Monday, August 8, 2022
Home > కథలు > || దారి చూపిన కళ || -వి. సునంద

|| దారి చూపిన కళ || -వి. సునంద

పేపర్లో ఆ వార్త చూడగానే సాధన మనసు ఒక్కసారిగా గతంలోకి పరుగెత్తినది…
ఎలాగైనా వీలు చూసుకొని వెళ్ళాలి. అందులో… అందులో నన్ను నేను వెతుక్కోవాలి…. రోజంతా అదే ఆలోచన…
షాపుకెళ్ళింది. అన్నింటి వంకా తృప్తిగా చూసుకుంది…
సాధనను వింతగా చూస్తూ “మేడమ్! మీరివాళ ఏదో ఆలోచనలలో తేలిపోతున్నట్టుగా వున్నారు.. అదేంటో చెప్పరా!” కొంచెం చనువుగా అంటున్న పార్వతిని చూస్తూ విడివడని నవ్వు మొహంతో “ఆ తర్వాత చెబుతాను గానీ ఓ నాలుగు రోజులు షాపును జాగ్రత్తగా చూసుకోగలవా” అంది.
“మీరు.. మీరు షాపును వదిలి నాలుగు రోజులు ఉండగలరా” ముందా విషయం తేల్చమన్నట్టుగా కొంచెం ఆరా తీస్తున్నట్టుగా, ఆశ్చర్యంగా అడిగింది.
నిజం పారూ! వెళ్ళాలి… ”నా గతం బావిలోని జ్ఞాపకాలను తోడుకొని మనసూ తనువూ ఆనందంతో అభ్యంగన స్నానం చేయాలి” అంటున్న మాటల అర్థం అంతుపట్టక అలాగే చూస్తుండి పోయింది పార్వతి.
వీళ్ళిద్దరి మాటలను ఆసక్తిగా వింటూ మరో ముగ్గురు పనులలో తలమునకలుగా వున్నారు…

సాధన ఓ నలుగురితో చిన్న షాపు నడుపుతోంది…
అందులో వాళ్ళు బొమ్మలను
తయారు చేస్తుంటారు.మొదట్లో బొమ్మలను చూసి ఎవరు కొంటారవి అని పెదవి విరిచిన వారే, అవే ఆ ఐదు కుటుంబాలను పోషిస్తున్నాయంటే ఆశ్చర్య పడుతుంటారు.
అక్కడ పని చేసేవాళ్ళలో పార్వతి ఒక్కతే పది పాసయ్యింది. మిగిలిన ముగ్గురు చదువుకు, తల్లిదండ్రులకు దూరమైన అనాధలు. బతుకు దెరువు కల్పించిన సాధనే వారికి తల్లీ తండ్రి గురువు దైవం..
సాధన కూడా అనాధనే చెప్పుకోవచ్చు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. సవతి తల్లికి బరువైంది. పనులకందని పిల్ల వల్ల లాభమేంటని మొగునితో పోరి అనాధాశ్రమంలో చేర్పించింది. మొదట్లో తండ్రి చూడటానికి వచ్చిప్పుడల్లా ఇంటికొస్తానని పేచీ పెట్టేది. రాను రాను ఆ ఇంటిలో తన స్థానమేమిటో తెలిసిపోయింది.అక్షరాలే తనకు అమ్మా నాన్న అని, వాటి వెలుగులో బతుకును పండించుకోవాలనుకుంది. ”అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితమెందుకవుతుంది”.
చదువులో రాణిస్తున్నందుకు కాదు, పూవై వికసిస్తున్న సాధన గురించి ఆనోట ఈనోట పినతల్లికి తెలిసింది…
”ఆడపిల్ల అందునా ఈడొచ్చిన పిల్ల” అక్కడెందుకింకా తీసుకొచ్చి పెళ్ళి చేద్దాం” అన్న మాటల్లో మర్మం తెలియని సాధన తండ్రి సంతోషంతో మురిసి పోయాడు. సవతి తల్లైనా, ఆ తర్వాత ఇద్దరు పిల్లల తల్లయింది కదా! అందుకే తల్లి మనసు బిడ్డ భవిష్యత్తు కోసం తపన పడుతుంది అనుకున్నాడు..
