Sunday, October 2, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 18 వ & చివరి భాగం) – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 18 వ & చివరి భాగం) – శ్రీ విజేత

అతని ప్రేమ కవిత్వంలో పడి కొట్టుక పోతున్నాను. తనువూ మనసు ఒకటే అయి అతడు రాసుకున్న కవితామృతం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రేమపై అతడి అమూల్య భావనలు చదువుతుంటే ప్రేమ విశ్వజనీన సత్యం అనిపిస్తుంది.

అతని భావనల్లో ప్రేమంటే,
‘ప్రేమ ఒక అపురూపమైన భావన. బతుకు యొక్క పరమ విలువ, మనిషికి మనిషికి ఉండే ఉండే స్వచ్ఛమైన అనుబంధం. ప్రేమ నూరు వన్నెల బంగారము లాంటిది. పరిసరాలను సువాసనలతో గుబాళింప జేస్తూ ప్రేమ వెలిగే దీపంలాంటిది చుట్టూ కాంతిని ప్రసరింపచేస్తూ. ప్రేమ మట్టికి మనిషికి ఉండే అనుబంధం లాంటిది, పూవుకు తావికి ఉండే బంధం లాంటిది, చేపకు నీటికి ఉండే సంబంధం లాంటిది. కష్టములా, కన్నీరులా, సత్యములా ప్రేమ కల్తీ లేనిది ఎక్కడ ప్రేమ హృదయం ఉంటుందో అక్కడ బతుకులో పూల జల్లులు కురుస్తుంటాయి, సువాసనలు గుబాళిస్తుంటాయి మనసులో మల్లెలు పూస్తుంటాయి. బహుశా ప్రేమ జనితమైన చోట మనసులను హృదయాలను కన్నీళ్లతో ప్రక్షాళనము చేసుకోవలసి వస్తుందేమో. నిజంగా ఎందరికి అందుతుంది ఈ అందమైన భావన ! చిట్టచివరికి మనిషిని మనిషిలా కాకున్నా ప్రేమకోసమై ప్రేమించాలేమో ప్రేమకోసమై బతుకాలేమో , ప్రేమ కోసం మరణించాలేమో! ప్రేమ ఇచ్చేదే, తీసుకునేదే. కానీ ఎందరు ఇస్తారు ప్రేమను ఎందరు స్వీకరిస్తారు ప్రేమను! స్వచ్ఛమైన ప్రేమని ఇచ్చిన వాళ్ళు ధన్యులు! ప్రేమించిన వాళ్లే ధన్యులు! ప్రేమ బతుకును పుటం పెట్టి ప్రజ్వలింపచేసి రసాయన ప్రక్రియ! అందుకే ప్రేమ కోసమై ప్రేమించాలి.’

నిజమే కావచ్చు, నాకు నేను ఏమని అన్వయించుకోవాలి అతని ప్రేమను. నా ప్రేమ ఏముందీ ! అతని ప్రేమనే అంతా ! నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అతని ప్రేమామృత ధార ! ఇంకా ఇచ్చిపుచ్చుకొనే ప్రేమ గురించి అతని భావనలు నన్ను ముగ్ధురాలిని చేస్తున్నాయి.

