Sunday, October 2, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరుదీపం(13 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరుదీపం(13 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఈ లోగా ఈ క్రూజ్. నిజానికి దీన్ని కాన్సిల్ చేద్దామనే చూసాడు కాని నో రీఫండ్ అనేసరికి తప్పలేదు. మా ఇన్లాస్ ని కూడా తీసుకు వద్దాం అన్నాడు. సరే అన్నాను, కాని టికెట్స్ చాలా ఖరీదు అని ఆగిపోయాడు. వాళ్ళు ఆరునెలలపాటు ఇక్కడే ఉంటారట. ఇతను నా కాలేజి విషయమే ఎత్తడం లేదు. ఎప్పుడు ఆ విషయం మాట్లాడదామన్నా మాట మార్చేస్తున్నాడు. గట్టిగా నిలదీసి అడగడానికి సంకోచంగా ఉంది. ఇక్కడికి వచ్చాక కూడా ఇంట్లో ఎవరితో మాట్లాడినా నాకు దూరంగా వెళ్లి మాట్లాడతాడు. అంత రహస్యం ఏమిటో తెలియడం లేదు.

ఈ విషయం ఎవరితో మాట్లాడాలో అర్ధం కాలేదు. ఈ లోగా మీ పరిచయం.ఎందుకో మీరు సాయం చెయ్యగలరు అనిపించింది.
కాలేజిలో వెళ్లి చేరాలన్నా అతని సాయం లేకుండా ఒక్కదాన్నీ వెళ్ళలేను”.
అంతా విని కాస్సేపు నిశ్శబ్దంగా ఉ౦డిపోయి౦ది చందన.

“నిజమే స్పందనా, అతని ప్రవర్తన కొంచం అనుమానాస్పదంగానే ఉంది. భయపడకు కాని నీ స్థితిగతులు తెలిసే వలపన్నాడేమో అని ఒక చిన్న అనుమానం. అయినా అన్ని వేళలా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. సందేహం సంకోచం వద్దిలేసి అడుగు కాలేజీలో ఎప్పుడు చేరుస్తున్నావని. వీలైనంత వరకు నలుగురిలో ఉండటానికి ప్రయత్నించు. పద అతనికి అనుమానం రాకుండా మనమూ బయట తిరుగుదాం”.

పైకి ఎంత ధైర్యం చెప్పినా చందనకూ అనుమానంగానే ఉంది. అతనొక మేకతోలు కప్పుకున్న పులి ఏమోనని.
ఇంత చదువుకుని ఈ ఆడపిల్లలు ఇలా వంచనకు గురవడం చింతగానూ ఉంది.
ఏం చెయ్యాలన్న ఆలోచన అనుక్షణం ఆమెను వెన్నాడుతూనే ఉంది.
చదువుకూ సంస్కారానికీ సంబంధమే లేదా అని ప్రశ్నించుకుంది.` రోజంతా ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా స్పందన గురించే ఆలోచనలు రాత్రి కల్చరల్ ప్రాగ్రాం డాన్స్ లు, డ్రామాలు ఆపైన డిన్నర్ ఎంత మంది పని చేస్తున్నారో కాని ఎప్పటికప్పుడు ఎవరేది అడిగినా వేడి వేడిగా వండి వడ్డించే వారు.

వీటన్నింటి మధ్యా ఎవరి కష్ఠ సుఖాలు వారివి అన్నింటి మధ్యా ఎవరి సమస్యలు వారివి. రూమ్ కి చేరుకొని నైట్ డ్రెస్ మార్చుకున్నాక హరితో చర్చించింది రిషి విషయం. అవును అతనితో చర్చించ వలసిన విషయమే.
హరికి కూడా అదే అనుమానం వచ్చింది. నిజమే. స్పందన గురించి అన్ని వివరాలూ తెలిసే వెంటపడి ఒప్పించి పెళ్లి వరకూ వచ్చాడేమోనని.
చూస్తుంటే స్పందన అపాయం లో ఉన్నట్టే అనిపిస్తో౦ది. స్పందనను చూసాక ఆమె కధనం విన్నాక తను ఎంత అదృష్ట వంతురాలనో అనుకుంది చందన.
అనుకున్నదే తడవు హరి చుట్టూ చేతులు వేసిఅతని కి మరింత దగ్గరగా జరిగి పసిపాపలా అతని ఎదలో తలదాచుకు౦ది.

