Monday, August 8, 2022
Home > కథలు > ఇంటి దొంగలున్నారు జాగ్రత్త! -వి. సునంద

ఇంటి దొంగలున్నారు జాగ్రత్త! -వి. సునంద

అమ్మూ! అందరికీ భోజనాలు పెడుతున్నా, చదివింది చాలుగానీ రా! ఆ తర్వాత మళ్ళీ చదువుకుందువుగానీ. డైనింగ్ హాల్లోంచి కేకేసింది సుభద్ర.
ఆఇంట్లో ఉదయం ఎవరికి వారే పరుగులు తీసినా రాత్రి భోజనం కలిసి చేయాలనే రూల్ పెట్టుకొని తు. చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం శివరామ్ కు మొదట్లో నచ్చలేదు.
తనది ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ. పిల్లలను ఇద్దరినీ పేరున్న స్కూల్లో చేర్పించాడు. ఖర్చు తడిసి మోపెడవుతుండటం. దీనికి తోడు సిటీలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో, పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న పల్లె పట్నం గాని ఊర్లో ఉంటున్నారు.
ఇంటికి వచ్చే సరికి ఒకోసారి ఎనిమిది దాటుతుంది. అప్పటిదాకా పిల్లల్ని తిననీయకుండా తన కోసం ఆపడం ఇష్టం లేదు. ఇలా అంటే సుభద్ర ఒప్పుకోదు. ఇప్పుడే కదా మనసులు మాటలు కలబోసుకునేది. పిల్లలతో సరదాగా తినేది అంటుంది. అలా ఆ ఇంట్లో ఎంతలేటయినా అందరు కలిసి తినడం అలవాటుగా మారింది.
వాళ్ళ పిల్లలు అభినవ్ ఇంటర్, అమ్మూ అనబడే అమూల్య పదవ తరగతి. వీరితో బాటుగా ఆడపడుచు కొడుకు వంశీ రెండేళ్ళ నుండి ఇక్కడే వుండి బి టెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండడం వల్ల చదువులో వెనుకబడి పోయాడని, తమ్మున్ని బతిలాడి వంశీని వీళ్ళ దగ్గర ఉంచింది. అమూల్య అభినవ్ లతో స్నేహం, అత్తయ్య మామయ్యల క్రమశిక్షణ వంశీని చదువు వైపు దృష్టి మళ్ళించాయి.
అమ్మూ! రా తల్లీ! నీ కోసమే వెయిటింగ్ అంటున్న నాన్న మాటలకు ఇక తప్పదన్నట్టు లేచి నెమ్మదిగా వచ్చి తండ్రి పక్కన కుర్చీలో కూర్చుంది.
అమ్మూ! ఏమైందిరా డల్ గా వున్నావు అంటున్న తండ్రి మాటలకు తల్లి, అన్నయ్య, వంశీ తనవైపే చూస్తుంటే ఏం చెప్పాలో తోచలేదు. వర్క్ ఎక్కువగా వుంది నాన్నా అందుకే రాసి రాసి చేతులు నొప్పెడుతున్నాయి అంది తలొంచుకొని ప్లేటు లో అన్నం కలుపుతూ…
“ఏం చదువులో ఏమో..
తరగతి పెరుగుతున్న కొద్దీ పిల్లలమీద వత్తిడి పెరుగుతున్నది.. అంటూ అందరికి వడ్డించి తనూ ప్లేట్లో వడ్డించుకుంది సుభద్ర.

సుభద్ర కూడా వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా, పూర్తయిన బియిడి చదువుతో
ఆ ఊరులోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పని చేస్తున్నది.
అమ్మూ రోజు రోజుకు ముభావంగా ఏదో పోగొట్టుకున్నట్టు కనబడుతుంటే కన్నతల్లి మనసు తట్టుకోలేక పోతున్నది.
వంశీతో అర్థం లెక్కలవీ చెప్పించుకొమ్మంటే “చెప్పు బావా!” అని పుస్తకాలు నోట్స్ ముందేసుకుని బుద్ధిగా చెప్పించుకునేది.
ఆ మాటలు వినకుండా ఏదో రాస్తున్నట్టు చదువుతున్నట్టు చేస్తూ వంశీని తప్పించుకొని తిరగడం గమనించింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు.
వంశీ ఎంత మంచి వాడయ్యాడు.
అత్తా అత్తా! అంటూ తన చుట్టే తిరుగుతూ ఇంటి పని వంట పనుల్లో సాయం చేయడం. చిన్న చిన్న బజారు పనులను నీ కెందుకత్తా నే చేస్తాగా. నువ్వూ బడికెళ్ళి వస్తున్నావంటూ తన కష్టాన్ని గుర్తిస్తుంటే… తన చేతుల్లో మంచివాడుగా మారిపోయిన వంశీని చూస్తుంటే సంతోషంగా వుంటుంది. పిల్లలిద్దరి చదువు బాధ్యతను వంశీకి వదిలేసి నిశ్చింతగా వుంటోంది..