‘ఎవరు ఎవరికి ఏమి ఇస్తారు నిజంగా! ఒక చూపునిస్తారు, పిల్ల తెమ్మర లాంటి నవ్వునిస్తారు, ఆహ్లాదాన్నిస్తారు, ఆనందాన్నిస్తారు, ప్రేమనిస్తారు, అభిమానాన్నిస్తారు. అలా ఇవ్వడం ఎందరికి సాధ్యం? కొందరికి తెలియదు తమ గురించి తమకు, బంగారం వజ్రాల గనికి కూడా తను బంగారం , వజ్రాల గనినని తెలియదు. కస్తూరి సుగంధమైన దాని గుబాళింపును అందుకునే వాళ్లకే తెలుస్తుంది! కొన్ని బతుకులు కాంతివంతమైన దీపాల్లా ఉంటాయి, అవి కొందరిని వెలిగిస్తాయి ఆ వెలుగు జగతికి కూడా వెలుగవుతుంది. నువ్వు వెలుగు, నేను వెలుగు చీకట్లో చిరుదివ్వెల్లా కూడా. బతుకు పథంలో కోల్పోయిన రవ్వల్లాంటి, రత్నాల లాంటి క్షణాలను, నిమిషాలను గంటలను సంవత్సరాలను మళ్ళీ దొరకబుచ్చుకోవాలని ఒక పొద్దూ ఒక రాత్రిలా గడుపుతూ నీ కోసం నిరీక్షణలో.. చదువుతుంటే అనిపించింది, ఇంకానా నా కోసం అతని నిరీక్షణ అని! నేను ఏమి ఇవ్వగలను అతని నిరీక్షణకు సమాధానం! మౌనమే ఈ జీవితానికి సమాధానం అనిపించింది. అతని భావనలు చదువుతుంటే నాకు ఏమి చెప్పదలచుకున్నాడో అవన్నీ కవితా రూపంలో నాకు చెపుతున్నాడా అని అనిపించింది.

‘ఏమని రాయను నీ కోసం. నేను కవితలల్లింది, కలం పట్టింది నీ కోసమే. బంగారు గని నా ఎదుట ఉన్నా, దాన్ని అందుకోనట్లు, సౌందర్య లహరిలా, నిండు జాబిల్లిలా, వెన్నెల వానలా, సుందర పుష్పములా, నెమలి నాట్యములా కలకూజితంలా, నవ్వుల సోయగంలా, గలగలపారే సెలయేరులా, ఫలించే చెట్టులా నువ్వుంటూ నిండుకుండను రెండు చేతులతో పొదివి పట్టుకుని తీగ మీద నడుస్తున్న ఒంటరి సాహస బాలికలా నువ్వు బతుకీడుస్తుంటే, ఒహ్! ధైర్యశాలురు నీలా కొందరే ఉంటారనిపిస్తుంది. అందుకే కొండను దర్శించ బోయినట్లు, ప్రవహిస్తున్న నదిని చూడబోయినట్లు, మహా సముద్రాన్ని చూసి రావడానికి వెళ్లినట్లు నీ చేరువకు వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది. కొన్ని దర్శనీయ ప్రదేశాలుంటాయి, మనమే వెళ్లి దర్శించాలి, అవి రావు, నువ్వు అలానే కదా! ఏ అపరాత్రో అర్థరాత్రో, పట్టపగలో, సూర్యోదయమో, సూర్యాస్తమయమో బతుకంతా జ్ఞాపకం వచ్చి నువ్వు స్పురణకు వస్తే కమ్మని కవితవై నువ్వే వస్తావు, కవితలని నువ్వే ఇస్తావు.
ఇలా అతని కవిత్వ ధారలో కొట్టుకపోతుంటే అతడు చెప్పుకున్నట్లు, అతని కవిత పుట్టుకకు కారణం నేనేనని తెలిసి మనసు ఉప్పొంగిపోయింది. నిజంగా అతడు అన్నట్లు నేను ధన్యురాలినా! కాలం ఇంత గమ్మత్తుగా ఉంటుందా కొందరి జీవితంలో కొందరు పరోక్షంగా ప్రభావితం చేస్తుంటారా అని, నాకు తెలియకుండానే నేను పరోక్షంగా అతన్ని ఇంతగా ప్రభావితం చేశానా అనిపించింది!

