Tuesday, July 14, 2020
Home > కథలు > || జానకి విముక్తి || -వి. సునంద

|| జానకి విముక్తి || -వి. సునంద

జానకమ్మకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఇది ఇవాల్టి సమస్య కాదు. భర్త పోయినప్పటి నుండీ వుంది….

ఆయన ఉన్నప్పుడు ఆయన మాటలకు భయపడి తనకూ గౌరవమిచ్చే వాళ్ళు. తనే ఎప్పుడూ పిల్లల్ని వెనకేసుకొస్తూ.. ఎందుకండీ! అలా గట్టిగట్టిగా మాట్లడుతారూ! వాళ్ళకూ పెళ్ళిళ్ళయి పిల్లలూ అవుతున్నారు ” ఆ మాటకు తనమీద ఇంతెత్తున లేచి పెళ్ళిళ్ళయితే మాత్రం నా కంటే పెద్దోళ్ళయినట్టా… వాళ్ళు నా అంతయినా మనకంటే చిన్నోళ్ళే కదా పిచ్చి మొహమా! పెద్దోళ్ళం మనల్ని గౌరవించడం చూస్తేనే, రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళను గౌరవిస్తారు అంటూ తేల్చి పడేసే వాడు. మంచి చెడు ఆహార వ్యవహారాలన్నీ తన కనుసన్నలలో జరగాలని కోరుకునే తండ్రి మాటల వెనుకున్న కలిసి వుండాలనే తపన కనబడేది కొడుకులకు.. అందుకే తండ్రి మాటను గౌరవిస్తూ భార్యలకు సర్ధి చెప్పడం తను గమనించేది…
ఆయన అదృష్ట వంతుడు ఒంట్లో శక్తి, గొంతులో గాంభీర్యం తగ్గకముందే హార్ట్ ఎటాక్ తో అనాయాస మరణం పొందారు…
అప్పటి వరకు ఆయన నీడలో నిశ్చింతగా బతికిన తను మోడై పోయింది…. పుణిస్త్రీగా పోవాలని ఎన్ని నోములు నోచినా అవన్నీ ఆయనను పుణ్యపురుషుణ్ణి చేయడానికే ఉపయోగపడ్డాయి.
జంట వీడిన పక్షిలా ఒంటరి జీవితాన్ని గడపలేక కనికరించని మరణం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నది.

ఆయనున్నంత కాలం లేవని కోడండ్ల గొంతులు నెమ్మదిగా పెరగసాగినయి… ఇంతకాలం ఆ ముసలాయన కోసమే కలిసున్నాం అనే భావన మాటల్లో చేతల్లో వ్యక్తం చేయడం మొదలు పెట్టారు.
జానకమ్మకు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. కొడుకులిద్దరిని పిలిచి వాళ్ళ మనసులో ఏముందో తెలుకోవాలనుకుంది…

ఇద్దరూ ఇద్దరే… ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పమ్మా!అన్నారు. మీ నాన్నంత తెలివుంటే పరిస్థితి ఇలా చెయ్యి దాటిపోయేది కాదురా.. మీ భార్యలను అడిగి చెప్పండి. వాళ్ళ చేతుల్లోనే ఇంటి ప్రశాంతత ఆధారపడివుంది ” స్థిరంగా అంటున్న అమ్మ మాటలు వాళ్ళకు చురకలుగా తాకాయి. చిన్న కొడుకు నసుగుతూ పిల్లల స్కూల్ కు దగ్గరగా ఇల్లు తీసుకుందామంటోందమ్మా మీ కోడలు. తనేదో కోర్స్ లో కూడా జాయిన్ కావాలనుకుంటుంది”అన్నాడు.

