Saturday, May 30, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 16 వ వారం) -శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 16 వ వారం) -శ్రీ విజేత

జీవితంలో ఒక కొత్త మజిలీ, ఓ కొత్త ప్రయాణంలా అనిపించింది. ఇష్టపడి ఇష్టంతో చేసిన పని కష్టంగా ఉండదేమో, ఇష్టం లేనపుడు అదేపని కష్టం అనిపిస్తుందేమో కూడా. మనసునే కట్టడి చేసుకున్నాను. ఇక బాధేమిలే అనిపించింది. అదే పాత మనుషులు కాని కొత్త జీవితం. పరస్పరం అడ్జస్ట్ కావాలె అన్నట్లుగా జీవితం. ఎన్ని తపనలు పడితేమి, ఎన్నిసార్లు వద్దనుకుంటేమి? మెడకు పడ్డ పాము కరువక మానదు అన్నట్లుగా ఈ బతుకు. మా ఆయనతో నేను మనసు పడాలి ముందుగా! ఇంతకు ముందు అంతా అంటీ ముట్టనట్లుగా, ఇక ఇప్పుడు అట్లా కాదు అనిపించింది. మురిపంగా ముచ్చటగా ఉండాలి కదా! మురిపాలు తెలియనివారికి మురిపాలు నేర్పాలి కదా! ఆయన ఉట్టి ముద్ద ! ఆ మట్టి ముద్దను నాకు అనుగుణంగా మార్చుకున్నాను. మేమిద్దరం పక్కపక్కన నిలుచుంటే ఈడుజోడుగా లేరు అన్నట్లుగా ఉన్నా, ఈడు జోడు మనుషుల్లాగానే కనిపించాలి కదా అని అనిపించి బతుకులో అడ్జస్ట్ అయిపోయాను. కళ్ళు మూసుకుంటే కాపురాలు చెయ్యచ్చు చీకట్లో, ఇష్టం అఇష్టాల సంగతి దేవుడెరుగు. నటించాలేమో జీవితంలో ఒకొసారి అనిపించేది. బాధ్యత కోసం బతుకాలి కదా అనిపించేది. భార్యధర్మం తను, భర్త ధర్మం ఆయన నిర్వర్తించాలి కదా అనిపించి బతికామేమో. మా ఒడుదొడుకుల కాపురంలో నా కడుపులో ఓ కాయ పడింది. నేను నెల తప్పానని తెలిసింది. ఇంట్లో అందరికీ సంబురం. ఇంటికి పెద్ద కోడలును కదా! పిలల్ని కనకున్నా గొడ్రాలు అని నిందించే లోకం ఇది. అమ్మ, అక్కలు విషయం తెలుసుకొని సంతోషించారు. దాంపత్యం గట్టి పడాలంటే పిల్లలు ఉండాలేమో, అది అందరి తాపత్రయంలా కనిపించింది నాకు. జీవితం ఎంత విచిత్రమైనది అనిపించింది! మద్యలో ఒక్కసారి అమ్మావాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాను. కడుపుతో ఉండి మనిషిని నిండుగా కనిపిస్తున్నావని అన్నారు అందరు. నిజంగానే అద్దంలో చూసుకుంటే నిండుగా కుందనపుబొమ్మలా నన్ను నేనే నమ్మనట్లుగా! అమ్మతనం అంత నిండుతనం ఇస్తుందా స్త్రీకి అనిపించింది.! అమ్మ ఫలహారాలు చేసి పెట్టింది ఐదో నెల అని. అక్కలు కూడా వచ్చి కూడా సంబురపడ్డారు నన్ను చూసి. వాళ్ళ అందరి కళ్ళల్లో ఒక తృప్తి కనిపించింది నేను జీవితంలో స్థిరపడుతున్నందుకు. ఇది బహుశా వాళ్ళు ఊహించని విషయం. మధ్య మద్యలో అమ్మ దగ్గరికి వచ్చి డాక్టర్ చెకప్ చేయించుకున్నాను. తొమ్మిది నెలలు నిండే రోజు వచ్చింది. తొలిచూలు కానుపు కదా అమ్మవాళ్ళే చూసుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. డాక్టరమ్మ ఇచ్చిన తేదీ ప్రకారం ప్రవేటు దవాఖానాలొ నార్మల్ గానే డెలివరి అయినాను. నా పేగు తెంచుకొని కొడుకు పుట్టాడు. తృప్తిగా కళ్ళకు అద్దుకున్నాను. బరువుగా రెండు వెచ్చటి కన్నీటి చుక్కలు రాలినాయి. ఇప్పుడు నేను ఒంటరి కాదు నాతో పాటు నా పేగు త్రెంచుకొని పుట్టిన బిడ్డ తోడుగా ఉంది అనిపించింది. అమ్మ సంతోషానికి అవధులు లేవు. ఏడాది గడిచే నాటికి ఎంతలో ఎంత మార్పు. దావఖానలకు అందరు వచ్చి చూసిపోయారు, పుట్టింటి బంధువులు, మెట్ట్టినింటి బంధువులు మా ఆయనతో సహా! దావఖాన నుండి ఇంటికి వచ్చిన తరువాత అందరికీ చేసే లాగానే పురుడు చేశారు బాబుకు. ఎవరికి నచ్చినపేరు వారు పెట్టుకున్నారు. నాకు నచ్చిన పేరు నేను పెట్టుకున్నాను. అచ్చం బాబు బాపమ్మలానే ఉన్నాడు అన్నారు. మూడు నెలలు గడిచేలోపున ఒకసారి ఆతగారి ఇంటికి వెళ్లి వచ్చాను. తరువాత అయిదు నెలలు నిండిన తరువాత మళ్ళీ అత్త గారింటికి వెళ్లాను. కాలం ఈజిగానే గడిచిపోయింది. బాబుకు యాడాది వచ్చేసింది. ఆ తరువాత నెలకు మా మరిదికి పెళ్లి కుదిరింది, నాకు ఒక తోటి కోడలు వచ్చింది. బతుకులో బరువులు బాధ్యతలు పెరిగినాయి. పెద్ద కోడలిని కదా, నా మాటకు, పనికి గౌరవం ఇచ్చేవాళ్ళు ఇంట్లో. మా మరిది చదువుకున్నాడు డిగ్రీ వరకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉండేవాడు. మా తోటి కోడలు కూడా చదువుకున్న అమ్మాయే! వాళ్లకు ఉద్యోగాలేమైనా రావచ్చు, మాకే వ్యవసాయమే ఆధారం అనిపించేది. ఇన్ని ఏళ్ళు నేను బతుకులో ఏమి పట్టించుకున్నానని, అత్తగారింటికి కూడా ఉట్టి చుట్టపు చూపుగా వచ్చిపోయినట్లు అనిపించేది. ఇప్పుడు అట్లా కాదు, బతుకంటే బాధ్యత అని తెలిసింది. ఎన్ని ఉంటె బతుకులో అన్నీ ఉన్నట్టు! సంసారం అంటే అప్పుడు తెలుస్తూ పోయింది. రైతు కుటుంభం కదా ఇంట్లో ధాన్యం ఉంటె ఉండచ్చు. ఇక అన్నీ కొనుక్కచ్చుకోవలసిందే. ఏడాదికి రెండు సార్లు పంటలచ్చినప్పుడే పైసలు. అవైయినా ఇంటి పెద్దలు అత్తామామలె లెక్కలు చూసుకుంటారు. మామ బయటి వ్యవహారాలూ చూసుకుంటే, అత్త ఇంటి వ్యవహారాలు చూసుకొనేది, మా అవసరాలు, అక్కరలు అన్ని అత్తగారి ద్వారానే తీరేటివి. నా పని ఇంటి పనులు చూసుకోవడమే. నాకు ఆసరగా ఇంటి పని మనిషి ఉండేది.మా అయన పెద్దగా చదువుకోలేదు కాబట్టి వేరే ఉద్యోగం వచ్చే అవకాశం ఏమీ లేదు. అందరు ఆ వ్యవసాయం చేసుకుంటూనే, చూసుకుంటూనే బతుకాలి, గడుపాలి పాలేర్ల సాయంతో. ఆయన స్వతహాగ కూడా ఏమి పనులు చేయలేడు, చేయించలేడు కూడా. ఉట్టి బోళా మనిషి. పనివాళ్ళతో అదిరించి బెదిరించి కూడా పనులు చేయించలేడు. ఉన్నావురా బసువన్నా అంటే ఉన్నా, తిన్నావురా బసువన్నా అంటే తిన్నా అన్నట్లుగా ఉండేవాడు. అప్పట్లో