ప్రేమ ఇంత పచ్చి నిజమా! సత్యమైనదా! దానికి కాలం తో పాటు తరగిపోయే స్వభావం ఉండదా?
‘అవును, నేను ప్రేమిస్తున్నాను. ఇప్పుడూ ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తుంటాను. సముద్రగర్భంలో విలువయిన రాళ్లు, రత్నాలు ఉన్నట్లు నీలో ఏదో అద్భుత శక్తి ఉంది అనిపిస్తుంది, లేకుంటే ఇంతగా ఆరాధించను. కవిత ఆలంబన అయింది కాబట్టి బతుకుతున్నాను. హృదయం అనే అద్దంలో నీ రూపము స్థిరపడిపోయింది, తీసివేయడం తుడిచెయ్యడం సాధ్యము కాకే మనసు ఉసూరుమంటూ కన్నీళ్లు కారుస్తుంది. గాయపడిన హృదయానికి మదనపడే హృదయానికి మందు నువ్వే, మనసు నువ్వే. గాయమై తునాతునకలైన హృదయములోంచి వేయి కవితా నదులు ప్రవహస్తాయేమో, ప్రేమ, కరుణ అని అమృత వాక్యాలు వెలువడుతాయేమో. జీవితం ఒక అద్భుత కావ్యం. అది ఆనందమో, విషాదమో మిగులుస్తుంది. ప్రేమకు వెయ్యింతల ప్రేమను ఇస్తాను, స్నేహానికి వెయ్యింతల స్నేహాన్ని ఇస్తాను. బతుకు కట్టుబాట్లకు బందీ అయిపోయినప్పుడు జగతికి వెలుగునిచ్చే పొడిచే పోద్దులా, గుబాళిస్తూ పూసే పువ్వులా, సజీవ నదీ ప్రవాహంలా దృఢంగా నుంచున్న దండి కొండలా ఆటుపోట్లకు నిలయమై ఘోషిస్తున్న సముద్రంలా నేను కవితా చక్రవర్తినయి ఈ జగతిలో కనిపిస్తాను. ప్రేమను పొందడం, ప్రేమించబడటం ఎంత అదృష్టం! ప్రేమ అనే వృక్షము నీడలో హాయిగా జీవించవచ్చు ప్రేమ వృక్షము అందించే ఫలాలను తనవితీరా ఆస్వాదించవచ్చు పరస్పరము ప్రేమించుకుంటూ! అవునూ అలా నిన్ను నేను ప్రేమిస్తున్నాను.’ ఇలా నిర్మలమైన అతని భావ కుసుమాలను చదువుతుంటే కనుకోలుకుల్లోంచి వెచ్చటి కన్నీటి బొట్లు ధారలుగా కారుతూ ఉబికి ఉబికి వస్తున్నాయి.
ఇంకా అతని కవిత్వ ధారలో నిండా మునిగి చదువుతూ పోయాను. చివ్వరగా చెపుతున్నట్లుగా ఇలా చెప్పాడు
‘అసలు నిన్ను మరచి పొగలనా! మరచి పోవడం సాధ్యమా! పువ్వును అంటిపెట్టుకున్న పరిమళములా నీపై ప్రేమ నాకు, నా పెదాలపై నీ పేరు పలుకని రోజుందా! బతుకులో విజయమంటే నువ్వేనని, నా ప్రతి అపజయంలో కూడా నేను నిన్ను గుర్తు పెట్టుకున్నాను నా ఆశయం గమ్యం నువ్వే అని, నేను బతుకుతుంది నీకోసమే అంటే వింతగా విస్తుపోయి చూస్తోంది లోకం! క్షణాలు, గంటలు, రోజులు, నెలలు , సంవత్సరాలు గడిచినా నిన్న మొన్నటిలానే ఉంది కాలము నాకు. అప్పటికీ ఇప్పటికీ ప్రకృతి కాంతలా నువ్వు నా కళ్ళలో కదలాడుతున్నావు. నేను నిన్ను ఎప్పుడు మరిచి పోగలనో చెప్పనా ! శరీరంలో జీవ ధాతువు ఇంకిపోయి, తనువు నుండి జీవుడు వెళ్లిపోయినప్పుడు మాత్రమే! అప్పుడు కూడా నిన్ను స్మరించుకుంటూ పోతాను. నిజంగా నా ప్రేమను పొందిన నీవు ఎంత ధన్యురాలివి! కన్నీళ్లు, కవిత్వమే నువ్వు నాకు ఇచ్చింది. బహుశా నీ కన్నీళ్ళు నా లోకి ప్రవహించి కవిత్వమై వచ్చిందేమో! నా కవిత్వము పుట్టుక జీవ ధాతువు నువ్వే ! నిన్ను చేరకుండా కలువకుండా ఉండగలనా నది పుట్టి త్రోవ చేసుకుని వచ్చి సముద్రంతో కలిసినట్లు నేను నిన్ను కలువాలని ఉంది. చివరగా రెండు మాటలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిండు మనసుతో. ఎలా మరచిపోగలను చెప్పూ! నా ప్రేమ స్వచ్ఛమైనది ఐనపుడు నీ జ్ఞాపకాలు అయినా చాలు. అవి నన్ను నిరంతరం వెలిగిస్తూ అమితమైన శక్తిని ఇస్తుంటాయి. ఇక ఎలా మరచిపోగలను చెప్పూ!’

