Monday, March 1, 2021
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 15 వ వారం) -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 15 వ వారం) -శ్రీ విజేత

జీవితమనే నాలుగు రోడ్ల కూడలిలో నిలుచోని కొత్త జీవితంను ఆహ్వానింపలేక పాత జీవితంలో ఇమడలేక ఒక నిర్ణయానికి వచ్చి అతని కోరిక ప్రకారం బతుకడానికి నిర్ణయించుకొని మా అత్తగారికి ఒక లేఖ రాసి పంపించినాను నాకు విడాకులు ఇప్పించి విముక్తి ప్రసాదించమని. వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. నాకు విడాకులు ఇవ్వడానికి ఆ కుటుంభం సిద్ధపడి లేదు అని అర్థమయ్యింది. వారు నన్ను ఇంకా వారి ఇంటికి తీసుకవెళ్ళదానికే ఇష్టంగా ఉన్నారని తెలిసింది. మావాళ్ళు కోరుకున్నది కూడా అంతే. నాకు విడాకులు ఇప్పించలేరు, ఇంకో పెళ్లి కూడా చెయ్యలేరు. నేను నచ్చినట్టుగా వెళ్లి బతుకుదామంటే కూడా వాళ్ళకు ఇష్టం ఉండదు. కష్టమో, నష్టమో అత్తవారి ఇంటివద్దనే ఉండడం వాళ్ళకు ఇష్టం. కాలాన్ని కొన్ని రోజులు గమనించి చూసాను, ఏమి జరిగినా, ఎలా బతికినా పరువా లేదులే అన్నట్లుగా. అతడు ఆహ్వానించిన జీవితంలోకి వెళ్లే సాహసం చెయ్యలేనందుకు కూడా ఒకోసారి బాధ అనిపించేది. ఎంతైనా నా నిర్ణయం ఖచ్చితంగా చెప్పిన తరువాత ఇక నా కోసం అతడు ఎన్ని రోజులని ఆగుతాడు? రాని దాని కోసం ఎన్ని రోజులు ప్రాకులాడుతారు ఎవరైనా? ఎందరి ఒత్తిడులను మాటలను కూడా అతడు ఎదుర్కొనవలసి వచ్చిందో. నా కోరిక అతడు పెళ్లి చేసుకోవాలని వేరొక అమ్మాయిని . అన్నట్లు గానే అతని పెళ్లి మే మాసంలో జరిగింది. నాకేమి చెప్ప లేదు, నన్నేమి కలువలేదు అతడు. నన్ను కలిసే అవకాశం కూడా బహుశా అతనికి లేకపోవచ్చు. జీవితం మనం ఊహించి నట్లు జరుగడానికి సినిమా కథ కాదు కదా ! అతడు పెళ్లి చేసుకొంటే నేను సంతోషపడ్డాను. దూరంగా పెళ్లి బరాత్ లొ అతడు పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళుతున్నపుడు చూసి మనసుతోనే దీవనలిచ్చాను. మా ఇంటివైపు వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చినపుడు అతని భార్యను కూడా చూశాను. బాగానే ఉంది నాలా, ఆమెకు నేను ఎవరో తెలియదు. జీవితం ఎంత విచిత్రమైనది, ఎవరికి ఎవరితో బంధం అలా రాసి పెట్టి ఉంటుందేమో అనిపించింది! అతడు ఎంతో తాపత్రయ పడ్డాడు నా కోసం, అయినా నేను అతని కోసం అతను కోరుకున్నట్లు అతని జీవితం లోకి వెళ్ళలేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు నిజమేమో అనిపించింది. ఒక్క ఏడాది గడిచిపోయింది, అతడికి కొడుకు పుట్టిండు అని తెలిసింది. సంతోషం వేసింది అతడు జీవితం లొ స్థిరపడి పోతున్నాడు అని. ఆ ఏడాదిలో అతడు నాకు కనీసం ఒక్కసారి కూడా కనిపించలేదు. అతని మనసు గాయపడిందేమో నా మూలంగా, మా యింటి చుట్టు మనుష్యులు అతని హృదయాన్ని గాయపరిచారేమో అనిపించింది. ఇక నా జీవితం గురించీ ఆలోచించాలనుకున్నాను. ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలానే ఉంది జీవితం. నా జీవితాన్ని బాగుచేసేవారు లేరు, సరిదిద్దేవారు కూడా లేరు అనిపించింది. ఎవరి జీవితాన్ని వారే సరిదిద్దుకోవాలేమో అని తెలుస్తుపోయింది. నా మొండితనం, నా పట్టుదల, నా అర్తంచేసుకోలేనితనం, నన్ను ఇలా ఉంచుతున్నాయా అనిపించింది. ఎవరి జీవితాన్ని వారే మలచుకోవాలేమో ఉన్నంతలో సరి అయిన దిశలో. జీవితంలో కొంత త్యాగం చెయ్యాల్నేమో, కొంత అర్థం చేసుకోవాల్నేమో, కొన్ని కోరికలను చంపుకోవాల్నేమో, కొంత సర్దుక పోవాల్నేమో అనిపించింది. అతడు రాసిన నవల ముగింపు జ్ఞాపకం వచ్చింది. చనిపోతాననుకున్న నేను మనసు మార్చుకొని మళ్ళీ అత్తారింటికి వెళ్ళి సీదా సాదా గృహిణిగా బతుకుతున్నట్లు ముగించాడు. అతని కోరిక నేను చనిపోకూడదని. ఆలోచిస్తే నిజమేమో అనిపించింది. ఇక ఈ బతుకులో విడాకులు ఇప్పించుకోనేంత శక్తి కూడా నాకు లేదు. విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనే ఇష్టం కూడా నాకు లేదు. మరో పెళ్లి అనేది నాకు నచ్చని విషయం. ప్రాణంలా ప్రేమించే ప్రేమికుడిచే వచ్చిన అవకాశాన్ని కూడా వద్దనుకున్నాను.ఇక మరొకరితో పెళ్లి అనే మాట లేదు నా దృష్టిలో . బతుకుతే ఇదే మొగుడితో లేకుంటే చావడమే నయమనిపించింది. కాని చచ్చే అంత నిర్ణయాన్ని మాత్రం ఇక తీసుకోవద్దు అనుకున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో నాకు చెప్పేవారు, సలహాలు ఇచ్చేవారు కూడా ఎవరు కనిపించలేదు. పెళ్లి అనేది హైందవ సమాజంలో ఒక బలమైన పీటముడి లాంటిది, అది తెంపేద్దామంటే ఊర్కే తెగిపోయేది కాదు. బతుకులొ ఆలోచిస్తే ఎక్కువ దారులు ఏమి కనిపించ లేదు. బతుకాలి లేదా చనిపోవాలి, చనిపోయే ఆప్షన్ అయిపొయింది. ఇక ఎవరితో బతుకాలి అనేదే. కనిపించిన , ఉన్న ఆప్షన్ ఒక్కటే ఇష్టం ఉన్నా, లేకున్నా, నచ్చినా, నచ్చకున్నా మొగుడి దగ్గరకు వెళ్లిపోయి బతుకడమే మార్గంలా కనిపించింది. వాళ్ళకు ఇష్టం లేకుంటే ఇక్కడే ఆగిపోయే దాన్నేమో, కాని వాళ్ళు నన్ను విడిచి పెట్టడానికి ఇష్టపడలేదు. ఇంకా అప్పటికీ నన్ను తీసుకవెళ్ళదానికి రాయభారాలు, సంప్రదింపులు తెలిసిన బందువుల ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా నడిపిస్తుండేవారు. కాల మహిమ ఎంత గొప్పది! అది ఎంత పెద్ద గాయాన్ని అయినా మాన్పుతుందట! ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చూపుతుందట ! అంతా మనసులోనే, మనసును నింపుకోవడంలోనే ఉంటుందేమో ! ఒకనాడు నచ్చని జీవితం ఇప్పుడు ఎలా నచ్చుతుందంటే, అంతా జీవితాన్ని అనుకొని స్వీకరించాడంలోనే ఉంటుందేమో, ఇష్టపడి, ఇష్టం చేసుకొని స్వీకరించడం లోనే ఉంటుందేమో అని అనిపించింది.!

