Wednesday, July 6, 2022
Home > కవితలు > || తెలంగాణ బతుకమ్మ పాట || -సబ్బని శారద

|| తెలంగాణ బతుకమ్మ పాట || -సబ్బని శారద

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

హరి హరి ఓ రామ ఉయ్యాలో

హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో

నెత్తి మీది సూర్యుడా ఉయ్యాలో

నెల వన్నెకాడ ఉయ్యాలో

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో

బాలకోమారుడా ఉయ్యాలో

ముందుగా నినుదల్తు ఉయ్యాలో

ముక్కోటి పోచవ్వ ఉయ్యాలో

అటెన్క నినుదల్తు ఉయ్యాలో

అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో

భక్తితో నినుదల్తు ఉయ్యాలో

బాసర సరస్వతి ఉయ్యాలో

ఘనంగాను గొల్తు ఉయ్యాలో

గణపతయ్య నిన్ను ఉయ్యాలో

ధర్మపురి నరసింహ ఉయ్యాలో

దయతోడ మముజూడు ఉయ్యాలో

కాళేశ్వరం శివ ఉయ్యాలో

కరుణతో మముజూడు ఉయ్యాలో

సమ్మక్క సారక్క ఉయ్యాలో

సక్కంగ మముజూడు ఉయ్యాలో

బద్రాద్రి రామన్న ఉయ్యాలో

భవిత మనకు జెప్పు ఉయ్యాలో

యాదితో నినుదల్తు ఉయ్యాలో

యాదగిరి నరసింహ ఉయ్యాలో

కోటి లింగాలకు ఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో

కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో

కొమురెల్లి మల్లన్న ఉయ్యాలో

కొండగట్టంజన్నఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో

కోర్కెమీర దల్తు ఉయ్యాలో

కొత్తకొండీరన్న ఉయ్యాలో

ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో

ఎములాడ రాజన్న ఉయ్యాలో

ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో

ఒదెలా మల్లన్న ఉయ్యాలో

ఐలేని మల్లన్న ఉయ్యాలో

ఐకమత్యమియ్యి ఉయ్యాలో

…………………………………………….