*********

ఉదయం ఏడున్నరకు లేచి టీ తాగడానికి వెళ్లి౦ది చందన. వేడి వేడి టీ తాగుతూ నెమ్మదిగా అలల మీద రాజహంసలా కదులుతున్న నావను అద్దాల నుండి చూస్తూ కిటికీ పక్కన కూచు౦ది బద్దకంగా. ప్రత్యేకంగా గమనిస్తే గాని నావ కదులుతున్నట్టు అనిపి౦చదు.
ఎదురుగా ఆ పక్కన ఎవరో పడుకుని ఉన్నారు. మోచయ్యి కళ్ళకు అడ్డంగా పెట్టుకుని , ముందుగా అది చూసినది ఆ అద్దం వెనకాల అలల మీద.
తలతిప్పి చూసింది.
అవును. నైటీలో సన్నగా తను స్పందన కాదుగదా అనుకుంది. అయినా నిద్రపోతున్న తనను లేపడం భావ్యం అనిపి౦చలేదు.
ఒకవేళ స్పందన కాకపొతే….
లేచేవరకూ అక్కడే ఉండి ఎదురు చూడదలుచుకు౦ది.
పది నిమిషాల్లో హరి ఆమెను వెతుక్కు౦టూ వచ్చాడు. ఆటను కూడా పెద్ద కప్పులో కాఫీ తెచ్చుకుని కూచున్నాడు. లో స్వరంతో తన అనుమానం వెలిబుచ్చింది చందన.
“అవును చూస్తు౦టే ఆ అమ్మాయి లానే అనిపిస్తోంది. కాస్సేపు వెయిట్ చేద్దాం”
అరగంట ఎదురు చూసాక కళ్ళు విప్పి దిగ్గున లేచి కూచుంది ఆ అమ్మాయి.
అవును ఆమె స్పందన.
“మార్నింగ్ “ ఇద్దరూ ఒకే సారి గ్రీట్ చేసారు.
చిన్నగా నవ్వి లేచి నైటీ సరిచేసుకు౦ది.
“అదేమిటి ఇక్కడ పడుకున్నావు?”
రెండు నిమిషాలు తటపటాయి౦చి ‘ఫర్వాలేదు చెప్పమన్నట్టు చందన సైగ చేసాక చెప్పింది.
రాత్రి డ్రింక్ సిప్ చేస్తూ చాలా సేపు కూర్చున్నారు ఇద్దరూ ఎప్పటిలా స్వీట్ నథి౦గ్స్ మాట్లాడుతూ. గదికి వెళ్ళే ముందు బయట వెన్నెల చూడటానికి డెక్ మీదకు వెళ్ళారు.
పైన నిండు జాబిలీ కింద సముద్రం వచ్చేలా చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. రిషి ఫోటో తీస్తున్నాడు, “ కొంచం వెనక్కు మరికాస్త వెనక్కు పూర్తిగా చంద్రుడు రావాలి “ వెనక్కు మరింత వెనక్కు వెళ్తోంది స్పందన.
“మరొక్క అడుగు వనక్కు … “
మరొక్క అడుగు కదపబోయి౦ది. ఈలోగా ఎప్పటినుండి గమనిస్తున్నాడో అమెరికన్ యువకుడు చటుక్కున పరుగెత్తుకు వచ్చి ఆమెను వెనక్కు లాగాడు.
గుండె ఝల్లుమంది.
ఒక్క అడుగు …ఒక్క అడుగు వెనక్కు వెళ్తే రెయిలింగ్ కొట్టుకుని సముద్రంలో పడిపోయేది.
తేరుకునే లోగానే , దగ్గరకు వచ్చిన రిషి గాభరాగా , “అయ్యో వెనకాల చూసుకోవా …” అంటున్నాడు.
అయోమయం నుండి బయటపడినా గుండె దడ ఆగలేదు.
“కావాలనే , కావాలనే వెనక్కు వెనక్కు వెళ్ళమన్నాడా? ఏమో .
చాలా సేపు కారిడార్స్ లోనే తిరిగి గదికి వెళ్ళినా ఇద్దరికిద్దరూ ముభావం గానే ఉన్నారు.
“ఏమైనా జరిగి ఉంటే …” ఇద్దరి మనసుల్లోనూ అదే ప్రశ్న.
“ నీకేదైనా జరిగి ఉంటే స్పందనా , సముద్రం లో పది పోయి ఉంటే … మైగాడ్ నేనూ నీ వెనకే దూకేసే వాడిని. కొంచం చూసుకోవా?” ఎంత ఆవేదన కనబరచినా ఎందుకో అది నిజాయితీగా కనిపించలేదు.
అరగంటలో అతను నిద్రలోకి జారుకున్నా అక్కడ నిద్రపట్టలేదు స్పందనకు. అందుకే వచ్చి ఇలా నలుగురూ తిరిగే చోట పడుకోగలిగి౦ది.
హరి ధైర్యం చెప్పాడు.
