Tuesday, July 14, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 17 వ వారం) – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 17 వ వారం) – శ్రీ విజేత

అదే విషయాన్ని మా అత్తా మామలకు చెప్పినాను. వాళ్ళు వద్దన్నారు, మేం అలా ఊరు విడిచి వెళ్ళడం వారికి ఇష్టం లేదు. ఊరు కాని ఊరిలొ ఎలా బతుకుతామో అనేది వారి భయం. వారి భయం ఇంకోటి కూడా కావచ్చు, మా ఆయన అమాయకుడు, నోట్లో నాలుక లేని మనిషి, నేను తెలివయినదాన్ని, పైగా అందమైనదాన్ని, ఏమో ఎలా ఉంటుందో ముందుముందు అని భయపడ్డారేమో! అందుకు కూడా వద్దన్నట్టున్నారు. అయినా మా కష్టం మా బతుకు మాకే తెలుస్తుంది. వెనుకా ముందు ఆసరా ఎవరూ లేరు. పీట్టుబడి లేనిది నీళ్ళు లేనిది వ్యవసాయం కష్టం. ఇప్పటికే చేయి కాల్చుకోవడం అయ్యింది. కట్టె పిడుక లేకుండా కంకడే చాలట, చేతులను నమ్ముకొని ఏదో ఒక పని చేసుకొని బతుకచ్చు టౌన్ లొ అనిపించింది. ఇదే విషయంపై తెలిసిన స్నేహితురాలు టౌన్ లొ ఉంటే ఒకసారి వెళ్లి కలిసి వచ్చాను, అక్క వాళ్ళ ఊరు కూడా టౌన్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఒకసారి అక్కవాళ్ళ ఊరికి కూడా వెళ్లి వచ్చాను. వాళ్ళు కూడా రమ్మన్నారు. అక్కవాళ్ళ ఊరుకు దగ్గరున్న టౌన్ కే వెళ్దామనుకున్నాం, వాళ్ళకు దగ్గర ఉంటె మాకు కొంత ఆసరాగా ఉంటారని అనిపించింది. అదే విషయాన్ని అత్తామామలకు చెప్పాను. వారు మేం వెళ్ళడానికి ఇష్టపడలేదు ముందుగా కాని వారికి నమ్మకంగా చెప్పాను, ‘ నన్ను నమ్మండి మేం మంచిగా బతికి మీకు చూపెడుతాం’ అని. అలా వారి అనుమతితోనే పిల్లలు, నేను, ఆయన ఊరు వదిలి వచ్చాం.

