Sunday, October 2, 2022
Home > పుస్తక పరిచయం > !! నేనేమి మాట్లాడను… !! -పుష్యమీ సాగర్

!! నేనేమి మాట్లాడను… !! -పుష్యమీ సాగర్

!!నేనేమి మాట్లాడను…!!

అక్షరాలకు మరణం లేదు. అవి చీకటి ని చీల్చే ఉదయాలు. కొత్త వ్యవస్థ కోసం కలలు కనే కన్న తల్లులే.. నేనేమి మాట్లాడాను, నా అక్షరాలే మాట్లాడతాయి. రచయత చేతి లో కలం స్పార్టకస్ కత్తి అవుతుంది. పాలకుల అవినీతి సామ్రాజ్యాలని చీల్చి చెండాడుతుంది. అవును నేనేమి మాట్లాడాను, నా కలం మాత్రమే మాట్లాడుతుంది అంటూ రేపటి భవిష్యత్ కోసం ఓ కవి చేతుల్లో అక్షరం కొత్త జెండా గా మారి రెప రెపలాడుతుంది. రేపటి తరం కోసం తపన పడుతుంది… “నేనేమి మాట్లాడాను” అంటూ పుస్తకం లో ని చైతన్య అక్షరాలని పరిచయం చేస్తున్నారు కొనకంచి గారు.

“కవి గా బతకటం లో, కవి కావటం లో సంతోషం కంటే బాధే ఎక్కువ, ఎందుకంటే జీవితాలని ఫణం గా పెట్టి కవులంతా రాత్రి తెల్ల కాగితాలపై అక్షరాలతో ఉరేసుకుంటారు.. ఎంత బాగా వర్ణించారు. వైయుక్తిక వేదన, కొంతమంది జననం, సామూహిక వేదననుంచి మరికొంతమంది జననం, సమూహం లో ఉండి కూడా వంటరివాడు అయ్యాడు మనిషి అంటూ మనిషి తనకు తానూ పేర్చుకున్న ఒంటరితనపు అడ్డుగోడల గురించి తపిస్తారు.. నిన్నటి పేరు “మంత్రలిపి” రాబోయేది “ద్వంస ధ్వని” అని తన భవిష్యత్ కార్యాచరణాన్ని ప్రకటిస్తారు.. “కత్తి మాత్రమే నిజం మాట్లడుతుంది” కవిత లో…
మీ రేపటి తరాల కోసం నేను అక్షరాల శివ ధనుస్సు గా మారి, మీ ఇంటి గడప ల కిందే మొలుస్తాను ఎంత గొప్ప నమ్మకం… “అక్షరం” తోడు గా మీ వెంటే నేను నడుస్తాను, కవి కి ఉన్న గొప్పదనం అదే.. పోగొట్టుకున్న చోట బూడిద కుప్ప గా మిగలడమే కవిత్వమని, ఆర్పేస్తే ఆరని నిజమే కవిత్వం.. వృధ్యాప్యం లేని అక్షరాలకు కవి చిరంజీవుడై బతుకు ను నిత్య వసంతం చేస్తారు.. “నేనే పొయెమ్ ” లో..

విప్లవం అంటే మనుషులని మోసం చేసే బూతుగా మారిన చోట, దేశ ద్రోహులతో చేతులు కలిపి దేశ భక్తులు గా చెలామణి అయ్యే చోట “నేనేమీ మాట్లాడాను”. నీలోంచి ఆవిష్కరించే క్రమం లో నిలువెత్తు గా యౌవ్వనం తో కాలిపోతున్న భావాక్షరాల మధ్య నన్ను నేను భూస్థాపితం చేసుకుందామని, కాళ్ళ కింద చూస్తే శూన్యం లో నిలబడ్డ భ్రమని అయి భూస్థాపితం అయ్య్యను.. ఎంత భావయుక్తం గా చెప్పారో.. చావుకి బతుక్కి మధ్య ఉన్న క్షణాలను లెక్కిస్తారు.. “హిట్ అండ్ రన్” లో దేశం లోని అన్ని ప్రశ్నలకి పైసలే సమాధానం చెప్తాయి. ఒక్క వాక్యం లో చెప్పాలి అంటే మనిషి అంటే నే వ్యాపారం.. ఇది బహిరంగ సత్యం.. కత్తుల వంతెన మీద యుద్ధం చేస్తున్నప్పుడు, ఎప్పటికి ఖాళి కానీ అమ్ముల పొదిలా మారిన నేను కృతజ్ఞతలు చెప్పాలి అంటే రావణాసురిడిలా పది తలలు కావాలి, ఇరవై చేతులు కొత్తగా మొలవాలి.. ఎంత అనురాగం భార్య పై, భార్య పై గల ప్రేమని ఇంతకంటే ఎక్కువ చెప్పలేము ఏమో … వచ్చే జన్మ లో కొడుకు గా పుట్టి భార్య ఋణం తీర్చుకుంటాను.. అన్నప్పుడు ఆ ఉన్నత సంష్కారానికి నమస్సులు చెల్లించాలని ఉంటుంది..(భార్య, Tribute to a wife).

