Monday, August 8, 2022
Home > కవితలు > || ఊరు..ఓ జ్ఞాపకం || -బిల్ల మహేందర్

|| ఊరు..ఓ జ్ఞాపకం || -బిల్ల మహేందర్

పొద్దుగాల ల్యాత చిగురాకుల నడుమ
కురిసిన ముత్తెపు చినుకులు..
మాపటిలి చేదబాయిలోంచి బొక్కెన నిండ చేదిన
చల్లని నీళ్ళు..మా ఊరు

పొద్దూకినంక చెర్వుకట్టమించి గూటికిపోతున్న
చెమటజీవుల ప్రవాహం..
నడిజాము రాతిరి నిండు సందమామ ఎలుగుల్లో
మొగుడుపెళ్ళాల ముద్దుముచ్చట్లు..మా ఊరు

ఐతారం పూట
చింతచెట్టునీడకింద పోరగాళ్ళ ఎగురుదునుకుడు.. మర్రిచెట్టు ఊడలమధ్య ఉయ్యాల జంపాలాటలు..మా ఊరు

మక్కజొన్నచేనులో పచ్చని పాలకంకుల తీపిరసం..
నల్లరేగడిమట్టిలో నిండుగ విచ్చుకున్న తెల్లబంగారం..మా ఊరు

యాపసెట్టు కొమ్మ మీది తేనెతుట్టె..
మామిడిసెట్టు రెమ్మ మీది కోయిలగొంతు..మా ఊరు

పసిమొగ్గల
ముసిముసి నవ్వుల జల్లులు..
ఎండిన గొంతులకు
కడుపారా దూపతీర్చే అమ్మచనుబాలు..మా ఊరు

వాన పడినంక
మబ్బులల్ల పూసిన ఏడురంగుల పువ్వు..
ఎన్నోవేల ఉగాదుల ఉషస్సుల షడ్రుచుల కలయిక..మా ఊరు

ఇప్పుడు
ఆ ఉగాదుల్లేవు..ఆ ఉషస్సులు లేవు
అవన్నీ ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయాయి..
అన్నీ ఓ జ్ఞాపకంగ మిగిలిపోయిన చోట
ఏదీ కనబడదు వినబడదన్నట్లు
ఇప్పుడక్కడ మా ఊరు కనబడుతలేదు..
ఆ మాటే ఇనబడుతనేలేదు..!!

-బిల్ల మహేందర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!