జీవితంలో అది పెద్ద నిర్ణయం. బతుకు మీద ఆశ, నమ్మకమే మమ్ములను అలా కదిలేట్టు చేసింది. పిల్లలు చిన్నవాళ్ళు, ఆయన అమాయకుడు, ఇక నేనే అన్ని సవరించి చూసుకోవాలి బతుకులో అనిపించింది. అక్కవాళ్ళ ఊరి దగ్గరి టౌన్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నాం. కొత్తజీవితం టౌన్లో మాకు. ఇన్నేళ్ళు పల్లెటూల్లోనే బతికాం. పట్నంలో పైసలు లేంది బతుకు కష్టం, బతుకడం కష్టం. కొత్తగా వచ్చినమని అక్కవాళ్ళు కొన్ని బియ్యం, ఉప్పు, పప్పు మాకు ఆసరాగా పంపించారు. అక్కవాళ్ళ ఆదరణను మరచిపోలేను అనిపిస్తుంది. ఆయన ఒక దుకాణంలో గుమస్తాగా చేరిండు, నెలకు మూడు వెయిలు అప్పట్లో జీతం. నాకు టైలరింగు వచ్చు, కుట్లు అల్లికలు కూడా వచ్చు, దానికి తోడుగా ఇంట్లోనే కిరాణా దుకాణం పెట్టుకున్నాను. పెద్దోడ్డు ఎలెక్ట్రికల్ వర్క్ నేర్చుకొని పనికి వెళ్తానన్నాడు. చిన్నోడు టౌన్లోనే ఆరవ తరగతిలో జైన్ అయినాడు. అలా నెలలు గడుస్తున్నాకొద్ది, కొద్దికొద్దిగా స్థిరపడుతూ బతుకుదెరువులో పడ్డాం. పెద్దోడు పని నేర్చుకొని కొంత సంపాదనలో పడ్డాడు. కొద్దిగా వెసలుబాటు అయ్యింది. అలా ఏడేండ్లు గడిచినవి. అప్పుడప్పుడు అత్తామామ వాళ్ళు వచ్చి చూసిపోయేవాళ్ళు. ఉన్నంతలో కూడు, గుడ్డకు కష్టం లేకుండా బతుకుతున్నందుకు వాళ్ళు కూడా తృప్తి పడ్డారు. మా ఊరి దగ్గర మాకు ఉన్న భూమిని కౌలుకు ఇచ్చినాం. పంట పండినప్పుడు కొంత డబ్బులు కూడా వచ్చేవి. క్రమం తప్పకుండా ఆయన జీతం తెచ్చి ఇచ్చేవాడు. ఆయన జీతం క్రమక్రమంగా అయిదు వేల వరకు అయ్యింది. ఎంత పొదుపుగా బతుకవలసి వచ్చేదో అనుభవిస్తేగాని తెలుస్తుందేమో ! రెక్కలు ముక్కలు చేసుకుంటే లక్షలు సంపాదిస్తామా ! కొన్ని వెయిలు మిగిలితే ఎక్కువ, అదీ కష్టంగా ! కష్టజీవికి ఒక జీవిత కాలం సరిపోతుందేమో ఒక స్తాయికి రావడానికి, తన పిల్లలు ఎదిగే వరకు కూడా కష్టపడాల్నేమో! ఇక ఎన్ని రోజులని కిరాయికి ఉంటాం, ఇల్లు కట్టుకోవడానికి కొంత జాగ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. మేం వచ్చినప్పుడు భూముల ధరలు తక్కువగా ఉన్నాయి టౌన్ లొ యాబయి వేలకు గుంట చొప్పున, కాని భూమి కొందామంటే డబ్బులు లేవు అప్పట్లో. మేం చూస్తుండగానే భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి. ఆ ఎడుఎనిమిది ఏళ్లల్లోనే భూముల ధరలు లక్షల్లో చేరినవి. ఇక టౌన్ లొ భూమి కొనడం కష్టం అనిపించింది. భూమి కొనడం అంటే ఇక ఊరి అవతలనే తక్కువకు వస్తాయి అని అర్ధమయ్యింది. అటు ఇటు కష్టపడితే చేతిలో ఉన్నవి యాబయి వేలే. పక్షికి ఒక గూడు ఉన్నట్లు, మనిషికి ఒక ఇల్లు ఉండాలేమో స్థిర నివాసంగా, ఇల్లు ఉంది అంటే కొంత తృప్తిగా బతుకచ్చు అనిపించింది. ఉన్న డబ్బులతో కొంత జాగ తీసుకుంటే రెండుమూడేళ్ళలొ చిన్నగా ఇల్లు కట్టుకోవచ్చు అనిపించింది. అలా ఆలోచించి ఉన్న డబ్బులతో టౌనుకు, అక్కవాళ్ళ ఊరికి మధ్యలో బస్ సౌకర్యం ఉన్న రోడుకు దగ్గరగా రెండు గుంటల భూమిని కొనడం జరిగింది. అది మా అందరి పదేళ్ళ కష్టార్జితం. ఇంకా రెండేళ్లలో కొంత అప్పోసప్పో చేసి చిన్నగా స్లాబ్ వేసి రెండు రూముల ఇల్లు కట్టుకున్నాం, ఇద్దరు పిల్లలకు, మాకు సరిపోదు అని స్లాబ్ పైన రెండు రూముల షెడ్ కూడా వేసినాము. అప్పటి నుండి మా మకాం టౌన్ నుండి పల్లెటూరికి మారింది. ఓ మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి గృహ ప్రవేశం కూడా చేసినాం. నిజంగా ఇల్లు ఉంటె ఎంత తృప్తి ! పచ్చటి ప్రకృతిలో పర్ణశాల లాంటి ఇల్లు మాది. చుట్టూ పొలాలు, దగ్గరగా కొండలూ గుట్టలూ కనిపిస్తాయి ఎటుచూసినా ప్రశాంతంగా. ఎంతో కస్టపడి ఇక్కడి దాకా వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నాం అనే తృప్తి మాత్రం మిగిలింది. అదే పల్లెటూరిలో మా అత్తామామలు చెప్పినట్లు ఉండి ఉంటే, ఎలా గడుపవలసి వచ్చేదో అనిపించింది. ఆయన దుకాణంలో పని చేసి క్రమం తప్పకుండా కొంత సంపాదిస్తాడు, పెద్దోడు పని నేర్చుకొని కొంత సంపాదిస్తున్నాడు. చిన్నోడు అటూ ఇటూ చదివి డిగ్రీ చదువులు అయిపోయే దశ వచ్చింది. అలా పన్నెండేండ్లు గడిచింది మా అత్తవారి ఇల్లు నుండి వెళ్లి వచ్చి. పెద్దోడికి పెళ్లి అయితే చిన్నోడికి ఇంత ఉద్యోగం అయితే చాలు ఇప్పటికి అనుకున్నాను.