“పెద్దోడా నువ్వేం అనుకుంటున్నావ్. నీ అభిప్రాయం కూడ చెప్పు” అంది… “మేమిక్కడే వుంటామమ్మా.. నీవు మాతోనే వుందువు గాని, నాన్న రిటైర్ మెంటు డబ్బులతో ఎంతో ప్రేమతో కట్టినిల్లు ఇది” అన్నాడు పెద్దకొడుకు. ఇది ఇద్దరి కోసం కట్టించిన ఇల్లు. మీరున్నప్పుడే రెండు భాగాల హద్దులవీ పెట్టిస్తే బాగుంటుంది. అప్పటి వరకు తలుపు చాటునుండి మాటలు వింటున్న చిన్న కోడలు కుండబద్దలు కొట్టినట్టు అనేసరికి జానకమ్మ మనసు చివుక్కుమంది. “అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. ఎవ్వరూ తొందర పడకండి” అంటూ నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది…
జ్ఞాపకాల తుట్టె కదిపినట్టయ్యింది జానకమ్మకు. ఆయన ముందు జాగ్రత్తగా రెండు పోర్షన్లుగా కట్టించాడు. కానీ తమ కోసం ప్రత్యేకంగా ఒక్కగదన్న కట్టించలేదు… ఇప్పటి వరకు అవసరం రాలేదు ఆరుగదుల ఇంట్లో తాము వరండా ముందున్న గదిలో వుండేవాళ్ళు. మరిప్పుడు పంచితే తనకుండటానికి చోటేది.. కంటి మీద కునుకు లేదు.

పొద్దున్నే అత్యుత్సాహంతో కోడండ్లు కొడుకులు హద్దులు గీయించి, మేస్త్రీని పిలిపించి రెండు పోర్షన్లకు మధ్య గోడ కట్టించారు.. మరి నా సంగతేం చేశార్రా:! అడిగింది.
“అత్తమ్మా! నువ్వు కంగారు పడకు చెరో ఆర్నెల్లు ఎవరి దగ్గర వుంటే అక్కడ వరండాలో వుందురు గాని…అదో పెద్ద సమస్య కాదు, చూడు నేను చిటికెలో తేల్చేశాను” అని గర్వంగా చూస్తున్న చిన్న కోడలి వంక నివ్వెర బోయి చూసింది…
తను పదిల పరుచుకున్న జ్ఞాపకాలు, ఇంతకాలం తను వాడుకునే బీరువాల మాటేమిటి అవెక్కడ పెట్టుకోవాలి.. అత్తగారి ఆలోచనలను పసిగట్టిన పెద్ద కోడలు “అంతపెద్ద బీరువా మీ కవసరమా అత్తయ్యా! ఓ ట్రంకు పెట్టె పెద్దది కొందాం. మీ వన్నీ అందులోనే సరిపోతాయంటుంటే”… ఆ ఇంట్లో మనుషులకే తప్ప మమతానురాగాలకు తావు లేదని తెలిసిపోయింది. జానకమ్మ ప్రమేయం లేకుండానే పూచిక పుల్లతో సహా ఇద్దరూ పంచుకున్నారు…..

మొదట పెద్దోడి ఇంటికి వెళ్ళింది… తిరిగే కాలు తిట్టే నోరు ఆగవని తెల్సు… చేసే చెయ్యి కూడా ఆగదు.. ఓపికున్నంత వరకు వంట వార్పూ చేసి అందరిని మెప్పించింది….
ఇప్పుడిక చేసి పెడితే తప్ప తినలేని పరిస్థితి. అప్పటి వరకున్న స్వేచ్ఛ ఆయనతోనే పోయినది…

ఇకపై ఒంటరి పోరాటం, సర్థుకు పోవాలి… బతుకు ముళ్ళ మీద ఆరేసిన చీరయ్యింది…. కంటి మీద కునుకు కరువయియింది..
చెరకు గడలాంటి తీయని అనుబంధం వెగటుగా మారింది…
చేసి పెట్టినంత కాలం ఇంటిల్లి పాది అక్కడా ఇక్కడ అమ్మ చేతి వంట అమృతం, అసలు అత్తమ్మ చేతిలోనే ఏదో మహిమ ఉందన్నకోడండ్లు, ఉడిగిన రెక్కలను లెక్కలోంచి పక్కకు పెట్టడం మొదలు పెట్టారు.

“అమ్మ నీకేం అవసరాలుంటాయి. ఏవైనా నీకు కావలసినవి తెచ్చేది మేమే కదా” అని పెన్షన్ డబ్బులను కూడా కళ్ళ జూడనీయకుండా చేస్తున్న కొడుకులను చూస్తుంటే తన పిల్లలేనా అనిపిస్తున్నది జానకమ్మకు.

