Sunday, October 2, 2022
Home > కథలు > మాకూ మనసుందంటే…! -వి. సునంద (యదార్ధ సంఘటన)

మాకూ మనసుందంటే…! -వి. సునంద (యదార్ధ సంఘటన)

అబ్బబ్బా! ఏం ప్రయాణమో ఏమో!

ఒంట్లో ఓపిక లేదు రాను తమ్ముడూ’ అంటే అస్సలు వినిపించుకోలేదు. ఙిల్లా కవులందరికీ అడ్మిన్ వి. “నీవు రాకపోతే ఎలాగక్కయ్యా?” అంటే తప్పని సరై బయలు దేరింది..

‘ముందుగ మురిసినమ్మపండుగ గుర్తెరగలేదన్నట్టు’ అందరినీ. ఉత్సాహ పరిచింది తనే.. కానీ ఈ జలుబు హఠాత్తుగా ఒంట్లో చేరె.. “పడిశం పదిరోగాల పెట్టని” మనిషిని మనిషిగా వుండనియ్యదయ్యె.

ఇప్పుడిప్పుడే బాల కవులుగా ఉనికిని చాటుకుంటున్న పిల్లలకు మహా ఉబలాటంగా వుంది.. “మేడమ్ మేం వస్తాం. ప్రపంచ రికార్డ్ కవి సమ్మేళనం అంటున్నారుగా ఎలా జరుపుతారో చూస్తాం”.. అంటుంటే… “నిజమేరా మీ ఉత్సాహం బాగానే వుందిగని ప్రయాణం ప్రయాసతో కూడుకుందిరా నాన్నా” అనగానే వాళ్ళ ముఖాల్లో నిరుత్సాహం.

“మేడమ్ అప్పుడు మన గోపి, సంతోష్, రమేష్ గాళ్ళను తెలుగు మహా సభలకు తీసుకు పొయ్యారు కదా.. వాళ్ళైతే ఇప్పటికీ మాముందు గొప్పగా చెప్పుకుంటారు మేడమ్”

వాళ్ళ ఉత్సాహం, రావాలనే కోరిక చూసి కాదనలేక పోయింది సుప్రజ.

“మరి మీ అమ్మావాళ్ళు పంపివ్వరేమోరా” నోట్లోంచి మాట పూర్తిగా రాకముందే “ఎప్పుడో ఒప్పించాం మేడమ్. ఇగో డబ్బులు కూడా ఇచ్చిండ్రు మా అమ్మోళ్ళు” కంపాస్ బాక్స్ ల్లో దాచుకున్న డబ్బులు చూపించారు. ముందు రోజు రెండవ శనివారం కదరా మిమ్మల్ని నాతో తీసుకురాలేను కదా! అనగానే “మా నాన్న మా అందరిని మీ ఇంట్లో దింపుతానన్నడు మేడమ్” అన్న త్రివేణి మాటలకు ఇక తను ఒప్పుకోక తప్పలేదు. వాళ్ళను తీసికెళ్ళాలని తనకూ వుంది.. కానీ ఈ జలుబే మనిషిని అల్లడం తల్లడం చేస్తున్నది.

పన్నెండు మంది పిల్లలు. ఒక రోజు ముందే సుప్రజ మేడమ్ ఇంటికి వచ్చారు.. వాళ్ళను చూడగానే ఓ ప్రక్క సంతోషం మరో ప్రక్క భయం ఆవరించాయి సుప్రజను. తల్లిదండ్రులకు తనమీద ఇంత నమ్మకమున్నందుకు చాలా ఆనందం అనిపించింది. మారు మూల పల్లెటూరయినా ఆడపిల్లలను కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఇంతదూర ప్రయాణానికి పంపడం వాళ్ళలో వస్తున్న మంచి మార్పుకు శ్రీకారం అనిపించింది.

వాళ్ళంతా తన చుట్టే తిరుగుతూ మీకేం ఇబ్బంది కలిగించం అంటూ చేతులోని పని లాక్కొని చేయడం. అయ్యో మిమ్మల్ని చూస్తుంటే బాధగుంది తలత్తొనా మేడమ్. “మా అమ్మకు ఇంట్లో పనులు చేస్తం మేడమ్..” అంటూ ఇంటినిండా కలయదిరుగుతూ సహాయం చేస్తుంటే వాళ్ళ స్వచ్ఛమైన మనసులను చూసి… వద్దనక పోవడమే మంచిదయ్యిందనుకుంది.