నాపై నిందలు వేసాడంటే అది ఇంట్లో వాళ్ళు చెపితే అన్నాడు అని అనిపించేది. ఇక నాపై అతని ఆజిమాయిసీ కాని, నన్ను కట్టడిలో ఉంచాలే అనే పరిస్థతి ఏమి కనిపించేది కాదు. ఆయన గాని, వాళ్ళు గాని ఏ మాటలు అనే అవకాశం ఇవ్వకుండా నేను మెదిలేదాన్ని. ఇప్పుడు ఉమ్మడి కుటుంభం కాబట్టి నడుస్తుంది, ముందు ముందు ఎలానో ఆర్టిక పరంగా ఖర్చులకు అని అనిపించేది. ఒక బాధ్యతాయుతమైన జీవితంలో. ఒక యాంత్రికమైన జీవితంలో పడి కొట్టుకపోయాను. బాబుకు ఒక్క ఏడాది దాటిపోయింది. బుడిబుడి నడకలతో అటూ ఇటూ ఉరుకుతున్నాడు. బాబు పుట్టాడు కాబట్టి సంతోషం, అదే ఆడపిల్ల పుడితే, కష్టం అనిపించేది. ఆడపిల్ల పుడితే కట్నకానుకలు ఇచ్చి పెండ్లి చేసే సమాజంలో ఉన్నందుకు బాధ అనిపించేది. అందుకే ఆడపిల్ల వద్దు, మగ పిల్లవాడే నయం అనుకున్నాను. పిల్లలు ఎంత ఆసరా బతుకులో అనిపించేది. ఏమున్నా లేకున్నా ఇంటిల్లిపాది ఆనందంతో ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే. ఇంకో యాడాది గడిచే నాటికి మా తోటి కోడలికి బిడ్డ పుట్టింది. ఇంటిలోకి ఒక అమ్మాయి కూడా వచ్చింది.బతుకంటే ఇదేనేమో సంప్రదాయబద్దంగా, అందరిలాగే మనం బతుకుతూ, అందరు చేస్తున్నట్టే మనం చేస్తూ బతుకు బండిని ముందుకు తీసుకవెళ్ళాలేమో అనిపించేది. ఇంకో యాడాది నాటికి మా మరిదికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఓ ఆరు నెలల తరువాత కుదురుకున్నాక వాళ్ళు టౌన్ వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు కొంత సందడిగా ఉన్న ఇల్లు, ఇప్పుడు బోసిపోయినట్లు, లంకంత ఇంటిలో ఉన్నట్లుగా అనిపించేది. ఎప్పుడూ అదే ఊరిలొ ఉండడం, జీవితంలో పెద్దగా మార్పు లేనట్లుగా అనిపించేది. పెద్దోడికి ఐదేండ్లు వచ్చినాయి. అప్పట్లో పైవేటు బడులేమీ ఉండేటివి కాదు, ఊర్లొనే సర్కారు బడిలో వేసినాం. ఈ అయిదేండ్లలో ఒక్క పిలగాడేనా అని మా అత్త సణుగుడు, ఒక్క పిలగాడు కాదు, ఇంకొకలు ఉండాల్నని. నాకేమో ఒక్కరైనా చాలునని అనిపించేది మా స్తోమతకిది చాలదా అని. ఒకవేళ ఆడపిల్ల పుడితే కష్టమే కదా అనిపించేది. నా జీవితమే ఉదాహరణలా కనిపించేది. జీవితమంటే గడియారానికి అలారం పెట్టుకున్నట్లు ట్యూన్ చేసుకోవడమే, సరే లే అని మనసులో నిర్ణయం చేసుకున్నాను ఇంకో బిడ్డను కనాలని. మా ఆయనకు ఇవన్ని ఏమి పట్టింపులు ఉండవు. అదృష్టవంతుడు, బాదరబంది లేని బతుకు. వేళకింత తిండి, చేయడానికింత పని ఉంటె తరువాత హాయిగా నిద్రపోవడమే. ఒకోసారి అనిపిస్తుండేది ఈ బతుకు ఒక అడవి కాచిన వెన్నెలలాంటిది అని, ఆ వెన్నెలను ఆస్వాదించి జుర్రుకొని త్రాగే ఒక మనషి ఉండాల్నని. అయినా ఎప్పుడూ ఏదీ ఎక్కువ ఆశపడ లేదు నేను. సవాలక్ష సంసారాల్లో మాది