Saturday, February 22, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 14 వ వారం) -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 14 వ వారం) -శ్రీ విజేత

బహుశా కాలం కొన్ని అవకాశాలు ఇస్తుంది మనిషికి బాగు పడడానికి, వాటిని విచక్షణతో గుర్తించి స్వీకరించాలేమో, అలా చేయకుంటే ఇక జీవితాంతం అనుభవించవలసిందేమో! నేను కాలం ఇచ్చిన అవకాశాన్ని కూడా స్వీకరించలేదు ఉట్టి సెంటిమెంట్ పేరు మీద! అది కులం, పరువు, ప్రతిష్ట, గౌరవం,పెళ్ళయిపోయింది అనేటివి కావచ్చు. వీటిని అధిగమించడానికి నా శక్తి చాలా లేదు. వేయి ఆశలతో నా కోసం ఎదురు చూసిన అతనికి నేను నో! అని మాత్రమె చెప్పాను. ఈ లెక్కన నేను నా కోసం, నా వాళ్ళు అనే వాళ్ళకోసం ఆలోచించిన స్వార్ధపరురాలిని మాత్రమె కావచ్చు. అతడు నా గురించి ఏమనుకున్నాడో ఏమో, నేను మాత్రం అతని కోరికను అంగీకరించ లేదు. మనసులో ఒక తృప్తి , ఆనందం మాత్రం కలిగింది, ఎవరికి అంతగా పట్టని నా కోసం కూడా ఆలోచించేవారు ఉన్నారని. ఇంకా బాధ కూడా కలిగింది ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను కదా అని. ఈ వ్యవస్థ నిర్మించిన చట్రంలో కట్టుబాట్లల్లో మనిషి బతుకాలేమో అనిపించి, ఈ వ్యవస్థను ఎదురించే శక్తి లేక, అతనితో కలిసి వెళ్ళిపోయే శక్తి లేక, లోకం వేసే అపవాదు లేచిపోయింది అనే మాటను కూడా స్వీకరించే శక్తి లేక కూడా నేను అతని మాటను కాదన్నాను. బహుశా నేను స్వార్ధపరురాలిని! అతని కోసం నేను ఆలోచించ లేదు. నా కోసం మాత్రమే ఆలోచించాను. నీ కోసం నేనున్నాననే అతని ప్రేమ ఎంత గొప్పది అనిపించింది! అయినా నేను అతనికి తెలియ చేయడానికి ఏదో ఒకటి నా సమాధానం ఇవ్వాలి కాబట్టి నా అభిప్రాయాన్ని అతనికి లేఖ ద్వారా రాసి పంపించాను.