సామాజిక కోణం లో ఆశ వర్కర్స్ ల కష్టానికి చలించి ఇలా “ఈ దేశం ఒక పశువుల సంత, దేశం లో మనుషులే పశువులు, అంగన్వాడీ ఆడ కూతుర్లారా.. దశాబ్దాల ప్రభుత్వ మోసానికి, ప్రజా ద్రోహాలకి బలి అయినా మీ బతుకు కస్టాలు రాయడానికి ఈ దేశం లో తెల్ల కాగితాలకే కరువొచ్చింది”. ప్రేమ ఎప్పుడు విరాళం గానో, బిచ్చం గానో విసిరేసి బొమ్మ గుర్రం కాదు … కనిపించే రెండు దృశ్యాల మధ్య కనిపించని ఖాళీలో దాక్కున్న నిశ్శబ్దపు శబ్దం. “ఆ విషయము నీకు తెలియదు”.

మీరు విన్నది నిజమే… స్వప్నాలు పగిలిపోతున్న స్వరాలని కొనుక్కుంటున్నా, ఒక డబ్బుతో అన్ని స్వంతం చేసుకోవచ్చు.. జీవితం అంటే ఆకలికి, దాహానికి ఆహరం వెతుక్కోవడమే..”(నిజమే.. మాస్టారు మీరన్నది నిజమే )
నేను సృష్టించిన ఉద్యానవనం లో ఓ కొత్త సముద్రం గా మారిపోయాను. ముసలితనాన చిరునవ్వు తో గుర్తుకు తెచ్చుకోవడానికి మనకంటూ ఒక జ్ఞాపకం లేకపోవడం ఎంత క్రూర విషాదమో కదా… మనిషి ని మరో మనిషి నమ్మటం ఒక మత్తు నిషానే.. పరాయి చేతుల్లో మోసపోతూనే ఉంటారు.. అమ్ముడవుతూనే ఉంటారు.. ప్రేమించడం, ద్వేషించడం మధ్య సమస్య…చాలా సందర్భాల్లో ద్వేషించడమా? ప్రేమించడమా.. లేదు తప్పుకు పోవడమా? జీవితం లో పనికి రానీ పోరాటాలు చేసి వేస్ట్ చేసుకోవడమే సామూహిక దౌర్బాగ్యం సత్యమే ఇది… ఈ దేశపు నాయకుల గురించి “జై భరత్ మాత కి జై ” లో దేశ నాయకుడు ద్రుష్టి లో దైవ భక్తి అంటే అమ్మడమే..!! దేవుడా రక్షించు ఈ దేశాన్ని పిచ్చి ప్రజలని అంటారు.

