Saturday, May 30, 2020
Home > కవితలు > || హత్యా…? ఆత్మహత్యా…? || -మాధవ్ గుర్రాల

|| హత్యా…? ఆత్మహత్యా…? || -మాధవ్ గుర్రాల

నీరింకిన కళ్ళతో
నింగి వైపు దీనంగా చూసిన వేళ
తెల్లని మేఘం
కురిపించిన నాలుగు జల్లులకు
నెర్రెలు వారిన నేల
నెగడు ధగడు చల్లారకుండానే
పుడమిని దున్నిన
రైతన్నను చూసి
అవని బాధను ఓర్చుకుంటూ
తన గుండెల్లోని
పచ్చిదనం తోడందించినపుడు
తనకు తోడుగా ఉన్న
నేల తల్లిని చేతులెత్తి మొక్కి
దుక్కిదున్ని
మొలుస్తాయో లేదో
తెలియని విత్తనాలు తెచ్చి నాటి
అక్కడక్కడా మొలచిన
మొలకలను ఆప్యాయంగా పెంచి
నిండు గర్భినిలా మారిన
పైరును చూసి
ఆనందిస్తున్న వేళ
రాక్షస మబ్బులు
వికృత రూపంతో వికటాట్టహాసం చేస్తూ
కుమ్మరించిన విషపు వర్షానికి
పొద్దులు నిండిన పంట
దీనంగా
తన వంక చూస్తూ నేలకొరిగినపుడు
నేలపై ఉన్న మనుషులకే కాక
నింగిలోని మేఘాలకు సైతం
జాలీ దయా లేవని తెలిసి
రోదిస్తున్న రైతన్నను చూసి
పురుగుల మందు డబ్బాలు
చెట్ల కొమ్మలు గజగజలాడుతున్నాయి….

-మాధవ్ గుర్రాల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!