ఎందుకైనా మంచిదని డ్రైవర్ బుచ్చిబాబును కూడా తీసుకొస్తున్నది. పిల్లల అవసరాలు చూడటానికి…

అక్కా! పిల్లలతో ప్రయాణం అంటూ
తమ్ముడు శంకర్ రెడ్డి దగ్గరుండి చేయించిన సీట్ల రిజర్వేషన్ మంచిదయ్యింది.
పొద్దున్నే 3 గంటలకు లేచి చెప్పకుండానే 5 గంటల వరకల్లా చకచకా తయారయ్యారు.
ఒక బోగీ నిండా సందడే సందడి పిల్లలు కవి మిత్రులు తమ్ముళ్ళతో….
ఈ పాడు జలుబు ఇంకా తగ్గక ఇంత ఇబ్బంది పెడుతుందేమని.. కోపంగా వుంది సుప్రజకు.. మందులు వాడినా వారం రోజులుంటుందట వాడక పోతే ఏడు రోజులకు తగ్గుతుందట. అనుకోగానే నవ్వొచ్చింది…

వచ్చిన పిల్లల్లో ఇంతవరకు రైలెక్కని వాళ్ళకు సరదాగా వుంది… కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పోతున్న చెట్టూ పుట్టలను చూస్తూ, మధ్య మధ్య మనమే కవిత చదువుదాం అని గుర్తు చేసుకుంటూ, ఆకలి మరిచి ఆనంద ప్రపంచంలో మునిగి పోయారు. బుచ్చి బాబును పిలిచి అందరికీ పులిహోర పండ్లు ఇప్పించి, తనో ప్యాకెట్ తీసుకుంది…

రెండు మూడు గంటల తర్వాత ఇంకెప్పుడొస్తుందా అని, నెమ్మదిగా సీట్లనుండి లేచి అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టారు. తమ్ముడు లెనిన్ పిల్లలూ బోర్ కొడుతుందా ఇక్కడే కవి సమ్మేళం ఏర్పాటు చేసుకుందామా ‘ నవ్వుతూ అనగానే, అమ్మాయిలు కొంచెం సిగ్గుపడుతూ సుప్రజ వైపు చూశారు.”ఇది రిహార్సల్ అనుకోండి హాయిగా చదివేయండి “అనగానే మేం చదువుతం మేడం” ముందుకొచ్చారు సంతోష్, గోపీ.

ఇంతలో బోగీలో కలకలం చప్పట్లు. “ఏయ్! డబ్బులు తియ్, అంటూ కొందరి బుగ్గలను పొడుస్తూ తీస్తవా, తీయవా, అంటూ పిచ్చి మాటలు, చేతలతో బోగీలో కొందరి దగ్గరికి వెళ్ళి అసహ్యంగా ప్రవర్తిస్తున్న హిజ్రాను చూడగానే బిక్కచచ్చిపోయారు పిల్లలు. ఆ వ్యక్తిని భయంతో ఆసక్తితో చూస్తుంటే మరికొంచెం రెచ్చిపోతూ బుచ్చిబాబు దగ్గరకు వచ్చాడు. [వచ్చింది].

డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని బుచ్చిబాబును మందలిస్తూ ‘ఎంత కావాలో ఇవ్వు బాబు’…. సుప్రజ అనగానే
“ఎందుకివ్వాలి, ఆ దబాయింపు ఏమిటన్నట్టు” అసహనంగా చూస్తున్న బుచ్చిబాబును….
“వాళ్ళ బాధ నాకు తెలుసు. వాళ్ళెందుకిలా తయారయ్యారో నాకు తెలుసు, ముందు నువ్వు తీసి ఎంత కావాలో ఇవ్వు.. లేదంటే నేనిస్తా” అని బ్యాగ్ జిప్ తీయ బోయింది సువ్రజ.

మొహం చిన్నబుచ్చుకొని ఇరవై రూపాయల నోటు తీసాడు.. అది చూసి “నాకు పదిరూపాయలు సాల్ ఇగ్గో నీ పదిరూపాయలు జాకెట్లోంచి తీసి ఇచ్చిందా హిజ్రా..”

మనిషి మాట కరకుగా వున్నా, ఆమెలోని ఖచ్చితత్వం చూసి, మాట కలిపి తను రాసిన కవిత వినిపించాలనిపించింది సుప్రజకు.