వెంటనే సాధన వున్న ఆశ్రమానికి వెళ్ళి యాజమాన్యానికి ఈ విషయం చెప్పాడు.
ముందు వాళ్ళూ ఒప్పుకోలేదు. స్వయాన కన్నతండ్రి వచ్చి అడగడంతో సాధనను ఆశీర్వదిస్తూ, తండ్రికి అప్పగిస్తూ
“అమ్మాయి చాలా చురుకైనది, చదువు ఆపవద్దు మంచి భవిష్యత్తున్న పిల్ల” చెప్పి పంపించారు.
స్నేహితురాళ్ళంతా తన నేస్తానికి కుటుంబం దొరికిందని ఆనందం, మరోవైపు దూరమవుతుందని ఆవేదనతో భారంగా సాగనంపారు..
అందరి దగ్గర సెలవు తీసుకుంటూ తనకిష్టమైన టీచర్ సభాషిణి మేడం దగ్గరకు వెళ్ళింది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం ఆగలేదు. మేడం చేతుల్లో ముఖం పెట్టి బోరుమని ఏడ్చింది.
“పిచ్చిపిల్లా! ఇంతమందిలో వున్నా నీకంటూ కుటుంబం లేదని ఇంతకాలం కుమిలి పోయావు. కన్నతండ్రి బాధ్యత తెలిసి వచ్చాడు. నిన్ను చదివిస్తానంటున్నాడు. నిన్ను ఎప్పటికైనా ఉన్నతస్థాయిలో చూస్తానని నమ్మకం నాకుంది.. నేను నేర్పించిన విద్యాబుద్ధులు. నీకెప్పటికీ తోడుంటాయి బంగారూ! అంటూ ప్రేమగా తల నిమిరి వెన్ను తట్టి పంపించిన జ్ఞాపకం ఇప్పటికీ సజీవంగా తనలో వెలుగులీననుతూనే వుంది…
ఇంటికొచ్చిన తర్వాత కదా తెలిసింది నాన్న నిస్సహాయత, సవతి తల్లి నిజ స్వరూపం… మన ఇంటా వంటా లేని చదువు అంత అవసరమా అంటూ ఊళ్ళో పది పూర్తవ్వగానే మానిపించేసింది. ”తమ్ముడు చెల్లెండ్ల బాధ్యత నెత్తినేసి నలుగురిలో నేను చూడు ఎలాంటి తేడా లేకుండ ఎంత ప్రేమగా చూస్తున్నానో” అని చుట్టు పక్కల వాళ్ళతో మెప్పు పొందిన తల్లి యుక్తికి చేష్టలుడిగి అలాగే వుండి పోయింది..
పొద్దంతా చాకిరితో అలసిపోయి పడుకున్నా, మేడం మాటలు చెవిలో కర్తవ్యం బోధిస్తూ తనేం చేయాలో గుర్తు చేసేవి…కానీ ఎలా సాకారం చేసుకోవాలో తెలియలేదు సాధనకు.
కంచెపై బడిన చీరైతే తీసుకునేటపుడు చిరుగులు పడ్డా కుట్టుకుని కట్టుకోవచ్చు. కానీ జీవితం.. “వంచన కంచెలో పడిన జీవితం ఎలా బయట పడుతుంది”
బాధ్యత తీర్చుకుంటున్నామంటూ చదువూ సంధ్యలేని దూరపు బంధువుకు కట్టబెట్టినపుడు ఎదిరిస్తే ఏమవుతుందో తెలిసి మౌనంగా అతనితో ఏడడుగులు నడిచి పుట్టింటి నుండి అత్తింట్లో అడుగుపెట్టింది…
ఖమ్మానికి దగ్గర్లోని పల్లెటూరది. ఇప్పుడిప్పుడే పట్టణ పోకడలను వంటబట్టించుకుంటున్న ఊరది. ఇంటి పనులు తప్ప కూలి పనులు తెలియని సాధనకు భర్త తెచ్చేకూలీ డబ్బులు ఇంట్లో తిండికే బొటాబొటిగా సరిపోతుంటే తనూ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది.