పొద్దున్నేనలుగురికి బాక్స్ లు సర్ధి. వాళ్ళను పంపించే సరికి వానపడి వెలసినట్టుగా వుంటుంది. ఆ తర్వాత నింపాదిగా తను తయారై వెళుతుంది.
అమ్మూ! ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చిందా రోజు. అన్నింటిలో బి సి గ్రేడులు చూసి అదిరి పడింది సుభద్ర. “ఏంటీ పిల్ల.. క్లాస్ ఫస్ట్ ఎప్పుడూ ఏవన్ గ్రేడులో వుండేది. ఇలా వచ్చాయేమిటి”.. నిలదీసింది బిడ్డను. కళ్ళనీళ్ళు నింపుకుంటూ నిశ్శబ్దంగా గదిలోకి వెళ్తున్న అమూల్యను చూస్తుంటే సుభద్రకు కోపం నషాళానికి అంటింది. రెక్క పట్టి ఊపుతూ “ఏమైంది నీకు దయ్యమేమైనా పట్టిందా మూగి మొద్దువైనవు. బావ దగ్గర అర్ధం కానివి చెప్పించుకోమంటే చెప్పించు కోకుండా తప్పించుకుంటున్నవ్. ఇన్నిన్ని డబ్బులు పోసి చదివిస్తుంటే నీకు చదువు విలువ అర్థం కాకుండా పోతోంది రోజు రోజు పెరుగుతున్న కొద్దీ నిర్లక్ష్యం ఎక్కువై పోతోంది’మీ భవిష్యత్తు కోసమేగా మీ నాన్న డ్యూటీ అయినంక కూడా ఓటీ చేస్తున్నాడు. మన మీద నమ్మకంతో పంపిన వంశీ దారిలోకొచ్చాడు మీరేమో ఇలా తయారవుతున్నారు” ఆవేశంగా అంటున్న తల్లి వైపు చూస్తూ బావ అని అనబోయేదల్లా అప్పుడే అక్కడికి వచ్చి చోద్యం చూస్తున్న వంశీని చూడగానే టక్కున ఆపేసి తలొంచుకుంది అమూల్య.

“పోనీలే అత్తా చిన్నపిల్ల కదా. నే బుజ్జగించి చెబుతాగా.. తను గదిలోంచి రాకపోతే నేనే గదిలోకి వెళ్ళి కూర్చబెట్టి చెబుతా” అంటున్న వంశీ మాటలకు చిగురుటాకులా వణికిపోతూ ‘అమ్మా! నాకెవరూ చెప్పక్కరలేదు నేనే చదువుకుంటా’ బోరున ఏడుస్తూ తనను అల్లుకుపోయిన బిడ్డను చూసే సరికి గుండె తరుక్కు పోయింది సుభద్రకు. నా బిడ్డ బంగారం ఎందుకిలా మారిపోయిందో నెమ్మదిగా రాబట్టాలి అనుకుంటూ అమ్ము కళ్ళ నీళ్ళు తుడిచి. మన భవిష్యత్తు కోసమేరా అమ్మ తపనంతా.. అని దగ్గరికొచ్చిన కొడుకు అభినవ్ ను చూస్తూ మురిపెంగా అనుకుంది. వాడికి మా విలువ చదువు విలువ అర్థమయ్యింది. అమ్మూలో ఇంకా చిన్నతనం పోలేదు. ఇద్దరినీ గుండెలకు హత్తుకుంటుంటే… అత్తా! మరి నేనూ అంటూ అమ్మూ పక్కన నిలబడటానికి వస్తున్న వంశీని గమనించి తల్లిని విడిపించుకొని నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళింది అమూల్య. వయసులో వస్తున్న మార్పా మనసులో ఏమైనా వుందా అమ్మూ వెళ్ళి వైపు చూస్తూ “నువ్వు మా బంగారం లాంటి అల్లుడివి. నీకేం రెండేళ్ళలో మీ మామయ్యకంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటావు” అని తలమీద చేయితో తట్టి, వంటపనిలో ప్రవేశించింది సుభద్ర… కానీ మనసు వంటపై కాకుండా అమ్మూ మీదనే వుంది.. ఎంత ఒద్దికగా వుంటాడు వంశీ. మరి వంశిని చూడగానే కలవరపడుతున్నదెందుకు అమ్ము. మాటల్లో చేతల్లో తనకు వంశీలో తేడా ఎక్కడా కనబడలేదు. బావా మరదళ్ళలా కాకుండా ఒక్కతల్లి పిల్లల్లాగే ముగ్గురూ కలిసి వుంటుంటే ఎలాంటి విపరీత పరిస్థితులు తమ ఇంట్లో లేనందుకు, తన క్రమ శిక్షణ తరచూ చెప్పే మోరల్ వాల్యూసేనని గర్వంగా వుంటుంది సుభద్రకు.