హేతువాదానికి, హితవాదానికి తేడా నలభై ఏళ్ళు వచ్చేవరకు తెలియదా? సెక్స్, డబ్బు, తాగుడు, వ్యభిచారం లాంటి భౌతిక వాసనలనుంచి విముక్తి పొందినతరువాతే తేడాలు తెలుసుకోవచ్చు అజ్ఞానాన్ని జ్ఞానం గా భ్రమిస్తూ ఉరికి దూరం గా వెళ్ళినప్పుడు మాత్రమే తెలుసుకోవచ్చు?…. శాంతి ని ఇవ్వడం లో నాస్తికత్వం విఫలం అయినప్పుడు మాత్రమే హేతువాది హితవాది గా మారతాడు ఏమో… మనిషి మరో మనిషి కలిపేది బంధం అయితే ఆ బంధానికి దారి వేసేది పుస్తకమే… అలాంటి ఒక బుక్ ఫెయిర్ లో మనిషి విరిగిపోయి ముక్కలు గా విడిపోయి కొత్త మనిషి గా రూపాంతరమవటం అంటే ఏంటో తనకి మాత్రమే తెలుసంటాడు …కవి …పుస్తకం అంటే మనిషికి కడ వరకు తోడుండే హృదయం.. నేనంటే మరేమి కాదు ఓ కొత్త బుక్ ఫెయిర్ ని..(మనిషి, రోడ్, ఒక బుక్ ఫెయిర్)…

నేనెవరు, ఎందుకు మాట్లాడాలి, మౌనం గడ్డ కట్టి సంఘర్షణ కు గురి కాబడ్డప్పుడు అన్యాయాలను తెగనరికే అక్షరాలను పోగు చేసుకుంటూ యుద్ధం ప్రకటన చేస్తూనే నేనేమి మాట్లాడాను నా కవితలే మాట్లాడతాయి అన్న కవి భావన నిజంగా గొప్పదే… అక్షరాల పిడికిళ్ళలో దాగున్న విశ్వ రహస్యాల అంతు తెలుసుకున్నవాడిని, నా జాతి ప్రజలకోసం చెట్టు గా మొలిచినవాడిని, మరణించిన ప్రతీసారి సరికొత్త గా జన్మించిన నాకు మల్లి మనిషి గా పుట్టడం కొత్త ఏమి కాదు అయినా నేనేమి మాట్లాడను …నా కలమే కాలానికి చెబుతుంది అంటూ ధర్మాగ్రహాన్ని వెళ్లగక్కుతుంది కొనకంచి గారి కలం. జీవితం మొత్తాన్ని అర్థం చేసుకోవాలి అంటే నిన్ను నువ్వు, నీకు నువ్వే చదవగలగాలి… అప్పుడు మాత్రమే నువ్వు నీకు నువ్వే కవిత్వం గా మరగలవు నిజమే… మనిషి అంతర్లీనం గా ఆత్మవిమర్శ చేసుకుననప్పుడే నిజమైన మనిషి గా రూపాంతరం చెందుతాడు.. ఆత్మలన్నీ కవిత్వం తో శుద్ధమైన చోట నీకు నువ్వే మనుషులందరి లో అక్షరాలా హరివిల్లు గా మారాలి…(నీకు నువ్వే కవిత్వం గా మారాలి )..

నేనేమి మాట్లాడాను అంటూనే బోలెడు విషయాలని నిక్కచ్చి గా, నిజాయితీ గా.. వెలువరించారు. చాలా వరకు దీర్ఘ కవితలని తలపిస్తాయి …prose పోయెట్రీ లో కంటెంట్ ఉన్న కవితలు ఎన్నో కనిపిస్తాయి… వచనం తేలిపోతుంది అన్న అపవాదు ని తప్పించుకుని తనదైన శైలి లో నిప్పులు కురిపించిన కొనకంచి గారి కలం తాలూకు పదును ప్రతి అక్షరం లో కనిపిస్తుంది. రాజకీయం, స్నేహం, కళా రంగం, కవులు, ఇలా భిన్న వస్తువులను తీసుకొని కవిత్వీకరించిన తీరు గొప్ప గా వుంది “మంత్రం లిపి” తో తనకంటూ ఓ ప్రతేయక స్థానాన్ని సంపాదించుకొని “నేనేమి మాట్లాడాను” నా కవిత్వమే మాట్లాడుతుంది అని మరింత ముందుకు దూసుకు వెళ్తున్నారు… మరిన్ని మంచి కవితా సంకలనాలు విలువరించాలని కోరుకుంటూ..కొనకంచి వారికి అభినందనలు

-పుష్యమీ సాగర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!