భర్తతో ఖమ్మం వెళ్ళి ఓ రెండు
ఇండ్లలో పనికి కుదిరింది. ఆత్మాభిమానం దెబ్బతిన్న సాధన ఆ పనులను మానేసింది…
చదువు లేకున్నా సంస్కారం ఉన్న భర్తకు తన మనసులోని కోరికను చెప్పింది.
చదువుకున్నా వినయ విధేయతలున్న భార్యంటే చాలా ఇష్టం. అత్తమామలు కూడా సాధనకు అండగా నిలవడం. సాధన కలలకు రెక్కలొచ్చాయి.
భర్తతో వెళ్ళి కావలసినవి తెచ్చుకుంది.
ఎప్పుడో నేర్చుకున్న కళను సానబట్టుకుంది. తయారు చేసిన బొమ్మలు చూసి వాటినెవరు కొంటారని ఇరుగు పొరుగు బుగ్గలు నొక్కుకున్నారు.
చేసిన బొమ్మలతో ఖమ్మంలో ఓ పెద్ద బొమ్మల షాపుకెళ్ళింది.
షాపు యజమాని “వీటినెవరు కొంటారమ్మా… నీ పిచ్చి బొమ్మలు” అంటుంటే దుఃఖం వచ్చింది సాధనకు. “ఇక్కడే వుంచండి ఎవరైనా కొన్న తర్వాతే డబ్బులివ్వండి సారూ”… నిరాశతో ఇంటికి వచ్చింది… భర్తతో కట్టుబడి పనులకు వెళ్ళినప్పుడు మిగిలిపోయిన ఇనుప తీగెలు ఆకర్షించాయి సాధనను. అడిగి తెచ్చుకుని తన దగ్గరున్న ఊలు గుడ్డ ముక్కలతో బొమ్మ తయారు చేసింది. “ఇదేదో చాలా బాగుందమ్మాయీ” అనగానే రోజూ రాత్రి కూర్చోని మరో పది బొమ్మలు తయారు చేసి షాపులో ఇస్తుంటే.. సాధనలోని పట్టుదలకు ఆశ్చర్యపోయి ఆమె కోరికను కాదనలేక వాటిని అమ్మకానికి పెట్టాడు. అవి చూసిన యజమాని భార్య ఇవి బాగున్నాయండీ. అమెరికా వెళ్ళేటప్పుడు వీటిని తీసికెళ్తా అక్కడ మనమ్మాయి ఫ్రెండ్స్ కు ఇస్తానని తీసికెళ్ళింది..
ఆమె అమెరికా ప్రయాణం సాధన పాలిటి వరమయ్యింది…
“బొమ్మలు బాగున్నాయంటున్నారు. ఇంకా కావాలంటున్నారు ఆ అమ్మాయి చేస్తుందేమో అడగండి” అని స్కైప్ లో మాట్లాడిన భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు. అవునండీ ఒక్కో బొమ్మ పది డాలర్లకు అమ్మింది మనమ్మాయి ఫ్రెండ్. “అక్కడి వారికి కొత్తదనంతో కూడిన హ్యాండీ క్రాఫ్ట్స్ అంటే బాగా ఇష్టపడటమే కాదు ఎంత రేటైనా కొంటారటండీ” అనడంతో దీనంగా నిలుచున్న సాధన కళ్ళముందు మెదిలింది. ఆ అమ్మాయి జీవితానికో అద్భుతమైన మలుపవుతుందని,
మరుసటి రోజు ఆఘమేఘాలతో సాధనను పిలిపించాడు.
విషయం విన్న సాధన కళ్ళలో ఆనందబాష్పాలు. ఇక భర్త సంతోషం చెప్పనలవి కాదు.. చేతులో పెట్టిన రెండువేలను చూసి ఆశ్చర్యంతో అవాక్కయ్యారిద్దరు..
