు అర్ధం చేసుకుంటావు నన్ను? నువ్వంటే నాకు ప్రాణమని, నీ గురించి ఆలోచిస్తుంటే నా కన్నుల్లోంచి కన్నీళ్లు టపటప రాలుతుంటాయని నీ కెన్నడు తెలుస్తుంది.? మీ అమ్మానాన్నలు నిన్ను కనిపెంచనూవచ్చు, లోకం దృష్టిలో మొగుడు తాళి కట్టనూవచ్చు.! అసలు వీళ్ళు నీ గురించి ఏమైనా ఆలోచిస్తారా? నీకు వీళ్ళే ఎక్కువ, నేను ఏమీ కానా? దురదృష్టవశాత్తు నువ్వు ఈ లోకంలోంచే లేకుండాపోయినపుడు నేను బతగ్గలనా? నువ్వు నాకోసమైనా బతుకాలి! నీ వారు అనుకుంటే నిను ఒంటరి చేస్తారు. నా మాట విని, నా కోసం, మనిద్దరి కోసం ఆలోచించవా! నువ్వు నా ప్రాణం, ప్రాణం అని రక్తంతో ఈ తెల్ల కాగితంపై రాసివ్వమంటావా ! నువ్వు నా జీవితంలోకి వస్తే పోగొట్టుకున్న నా అదృష్టాన్ని తిరిగి పొందినానని తృప్తిని పొందుతాను. ప్రేమించిన నీ కన్నా నాకు ఈ ప్రపంచంలో వేరే గొప్ప ఎవరు లేరు! నువ్వు నాకు కావాలి! నా గుండెల్లో నిన్ను పదిలంగా దాచుకుంటాను! ఇక నువ్వే చెప్పాలి! ఈ తెల్ల కాగితాలు ఎంత ఫేర్ గా ఉన్నాయో, నా హృదయం అంత నిర్మలంగా ఉంది! ఇంతగా నా . గురించి రాస్తున్నాడని నీకు కోపం వచ్చినా, నన్ను నువ్వు అర్ధం చేసుకొని క్షమించక తప్పదు. ఇక నువ్వు చెప్పవలసిన విషయాలు నాకు తెలియ చేస్తావని ఎదురు చూస్తాను.

ఒకరి పరువు కోసం నిన్ను నువ్వు బలి చేసుకుంటావా? నాకు తెలుసు, కులం, పరువు, గౌరవం, ! ఇంతేగా ! నువ్వు భయపడుతున్నావు అంటాను! అయితే ఇందుకు సమాధానంగా నేను ఎంత గొప్పవాణ్ణి కావాలో చెప్పు! నీ కోసం ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ చేయాల్లో చెప్పు! నా బాధను, దిగులును, వేదనను నువ్వు అర్ధం చేసుకుంటావా! ఏనాడైనా విసిగిపోయి నువ్వు చనిపోతే ! ఆనాడు కులం, పరువు, ప్రతిష్ట, గౌరవం ఏ గంగలో కలిసిపోతాయి ! నీ ప్రాణానికన్న ఎక్కువనా ఇవన్ని!

ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా తప్పు కాదు ఇద్దరు ప్రేమికులు కలిసి బతుకడం! ఎలా మరచిపోమ్మంటావు నిన్ను! నా అణువణువులో నిండిపోయావు! తెలిసికూడా, నన్ను అర్ధం చేసుకొని కూడా నీ నుండి నేను కోరినట్లు సమాధానం రాకపోతే, ఇక మనం ఒకరి ముఖం ఒకరు చూసుకునే రోజెందుకు?. ఆనాడు సృష్టిలో ఉన్నది ప్రేమ కాదని, కేవలం కామం అని, ఆడదాన్ని మొగవాడు, మగవాన్ని ఆడది అనుభవించడం అని, ఆ పనికి కూడా నీ లాంటి , నా లాంటి పిరికివాళ్ళు పనికిరారు అని, మోసగాళ్ళు, మోసగత్తెలు పనికివస్తారు అని చెపుతాను !

నువ్వు కాదన్ననాడు, నేను ఉహించుకున్న’ ప్రేమ’ గొప్పదని, అలాంటి దేవత కోసం మరో జన్మ ఎత్తుతాను. అంతవరకూ సంతృప్తి ఉండదు

ప్రేమతో ,- కృష్ణ.