ఒక రకం. అనుకుంటే కలుసుకోవచ్చు, వద్దనుకుంటే ఊర్కోవచ్చు. అంతా మా యిష్టం, నా ఇష్టంలా. బంగారాన్ని, మట్టిని ఎలానైనా మలచుకోవచ్చు. అది బంగారం లక్షణం, మట్టి లక్షణం. మా వారు ఉట్టి మట్టి ముద్ద, ఆ మట్టి ముద్దను నాకు అనుగుణంగా మలచుకున్నాను. ఈ ఒక్క విషయానికి కూడా నేను అదృస్టవంతురాలిని. నా ఒడిలో ఇంకో నలుసు పడింది. తొమ్మిది నెలలు గడిచి నాకు ఇంకో బాబు ఉదయించాడు. ఒక్కరు కాదు ఇద్దరు కొడుకులు అని అందరు సంతోషించారు. ముఖ్యంగా అమ్మ తృప్తి పడింది ఆడపిల్ల కానందుకు ఈ సారి కూడా, కాలం ఏమిచ్చినా స్వీకరించాలి కదా అనుకుంటూ కాలాన్ని గడుపుతూ పోయాను. కాలమేమిచ్చినా కాఠీన్యమిచ్చినా అది కరుణించకపోదు అనే నమ్మకంతో గడుపుతూ పోయాను. ఎవరో అన్నట్టు నవ్వినా నాప చేనే పండుతుందట కొందరి జీవితాల్లో, నా బతుకు అలాంటిదే అనిపించింది. బట్టకు పొట్టకైతే కొదువలేదు ఇంటిలో, కొంత డబ్బుల కోసం ఇబ్బంది అయ్యేది. ఇల్లు సవరించడానికి ఇబ్బంది కాలేదు కాని పిల్లల ఖర్చుల కోసం ఇబ్బంది అయ్యేది. కొత్తలో మా మరిది ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి కొంత పంపించేవారు ఇంటికి డబ్బులు. అయిదారేళ్ళు గడుస్తూ వాళ్ళు పంపడం తగ్గించివేశారు టౌన్లో జాగ తీసుకున్నాం ఇల్లు కట్టుకోవడానికి అని. పెద్ద్దోడు సర్కార్ బడిలో ఐదో తరగతి అయిపొయింది, చిన్నోడు ఒకటవ తరగతిలోకి జైన్ అయినాడు. ఎంత తొందరగా గడిచిపోయింది కాలం ఓ పదేళ్ళు అనిపించింది. గతమంతా కళ్ళముందు లీలగా కనిపించేది. మధుర స్మృతిలా అతని జ్ఞాపకం లీలగా హృదిలో మెదిలేది అప్పుడప్పుడు. ఆ ప్రేమ కథ ఏమైనా ఇబ్బందులు కలుగచేస్తుందా అని కొద్దిగా బయపడేదాన్ని. అతడు మంచివాడై, సంస్కారవంతుడై మౌనంగానే ఉన్నాడు. ఆ పదేళ్ళలో ఒక్కసారి కనిపించాడు, బంధువుల పెళ్ళిలో అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు కలిసి ‘బాగున్నావా’ అని అడిగితే ‘బాగున్నాను’ అన్నాడు. ఇక అంతే మళ్ళీ ఎప్పుడూ కలువ లేదు. కాలమంటే కష్టాలతో కూడుకున్నదై కనిపిస్తూ కూడా కష్టాలను పరిష్కరించు కుంటూ దాటుతూ వెళ్లేదిలా కూడా కనిపించింది. కాలం పెట్టె పరీక్షలను ఎప్పుడూ దాటుతూనే వచ్చాను ఇబ్బందులు ఎదురైనప్పటికినీ. ఉమ్మడి కుటుంభం కాబట్టి కొంత ఏర్పడలేదు బతుకు గడువడం. కాని వెయ్యేళ్ళు కలిసి ఉన్నా వేరు తప్పదు అన్నట్లుగా మేం వేరు పడవలసి వచ్చింది. మా మరిదివాళ్ళు టౌన్లో ఇల్లు కట్టుకుంటామన్నారు. ఎవరిది వాళ్ళు వ్యవసాయం చేసుకుందాం అన్నారు. కుటుంభంలో ఒకరిది ఉద్యోగం, ఒకరిది వ్యవసాయం అయితే ఎల్లకాలం అర్ధం చేసుకొనే అవసరం వాళ్లకు కూడా ఎందుకుండాలి. అందుకే వాళ్ళు వేరు ఉంటామన్నారు ఆర్ధిక పరమైన భూమి