ఆరోజు ప్రైవేట్ స్కూల్స్ బందని ఇంట్లోనే వుంది అమ్మూ. అమ్మా నువ్వూ వుండమ్మా అని బతిలాడే సరికి స్కూల్ కు లీవు లెటర్ పంపింది సుభద్ర.
కాలేజీ వుందంటూ వెళ్ళిన ఇద్దరిలో వంశీ తలనొప్పిగా వుందంటూ మధ్యాహ్నానికే వచ్చేయం చూసి కొద్దిగా ఆశ్చర్యం, ఆపైన ఆనందం కలిగింది. హమ్మయ్య! అమ్ము ఒక్కతి ఎలా వుంటుందోనని భయపడి ఆగి పోయాను. నేను ఒక్కపూటన్నా వెళ్తానంటున్న తల్లిని అమ్మా! ప్లీజ్!వెళ్ళొద్దమ్మా! కావాలంటే నేనూ నీతో వస్తా ‘చిన్న పిల్లలా ‘మంకు పట్టు పట్టిన అమ్మూను ‘ఎంతరా రెండు గంటల్లో నీ ముందు వాలుతా ‘అన్న తల్లివైపు నిస్సహాయంగా, భయంగా చూసిన చూపులు సుభద్రను దాటి పోలేదు.. “ఏం కాదు నువ్వు గదిలో తలుపులేసుకొని పడుకో బావ బయట వరండాలో చదువుకుంటాడు” అంటూ చెప్పు లేసుకొని బయలు దేరింది సుభద్ర…

నడుస్తున్నదే కానీ మనసునిండా కందిరీగెల తుట్టెలా సందేహాలు ముసురు తుంటే.. బిడ్డ దీన వదనం కళ్ళముందు మెదిలి ముందుకు అడుగేయలేక పోయింది.. ఎలాగూ సెలవు పెట్టేవుంది ఎందుకంత ఆరాటం బిడ్డ ముఖ్యం అయినా ఈ రోజు ఒంటరిగా వుంది. పొద్దుటంతా పనిలో పడి విషయం తెలుసుకో లేక పోయింది. ఇప్పుడు దగ్గరికి తీసుకొని అమ్ము మనసులోని బాధను రాబట్టాలి’
ఇంటిదారి బట్టింది సుభద్ర. తను. వెళ్ళే టప్పటికి వరండాలో వుండాల్సిన వంశీ కనబడలేదు. ఎందికో కీడు శంకించింది సుభద్ర మనసు. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ కూతురు పడుకున్న గదివైవు మల్లెతీగ పొద దగ్గరికి వచ్చింది’
వంశీ, అమ్మూ మాటలు విని అక్కడే ఆగిపోయింది. అమ్మూ తలుపు తియ్యి. ఒక్కసారి నేను చెప్పినట్టు విను.. ఇదిగో నీ కోసం ఓ మంచి సినిమా మా ఫ్రెండ్ నడిగి తెచ్చాను చూస్తూ ఎంజాయ్ చేద్దాం ‘అంటున్న వంశీ మాటలు’.