ఇది ఒడుదోడుకులతో కూడుకున్న వ్యథాపూరితమైన నా జీవిత కథ! ……………………………………………………………………………………………………………………………………………………

రాత్రి పడుకునే ముందు ఏ పది గంటలకో అతను ఇచ్చిన పుస్తకాలు తిరిగేస్తూ ఆలోచనల్లో పడిపోతే సమయం తెలియ లేదు, నిద్ర రాలేదు. గతమంతా కళ్ళముందు సినిమా రీలులాగా తిరుగుతూ కనిపించింది. విషాదమో, ఆనందమో, అమృతమయమో, ప్రేమ మయమో, స్నేహమయమో అర్ధం కాలేదు బతుకు. గోడ గడియారం రాత్రి నాలుగు గంటలు చూపిస్తుంది లైట్ వెలుగులో. పక్కన మంచంపై అతను నిద్ర పొతున్నాడు అదమరిచి. చిన్నోడు హాలులో నిద్ర పోతున్నాడు.
అస్సలు నిద్ర రావడం లేదు. అతడు ఇచ్చిన పుస్తకాలు తిరుగేస్తూ పోయాను. ఎక్కువ సామాజికాంశాలపై రాసిన పుస్తకాలు అయినా రెండు పుస్తకాలు నన్ను ఆపి వెసినాయి. అందులో ఒకటి ‘ప్రేమ’ అనే పుస్తకం. ప్రేమకు చిహ్నం రాధ కృష్ణుల ముఖచిత్రంతో ఉంది అది. అన్నీ ప్రేమ గురించే చిరు కవితావాక్యాలు అమృతతుల్యంగా. ఎంత నిర్మలమైన మనసుతో రాసి ఉంటాడో కదా అనిపించింది వాటిని చదువుకుంటుంటే ! అవి ఎవరి కోసం రాశాడు….. బహుశా! నా కోసమేమో! అందులో ఉన్నది ఎవరు బహుశా….. నేనేనేమో! అన్నట్లుగా ఉంది ఆ పుస్తకం.

ఆకాశములో తూనీగలా విహరిస్తూ వస్తాను నీ కోసమే!
నీ ఒక్క చూపులో వెయ్యి స్వాగతాలు, వెయ్యి కృతజ్ఞతలు. నేనెవరిని…? నా చిరునామా నీ గుండె గూట్లోనే ! అలసిన ప్రయాణములో ఆశలు- నిరాశలు , నువ్వు అందుతావనె. కాలమేదయితేనేమి, నువ్వుంటే నవ వసంత శోభ ! పంట చేనులో పసిడి వన్నెల లేడిపిల్లలా నీవు. నిన్ను చూస్తూ, బతుకును నెమరేస్తూ కవిత్వం రాశా! మళ్ళీ ఒక మజిలీ, బతుకులో నవ వసంతం. నీ ధ్యాసలో నేను, బహుశా ఎకాగ్రత అంటే అదే ! ఈ వెన్నెల రాత్రి యెంత హాయి! జాబిల్లిలో నువ్వే !

వసంతం మళ్ళీ వచ్చింది, నువ్వే ప్రకృతికి శోభాలా! మబ్బు తెరలు తొలగిపోయాయి, చంద్రముఖిలా నువ్వు, జ్ఞాపకాల మాటున నువ్వు రసరాగిణి వై ! నువ్వు అందీ అందనట్లు, వెన్నెల నీడలా ! నువ్వు కలిసావు, బతుక్కే పరిమళమబ్బింది మనసున మల్లెలు పూస్తూ. పగలూ రాత్రి నీ ధ్యాసే, పరిమళములా నీ స్మృతి ! కా ల ప్రవాహములో నీ కోసం పయనిస్తూ నేను. కాలం క్రొవ్వత్తిలా కరుగుతుంటే, నీ జ్ఞాపకాలు నడిపిస్తున్నాయి. నీ అశ్రువ్రు బహుశా నా కలానికి సిరా చుక్కయ్యింది !
జ్ఞాపకాలన్నీ తోడేశాను, నీటి చెలిమలా నువ్వే ! రాత్రి చిమ్మ చీకటి , నువ్వు మాత్రం మెరుస్తూ ! వాడిపోయిన జ్ఞాపకాలన్నీ కొత్త చిగుళ్ళు వేస్తున్నాయి, నవ వసంత హేల !
నువ్వు -నేను ప్రేమకు చిహ్నాలం, బతుకు నేస్తాలం .నీ జ్ఞాపకాలు, పిల్లతెమ్మరను ఆస్వాదిసున్నట్లు !
ఆకాశములో కోటి నక్షత్రాలు, నువ్వు కనిపించావు ! అద్దంలోకి చూశాను, చిత్రం ! నాలో నువ్వు ! నీ మాటల్లో ముత్యాలు తళుక్కున మెరుస్తూ ! శిథిలమైన బతుకును కాలము కాపాడుకుంటుంది, జీవితం అపూర్వం ! ఎంతటి ప్రేమ నాకు నీపై , తరగని నిధిలా ! ఈ వాన గాలి హాయి గొల్పుతుంది, చల్లని నీ చూపుల్లా ! నీ కళ్ళు , హాయ్ ! రసరమ్య కావ్యాలు !
నీ నవ్వు , గుబాళించే గులాబీ పరిమళం! నీ జ్ఞాపకం, బతుకంతా పరిమళం ! నీ కన్నీళ్ళు నా కవిత్వపు సిరా ! ఎంతటి విషాదం ! ఎన్ని ఉంటేనేమీ? జీవితంలో నిన్నే పోగొట్టుకున్నపుడు!