కాలం సృష్టించిన నాటకంలో నేను ఒక పాత్రను అనిపించింది. ఆ కాలం నన్ను ఎటు తీసుకపోతుందో, ఈ జీవితంలో ఎన్ని మార్పులకు గురి చేస్తుందో చూడాలనిపించింది. జీవితంలో కొందరి ఇష్టానికి, కొందరి ప్రేమకు, కొందరి అభిమానానికి తలవంచక తప్పలేదు నేను. అతడే నాకు ఆదర్శంలా కనిపించిండు, అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అతని కోరిక మేరకు బతుకాలనుకున్నాను. నేను కోరినట్లు అతడు పెళ్లి చేసుకొని బతుకుతున్నాడు భార్య కొడుకుతో. ముందుముందు నేను కూడా అలా సంసార జీవితంలో బతుకవచ్చుగా అనిపించింది పిల్లా పాపలతో. అంత గొప్పగా బతుకక పోయినా ఒక సాధారణ గృహిణిగానైనా బతుకవచ్చు అనిపించింది. జీవితానికి ఏదైనా సమర్పణ కావాలి కావచ్చు. కష్టాలను ఎదుర్కొనే నేర్పు, ఓర్పు ,సాహసం కావాలి కావచ్చు. ఆ నేర్పు, ఓర్పు, సాహసములను నేను నేర్చుకోవాలని అనుకున్నాను. జీవితంలో ఏమి వచ్చినా పరువా లేదు, కష్టం వచ్చినా పరువా లేదు , స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నపుడు ఇక బాధ ఉండదేమో! పరిపరివిధాల పరితపించాను, ఆలోచించాను, మొండిదానిలాగా బతికాను, చివ్వరికి చచ్చిపోవాలని కూడా అనుకున్నాను, ఏది నా చేతిలో లేదనిపించింది. కాల ప్రవాహంలో ఇలా కొట్టుకపోతున్నాను అనిపించింది. ఇక ఆ కాలమే నన్ను కరుణిస్తుందేమో చూడాలి అనుకున్నాను. కళ్ళ ముందు ఈ మనుష్యులందరూ కనిపించారు. ఎవ్వరు ఏమి ఇస్తారు నాకు, ఎవ్వరు నా కష్టాలను తీరుస్తారు, ఉట్టి మాటల వరకే కదా ! అని అనిపించింది. ఈ సమాజం, ఈ బందువులు అందరు నేను కష్టపడుతూ అయినా ఓక సామాన్య గృహిణిలా బతుకాలనే ఆశిస్తారు, ఆశించారు, అంతకు మించి ప్రేమ పేరుతో నేను సాహసం చేసినా జీర్ణం చేసుకొనే స్థితిలో వాళ్ళు ఉండరు అని తెలిసి వాళ్ళ ముందట నేను ఓడిపోయి, వాళ్ళ అహాన్నే గెలిపిస్తూ నేను మొగుడి దగ్గరకే వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నాను. కుంటివాడైనా, గుడ్డివాడైనా, అవిటివాడైనా భర్త భర్తే అంటుంది ఈ సమాజము, బర్తను అర్థం చేసుకొని స్త్రీ అణిగి మణిగి ఉండాలంటుంది ఈ సమాజం. స్త్రీకి స్వేచ్చ, స్వాతంత్ర్యం అనే మాటలు ఆ ముప్పయి ఏండ్ల కింద ఉట్టి మామూలి మాటలే నా బోటి దానికి అనిపించింది. ఎవర్ని కాదనుకున్నానో, ఎవర్ని వద్దనుకున్నానో, ఎవర్ని ఇష్టం లేదనుకున్నానో ఆ మొగుడి దగ్గరికే వెళ్ళాలనుకున్నాను, నన్ను ప్రాణములా ప్రేమించే మనిషి ఉన్నాడు అని తెలిసీ కూడా. తరతరాలుగా బూజు పట్టిపోయిన బావాలతో నిండి ఉన్న మనుషుల మధ్య పుట్టినందుకేమో నేను కొంచెం కూడా అధునాతనంగా ఆలోచించక పాతభావాల చట్రంలో పడి కొట్టుకపోయాను. తృప్తి అంటే బహుశా నేను ఏమి మిగిల్చుకోక పోవచ్చు. సర్దిపెట్టుక పోవడమే అయ్యింది బతుకు. జీవితంలో మిగిల్చుకొన్న తృప్తి ఒక్కటే నన్ను ప్రాణములా ఇష్టపడిన, ప్రేమించిన ఒక మనిషి ఉన్నాడనే !