ఫిబ్రవరి 29, రాత్రి 11. 00

మిత్రుడు కృష్ణకు,

నీవు నన్ను నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నావంటే ఎంతో ఆశ్చర్యంగా ఉందే కాని కోపం లేదు. చిన్న పిల్లాడు కాపీలను పారవేసి చిత్తు కాగితానికి ఏడ్చినట్లుగా ఉంది. నీవు నన్ను అలా అర్ధం చేసుకున్నావని నాకు ఈ రోజు వరకూ తెలియదంటే నమ్మవేమో! నీది అంత గాఢమైన ప్రేమ మరి! అందుకే అంటారు ప్రేమ గుడ్డిది అని. నీవు మా అన్నయ్య ప్రియతమ స్నేహితుడివి కావున నీతో కొంత ఫ్రీగా మాట్లాడేదాన్ని. నేనిలా వ్రాసిన చేదు నిజాన్ని చదువుతుంటే నీ హృదయం వెయ్యి ముక్కలవుతుందని తెలుసు! అయినా మొదటినుంచి నా అంతర్యం ఏమిటో వివరంగా చెపుతానని అన్నయ్య హృదయం మీద ఒట్టేశాను. అందుకే చేదు నిజమైనా చెప్పగలుగుతున్నాను. డైరీ, నవల రెండూ చదివాను. ఇప్పుడు రాత్రి 11 గంటలు. ప్రియురాలి పేరును రక్తంతో వ్రాసేవారు,వ్రాసిన వారు ఎవరూ ఉండరేమో ! నాది అదృష్టమో, దురదృష్టమో అర్ధం కాకుండా ఉంది. పెళ్ళాడిన వాడి దృష్టిలో దయ్యాన్ని, ప్రేమించిన హృదయంలో దేవతను. తలచుకుంటే నవ్వు, బాధ రెండూను.నీ ప్రేమ పెళ్లి కాక ముందు తెలుసుకొని ఉంటె సమాజానికి సవాల్ చేసి ఉందును! కాని నీవు ఇప్పటికీ సమయం మించిపోలేదని చెపుతావేమో! కాని కొన్ని సంఘటనల వల్ల నా హృదయం మూతలేని సమాధి అయిపొయింది. నీ ప్రియ మిత్రుడు అయిన మా అన్నయ్యతో మాట్లాడినందుకే లోకులు పవిత్రమైన అన్నాచెల్లెల్ల అనుబందాన్నే అనుమానించారు. సమాజంలో నేను ఆడదాన్నేగా, అందుకే అన్నయ్య ఉంటె తప్పా నీతో ఒంటరిగా మాట్లాడేదాన్ని కాదు. అదృష్టమో , దురదృష్టమో నీవు నన్ను వేరుగా అర్ధం చేసుకున్నావు ! అన్నయ్య చెపితే దానికి నేనెలాంటి బాధ్యురాలిని కాదని చెప్పాను. కాని నీ నవల చదువుతుంటే కొంతవరకు నాకు తెలియకుండానే పరిస్తితుల ప్రభావం వల్ల నేను కూడా బాధ్యురాలిననిపిస్తుంది. అందుకే నీపై నాకు ఎలాంటి కోపం లేదు. మామూలుగా స్నేహితులుగానే ఉండిపోదాం. నీ కోసం నేనున్నానంటే నిజంగా నాకెంతో గర్వంగా ఉంది, ఇంత మంచి మిత్రుడు నాకున్నందుకు! ఇప్పుడు నాకు సమాజంతో పని లేదు, ఇంకొన్ని రోజుల్లో నా జీవితనాటక రంగానికి తెర దించబోతున్న కావున ఇక నీతో స్నేహంగా మాట్లాడగలను. కాని నీవనుకున్నంత దగ్గరగా మాత్రం అసలెప్పుడూ రాలేను కావచ్చు. నా కొరకు నీ బంగారు భవిష్యత్ ను బలి తీసుకునే మూర్ఖురాలిని మాత్రం కాలేను. నా కోసం నీ ప్రాణాన్నయినా బలిపెడుతానంటున్నావు, పిచ్చి నేస్తమా నేనంత స్వార్ధపరురాలిని అనుకొంటున్నావా? నీవు అందలం ఎక్కిస్తానంటున్నావు. అందుకు నేను అర్హురాలిని కాను. నేను కన్యను కాను, వివాహితను, నీవు ‘కొ’ అంటే కోటి మంది వచ్చి వాల్తారు నీ ముందు. నేను నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించే బాధ్యత ఉంది మరి! నేనిలా చెపుతున్నానని బాధపడుతున్నావు కదూ, కాని నా బాధామయమైన జీవితం చూస్తె నేను ఎందుకు ఇలా వ్రాశానో నీకు అర్ధం అవుతుంది. నన్ను అర్ధం చేసుకుంటావు కదూ ! తెలిసో తెలియకో ఒక మెట్టుపై కాలువేశాను, అక్కడి నుండి క్రిందకు దొర్లాను, ఇప్పుడు ఇన్నీ తెలిసి మరో మెట్టుపై కాలు వేసే ధైర్యం నాకు లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా నా నిర్ణయానికి తిరుగు లేదు.