“ మరీ అంతకు తెగిస్తాడని అనుకోను , అయినా జాగ్రత్తగా ఉండటం మంచిదే కాని అతన్ని అనుమానిస్తున్నట్టు కనిపించకు పద రూమ్ వరకూ వస్తాం” అంటూ ఇద్దరూ ఆమె తో బాటు వెళ్లి మేము “ “గమనిస్తూనే ఉంటాము. “ అన్నాడు.
చందన ఆమె చెయ్యి నొక్కి వదిలింది. ఒక చిన్న స్పర్శలో ఎంతో ఓదార్పు , బలం కనిపించాయి.
మామూలుగా ఉండటానికి నిర్ణయించుకుంది స్పందన.
మధ్య మద్ధ్యలో జమైకా మొదలైన దీవుల వద్ద రోజంతా గడపడం మళ్ళీ షిప్ చేరుకోడం ఎక్కడో సముద్రం మధ్యన ఆగి బోట్లలో తీరం చేరి షాపింగ్ లు సర్రదాలు మొత్తానికి కనురెప్పపాటులో గడచిపోయాయి పదిరోజులు.
అనుకున్న సమయానికి సవ్యంగా బయలు దేరిన చోటుకు చేరుకున్నారు. ఈ లోగా రిశితో కొంత పరిచయం పెంచుకున్నాడు హరి.
అతనిలో అనుకున్నది ఏ రకంగా నైనా సాధించే ఒక మొండితనం భయంకరమైన స్థాయిలో ఉండటం గమనించాడు. స్పందన ఊహ సరైనదేమో నని అనిపించింది కూడా.
అందుకే ఫ్లారిడాలో దిగాక ఇద్దరినీ ప్రెండ్ లీగా తమతో బాటు రమ్మని ఆహ్వానించారు. ఒకరకంగా బలవంత పెట్టారనే చెప్పాలి.
డ్రైవ్ చేసుకు వెళ్ళగలిగే దూరమే గనక పెద్దకార్ ఒకటి రెంట్ చేసుకుని బయలు దేరారు. దారిలో డ్రైవ్ చేస్తూనే తమ ప్రేమ కధనం వినిపించాడు హరి.
“అబ్బో ఒక పట్టాన ఒప్పుకుందా మహారాణి, చివరికి మరొకరితో పెళ్లికి కూడా తలవంచింది.”
చందన కళ్ళలో సన్నటి నీటి పొర.
“అవునా …” ఆసక్తిగా అడిగింది స్పందన.
“అయినా నా ప్రేమ చాలా గొప్పది ఆమెను గెలుచుకుంది కదా , మీ ప్రేమ లాగే కదా రిషీ”
రిషి తడబడ్డాడు.
“అవునవును, నేనూ అంతే ఎంత తపస్సు చేసానో …” అన్నాడు
మధ్యాన్నం దారిలో లంచ్ చేసి సాయంత్రానికి ఇల్లు చేరారు. అప్పటికే వచ్చి ఇల్లు క్లీన్ చేసి వంట చేసి పెట్టింది కేర్ టేకర్.
హోమ థియేటర్ లో సినిమా చూసి డిన్నర్ అరేంజ్ చేసుకున్నారు.
హరి రెడ్ వైన్ బాటిల్ ఓపెన్ చేసి ఆఫర్ చేసాడు.
ఆడవాళ్ళిద్దరూ ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకుని సినిమా కదా గురించీ సన్నివేశాల గురించీ మాట్లాడుకుంటున్నారు.
హరి ,రిషి డైనింగ్ హాల్ లో సరదాగా వైన్ సిప్ చేస్తూ వాళ్ళ ధోరణిలో వాళ్ళున్నారు.
“అదృష్టవంతులు , స్పందన లాటి అమ్మాయిని ఏమ్చుకోడంలోనే తెలుస్తో౦ది మీ అభిరుచి చక్కని అందం చదువు … “
హరి అతన్ని పొగిడాడు.
“ అంతేనా ? అంతులేని సంపద కూడా , మీకు తెలుసా ఈ క్రూజ్ టికెట్స్ మా మావగారు ఇచ్చిన హనీమూన్ టికెట్స్ …”
“అవునా, గ్రేట్ “
“కాలేజిలో చేర్రిన రోజునే ఈ అమ్మాయి విధానంలోనే గొప్ప రాజసం కనిపించింది. ఆరా తీస్తే తెలిసింది. మామూలు మధ్య తరగతి వారిలా మసలే ఆగర్భ శ్రీమంతులని”
“ఈజిట్ ?”
“అవును అది పూర్తిగా నిర్ధారించుకున్నాకే తనతో పరిచయం పెంచుకున్నాను.”
క్షణం ఆగి ,
“ఆ ఓల్డ్ ఫాక్స్ మా పెళ్ళికి నాలుగేళ్ళు పరీక్ష పెట్టాడు “ అసహనంగా పలికింది రిషి స్వరం

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!