అడవిలో ఒంటరిగా, ఏ దిక్కు చూసినా నీ ఆర్తే ! బతుకంతా సుదీర్ఘ తపస్సు , ఒక్క నీ కోసమే !
లీనమై చదువుతుంటే, మనసంతా పులకించిపోయింది ! ఎందుకు పనికిరాని, ఎవరూ గుర్తించని నా లాంటి గడ్డి పువ్వుపై ఇన్ని కవితలు ఎందుకు, ఇన్ని వర్ణనలు ఎందుకు అనిపించింది. ప్రతి పేజీలో, ప్రతి కవితలో నేనేనా అనిపించింది. నిజంగా ఇంకా అతని మనసునిండా నేను ఉన్నానా అనిపించింది! అతని రాతలు చూస్తే ఒకింత జాలి వేసింది కూడా , ఇంత ప్రేమ ఎందుకు నాపై అని. అతన్ని నేను పెద్దగా పట్టించుకొంది ఏమీ లేదు. అయినా అతని ప్రేమ నాపై తరుగ లేదు అనడానికి ఈ కవితలు చాలు అనిపించింది ! అతను రాసుకున్న ఇంకో పుస్తకం ‘ప్రేమంటే’ అని, చక్కటి పక్షి జంట ముఖ చిత్రంతో ఉంది, కవర్ పేజి బొమ్మ చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఒకటి రెండు పేజీలు తిరగేశాను, ప్రేమతో అంటూ మొదటగా ఉన్న కవితా వాక్యాలు నన్ను కట్టిపడేశాయి.
‘గువ్వ పిట్టల్లానో, లేడి పిల్లల్లానో , ప్రకృతి ఒడిలో స్వేచ్చగా గడిపి, అమాయకత్వంతోనో, నిర్మలత్వంతోనో, భవిష్యత్ ఏమిటో పూర్తిగా తెలియక, ఉహించక చేజేతులా బతుకును విషాదంలో ముంచేసుకొనే ప్రేమైకజీవులు ఎందరో !
పెళ్ళంటే రెండు హృదయాల కలయిక, పెళ్ళంటే ఆత్మీయ బంధం అని తెలిసికూడా తెలియక సమాజ ఇనుప చట్రంలో ఇమిడి, నలిగి, మనసుల్ని చంపేసుకొని, బతుకుల్ని బలి చేసుకొనే అభాగ్య జీవులెందరో !
స్వచ్చమైన మనసుతో పరస్పరం ప్రేమించుకొని , స్వేఛ్చా విహంగాల్లా ఒకరిపై ఒకరు మనసు పారేసుకొని , జ్ఞానంతోనో , అజ్ఞానంతోనో, ఒకరికి ఒకరు త్యాగం చేసుకొని బతికే ప్రేమైక జీవులు ఎందరో!
అలాంటి ప్రేమమమయులకు, త్యాగామయులకు……’

బహుశా నా లాంటి వాళ్ళ కోసమేమో ఈ కవితావాక్యాలు అని తోచింది చదువుతుంటే ! జీవితం ఒక మధురమైన బాండం కావచ్చు కొందరికి. ఆ మధుర రసమును ఆస్వాదిస్తూ బతుకుతారేమో వాళ్ళు. కొందరికి జీవితం అడుగడుగునా కంటక ప్రాయమే కావచ్చు, ఆ ముళ్ళను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం వారికి . అమృతమయమైన అతని కవిత్వ ధారలో పడి కొట్టుకపోతూ పేజీలు తిరుగేస్తూనే ఉన్నాను అతని భావాలు ఇంకా ఏమిటో చూడాలన్నట్లుగా.

(మిగితా వచ్చేవారం)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!