జాగలను పంచుకొని. ఉన్న పాతిక ఎకరాల్లో మూడు భాగాలు చేశారు, ఒక భాగం అత్తామామలకు బతుకడానికి, ఒక భాగం మాకు, ఒక భాగం మా మరిది వాళ్ళకు. మూడు ప్రదేశాల్లో ఉన్న దాన్ని మూడు మూడు భాగాలుగా పంచుకున్నాం. మాకు కరెంటు భావి దగ్గర కొంత, ఊరి పక్కన కొంత, గుట్టల దగ్గర కొంత వచ్చింది. అప్పుడు అర్ధమైంది జీవితంలో అసలైన కష్టం అంటే, వ్యవసాయానికి పెట్టుబడి కావాలి, పని చేయడానికి పాలేరు కావాలి, పాలేరుకు పండినా పండకున్నా జీతం ఇవ్వాలి, వర్షాదారం అయితే వాన దేవుడు కరుణించాలి, ప్రకృతి కూడా కరుణించాలి. ఒకటి రెండేళ్ళు కష్టాలు పడుతూ వ్యవసాయం చేయించాం. కరువు ప్రాంతం మా దిక్కు. వర్షం తక్కువ. కేనాల్స్ ఏమీ లేవు, బావుల్లో నీళ్ళు తక్కువ. రైతు బతుకు ఏమిటో అప్పుడు అర్దమైంది. చేసుకుంటే తిన్నట్టు లేకుంటే పస్తులున్నట్టు. ఎంత కష్టపడినా రైతుకు కూలి మాత్రమే గిట్టుబాటు అవుతుందేమో. అంతే అర్ధమైంది. చావకుండా లేవకుండా బతికినట్టు రైతు బతుకు అని. మునుపటిలా కాలం లేకండా పోయింది. బావిలో నీళ్ళు లేకుండా పోయినవి.. పూడిక తీస్తే కాని, బావి తవ్విస్తే గాని నీళ్ళు వెళ్ళని పరిస్థతి. బావి తవ్విద్దామంటే డబ్బులు లేవు, ఎవరిని అడుగుదామన్నా ఇచ్చేవాళ్ళు లేరు. ఆత్మాభిమానం ఉన్న నేను ఎవరిని అడుగాలి? మా ఆయనకు ఇతరులను అడిగి తెచ్చివెల్లదీసెంతా శక్తి కూడా లేదు. చేతిలో చిల్లి గవ్వలు కూడా లెవ్వు. ఇక ఉన్న ఆశ అంత ఇంట్లో అమ్మానాన్నలు పెండ్లి నాడు పెట్టిన బంగారం పది తులాలు తప్పా ! ఇంట్లో చెప్పి ఆ బంగారం అమ్మితే తులానికి ఆరువేల చొప్పునా అప్పటి రేటు ప్రకారం అరువై వేలు వచ్చినాయి. కొంత డబ్బు సాగుబడికి ఉంచుకొని బావి తవ్విస్తే, ఆ ఏడుకు నీళ్ళు వెళ్ళినాయి. మళ్ళీ సంవత్సరం మామూలే ఎప్పటిలానే ఇంకా కరువచ్చింది వర్షాభావంవల్ల. ఇక ఆ ఊల్లొ బతుకడం కష్తం అనిపించింది. పెట్టుబడే సరిపోవడం లేదు వ్యవసాయం చేద్దామంటే. బతుకుదెరువు లేని పల్లెటూరు. రైతు బిడ్డకు ఏమి పనులు తెలుస్తాయి వ్యవసాయం తప్పా! వ్యవసాయం నమ్ముకుంటే బతుకుదెరువు కష్టమనిపించింది. ఉన్న ఊర్లో ఏం పని చేస్తాం, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేం కదా! పెద్దోడి చదువు పదవ తరగతి అయిపొయింది. చిన్నోడి చదువు అయిదు అయిపొయింది. ఇక పెద్దోడు చదువు చదువనన్నాడు, ఏదయినా పని చూసుకుంటానన్నాడు. పని చేద్దామన్నా ఆ ఊరిలొ పనేమీ లేదు. ఏదయినా టౌనుకు వెళితే తప్పా పని దొరికే పరిస్థితి లేదు. ఆలోచిస్తే అనిపించింది ఒక్కటే. ఏదయినా బతుకుదెరువు ఉన్న టౌనుకు అందరం వెళ్ళితే బాగుంటుంది అనిపించింది.

( మిగితా వచ్చేవారం)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!