వెంటనే ‘ఏమ్మా. మీ గురించి ఓ కవిత రాశాను వింటావా’ అంది.
సుప్రజను ఎగాదిగా చూసి “ఏం రాసినవ్.. ఏంది మా గురించి నువ్ రాసింది” కొంచెం ఎగతాళిగా అంటున్న హిజ్రా ముఖంలోకి తదేకంగా చూస్తూ ‘మీ మనసేంటో నాకు తెలుసమ్మా. నాకూ నీ లాంటి ఓ ఫ్రెండ్ వుండేది నాతో బాగా మాట్లేడేది, ఎన్నో విషయాలు చెప్పేది’ అనగానే ఆ హిజ్రా మాటల్లో కరకుదనం పోయి ‘అవునా అక్కా! ఏం రాసినవ్ చదవ్వా, వింటాను ‘అనగానే సప్రజ మనసులో ఓ ఉద్వేగ తరంగం ఉవ్వెత్తున లేచింది. ఓహ్! వినడానికి ఒప్పుకుంది.. ఇంతకాలం కవితలు సమాజంలోని రకరకాల సమస్యలు మనుష్యులపై రాసింది. అవి వాళ్ళ దాకా చేరుతున్నాయో లేదో సందేహమే… ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వదుసుకోవద్దు అనుకుంటూ సెల్. ఓపెన్ చేసింది. గత సంవత్సరం రాసిన కవిత అది. వెతుక్కుంటుంటే మళ్ళొస్త ఏడుందో సూడు అనుకుంటా ముందుకు వెళ్ళిన హిజ్రాను చూస్తూ..
అప్పటి వరకు చోద్యంగా చూస్తున్న ప్రయాణీకులు, మిత్రులు

“ఇంకేమొస్తుంది” అంటూ పెదవి విరిచారు..

వస్తుందన్న నమ్మకం వుంది. అందుకే కవితను వెతికి పెట్టుకుంది. ఐదు, పది, పదిహేను నిమిషాలు గడిచాయి.. ఇక రాదంటూ ఎవరికి వారు ముచ్చట్లలో పడిపోయారు…
ఇంకో పది నిమిషాల్లో స్టేషన్ కూడా రాబోతుంది. పిల్లలు, బుచ్చిబాబు, తమ్ముడు ఇక రాడని తీర్మాణించారు..
సుప్రజలో ఇంకా నమ్మకం తప్పకుండా వచ్చి తీరుతుందని…
గబా గబా వస్తూ, అక్కా! జర్ర లేటయ్యింది డబ్బులు అడుక్కొచ్చే సరికి.. ఇంగ సదువక్క! అని ఎదురు సీట్లో కూచుంది.
‘మాకూ మనసుందంటే నమ్మరేం.. మేము మీలాగే అమ్మ ఒడిలో పాలు తాగి కమ్మని కలల ప్రపంచంలో తేలిన వాశ్ళమే.. తర్వాత తెలిసింది రెక్కలు కత్తిరించబడ్డ లెక్కల్లో లేని మనుషులమని… మమ్మల్ని వెక్కించే ఈ లోకాన్ని చూసి శిలగా మారిన వాళ్ళం. పుట్టించిన బ్రహ్మకు తెలుసో తెలియదో. పుట్టుక నిచ్చిన తల్లికీ తెలియదు మేమిలాంటి వారమని ‘ అర్ధ నారీశ్వరుడని శివుని కలిచే జనం…. అపర అర్ధనారీశ్వరులమైన మమ్ములను చూసి హేళన చేస్తారెందుకు.. ఇలా కవిత పూర్తయ్యే లోగా ఆ హిజ్రా కళ్ళలోంచి ఉబికిన కన్నీళ్శు. నిజమక్కా:! మేమందుకే ఇట్ల తయారైనం.. చేతులు పట్టుకొని కాళ్ళకు దండం పెడుతున్న ఆమె వైపు చూస్తున్న వాళ్ళందరి కళ్ళలో చెమ్మ. సుప్రజ వైపు ప్రశంసగా అభినందనగా చూశారు.
నీ పేరేమిటమ్మా! అడిగిన సుప్రజతో నన్ను అనూష, హనుమంతు అంటరక్కా! అది రాసివ్వవా మా వోళ్ళకు సూపిస్త అంది. వెంటనే కవిత మొత్తం రాసి కింద ఫోన్ నంబర్ వేసి ఇచ్చింది.. రండక్కా ఇట్ల బోతే దగ్గర అంటూ రైలు దిగి ఆటోలు ఎక్కేంత వరకు వెంట వున్న అనుష్కహనుమంతును తలుచుకుంటూ.. పిల్లలు బృందంతో ముందుకు సాగి పోయింది.. అక్షరం ఎలా మనసులను కదిలిస్తుందో, కవిత్వానికి ఎంత శక్తి వుందో పిల్లలకు పెద్దలకూ అర్ధమయ్యింది..

“మనం వెతకాల్సింది మనిషి మూలాలను కాదు. సమస్య మూలాలను… ఈ మాట అందులో చేర్చండి సర్ వీలుంటే…”

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!