గట్టి పదార్ధాలు నమలలేని జానకమ్మ ప్రతిరోజూ రెండుపూటల జావ మధ్యాహ్నం అన్నం కొంచెం మెత్తగా వండుకునేది.
అవన్నీ మాకెక్కడ కుదుర్తాయి, పెట్టింది తిని ఓ మూలన కృష్ణా రామ అని కూర్చోవచ్చు కదా అనే అన్యాపదేశపు మాటలను రోజు రోజుకు భరించడం కష్టంగా వుంది…
ఒకప్పుడు వచ్చిన వాళ్ళకు మా అత్తగారని గొప్పగా పరిచయం చేసిన కోడండ్లు వరండాలో ఆమె నీడ కనబడ్డా సహించ లేక పోతున్నారు..
ఉదయ మంతా ఇంటి వెనకాల మల్లె పందిరి కిందనో, వేప చెట్టుకిందనో ఎండా వానలను భరించడం నేర్చుకుంది. , ఒకో సారి సాయంత్రాలు వచ్చిన స్నేహితులకు ఇబ్బందంటూ ఆమెను ఇంటి వెనకాలే ఉండమనడం మొదలు పెట్టారు.
రోజు రోజుకు శుష్కించే దేహంతో విశ్రాంతిగా మేను వాల్చుకోవడానికి కూడా స్వతంత్రం లేని ఆ రెండిళ్ళలో పరాయిదయిపోయింది జానకమ్మ.. అవసాన దశలో అరణ్యవాసంలా వుంది… పిడికెడు మెతుకుల కోసం వాళ్ళ పంచనబడి ఉండటం కంటే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటే బాగని మనసులో రోజు రోజుకూ పెరుగుతున్న చావు కోరిక జానకమ్మను నిలువనీయడం లేదు…
ఆ రోజు ఫంక్షనేదో వుందంటూ. జానకి ఉనికినే మరచిపోయి పదింటికే పిల్లలతో సహా వెళ్ళిపోయారు…
బాగా ఆకలవుతోంది జానకమ్మకు ఏదైనా తిందామంటే ఇంటికి తాళం. వరండాలో బాటిల్ లో పెట్టుకున్న నీళ్ళు తాగింది. ఎప్పుడొస్తారో తెలియదు. శోషొచ్చి పడిపోయేలా వుంది.. నెమ్మదిగా కర్ర ఆసరా చేసుకొని మెట్లు దిగి రోడ్డు మీదకి వచ్చింది.. బిచ్చగత్తెలా ఎవరినీ చెయ్యి చాచి అడగలేదు… గమ్యం తెలియని బాటసారిలా కనబడే రోడ్డు పక్కనుండి బలవంతంగా శరీరాన్ని లాక్కుంటూ వెళ్ళింది…. కళ్ళు బైర్లు కమ్మి ఓ చోట కుప్పకూలిపోయింది.

అలా ఎంత సేపు పడివుందో తెలియదు..
కళ్ళమీద నీళ్ళు జల్లి అమ్మగారు! ఇక్కడికెలా వచ్చారంటూ పలకరిస్తున్న మనిషిని కళ్ళకు చేతులడ్డం పెట్టి పోల్చుకో సాగింది. “ఓ! నువ్వు చంద్రయ్యవు కదా! అంది నీరసంగా…”

“అవునమ్మ మీ ఇంటి తోటపనికి వచ్చిన చంద్రయ్యనే… మీరు ఇక్కడ”.. అంటుంటేనే మగతగా కళ్ళు మూసుకుంది. అయ్యో! అమ్మకేమయింది ఇంటికి తీసుకెళ్ళాలి ముందు ఏదైనా తినిపిద్దామనుకుంటూ ఆటోలో కూర్చో బెట్టి హోటల్ ముందాపి, ఇడ్లీ పొట్లం కట్టించుకొచ్చి, బలవంతంగా లేపి తినిపించాడు చంద్రయ్య.