ఇలా అతడు రాసుకున్న భావనలు చదువుకుంటుంటే, ఇంతగా ప్రేమించిన అతనికి ఏమి సమాధానం ఇవ్వాలి అనిపించింది. అద్భతమైన, అపురూపమైన అతని పేమ భావనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నా దరికి ఇష్టంతో సమీపించాలనుకొనే అతనికి ఏమని చెప్పాలి. జీవితంలో రెండుపాళ్ళు జీవనం గడిచిపోయింది, యాబై ఏళ్ళు సమీపించాయి. బతుకంటే బాధ్యత కదా! ఆ బాధ్యతలని విడిచి, మరచి బతుకలేను కదా! ఎన్నో కోర్కెలను త్యాగం చేసి బతికాను నేను, ఇప్పుడు కూడా అలానే బతుకాలి కదా! అతని ప్రేమ అతని వద్దనే, నా ప్రేమ నా గుండెల్లోనే ఉండాలి కదా! ప్రేమను ప్రకటించుకొనే శక్తి ఎక్కడిది నాకు? అతడు మొగవాడు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాడు. ఆడజన్మ ఎత్తిన నేను అంత సాహసం చేయగలనా? ప్రేమ ప్రేమ అంటూ కలువరిస్తూ మాట్లాడగలనా! బతుకు ఒక అడవి కాచిన వెన్నెల అయినా కూడా కోర్కెలను చుట్ట చుట్టుకొని బతికాను నేను. దినదినం గడువడమే జీవితంలా బతికాను నేను. ఊహాలొకములొ వెళ్లిపోలేదు, ఉల్లాసాన్ని కోరుకోలేదు. కోర్కెల వలలు విసిరే సమాజంలో నన్ను నేను కాపాడుకుంటూ స్థిరంగా ఉండి ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడూ, ఎప్పుడూ అలానే ఉండాలనుకుంటున్నాను. ఒకరి ప్రేమకు తల ఒగ్గి ఒకరి జాలిపై బతుకాలా ! ప్రేమ అమృతమయమైనది, ప్రేమ అమలినమైనది. దాని విలువ కాపాడుకోవాలి కదా! ప్రేమ ఒక అందమైన భావన! అది నన్ను వదిలిపెట్టలేదు అన్నట్లు ఉంది చివరి వరకు కూడా! అయినా ప్రేమ ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకున్నా మనసుకు తృప్తిని ఇచ్చే భావన అది. ఒకరి కవితకు ప్రాణం, జీవం, ఆలంబన అయిన నేను ఎంత తృప్తి పడాలి నిజంగా! ఎప్పుడైనా అతడు కలిస్తే ఏమని చెప్పాలి ? ఎపుడో అతనికి రాసినట్లు గుర్తుకు వస్తున్న విషయం ‘నువ్వు అనుకున్నంత చేరువలో అసలు ఎప్పుడూ రాలేను’ అని చెప్పాలనుకున్నాను.