నట్టనడిమి సీమ ఉయ్యాలో

నా తెలంగాన ఉయ్యాలో

నెత్తురోడింది ఉయ్యాలో

నేల తెలంగాణ ఉయ్యాలో

తల్లడిల్లింది ఉయ్యాలో

తల్లి తెలంగాణ ఉయ్యాలో

బతుకులో చీకట్లు ఉయ్యాలో

భవిత కష్టమాయే ఉయ్యాలో

పల్లె పల్లెను జూడు ఉయ్యాలో

పట్నవాసం చూడు ఉయ్యాలో

కరువులిక్కడచ్చె ఉయ్యాలో

కష్టాలు వచ్చెను ఉయ్యాలో

సదువులూ సందెలూ ఉయ్యాలో

సక్కంగ లేకుండె ఉయ్యాలో

బంజరు భూముల్తో ఉయ్యాలో

బతుకు భారమయ్యె ఉయ్యాలో

కూలీల బతుకుల్లో ఉయ్యాలో

కూటిక్కస్టమచ్చేఉయ్యాలో

కన్నీటి కావ్యాల ఉయ్యాలో

కడలి తెలంగాణ ఉయ్యాలో

ఆర్తితో బతుకులూ ఉయ్యాలో

ఆగమయ్యె చూడు ఉయ్యాలో

మంజీర మానేర్లు ఉయ్యాలో

మన మధ్య నుండగా ఉయ్యాలో

మూసీలు మున్నేర్లు ఉయ్యాలో

ముచ్చ్చటగా పారే ఉయ్యాలో

గోదారి క్రిష్ణలూ ఉయ్యాలో

గొప్పగానూ పారే ఉయ్యాలో

సింగరేణి గడ్డ ఉయ్యాలో

సిరులు ఉన్న గడ్డ ఉయ్యాలో

నల్ల బంగారమూ ఉయ్యాలో

నాణ్యమైన బొగ్గు ఉయ్యాలో

షాబాద్ రాళ్ళలో ఉయ్యాలో

సక్కనీ ఈ సీమ ఉయ్యాలో

పాడి పంటలందు ఉయ్యాలో

పాటైన నేలరా ఉయ్యాలో

వనరులన్నీ ఉన్న ఉయ్యాలో

వజ్రాల గడ్డరా ఉయ్యాలో

అన్ని ఉన్ననేమి ఉయ్యాలో

అంతటా కరువాయే ఉయ్యాలో

కాలమహిమ చూడు ఉయ్యాలో

కష్ట కాలమచ్చె ఉయ్యాలో

…………………………

అదిలాబాదు జూడు ఉయ్యాలో

అడవి తల్లిని చూడు ఉయ్యాలో

గోండుల బతుకుల్లో ఉయ్యాలో

గోడులను జూడు ఉయ్యాలో

శ్రీరాం సాగర్లు ఉయ్యాలో

సిన్నబోతున్నాయి ఉయ్యాలో

బాసర క్షేత్రం ఉయ్యాలో

భాసిల్లిన చోట ఉయ్యాలో

సదువు సందెలు లేక ఉయ్యాలో

సట్టువడే బతుకు ఉయ్యాలో

సర్ సిల్క్ నేతలూ ఉయ్యాలో

సరిపోని బతుకులూ ఉయ్యాలో

అదిలాబాదు జూడు ఉయ్యాలో

అన్నిట్లో వెనుకుండె ఉయ్యాలో

అంగట్ల అన్ని ఉయ్యాలో

అల్లున్నోట్లే శని ఉయ్యాలో

అమ్మవోతే అడవి ఉయ్యాలో

కొనబోతే కొరివి ఉయ్యాలో

……………………………..

చక్కెర పొలాలు ఉయ్యాలో

సక్కంగ ఉండంగ ఉయ్యాలో

నిజాం షుగర్లు ఉయ్యాలో

నిలువ కష్టమాయే ఉయ్యాలో

ఈ నేల, ఈ నీరు ఉయ్యాలో

ఇక్కడీ వారియీ ఉయ్యాలో

జగ్గర్త మరి లేక ఉయ్యాలో

జాగ లెట్లబాయే ఉయ్యాలో

పని పాటల్లేక ఉయ్యాలో

పాడువడే బతుకు ఉయ్యాలో

దుబాయి, మస్కట్లు ఉయ్యాలో

దూరంగ పోవట్రి ఉయ్యాలో

వ్యాధులా బాధలూ ఉయ్యాలో

వారనుభవించిరీ ఉయ్యాలో

ఇందూరు భారతీ ఉయ్యాలో

ఇటు జూడు తల్లి ఉయ్యాలో

నిజాంబాదలూ ఉయ్యాలో

నిట్టూర్పు బతుకులూ ఉయ్యాలో

బీడీల బతుకులూ ఉయ్యాలో

బీడైన బతుకులూ ఉయ్యాలో

………………………………….

కైనారం జూడు ఉయ్యాలో

కష్టాల ఇల్లు ఉయ్యాలో

రాజకీయపు జిల్ల ఉయ్యాలో

రాణించే జిల్ల ఉయ్యాలో

కరినారం జిల్ల ఉయ్యాలో

కదలికున్న జిల్ల ఉయ్యాలో

మానేరు పరుగులూ ఉయ్యాలో

మరి చిన్నవైపాయే ఉయ్యాలో

సిరిసిల్ల బతుకులూ ఉయ్యాలో

సిరి లేని బతుకులు ఉయ్యాలో

ఆకలీ చావులూ ఉయ్యాలో

ఆత్మహత్యలు చూడు ఉయ్యాలో

వలస బతుకులు జూడు ఉయ్యాలో

వట్టిపోయిన బతుకు ఉయ్యాలో

బొంబాయి భీమండి ఉయ్యాలో

బోసిపోయిన బతుకు ఉయ్యాలో

నాగళ్ళు పట్టేటి ఉయ్యాలో

నా రైతులార ఉయ్యాలో

కూలికి నాలికీ ఉయ్యాలో

కూడ వెళ్ళుటాయె ఉయ్యాలో

బతుకులూ బరువాయె ఉయ్యాలో

భవిత కష్టమాయే ఉయ్యాలో

సింగరేణి బొగ్గు ఉయ్యాలో

సిరిగల్ల సీమరా ఉయ్యాలో

ఎన్టిపిసీలు ఉయ్యాలో

ఎఫ్ సి ఐ కంపిన్లు ఉయ్యాలో

ఎఫ్ సి ఐ కంపిన్లు ఉయ్యాలో

ఎమైపాయెరా ఉయ్యాలో

కరెంటు పుట్టిల్లు ఉయ్యాలో

కరువెట్ల వచ్చింది ఉయ్యాలో

అంతర్గాం మిల్లులూ ఉయ్యాలో

అంతరించి పాయే ఉయ్యాలో

సిరిసిల్ల స్పిన్నింగ్ ఉయ్యాలో

సిక్కుల్లో ఉండే ఉయ్యాలో

రామగుండమ్ములూ ఉయ్యాలో

రాణించక పాయె ఉయ్యాలో

గోదారి దారుల్లో ఉయ్యాలో

గోసకచ్చె బతుకు ఉయ్యాలో

కన్నీళ్ళ బతుకాయె ఉయ్యాలో

కష్టాల బతుకాయె ఉయ్యాలో

-సబ్బని శారద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!