Monday, August 8, 2022
Home > స్పెషల్ ఫీచర్ > బతుకమ్మ పండుగ విశిష్టత – సబ్బని లక్ష్మీనారాయణ

బతుకమ్మ పండుగ విశిష్టత – సబ్బని లక్ష్మీనారాయణ

తెలంగాణాలో బతుకమ్మ పండుగ విశిష్టమైనది. ప్రపంచములో ఏ దేశము. వారూ జరుపుకోరు బతుకమ్మ పండుగను. తెలంగాణ ఆడబిడ్డలే జరుపుకుంటారు ప్రపంచములో ఎక్కడ ఉన్నా సరే! బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతీక.

బతుకమ్మ అంటే బతుకు + అమ్మ = బతుకమ్మ. బతుకును తల్లి అనుకొని దేవతను చేసి కొలిచారు తెలంగాణ స్త్రీలు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ట్రేడ్ మార్క్ పండుగ. తెలుగు వారు అంతా ఒక్కటే అన్నా ఒక్క బతుకమ్మ పండుగను బట్టి చెప్పవచ్చు బత్తుకమ్మను ఆడేవారు తెలంగాణ ఆడబిడ్డలే అని, బతుకమ్మ తెలంగాణ ప్రాంతపు పండుగ అని.

ఆశ్వయిజ మాసంలో దసరా ముందు అరుదెంచే తొమ్మిది రోజుల పండుగ ఇది. సాధారణంగా ప్రతి ఏటా సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో వచ్చే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతపు పెద్ద పండుగ. బతుకమ్మ పండుగను పితృ అమావాస్యకు మొదలు పెడుతారు. అందులో పిల్లలు ఏడు రోజులు ఆడేది చిన్న బతుకమ్మ పండుగ, పెద్దలు తొమ్మిదవ రోజునాడు ఆడేది పెద్ద బతుకమ్మ పండుగ. ఈ పండుగను సద్దుల బతుకమ్మ పండుగ అని కూడా అంటారు, ఎందుకంటే చక్కర, బెల్లం, నెయ్యి మరియు అన్ని రకాల పిండిలతో, నువ్వులతో, వేరు శనిగ గింజలతో తీపి పదార్థాలు తయారు చేస్తారు. చిన్న బతుకమ్మను ఆడడానికి వెళ్ళినపుడు అందరు ఆ సద్దులను పరస్పరం సిబ్బిలలో పంచుకొని ఇచ్చుకోవాయినం, పుచ్చుకోవాయినం అంటూ పంచుకుంటారు. ఇక పితృ అమావాస్య వారం రోజులు ఉందనగా బొడ్డెమ్మను వేస్తారు, పుట్టమన్నుతో చెక్కపీటపై మట్టి వరుసల పీఠం పేరుస్తారు, అది బొడ్డెమ్మ . దానిని పసుపు కుంకుమలతో అలంకరించి, పూలతో పేర్చి సాయంత్రం పూటల్లో ఎవరి ఇంటి ముందటనైనా ఉంచి ఆడ పిల్లలు చుట్టూ తిరుగుతూ , బతుకమ్మ పాటలు పాడుతారు. బతుకమ్మ పాటను ఒకరు చెప్తుంటే మిగితావారు అంటుంటారు లయబద్దంగా.

“రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీ రామ ఉయ్యాలో
హరి హరి ఓ రామ ఉయాలో
హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో…” ఇలా సాగుతుంది బతుకమ్మ పాట.

బతుకమ్మ పాటల్లో, జాతి, సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేపాటలు, ఉమ్మడి కుటుంబ ప్రయోజనాలు, ఆరోగ్య సూత్రాలు- వీటికి సంభందించిన అంశాల పాటలు, కరవు కాటకాల మీద వచ్చిన పాటలు, ప్రకృతి బిభిత్సాల మీద వచ్చిన పాటలు, స్త్రీల జీవితములోని కష్టాలు తెలిపే పాటలు ఉన్నాయి. బతుకమ్మ పాటలు అంటే కష్టాలు, వెతలు వెల్లబోసుకొనే పాటలే ఎక్కువ. ఇక వాడవాడల్లో పిల్లలందరూ ఏడు రోజులు బొడ్డెమ్మను ఆడిన తరువాత, పితృ అమావాస్యనుండి చిన్నబతుకమ్మను ఏడు రోజులు ఆడుతారు. చిన్న బతుకమ్మ చిన్నారి ఆడపిల్లలకు ఏంతో ఇష్టమైన ఆట. బతుకమ్మ పండుగ వస్తుందంటే మేదరి వాళ్ళ దగ్గర కొత్త సిబ్బిలను కొంటారు అందరి ఇళ్ళల్లో. తెలతెలవారంగ పూల చెట్ల చెంత పొలం గట్ల చెంత బతుకమ్మ పేర్వడానికి కట్ల పువ్వులు, గునుగు పువ్వులు, పట్టుకుచ్చుల పువ్వులు, గోరంట పువ్వులు, బంతిపువ్వులు తంగేడు పువ్వులు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు సేకరించి తీసుకవస్తారు పిల్లలు. బడికి సెలవులే పిల్లలకు కాబట్టి తీరిక సమయం ఎక్కువే. మద్యాహ్నం వరకు బతుకమ్మలు పేర్చి, మధ్యలో గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టి అలంకరిస్తారు. సాయంత్రం తయారై వాడకట్టు ఇండ్ల పిల్లలతో కలిసి కాసేపు ఇంటి ముందట బతుకమ్మలను పెట్టి ఆడి తరువాత చెరువు లేదా వాగు ఒడ్డుకు తీసుక వెళ్లి అక్కడ కొద్దిసేపు బతుకమ్మ ఆట ఆడి బతుకమ్మలను నీళ్ళల్లో వేసి వచ్చేస్టారు. ఈ బతుకమ్మ సందర్బంగా ఉన్నంతలో స్త్రీలు, పిల్లలు,పెద్దలు అందరు కొత్త బట్టలు కొనుక్కొని ధరిస్తారు. ఉన్నంతలో బంగారు నగలు కూడా ధరిస్తారు. అందరి ఇండ్లల్లో జరుపుకొనే పండుగ వలె కాక ఇది అందరు ఒక దగ్గరి చేరి కలిసి ఆడుకొనే సమిష్టి పండుగ. ఈ పండుగ సందర్భంగా పెండ్లి అయిన ఆడపిల్లలు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలు తల్లిగారి ఇంటికి తప్పక వస్తారు. అలా పాత స్నేహితులందరు కలుసుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం.