ఆప్యాయంగా మాట్లాడుతూ ”షాపుకు దగ్గర్లో ఓ రెండుగదుల ఇల్లుందని, అందులో ఉండమని చెప్పి, కావలసిన మెటీరియల్ అంతా తెప్పిస్తానని మాటిచ్చాడు.
వాళ్ళ ఆనందంలో పాలు పంచుకున్న అత్తమామలు తామైతే ఊరిని వదిలి రాలేమని చెప్పారు. ఆ మాటలకు బాధ పడుతున్న కోడలిని దగ్గరకు తీసుకుని, నీకు సహాయంగా నీ స్నేహితులు ఎవరైనా ఉంటే తెచ్చుకోమనడం, ఆ సమయంలో పార్వతి పరిచయం కావడం… ఆ తర్వాత బొమ్మలకు పెరిగిన గిరాకీతో మరో ముగ్గురిని నియమించుకోవడం… మలుపులు తిరిగిన గతాన్ని తలుచుకుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది సాధనకు. బతుకును నెట్టుకురావడమే కష్టమనుకున్న తాను, మరో నలుగురికి ఉపాధి కల్పించడం… ఓహ్ తలుచుకుంటేనే ఉద్వేగానికి లోనవుతుంది….
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఆ వార్త…. “హైదరాబాదులో జనవిజ్ఞాన వేదిక వాళ్ళు నిర్వహిస్తున్న సృజనోత్సవం” 300 మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు జరుగుతున్న కార్యక్రమం….
అక్కడే కదా తనలోని సృజనకు అంకురార్పణ జరిగింది.. బడిలో చరుకుగా వున్నానని సుభాషిణీ మేడం, స్కూల్లో హెచ్చెం ను ఒప్పించి తనను తీసికెళ్ళడం ఓ గొప్ప అనుభవం. వేర్వేరు జిల్లాల పిల్లలతో స్నేహం మధురమైన జ్ఞాపకమైతే అక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అంశాలతో పాటుగా బొమ్మలు చేద్దాం కార్నర్ లో సుభాషిణీ మేడమ్ రిసోర్స్ పర్సన్ గా ఉండి, ఈ ఊలు బొమ్మలు తయారు చేయించడం…. తన జీవితానికో బంగారు బాటవ్వడం… భలే వింతగా అంతులేని ఆనందంగా వుంటుంది.
ఎప్పుడో 2004 లో జరిగిన సృజనోత్సవం… మళ్ళీ ఇన్నాళ్ళకు…
అక్కడికి భర్త పిల్లలతో వెళ్ళింది
తనను పరిచయం చేసుకుని కళ్ళతోనే మేడమ్ కోసం వెతకసాగింది. మేడమ్ ఎప్పుడో రిటైరై పోయారని ఆమె తోనే ఆ కళను బొమ్మలు నేర్పించే వారూ లేకుండా పోయారని వాపోతుంటే…
నేనున్నా సర్ నాకు మీరు అవకాశమిస్తే “అమ్మలాంటి ఆ కళను, అన్నం పెట్టిన ఆ విద్యను నేను నేర్పిస్తాను” ఆ మేడమ్ ఫోన్ నంబరిస్తారా, నాకు దారి చూపిన దేవత ఆ మేడమ్, ఒక్కసారి ఆ అమ్మతో మాట్లాడాలి అంటున్న సాధనను చూస్తున్న వారందరిలో ఆశ్చర్యం…
జెన విజ్ఞాన వేదిక
నిర్వాహక వర్గంలో చెప్పలేని ఆనందం.. బాలల్లో సమైక్యతా బీజాలు నాటడమే కాకుండా, బతుకు తెరువుకు కూడా బాటలు వేస్తూ,
విజయవంతమవుతున్న ఈ సృజనోత్సవం… కావాలి మరెందరికో ఆదర్శం అనుకుంటూ ఆత్మీయంగా స్వాగతించారు సాధనను… మరికొందరు సాధనలైనా ఈ బాలల్లో ఉంటారు నేర్చుకుంటారనే నమ్మకంతో…

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!