నాకు తెలుసు నువ్వు ఎలాంటి సినిమాలు చూపించాలనుకుంటున్నావో, నేను చచ్చినా తలుపు తియ్యను అమ్మ వచ్చేదాకా, “అమ్మ రానీ ఇన్ని రోజుల విషయాలన్నీ చెబుతా, నీ సంగతేందో తేలుస్తా”.. ఏడుస్తూ అంటోంది అమ్ము.
నీ మొహం నువ్వేంటి తేల్చేది నీ మాటలు ఎవరు నమ్ముతారు. మీ అమ్మకు నాన్నకు నేనంటే చాలా ఇష్టం నేనేది చెబితే అదే నమ్మతారు ‘అహంకారంతో అంటున్న వంశీ. నేను చావనైనా చస్తాను కానీ తలుపులు మాత్రం తీయను అంటున్న అమ్ము మాటలు విని ఉలిక్కి పడింది’సుభద్ర.

అంటే వీడు తమనెంత నయవంచన చేస్తున్నాడు. ఇన్ని రోజులుగా ఎంత వినయం నటించాడు.. చదువుకోవడానికి వెళ్ళి వీడు ఇలా అడ్డమైన స్నేహాలు చేసి చివరికి తనబిడ్డనే కాటేయాలని చూస్తున్నాడన్నమాట, అందుకే పిచ్చిపిల్ల తను చెబితే ఎవరూ నమ్మరని తనలో తనే కుమిలి పోతుంది.. తన రక్షణలో తనుండబట్టి సరిపోయింది.. ఆ తర్వాత ఆలోచించబోతేనే కాళ్ళు చేతులు గడగడలాడాయి సుభద్రకు…

ఇంతకాలం తనింట్లో తిరుగుతున్నది, విశ్వాసం గల కుక్కలాంటి మనిషనుకుంది. ఇప్పుడు తెలిసింది పాముకు పాలు పోసి పెంచుతున్నామని..
ఆలోచన ఆందోళనలతో వున్న తల విదిలించుకుంటూ
ఏం కాలేదింకా తన బిడ్డకు అనుకుంటూ నెమ్మదిగా వరండాలోకి వచ్చి లోపలికి నడుస్తూ వంశీ! ఎక్కడున్నావు తలనొప్పి తగ్గిందా ‘అంటూ దగ్గర దాకా వచ్చిన సుభద్రను చూసి కంగుతిన్నాడు.
చేతిలోని సెల్ ఫోన్ గబగబా జేబులో కుక్కుకుంటూ “ఆఁఆఁ తగ్గిందత్తా! అమ్మూకు పాఠాలు చెబుదామని వచ్చా” తడబడుతున్న వంశీని ఒంట్లో కనబడుతున్న వణుకు వస్తున్న చెమటలను చూస్తూ..
అమ్మూ! అని పిలిచింది.

తలుపుతీసిన బిడ్డను గుండెలకు హత్తుకుంటూ.. “ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటే ఏమో అనుకున్నా.. నా బంగారూ నీకేం కాదు తల్లీ! అందుకేనేమో కన్నపేగు కదిలి నన్ను వెనక్కి రప్పించింది. అసలు విషయం తెలుసుకునేలా చేసింది అంటూ” వంశీ వైపు చూసింది..

ఆ చూపులకు కాల్చే శక్తి వుంటే మాడి మసై పోయేవాడు.. ఆ తీక్షణతకు తట్టుకోలేక మెల్లగా దూరం జరుగుతున్న వంశీని తనఒంట్లో శక్తినంతా ఉపయోగించి రెండు చెంపలు ఎడాపెడా వాయించింది. అనుకోని పరిణామానికి బిత్తర పోయిన అమ్ము. “వద్దమ్మా వదిలెయ్ వాళ్ళింటికి పంపించేయ్. బావ ఈమధ్య మారిపోయాడు. ఇంతకు ముందు నన్నెవరన్నా అంటే వాళ్ళ గల్లా పట్టుకొని కొట్టినంత పనిచేసే వాడు. అలాంటి బావే ఇట్ల తయారయ్యిండు నా కిద్దరన్నలున్నరని మురిసినమ్మా.. కానీ బావే…” అంటున్న అమ్ము మనసులోని పసిదనపు స్వచ్ఛతకు. పాతాళంలోకి కూరుకు పోయాడు వంశీ…

వంశీలో మార్పుకు కారణాలు వెదుకుతూ నిశ్చేష్టగా మంచంలో కూలబడిపోయింది సుభద్ర.

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!