ఇక పెద్ద బతుకమ్మ పండుగను ఊరు ఊరంతా కలిసి ఒక దగ్గర చేరి ఒక్క వాడ కట్టు వాళ్ళు ఒక్క దగ్గర అన్నట్లుగా బతుకమ్మలను మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు లయబద్దంగా కొడుతూ, ఒకరు బతుకమ్మ పాట చెపితే మిగితావారు అందరు అంటుంటారు. స్త్రీలకు, పిల్లలకు అది ఒక ఆనందాల వేడుక. ఆహ్లాదాల గీతిక. నిజంగా ఊరు ఊరంతా ఒక దగ్గర చేరి ఆడుకోవడమనేది ఒక అపురూపమైన దృశ్యకావ్యం. మగవారు, మగ పిల్లలు కూడా ఈ బతుకమ్మ పండుగ నాడు స్త్రీలతో పాటుగా వెళ్లి వారి ఆటలను, పాటలను చూస్తూ కాలక్షేపం చేస్తారు. సాయంత్రం నాలుగు, అయిదు గంటల ప్రాంతంలో వెళ్లి పొద్దు గూట్లో పడేవరకు బతుకమ్మలు ఆడి, ఆ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, కొన్ని నీళ్ళను బతుకమ్మను పేర్చిన పళ్ళెములోనో లేదా తాంబాలములోనో తెచ్చుకొని పసుపు గౌరమ్మలను ఆ నీళ్ళతో తడిపి ఒకరికొకరు పసుపును వారివారి చెంపలకు పెట్టుకొని, వారు తెచుకున్న సత్తును సిబ్బిలలో ఒకరికొకరు ఇచ్చుకోవాయినం, పుచ్చుకోవాయినం అని పరస్పరం అందచేసుకొని ఆనందపడుతుంటారు స్త్రీలు. వాగు ఒడ్డ్డు నుంచో, చెరువు దగ్గరి నుంచో ఇంటికి తిరిగి వస్తూ కూడా ఇండ్లు చేరుకోనేవరకు బతుకమ్మకు సంభందించిన విభిన్నమైన పాటలు…

ఒక్కేసి పువ్వేసి చందమామ/
ఒక్క జాము ఆయే చందమామ…’ అనే బాణీ లొ ఉన్న పాటలు,
శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ.
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ…’ అనే బాణీలో ఉన్న పాటలు ఇంకా
‘ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయోప్పునే గౌరమ్మ .
ఆట చిలుకలారా, పాట చిలుకలారా, కలికి చిలుకలార
పందుమ్మ గుడ్డలూ, రానుపోనడుగులూ
ఘనమైన పోన్నపువ్వే గౌరమ్మ
గంటెల్ల ఒడ్డాణమే గౌరమ్మ..’ అనే పాటలు పాడుతూ ఇంటికి చేరుకుంటారు మనసు నిండా ఉల్లాసాన్ని నిలుపుకుంటూ వస్తూ.

బతుకమ్మ అనేది శ్రామిక జీవన సౌందర్యానికి చక్కటి ప్రతీక.
ఇది పూల పండుగ, ఇది స్త్రీల పండుగ, ఇది బతుకు పండుగ. ఇది తెలంగాణ ట్రేడ్ మార్క్ పండుగ. ఎవరో ఆడుకోమ్మంటేనే ఈ పండుగను జరుపుకోవడం లేదు తెలాంగాణ స్త్రీలు బతుకమ్మ పండుగ చరిత్ర ను త్రవ్వి చూస్తె 800 సంవత్సరాల చరిత్ర ఉంది అని తెలుస్తుంది ఈ పండుగ గురించి. తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ ఇది. అలా తెలంగాణాలో విశిష్టమైన పండుగ ఇది.

-సబ్బని లక్ష్మీనారాయణ
8985251271

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!