హితుడా, స్నేహితుడా, ప్రేమికుడా! ఏమని చెప్పాలి నీకు. ఎంతగా ఆశ పడ్డావు నాపై. ఏమి ఇవ్వగలను నేను నీకు! ఉట్టి జ్ఞాపకాలే మిగిలేవి మనకు! ఈ జన్మలో నేను నీకు ఏమి ఇవ్వలేను, మరు జన్మలో నీ ఇష్టాలు, కోర్కెలు తీరుస్తాలే అని చెప్పాలనిపించింది. అతడు యాదికి వస్తుంటే ఏదో సినిమా పాట జ్ఞాపకం వస్తుంది, ’అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’ అని అతనికి చెప్పాలనుకున్నాను. ప్రేమించే వారిపై, నిర్మలమైన మనిషిపై కోపం ఎలా వస్తుంది. నా గుండె నిండుగా ప్రేమను నింపాడు, నా మనసు నిండుగా తృప్తిని నింపాడు. అతని భావనల్లో భాషించే కవితా కన్యను నేను, అతని కలములో సజీవంగా ప్రవహిస్తున్న కవితా ధారను. అతని ఉహాల్లో వీచే వింజామరను. అతని మనసులో దాగి ఉన్న మమతను, అతని పెదవుల్లో అనునిత్యం పలికే పేరును, అతని స్మృతుల్లో నిలిచి ఉండే సుమధుర భావాన్ని, అతని కవనంలో కనిపించే కమనీయ రూపాన్ని! ఎలా, ఎలా మరచిపోవాలి! జీవితం ఊహ అయితే ఎంతబాగుండు? జీవితం నిజం అయి మనసును బాధిస్తుంది! ఈ సమస్త ప్రపంచం నాకు రెండు భాగాలై కనిపిస్తుంది. ఒకవైపు కేవలం అతడూ నేను, ఇంకోవైపు మిగితా ప్రపంచం! నేను ఎవరి వైపు ఉండాలి ? ఊహల్లొ అతని వైపు, వాస్తవంలో లోకం వైపు ఉండాలా! ఏమి చెప్పాలో అతనికి తోచడం లేదు! మనసు పరిపరి విధాల పరితపిస్తుంది. అతడు-నేను- ప్రేమ – జీవితం ఒక సజీవ కావ్యం లాగ కనిపిస్తుంది. హితుడా! స్నేహితుడా! జీవితం ఒకోసారి అడవి కాచిన వెన్నెల కదా కొందరికి? ఆ వెన్నెలను జుర్రుకొని తాగుతాను అంటావా! కొన్ని అందీ అందని జీవితాలే కొందరికి! మనం కట్టుబాట్ల, సాంప్రదాయ నియమ నిబంధనల్లో బతుకుతున్నాం, అది ఈ దేశం సామాజిక పరిస్థితుల కనుగుణంగా ! ఆ గీతలను దాటి బతుకలేం కదా! నీ ఊహల కవితా సామ్రాజ్యంలో రాణిని కావచ్చు నేను! బహుశా అంతమట్టుకే కదా అది! అది కాదని అతని కోసం అతని ప్రేమ కోసం నేను ఎదురు చూడాలా ! ఊహించడానికే భయమేస్తుంది! అందుకే, హితుడా సన్నిహితుడా! నువ్వు అనుకున్నంత చేరువలో నేను రాలేను కదా! నీ అపురూపమైన ప్రేమకు, అభిమానానికి, ఇష్టానికి శతకోటి కృతజ్ఞతలు! అని చెప్పాలనిపించింది. ఇంతకన్నా ఏమి చెప్పగలను! ‘ప్రవహించే గోదావరి ఇసుక తిన్నెల్లో, వెన్నెల రాత్రుల్లో మైమరచి హాయిగా గడుపవచ్చు అంటాడేమో! ఆడపిల్ల హృదయాన్ని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లు, పిడికెడు నీ హృదయంలో స్థానం ఇస్తే చాలు, నీ ఒడిలో గువ్వపిట్టెలా ఒదిగిపోనిస్తే చాలు, చెట్టు నీడలో విశ్రమించినట్లు నీ ఒడిలో విశ్రమిస్తాను అని అంటాడేమో! నువ్వు నా కోసమై, నేను నీ కోసమై బతుకుదామా ఈ బతుకు ప్రయాణంలో అని అంటా డేమో!’ ఇవన్ని సాధ్యమా ఈ జీవితంలో నా బోటి దానికి! విజ్ఞత గల అతనికి ప్రేమ అంటే, త్యాగం అంటే, బాధ్యత అంటే, లోకం అంటే కూడా తెలుసు కదా! అతని భాషలోనే చెప్పాలి అతనికి అని అనిపించింది. అతడు చెప్పినట్లే స్నేహ సంపద పంచు, అదియే ప్రేమను పెంచు, ఆదర్శమిది బతుకు ఓ చందమామ’ అని అతడు అన్నట్లు అలా బతుకచ్చు ఎప్పటికీ. ‘అయ్యింది మంచికే, అవుతుంది మంచికే, మంచి ఊహల బతుకు ఓ చందమామ’ అని అన్నట్లు అలా కూడా బతుకచ్చు. అని అతనికి చెప్పాలనిపించింది.