అతని లేఖలు చదువుకుంటుంటే టప్పుటప్పున కన్నీటిబొట్లు రాలినాయి. ఏకదాటిగా! ఎవరీయన?, ఇంతటి ప్రేమ ఎందుకు ఏర్పడింది నాపై ? ఇక నీనేమి చేయాలి? ఇలాంటి విషయం ఒకటి వస్తుందని నేను కలలో కూడా ఉహించలేదు! ఇప్పుడెట్లా? అతని.కి నేనేమి సమాధానమీయాలి? అతను కోరినట్లు నేను అతనితో .వెళ్లిపోగలనా? .అంతటి శక్తి నిజంగా నాకు ఉందా ? నేను అలా అతనితో వెళ్ళిపోతే లోకం నన్ను లేచిపోయింది అంటుంది! ఆ అపవాదు నేను వీళ్ళకు మిగిల్చిపోగలనా? పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవం నేను కాపాడాలి కదా ! కులం, పరువు, కుటుంభం, జీవితం గురించి ఆలోచించాలి కదా అని భయమేసింది ! ఇలా నేను ఆలోచిస్తే అతని దృష్టిలో స్వార్ధపరురాలిని కావచ్చు. ప్రేమ ప్రేమను ఇవ్వాలి, కోరాలి కదా ! నేను స్వార్ధంగా ఆలోచిస్తున్నానా అని అనిపించింది. నిజంగా నేను ఏమి చేయాలో పాలుపోలేదు ఆనాడు. ఒక వైపు సమాజం, పుట్టిల్లు, మెట్టినిల్లు వారి గౌరవం, పరువు, ప్రతిష్ట, ఇంకో వైపు అతని ప్రేమ, అనురాగం, ఇష్టం, త్యాగం. నేను ఎవరివైపు మొగ్గుచూపాలో అర్ధం కాకుండాపోయింది. జీవితం ఎప్పుడూ సమస్యనే అనిపించింది ! ఏదీ ఊర్కే అందదు కావచ్చు అనిపించింది. ఏదైనా త్యాగమేనా జీవితంలో అనిపించింది. ఎవరూ నా గురించి ఆలోచించరనుకున్న నాకు అతడు చేయి అందిస్తున్నాడు తన జీవితంలోకి రమ్మని, కాని నేను పోగలనా ? అంత ఈజీనా జీవితం అనిపించింది. జీవితమనే చౌరస్తాలో ఒకవైపు సమాజం, నావాళ్ళు, ఇంకోవైపు అతను! ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఈ జీవిత చదరంగంలో అనిపించింది. ఇన్ని సంవత్సరాలు బాధపడ్డానే, నా సమస్యకు పరిష్కారం ఎవరిస్తారు అని ఆలోచించానే, మరి పరిష్కారం దొరుకుతుందని తెలిసినా నేను ఏమి చేస్తున్నాను, పిరికిగా ఆలోచిస్తున్నాను ఏమిటీ అని అనిపించింది. నిజంగా నేను పిరికిదాన్నా? నాకు అతనితో వెళ్ళిపోయే శక్తి లేదా? అతనిది ప్రేమనే, మరి నాది ప్రేమ కాదా అనిపించింది! నాపై అతనికి గల నిర్మలమైన ప్రేమకు, మనసుకు నేనేమి సమాధానమివ్వాలి. నేనుట్టి స్వార్ధపరురాలిని అనిపించింది. జీవితములో వెయ్యి పనికిరాని మాటలు మాట్లాడుతాం కావచ్చు, కాని అసలైన సందర్భం వచ్చినపుడు పిరికివాల్లలాగా జారిపోతామేమో జీవితంలో ! అక్కడే మనిషి యొక్క నిజాయితీ బయట పడుతుందేమో ! నిజంగా అతను అన్నట్లు పిరికివాళ్ళు ప్రేమించడానికి పనికిరారా, అర్హులు కాదు కదా అనిపించింది! నేను కాదంటే అతడు ఎంత విలవిలలాడిపోతాడో కదా అనిపించింది. నాకు అతను కోరినట్లు సమాధానం ఇచ్చే శక్తి బహుశా లేదేమో అనిపించింది! కన్నుల్లో ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహించాయి,,గుండెల్లో అగ్ని పర్వతాలు పేలిపోయాయి. నిజంగా నేను ఏమి సమాధానం ఈయాలి అతనికి? ప్రేమా! నువ్వెప్పుడూ త్యాగాన్నే చూపెడుతుంటావా అని అనిపించింది? ఎవర్ని త్యాగం చెయ్యాలి నేను? అతన్నా, నా వాళ్లనా? రాత్రి పదకొండు గంటలు అయ్యింది అప్పుడు, అమ్మ నిద్రపోతుంది ఇవన్ని ఏమి తెలియకుండా!
( మిగితా వచ్చేవారం…)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!