ఈ ప్రేమ ఒక్కొక్కప్పుడు సమస్యలా తయారు కావచ్చెందుచేతో . ప్రేమ ఉందని మాత్రం చెప్పగలను. నా సుజిని మనసారా ప్రేమించాను, దానిచే ప్రేమించబడ్డాను. అలాంటి సుజికే నా సమస్య పూర్తిగా చెప్పలేదంటే మిత్ర ద్రోహమవుతుందేమో ! కాని అది బాధ పడడం ఇష్టం లేకనే, ఒక్కోసారి చెప్పక తప్పదన్నట్లుగా నేను నీకు ఏమీ కాను అందుకే నా దగ్గర దాస్తున్నావు అని నిష్టూరంగా మాట్లాడేది. దాని ఒడిలో తల పెట్టుకొని తనవి తీరా ఏడ్చేదాన్ని, అంతలోకే దాని కన్నీళ్లు చూసి నవ్వేదాన్ని. నా కెంత బాధ ఉన్నా దాని కన్నీళ్లు మాత్రం చూడలేక పొయ్యేదాన్ని. దీనినే ప్రేమ అంటారేమో! అలాగే అన్నయ్య కూడా పిచ్చి ప్రేమతో ‘ నీకు వీడెందుకు ఇలా అడుగుతున్నాడనిపిస్తుంది కదూ, అయితే చెప్పకులే ‘అని, నానుంచి కొంత వినగలిగాడు.బహుశా నా ప్రాణమున్నంతవరకు గుర్తుంటాయి. ఇలాగే అక్కలూ , భావలూ , ఇలా నా చుట్టూ ఉన్న సమాజం లోని వారందరిచే ప్రేమించబడ్డాను. నేను వారిని ప్రేమిస్తున్నాను. “ ప్రేమ” అనే రెండు అక్షరాలు సృష్టిలో ఎలా వెలువడ్డాయో తెలియదు కాని ఎంత మహాత్తరమైనవి!

నా జీవిత పర్యవసానం ఏమిటో, నేను విధి చేతిలో కీలు బొమ్మనేమో, నాకేది అర్ధం కావడం లేదు!

నా గురించి ఆలోచించేవారు ఉన్నారని తెలిసి మాత్రం నా హృదయం తేలికయ్యింది. ఇక నేను ఏమయినా పరువాలేదు! నీ ప్రేమకు నేను ఎలా ధన్యవాదాలు అర్పించాలో తెలియడం లేదు. వట్టి మాటలు చాలవేమో !

– – స్నేహమయి, ప్రేమమయి

నిజంగా ఆ లేఖ రాసి ఆ క్షణంలో చాలా తృప్తి పడ్డాను. ఏ తృప్తి అయినా కొన్ని గంటలు, కొన్ని రోజులే అనిపించింది. ఒక మంచి మనిషి ప్రేమ కోసమైనా బతుకచ్చులే అనుకున్నాను

నా లేఖ అతనికి ముట్టిన తరువాత అతడు, తన ఆశలను నాపై ఇంకా చంపుకోలేదు అని అర్ధమయ్యింది. నాకు ఇంకో లేఖ కూడా రాసి అందించాడు.

అందులో అతడు రాసుకొంది,

‘రా వెళ్లిపోదాం’ అన్నాడు.

‘బతుకుతే బతుకాల్నంటే జీవితాంతం గానుగెద్దులా బతుకాలన్న ఈ దుష్ట సమాజం గోడల్ని కూలదోసి, ప్రేమ పక్షుల్లా వెన్నెల గోదారి తీరాల్లో పిట్ట గూళ్ళు కట్టుకొని హాయిగా బతుకుదామ రా !’ అన్నాడు

‘క్షణాల్లోని ఆనందాలు పట్టుకుందామన్నా దొరుకవు, నాకు నువ్వు, నీకు నేను ఉత్తర దక్షిణ ధృవాల మంచు మైదానాల్లోని అందాల పెంగ్విన్ పక్షుల్లా మంచు దుప్పటి కప్పుకొని వెచ్చగా గడుపుదాం రా!’ అన్నాడు.

‘బతుకు ఒక మధురమైన అనుభూతి! బతుకు సజలమైన ఊట లోని మంచినీటిని మంచినీటిని దోసిలితో ఎత్తుకొని తాగడం లాంటిదే ! అమృతం గ్రోలాలన్నా, అజరామరంగా బతుకాలన్నా ఎవరికి వారి చేతుల్లోనే ఉంటుంది బతుకు!. రా ! వెళ్లి పోదాం, బతుకు పొద్దు కూకక ముందు’ అన్నాడు.