అలా మనసును దృఢపరుచుకొని నేను ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావలసి వచ్చింది. జీవితం మనం అనుకున్నట్టు జరిగే ఒక తమాషా ఘట్టం మాత్రం కాదు. అది కొంత స్నేహం, కొంత ఇష్టం, కొంత ప్రేమ, కొంత అభిమానం, కొంత సామాజిక బాధ్యత అని కూడా తెలిసి వచ్చింది. మార్పు అనివార్యమైనపుడు మారడానికి ప్రయత్నించాలి మనిషి. ప్రవహిస్తున్న ఏటికి ఎదురీదడం అన్ని వేళలా కుదురదు. పెళ్లి జరిగిన నాడు పదహారు ఏళ్ళు, అజ్ఞానం, ఆ అజ్ఞానం లోనే ఇన్నేళ్ళు గడుపుతూ వచ్చానేమో! ఆరేళ్ళు ఒడుదొడుకులతో గడిచి ఇప్పుడు ఇరువది రెండు ఏళ్ళు వచ్చినాయి. జీవితమంటే తెలియ వచ్చింది, అది కూడా చేతులారా కొన్ని పోగొట్టుకున్న తరువాత. నా జీవితానికి నేనే బాధ్యురాలిని ఇతరులు ఎలా అవుతారు. నా నిర్ణయానికే నేను కట్టుబడి ఉన్నపుడు, ఇతరులను నిందించి ఏమి లాభం అని తెలిసింది. ఇతరులు నాకు ఎలాంటి సూచన, సలహా ఇవ్వరేమో! ఆలోచిస్తే మబ్బులు వీడినట్లు భ్రమలన్నీ తొలగి పోయినాయి. ఉట్టి మొండి మనిషిని అనిపించింది నాపై నాకే జాలి వేస్తూ. అలోచిస్తుంటే కన్నీటి చుక్కలు కనుకొలుకుల్లోంచి టపటపా రాలి చెంపలపైనుంచి వెచ్చగా జారి పెదాలకు ఉప్పుగా తగిలినాయి. హృదయ మాలిన్యం తొలగిపోయిందేమో అనిపించింది.