‘హితుడా! స్నేహితుడా! స్వాప్నికుడా! ఎంత మంచి నిర్మలమైన మనసు నీది! కాల ప్రవాహంలో పడి కొట్టుకపోయి వచ్చాను ఇక్కడి దాకా! బతుకును ఆనాడే ముగించుకుంటే మట్టిలో మట్టి అయిపొయేదాన్ని ఎన్నడో! మనకు పట్టింపులు లేకున్నా లోకానికి పట్టింపులు ఉంటాయి కదా! అందుకే నీకు దూరంగా బతుకవలసి వచ్చింది! వ్యక్తిగత స్వార్ధం అంటారేమో! అంతకన్నా ఏమి చెప్పలేను! ఒంటరి సముద్రంలా ఉన్న నా దగ్గరికి ఒక జీవిత కాలం పయనించి నదిలా వచ్చి కలిసావు! మనసులో నిండి పోయావు, ఇది చాలు కదా! తృప్తికి మించినది ఏముంది! రక్తం రంగు అంతా ఒకటే అయినపుడు మనుషులంతా ఒకటే అని అనుకోని మనుషుల మధ్య బతుకుతున్నాం. నీ భాషలోనే జీవితం అంటే ఒక పెద్ద నటన. నటిస్తూ బతుకాలి, బతుకుతూ నటించాలి, అలానే చనిపోవాలి.

రాయడానికి నా దగ్గర ఏమీ లేవు, నేనుట్టి నిమిత్త మాత్రురాలిని, జీవితం యెడల మౌన ప్రేక్షకురాలిని. రాయిని రత్నం చేశావు నువ్వు, గడ్డిపువ్వుకు సువాసనలు అద్దావు నువ్వు. ప్రేమ అనే వృక్షానికి కన్నీళ్లు పోసి పెంచావు నువ్వు! ఆ వృక్షం ఇప్పుడు కావ్య కుసుమాలను ఇస్తుంది. ధన్యుడవు నువ్వు, నేను ధన్యురాలిని అవునో కాదో నాకు తెలియదు. నదులు, సముద్రాలు, గిరులు, పర్వతాలు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, సమస్త విశ్వం అందరికి చెందుతాయి. ప్రేమ కూడా అందరికి చెందే ఒక విశ్వజనీన భావననే! మనిషిని చూడడం కాదు, ప్రేమ అనే ఒక భావనను చూసినపుడు బతుకులో విశాలత్వం వస్తుంది, అది అర్ధం చేసుకున్నవాళ్ళకే అందుతుంది. నేను, నాది, మాది, అని ఏమీలేదు, అందరిది ఇది. గిరులు గీసుకొని బతికే ఈ మనుష్యులకు చాలా మందికి ఇది అర్ధం కాదేమో! అవునూ, ఒకటవ సారి కాదు, రెండవసారి కాదు, మూడవసారి కూడా నీకు అందని దాన్ని నేను! ఎన్నో పోగొట్టుకుంటే లేదా కొన్ని పోగొట్టుకుంటే కొన్ని మిగులుతాయి అంటావేమో, మిగిలింది చాలు కదా ఈ జీవితంలో! నిర్మలమైన మనసులో ప్రశాంతత ఉంటుంది. అంతకన్నా ఏమి కావాలి బతుకులో! నన్ను అర్ధం చేసుకుంటావు కదూ…” అని అతనికి చెప్పాలనిపించింది. అయినా, అవునూ నిజంగా, ‘అతని ప్రేమ కోసం’ నేను ఏమివ్వాలి ? ఒకనాడు అతనికి రాసుకున్నట్లు,
‘ఉట్టి మాటలు చాలవేమో’!

( అయిపొయింది)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!