అతని కవితా హృదయానికి నా హృదయం కరుగ లేదు. నేను నా నిర్ణయాన్ని చెప్పేశాను ముందే అతనికి. ఇక అంతా కాలానికే వదిలేశాను. కాలం మనమనుకున్నంత కష్టంగానూ, ఈజీగానూ ఉండదు కావచ్చు. ఈ లోకం కూడా మనను అంత ఈజీగా వదిలిపెట్టదు కావచ్చు. అవసరానికి ఆదుకోనివారు, అర్ధంచేసుకోనివారు కూడా మన మీద సమయం దొరికినపుడు నిందలు వేయడానికి, అబాండాలు వేయడానికి సిద్ద్ధంగా ఉంటారేమో! అలానే జరిగింది అప్పుడు మా విషయంలో. అలానో ఇలానో మా ప్రేమ కథ మా యింటి దగ్గర వాళ్లకు తెలిసిపోయింది, వాళ్ళ ద్వారా ఇంట్లో కూడా తెలిసిపోయింది. మా అన్నయ్యలకు కూడా తెలిసిపోయింది.వాళ్ళకు కావాలసింది పరువు, ప్రతిష్ట. నేను ఆ పరువు ప్రతిష్ట ల కోసమే జీవితాన్ని ఇంకోసారి త్యాగం చేశాను అనే సంగతి వాళ్లకు తెలియదు. అయినా నాపై ఓ కన్ను వేసే ఉంచారు, నన్ను మందలించారు కూడా! నిర్మలమైన నా మనసుకు వాళ్ళ మాటలు ఏమీ నన్ను బాధించలేదు. నన్ను చులకనగా చూసే, నిందలు మోపే వాళ్ళను చూస్తేనే నాకు జాలి వేసింది. నిజంగా అతని నిర్మలమైన ప్రేమ నాకు కొండంత బలాన్ని, తృప్తిని కూడా ఇచ్చింది. పాపం నా మూలంగానే అతడు ఎన్నో మాటలు పడుతున్నాడు, కొందరి తోని అని బాధ వేసింది. అతన్ని మా ఇంటివైపు అన్నయ్య వాళ్ళ ఇంటివైపు రావద్దని ఆంక్షలు కూడా విధించారు అని తెలిసింది. అప్పుడు అన్నయ్య ఊర్లో లేడు, పరిక్షలు ఉన్నాయని పట్నం వెళ్లిపోయిండు. అన్నయ్య ఉంటె పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఇద్దరి మధ్య ఎలాంటి ఆధారం కూడా లేకుండా పోయింది. ఇక నేనేమి చేయలేక ఆడపిల్లనై, అబలను అయి మౌనంగానే ఊర్కొన్నాను జీవితాన్ని కాలానికి వదిలేసి. అతను కూడా నాకు కలువలేదు కొన్ని రోజులు. అతడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు కాబట్టి ఊరికి వెళ్లి పోయాడేమో అనుకున్నాను. ఎప్పుడైనా అతడే నాకోసం వచ్చి నాకు కనిపించేవాడు మా ఇంటి దగ్గరనే. ఇప్పుడు అతడు వచ్చే పరిస్థతి లేకుండాపోయిందేమో అనిపించింది. కాలం బరువుగా గడుస్తూ మార్చ్ నెల గడిచిపోయింది, ఏప్రిల్ నెల కూడా గడిచిపోయింది. మావాళ్ళు, నా చుట్టూ వాళ్ళు చూస్తున్నట్లు ఏమి అనర్ధం జరుగలేదు. నిండా మునిగిన వాళ్లకు చలి ఏమిటీ ? చనిపోదాం అని అనుకున్నవాళ్ళకు భయమేమిటీ? త్యాగం .చేసినవాళ్ళకు భయమేమిటీ? ఏ తప్పు చేయని వాళ్ళు ఎవరి కోసమని ఎందుకు భయపడాలి అనిపించింది. మనసులో తీయని బాధ, అతని జ్ఞాపకం, అతని ప్రేమను తలచుకుంటూ కొన్ని రోజులు గడిపాను. నిండు వేసవి మే మాసం కూడా వచ్చేసింది.

(మిగితా వచ్చేవారం)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!