కడుపులో కొంచెం ఇడ్లీ పడ్డ తర్వాత, ఒంట్లో కదలిక వచ్చింది జానకమ్మకు ఆటోను ఇంటివైపు తీసికెళ్ళమంటున్న చంద్రయ్యను వద్దని వారించింది. ఆశ్చర్యంగా చూస్తున్న చంద్రయ్యతో చెప్పలేక చెప్పింది ఆ ఇండ్లకు తనకు ఋణం తీరిందని. “మళ్ళీ జన్ముంటే నీ ఋణం తీర్చుకుంటా చంద్రయ్యా.. ఆటో ఆపు నే వెళ్ళి పోతానంటున్న జానకమ్మతో “ఏడకెళ్తరమ్మా. మా ఇంటికి రండి. తర్వాత ఎల్దురు గానంటూ” ఆటోను కాలనీలో తానుండే ఇంటికి తీసికెళ్ళాడు.

ఓ గది, చిన్న వసారా ఇలా వరుసగా ఒకే రకంగా ఉన్న ఇండ్లను చూపించి నా కొడుకులు, బంధువులిండ్లమ్మా ఇప్పుడంతా పనులకెళ్ళిండ్రు, పొద్దు గుంకే ఏలకు వత్తరు. అనుకుంట భార్య మల్లమ్మను పరిచయం చేశాడు. మల్లమ్మ ఒళ్ళో ఒకరు పక్కనొకరు ఇంకో ఇద్దరు కొంచెం పెద్ద పిల్లలున్నారు. వాళ్ళను నవ్విస్తూ ఆడిస్తున్న ఆమెను చూడగానే ఎంతదృష్టం వాళ్ళతో కలిసుంటే వయసు గుర్తుకొస్తుందా అనుకుంది.

చంద్రయ్య జానకమ్మగురించి చెప్పగానే మల్లమ్మ వయసు మరిచి గబగబా లేచి హడావిడి పడుతూ మంచం దులిపి కూర్చోబెట్టడం, మంచినీళ్ళు తెచ్చి తాగమనడం చూస్తుంటే, ఇలాంటి ఆదరణ కరువై ఎంతకాలమయ్యిందో అనకోగానే జానకమ్మ కళ్ళు ఊట చెలిమలయ్యాయి. అమ్మగారు! ఏమైందమ్మా ఆదుర్ధాగా అంటున్న చంద్రయ్య దంపతులతో, “మీ ఇంట్లో నాకింత చోటిస్తరా నాక్కొంచం ఆదరణ కావాలి” దీనంగా అంటున్న జానకమ్మని చూస్తూ.. “మీరు బెట్టిన అన్నం తిన్నోన్ని. మీరు అయ్యగారు పనికోసం వచ్చినపుడు ఇంటి మనిషిలా పక్కన కూచోబెట్టుకొని కడుపు నిండా అన్నం
పెట్టిన ఆ రోజుల్నెలా మరిచిపోతమ్మగారూ.! మా ఇంటిదానికీ మీ గురించి చెప్పేటోడిని”.
అంటున్న చంద్రయ్యను చూస్తూ మనసులో అనుకోసాగింది

కనిపించిన వాళ్ళకెంత పెట్టినా కనికరం లేదు. పని చేయించుకుని పిడికెడన్నం పెట్టింది మరచి పోని పెద్ద మనసు చంద్రయ్యది. వీళ్ళ ఋణం ఎలా తీర్చుకోవాలా ఆలోచిస్తున్న జానకమ్మను చూస్తూ… వేరుగా అర్ధం చేసుకున్న చంద్రయ్య “అమ్మ మీకే లోటు లేకుండా చూసుకుంటం మా చేతి వంట తిననంటే రోజూ హోటల్ నుండి తెచ్చి పెడతమ్మా” అంటున్న చంద్రయ్యను వారిస్తూ ‘నీ ఋణమెలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నా.. ఇకనుండి నన్ను అమ్మగారు కాదు అక్కా అని పిలువు తమ్ముడూ! ఇదిగో ఈ గాజ అమ్మి నాకూ మరదలుకు చీరలు బట్టలు కొనుక్కురా..” అంటున్న జానకమ్మని “ఆడబిడ్జ సొమ్ము అస్సలు తీసుకోవద్దక్కా.. నువ్వు విశ్రాంతి తీసుకో!
నీకు మన కాలనీ షాపుకెళ్ళి చీరెలు పట్టుకొస్తా” అంటున్న చంద్రయ్యను అలాగే చూస్తుండి పోయింది జానకమ్మ వాళ్ళ ఋణం తీర్చుకునే మార్గం వెతుక్కుంటూ..!

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!