ఆ తెల్లవారి అన్నయ్య కలిశాడు. మన మంచి కోసం మన శ్రేయోభిలాషులు అనే వారికి చెప్పుకుంటే మంచిది అనిపించి అన్నయ్యకు చెప్పాను,” నేను అత్తగారింటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను ‘ అని.

అన్నయ్య “మంచి నిర్ణయం” అన్నాడు వాదనలు లేకుండా.

“కష్టాలు అందరికి ఉంటాయి ఏదో రూపకంగా వాటిని తొలగించుకొని పోవడమే జీవితం “ అన్నాడు

బాధను, కష్టాన్ని ఆత్మీయులకు చెప్పుకుంటే కొంత తీరుతుంది అంటారు, నా అజ్ఞానాన్నో, అమాయకత్వాన్నో తలచుకొని అన్నయ్య ఎదపై వాలి ఏడ్చాను.

“ఊర్కో, నేను లేనా నీకు, ఏమి కాదు, అంతా మంచే జరుగుతుంది “ అన్నాడు అనునయంగా.

ఆ మాట చాలు అనుకున్నాను. నా నిర్ణయానికి ఇంట్లో అమ్మ సంతోషపడింది. అక్కలకు, బావలకు విషయం తెలిసి వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మా అన్నయ్యలు, వదినలు కూడా సంతోషపడ్డ్డారు.

ఇంటి దగ్గరి మనుషులు కూడా విషయం తెలుసుకొని కొంత ఊరట చెందారేమో! వాళ్ళ ముందట నేను వాళ్ళు బహుశా ఊహించినట్లు ప్రేమ అంటూ వెళ్లిపోనందుకు. సమాజంలో పెళ్లి ఒక కష్టాల ఊబి లాంటిదేమో, ఆ ఊబిలొ పడి స్త్రీ పురుషులు పడి విలవిలా కొట్టుకుంటూ గడుపవలసిందేమో జీవితం. ఆ ఉబిలో ముందుగా పడ్డవారు, తరువాత వారు అచ్చం అలానే అందులో పడి గిలగిలా వాళ్ళలానే కొట్టుకుంటూ జీవించాలని కోరుకుంటారేమో. అంతకు మించి సమాజనియమాలు, కట్టుబాట్లను అదిగమిస్తే వారికి నచ్చదేమో! నేను సమాజ నియమాలు, కట్టుబాట్లకు అనుగుణంగానే బతుకాలనుకున్నాను. ఇక బాధ ఉండదు అనిపించింది. నేను నా తృప్తి కోసం కన్నా లోకం తృప్తి కోసం బతుకాలనిపించింది. నేను లోకం కోసం ఓడిపోతూ లోకాన్నే గెలిపించాలని నిర్ణయించుకున్నాను.

ఒక మంచి రోజు నాడు మా అత్తమ్మ, మా వారు వచ్చారు నన్ను తీసుకవెళ్ళడానికి. అప్పుడు అన్నయ్య కూడా ఉన్నాడు ఇంటి వద్ద . అలా మళ్ళీ దేన్నయితే వద్దనుకున్నానో ఆ జీవితంలోకి ఇష్టపూర్తిగా వెళ్ళిపోయాను మనసు నింపుకొని అత్తగారింటికి. ( మిగితా వచ్చేవారం…).

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!